Thursday, 11 September 2025
భాగవతము చదివితే…
భాగవతము చదివి,అర్థం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి అని అంటారు.సమస్త సంపదలు దక్కుతాయి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాన సంపద దక్కుతుంది.భాగవతము మనకు ముక్తిని ప్రసాదిస్తుంది.దానిని చదివినా,వ్రాసినా,విన్నా సర్వ పాపాలు నశిస్తాయి.నిత్యమూ ధర్మమార్గంలో నడిచేవారికి శ్రీహరి సులభంగా దక్కుతాడు.ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో,ఆనందంగా విరాట్ స్వరూపుడు అయిన ఆ దేవదేవుని కొలిస్తే కష్టాలు,కలతలు ఉండనే ఉండవు.ఎందుకంటే అన్నిటినీ సమంగా స్వీకరించ గలిగే స్థితప్రజ్ఞత అలవరుతుంది.ఈ విషయం స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు.అందరికీ ధర్మం అర్థం అయి,ఆ దిశగా ప్రయాణం చేయగలిగే వెసులుబాటుకోసం వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు.
భాగవతము అనేది నిజానికి ఒక కావ్యము కాదు.వేదమనే చెట్టుకి కాసి,రసమయమయిన పండుగా మారిన జ్ఞానము.దానిని శుక మహర్షి అనే చిలుక చిరు పంటితో కొరకగా,దానినుంచి కారిన అమృత రసగుళిక ఈ మహిమాన్వితమయిన భాగవత గ్రంథము.దీని నుంచి ఎవరెవరికి ఎంతెంత కావాలో అంతంత ఆస్వాదించ వచ్చు.అది మనతృష్ణను పట్టి ఉంటుంది.ఆ రసాస్వాదనకు అంతం ఉండదు.ఎంత జుర్రుకోవాలంటే అంత జుర్రుకోవచ్చు.ఎలాంటి ఆంక్షలు,ప్రతిబంధకాలు ఉండవు.
No comments:
Post a Comment