Monday, 15 December 2025

భక్తి మార్గము ఉత్తమము

పూర్వము బ్రహ్మ దేవుడు అన్నీ ఒకటికి పది సార్లు పరీక్షించాడు.ఏమని?మోక్షము దక్కాలంటే భక్తి మార్గము తప్ప ఇంక వేరే మార్గము ఇంకేదీ లేదని.ఇలా నిశ్చయానికి వచ్చాడు.వచ్చిన వెంటనే నిర్వికారుడు అయ్యాడు.చంచలత్వాన్ని వీడాడు.స్థిరమయిన మనసుతో శ్రీహరిని ఆరాధించాడు.భగవంతుడు సర్వవ్యాపకుడు కదా!సర్వభూతాలలోనూ ఆవరించి ఉన్నాడు కదా!ఆ సర్వేశ్వరుడిని ఆరాధించడం,కీర్తించడం మొదలు పెట్టాడు.హరి నామస్మరణ,లేకపోతే హరి కథలను వింటూ తరించాడు. మనకు సహజమయిన ఆరాటం,తపన,యావ,చంచలత్వం...వీటన్నిటినీ వదలి పెట్టాడు.మొదట మనము అంతా విష్ణుమయము,విష్ణులీల అని అర్థం చేసుకోవాలి.సర్వ సంగ పరిత్యాగి కావాలి.అప్పుడే మోక్షము లభిస్తుంది. శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ రాజా!విష్ణు కీర్తనలు వినని వాడి చెవులు కొండ బిలముల లెక్క!శంఖ చక్ర గదాపాణి పై పద్యములు చదువని జిహ్వ కప్ప నాలుకతో సమానము.ఆ లక్ష్మీకాంతుడు,లక్ష్మీవల్లభుని చూడని కళ్ళు నెమలి పింఛములోని కళ్ళతో సమానం.అంటే ఆకార పుష్ఠి,నైవేద్య నష్ఠి అన్నమాట! కమలనాభుడు,కమలాక్షుడిని పూజింపని చేతులు...ఉన్నా ఒకటే...లేకున్నా ఒకటే!శుద్ధ దండగ!విష్ణువు పాదపద్మాలపై ఉన్న తులసీ దళం వాసన చూడనేరని ముక్కు పంది ముక్కుతో సమానం.గోవిందుడు,గరుడ గమనుని చెంతకు పోలేని పాదములు మోడైన చెట్లుతో సమానము.నారాయణుని నామ సంకీర్తనకు కరగని మనసు చలనము లేని ఒక బండరాయి.శ్రీమహా విష్ణువు కథలకు పులకించని శరీరము ఒక మొద్దు.మాధవుడు,మథుసూదనుడికి మ్రొక్కని వాని తలపైన ఉండేది కిరీటంకాదు,ఒఠ్ఠి కట్టెల మోపు.ఆ నారాయణుడి సేవకి ఉపయోగ పడని సంపద అడవి గాచిన వెన్నెల.ఆ బ్రహ్మాండ నాయకుడిని సేవించలేనివాడు జీవించి ఉన్నా జీవం లేని వాడే.ఆ ఆపద మ్రొక్కులవాడి పాదపద్మాలను చూడలేని వాడి బ్రతుకు పత్తికాయలోని పురుగుతో సమానము.

No comments:

Post a Comment