bhaagavatham balpasandugaa
Sunday, 5 October 2025
వ్యాస నారదుల సంవాదం
నారదుడికి వ్యాసుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు.ఓ నారద మహర్షీ!నీవు బ్రహ్మ దేవుడి కుమారుడివి.మీ తండ్రి సమస్త సృష్టికి కర్త.నీవు ఎప్పుడూ నారాయణుని స్మరిస్తూ,ఆయన సన్నిథిలో కాలం వెళ్ళబుచ్చుతుంటావు.నీ ప్రబోధం అన్ని మూలలూ,దిక్కులూ వ్యాపించి ఉంది.సూర్యుడి గమనంతో సమానంగా నీవు కూడా మూడు లోకాలూ తిరుగుతుంటావు అలుపూ సొలుపూ లేకుండా!నీవు సర్వజ్ఞుడివి.కాబట్టి అందరి మనసులలో మెలగుతూ ఉంటావు.నీకు అన్ని ధర్మాలూ తెలుసు.నా అసంతృప్తి ఏందో,ఎందుకో నిజంగా నీకు తెలియదా?నా ఈ కలవరము,కలత చెప్పి,నా దిగులు,విచారము,మనస్తాపమూ అన్నీ తగ్గేలా చేసేది.
వ్యాసుడికి నారదుడు ఇలా ఉత్తరము ఇచ్చాడు.ఓ మునిసత్తమా!నీవు మహాభారతాన్ని రచించావు.అది సర్వ ధర్మాలనూ వివరించింది.కానీ అందులో శ్రీ మహా విష్ణువు యొక్క కధలను చెప్పలేదు.ధర్మాలు,ధర్మసూక్ష్మాలు ఎన్ని చెప్పినా అది అసంపూర్ణమే.ఎందుకంటావా?విష్ణుమూర్తి గుణగణాలను కూడా కీర్తించాలి.ఆ మహావిష్ణువు యొక్క వర్ణనలు,ఆ మహానుభావుడి గుణగానాలు చేయలేదు కాబట్టే నీకు ఆ అసంతృప్తి కలుగుతున్నది.ఆయనను స్తుతించే కావ్యము,రచన బంగారు పద్మాలతో విరాజిల్లే మానస సరోవరం లాగా కళకళలాడుతూ శోభాయమానంగా విరాజిల్లుతుంది.శ్రీహరి నామాల స్తుతి,వర్ణనలు లేని కావ్యము ఎంత ఛందోబద్ధంగా,సుందరంగా ఉన్నా శోభావిహీనంగా ఉంటుంది.పేలవంగా,హృదయంలేని దానిలాగా తేలిపోతుంది.ఒక రకంగా చెప్పాలంటే బురదతో నిండిన నరకకూపంలాగా ఉంటుంది.ఊపిరి ఆడనట్లు ఉంటుంది.పదాలు,పదప్రయోగాలు దోషంతో ఉన్నా విష్ణువు కథలతో ఉంటేచాలు.మనసు,హృదయం ఉన్నట్లు కళకళలాడుతూ ఉంటుంది.అది సర్వ పాపాలను హరిస్తుంది.అంతర్గత శోభతో నిండి ఉంటుంది.ఎందుకంటే హరి భక్తి లేని చోట జ్ఞానవికాసానికి ఆస్కారం లేదు.ప్రతిఫలాక్ష లేకుండా చేసే ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోవాలి.అలా చేయకపోతే దానికి విలువ ఉండదు.భక్తి లేని కర్మ,జ్ఞానములకు అర్థము లేదు.అవి ముమ్మాటికీ నిరర్థకాలే.వ్యాస మహర్షీ!నీవు మహానుభావుడివి.గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడివి.సత్య సంధుడివి.నీవు అన్ని బంధాలనుంచి విముక్తి పొందాలంటే వాసుదేవుని లీలామానుష విశేషాల గురించి ఏకరువు పెట్టు.భక్తి ప్రపత్తులతో ఆ దైవకార్యం నిర్వర్తించు.అన్నీ తెలిసిన వాడు హరి సేవకు నడుము బిగించాలి.కష్టాలు,నష్టాలు,సుఖదుఃఖాలు అనేవి వస్తుంటాయి,పోతుంటాయి.వాటిని చూసి భయపడకూడదు.ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా హరిని,హరి సేవను వదలకూడదు.హరి సేవ చేసుకునేవాడు సంసారము చేస్తున్నా,మానసికంగా ఆ జంఝాటంలో పడడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన అంటీ అంటనట్లు ఉండగలడు.హరినామ స్మరణ జీవిత పరమావధిగా పెట్టుకుంటాడు.అతనికి అంతా విష్ణుమయంగానే ఉంటుంది.హరి అనేవాడు పుణ్యమూర్తి.అతని ఆశ్రయంలో,ఆధీనంలో అంతా మంచే జరుగుతుంది.కోరినవన్నీ దక్కుతాయి.
గీతా గంగా చ గాయత్రీ…గీత పేర్లు
గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ।
బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహినీ॥
అర్థమాత్రా చిదానందా భవఘ్నీ భ్రాంతినాశినీ।
వేదత్రయీ పరాఽనంతా తత్వార్థ జ్ఞానమంజరీ॥
ఇత్యేతాని జపేన్నిత్యం నరో నిశ్చల మానసః।
జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాన్తే పరమం పదమ్॥
గీతకు మొత్తం పద్దెనిమిది పేర్లు ఉన్నాయి.అవి....
గీత
గంగ
గాయత్రీ
సీత
సత్య
సరస్వతి
బ్రహ్మవిద్య
బ్రహ్మవల్లి
త్రిసంధ్య
ముక్తిగేహిని
అర్థమాత్ర
చిదానంద
భవఘ్ని
భ్రాంతినాశిని
వేదత్రయి
పర
అనంత
తత్త్వార్థ జ్ఞానమంజరి.
ఈ పేర్లను,ఈ గీత యొక్క నామాలను ఎవరు నిశ్చలమయిన మనసుతో సతతం జపిస్తూ ఉంటాడో,అతనికి త్వరితగతిని జ్ఞానము సమకూరుతుంది.జ్ఞానసముపార్జన వలన సునాయాసంగా పరమాత్మ యొక్క సన్నిధానము,ఆ పరమ పవిత్రమయిన పరమ పదము దక్కుతుంది.
Wednesday, 1 October 2025
నారదుడు అక్కడకు వచ్చాడు
వ్యాసుడు దిగులు పడుతున్నాడు.అక్కడకు నారదుడు వచ్చాడు.ఆయన ఎప్పుడూ మహతీ వీణను వాయించికుంటూ,నారాయణ స్మరణ అనునిత్యం చేసుకుంటూ తిరుగుతుంటాడు కదా!నిజంగా మహానుభావుడు!వ్యాసుడు నారదుడి రాకను దూరంనుంచి చూసాడు.ఆనందంగా,ఆదరంగా ఆయనకు ఎదురు వెళ్ళాడు.సంతోషంగా ఆయనను తీసుకుని వచ్చి,అర్ఘ్యపాద్యాలతో సత్కరించుకున్నాడు.నారదుడికి వ్యాసుడిని చూడగానే అర్థమయిపోయింది ఎందుకో ఎడతెరిపి లేకుండా దిగులు పడుతున్నాడని.నారదుడు
ఆప్యాయంగా,అనునయంగా వ్యాసుడితో ఇలా మాటలాడటం మొదలు పెట్టాడు.ఓ మహర్షీ!నువ్వు చిన్నా చితకా వాడివి కాదు.వేదాలను విభజించిన ప్రతిభాపాటవాలు ఉన్న వాడివి.భారతము అంటే పంచమ వేదము అంటారు.ఆ మహాకావ్యాన్నే రచించావు.కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే సునాయాసంగా జయించావు.నీకు బ్రహ్మతత్త్వము తెలుసు.మునులుకు,యోగులకు,సాథువులకు నాయకుడివి.ఇన్ని గొప్ప గుణాలు ఉన్న నీకు దిగులుకు కారణం ఏంది?ఎందుకు అంత బేలగా,పిరికివాడిలాగా దిగులు విచారంలో మునిగి ఉన్నావు?
Monday, 29 September 2025
వ్యాసుడి పుట్టుక…వేదముల విభజన
సూతుడికి భలే సంతోషంఅయింది,శౌనకాది మునులు అట్లా అడిగేటప్పటికి.ఊపూ ఉత్సాహంతో చెప్పడం మొదలు పెట్టాడు.మూడవ ద్వాపర యుగము ముగిసింది.ఉపరిచర వసువుల వలన వాసవి పుట్టింది.ఆమెకు సత్యవతి అని ఇంకో పేరు కూడా ఉంది.ఆమె యందు పరాశర మునికి వ్యాసుడు పుట్టాడు.వ్యాసుడు విష్ణువు అంశతో పుట్టాడు.అతను మహా జ్ఞాని.అతను బదరికాశ్రమములో ఉండేవాడు.ఒకరోజు దగ్గరలోనే ఉండే సరస్వతీ నదీ తీరంలో స్నానపానాదులు ముగించుకుని వచ్చాడు.ప్రశాంతంగా ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో,సూర్యోదయ సమయంలో యుగధర్మాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు.
అతని మనసుకి ఇలా అనిపించింది.లోకంలో మానవులకు ఆయుష్షు తక్కువ.బలహీనంగా ఉంటారు.జవసత్త్వాలు తొందరగా నశిస్తాయి.దాని కారణంగా ధైర్యము ఉండదు.కాబట్టి సర్వ మానవకోటికి హితవుగా ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నాడు.
అతడు నలుగురు హోతలచేత అనుష్టింపదగినవి,ప్రజలకు మంచి చేసే యజ్ఞాలు నిరంతరం చేయించాలనుకున్నాడు.నాలుగు వేదాలు అన్నీ కలగాపులగం అయిపోయి ఉన్నాయి.వాటిని మంచిగా నాలుగు వేదాలుగా విభజించాడు.అవి ఋగ్వేదము,సామవేదము,యజుర్వేదము మరియు అధర్వణ వేదము.విభజించడంతో ఊరుకోలేదు.అతను ఓపికగా ఋగ్వేదాన్ని పైలునకు,సామవేదం జైమినికి,యజుర్వేదం వైశంపాయునికి అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు.తాను చెప్పిన పురాణాలు,ఇతిహాసాలను రోమహర్షణ మహామునికి బోధించాడు.రోమహర్షణుడు ఇంకెవరోకాదు,స్వయానా సూతుడి తండ్రి.పైలుడు,జైమిని,వైశంపాయనుడు,సుమంతుడు వాళ్ళకు చెప్పబడిన వేదాలను విభజించి వారి వారి శిష్యులకు చెప్పారు.ఈ రకంగా వేదాలను చిన్న చిన్న భాగాలు చేసారు.కాలక్రమేణా ఆ వేదాలు అజ్ఞానుల నోళ్ళలో కూడా పడ్డాయి.వ్యాస మహర్షి ఈ విషయం గమనించాడు.అందుకని పామరులకు,స్త్రీలకు,మందబుద్ధి గల వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా మహాభారతం రచించాడు.మహా భారతానికి పంచమ వేదము అనే పేరు కూడా వచ్చింది.ఇంత చేసినా వ్యాసుడికి వ్యాకులత పోలేదు.ఏదో అసంతృప్తి.ఇంకేదో దిగులు,విచారమూ పట్టుకున్నాయి.మనసును లాగేసే ఈ కలత,కలవరపాటుకు కారణం ఏంది అని సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు.అప్పుడు తోచింది.ఏమని అంటే ...శ్రీహరికి,యోగులకు,మునులకు ఇష్టము అయిన భాగవతము చెప్పాలనే ఆలోచన ఇన్ని రోజులు రాక పోవటమే అని.నా దిగులు,విచారం,మనోవ్యాకులతకు కారణం ఖచ్చితంగా ఇదే అని నిర్ధారణకు వచ్చాడు.
Thursday, 25 September 2025
శుక మహర్షి గొప్పదనం
శౌనకాది మహా మునులు సూతుడు చెప్పిన మాటలు విన్నారు.వాళ్ళందరూ ముక్త కంఠంతో ఇలా అడిగారు. ఓ సూత మునీంద్రా!అసలు దీనికి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?ఈ భాగవతాన్ని రచించమని ఏయుగంలో ఎవ్వరు అడిగారు?ఎక్కడ అడిగారు?ఎందుకు అడిగారు?
శుక మహర్షి వ్యాసుని కొడుకు.అతడు మాయా మోహాన్ని అతిక్రమించిన వాడు.స్వపర భేదం లేకుండా సమస్తాన్ని సమానంగా చూడగలుగుతాడు.చూస్తాడు.పరబ్రహ్మను కనుగొన్నాడు.ఎప్పుడూ ఏకాంతవాసం కోరుకుంటాడు.అతడికి అందరూ సమానమే!ఎంతలా అంటే స్త్రీ పురుష విచక్షణ కూడా కనబరచడు.అసలు లేదు.దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది.అది ఇలా సాగుతుంది.
ఒకరోజు శుక మహర్షి దిగంబరంగా దారిలో వెళుతున్నాడు.ఆ ప్రక్కనే దేవతా స్త్రీలు వివస్త్రలయి జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు.వారు ఈయనని చూడగానే అలాగే బయటకి వచ్చి ఆయనను పిలుస్తూ ఆయన వెనక వెళ్ళారు.శుక మహర్షి వారిని గమనించకుండా,తన దారిన తాను వెళ్ళిపోయాడు.ఇంకొంత దూరంలో వ్యాస మహర్షి వస్తూ వాళ్ళకి కనిపించాడు.వాళ్ళందరూ సిగ్గు పడిపోయి,మెలికలు తిరుగుతూ,గబగబా వస్త్రాలు ధరించారు.
వ్యాసుడికి అర్థంకాలేదు.తన కొడుకు వెనక వివస్త్రలయి పరిగెత్తారు.వార్థక్యంలో ఉన్న తనను చూసి వారందరూ సిగ్గు పడుతున్నారు.ఉండ బట్టలేక అడిగేసాడు.ఓ దేవతా యువతులారా!నా కుమారుడు యువకుడు.యవ్వనంలో ఉన్నాడు.అందులోనూ బట్టలు లేకుండా వెళుతున్నాడు.మీరు ఏమో సిగ్గు విడిచి,వస్త్రములు ఒంటి పైన లేక పోయినా,అతనిని పిలుస్తూ,అతని వెంట పడ్డారు.నా విషయానికి వస్తే,నేను ముసలి వాడను.జవసత్త్వాలు ఉడిగిన వాడిని.దానికి తోడు శుభ్రంగా,మర్యాదపూర్వకంగా బట్టలు ధరించాను.ఎందుకు నన్ను చూడగానే మీరందరూ సిగ్గు పడ్డారు?ఎందుకు వస్త్రములను ధరించారు?
దానికి ఆ యువతులు ఇలా జవాబు చెప్పారు.ఓ మహర్షీ!నీ కుమారుడు అన్నిటికీ అతీతుడు.అతనికి స్వపర భేదం లేదు,స్త్రీ పురుష భేదం అసలే లేదు.అతడు నిర్వికల్పుడు.అతను నిశ్చలమయిన మనసు కలవాడు.నీకు,అతనికి పోటీ ఏంది?నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
అట్లాంటి శుక యోగి కురు జాంగల దేశాలను ఎందుకు ప్రవేశించాడు?హస్తినాపురానికి ఎందుకు వెళ్ళాడు?పరీక్షిత్తు మహారాజుకు ఎందుకు భాగవతం చెప్పాడు?భాగవతము అంటే కాకమ్మ పిచుకమ్మ కథ కాదు కదా!అది పూర్తిగా చె ప్పాలంటే చాలా కాలం పడుతుంది కదా!శుక మహర్షి ఎక్కడా,ఎప్పుడూ,ఎక్కువ సేపు ఉండడు. ఆఖరికి మనము ఇండ్లలో ఆవుకు పాలు పితికినంత సేపు కూడా ఉండలేడు.అట్లాంటి ఆయన ఎంతో కాలము ఒకే చోట ఉండి,ఎట్లా భాగవతము చెప్పాడు?అసలు పరీక్షిత్తు మహారాజుకు ఏమైంది? ఆయనకు విరక్తి ఎందుకు కలిగింది?అసలు గంగ నడుమ ఉండే దానికి కారణం ఏంది?
స్వామీ!మా మనసుల నిండా ప్రశ్నలే!వాటన్నిటికీ మాకందరికీ సమాథానం కావాలి.కాబట్టి దయచేసి మా విన్నపాలు మన్నించి,మాకు అన్నీ వివరణగా చెప్పండి.
Wednesday, 24 September 2025
నారాయణుని చరిత్రే భాగవతమంటే!
ఆ తరువాత సూతుడు శౌనకాది మహామునులతో భాగవతము,దాని గొప్పదనం గురించి ఇలా చెప్పాడు.ఓ మహామునులారా!నారాయణుడు భగవంతుడు.భాగవతము అనేది ఆ భగవంతుని చరిత్ర.ఇది అన్ని పురాణాల సారము.దీనికి మించిన పుణ్య కావ్యము,గ్రంథము మరొకటి లేదు.వ్యాస మహర్షి భగవంతుని అవతారము.కాకపోతే ఇంత ప్రముఖమయిన గ్రంథాన్ని రచించగలుగుతాడా?ఆయన తన ఈ రచనను తన కొడుకు అయిన శుక మహర్షికి చెప్పాడు.పరీక్షిత్తు మహారాజు విరక్తి,వైరాగ్యముతో ఉన్న సమయంలో మునులతో ఉన్నాడు.అప్పుడు ఆయన కోరిక మేర శుక మహర్షి భాగవతమును వారందరికీ చెప్పాడు.శ్రీకృష్ణుని నిర్యాణము అందరికీ శరాఘాతం లాంటిది.ఆ మహానుభావుడితోటే ధర్మజ్ఞానము కూడా అంతరించింది.కలియుగము తన తొలి అడుగు పెట్టింది.ఇంకేముంది?దోషములు అనే చీకట్లు,అజ్ఞానము అనే సుడిగాలులు లోకమంతా విస్తరించాయి.జనులకు ఏది ఒప్పు,ఏది తప్పు,ఇంకేది సరి అయిన మార్గం?అనే మీమాంస అడుగడుగునా తలెత్తింది.వారికి దారి తెన్ను లేకుండా,అనాథలు అయిపోయారు.వారందరికీ ముఖ్యమయిన ఈ భాగవతాన్ని నాకు తెలిసిన విథంగా మీకు చెబుతాను.శ్రద్థగా వినండి.
Tuesday, 23 September 2025
భగవంతుని అవతారాలు ఇంకొన్ని
దేవతలు,దానవులు ఒకసారి పాలసముద్రాన్ని అమృతం కోసరము చిలికారు.అప్పుడు శ్రీహరి కూర్మరూపంలో మంథర పర్వతాన్ని తన వీపు పైన నిలిపి ఉంచాడు.ఈ కూర్మరూపము పదకొండవ అవతారము.పాల సముద్రాన్ని మథించిన తరువాత ధన్వంతరి అయి అమృత కలశం ను తీసుకుని వచ్చాడు.భగవంతుని పండ్రెండవ అవతారము ధన్వంతరి అవతారము.అమృతాన్ని దేవతలకు,దానవులకు సమముగా పంచాలి అని అన్నారు. అప్పుడు మోహినీ రూపంలో దానవుల కళ్ళు గప్పి మోసం చేసి అమృతం అంతా దేవతలకు పంచి పెట్టాడు.ఈ మోహినీ రూపమే ఆయన పదమూడవ అవతారము.ఆ తరువాత కాలంలో హిరణ్య కశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు.ప్రహ్లాదుడు,హరి భక్తుడు అతని కొడుకు.ప్రహ్లాదుడిని రక్షించేదానికి నరసింహావతారము ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు తన గోళ్ళు,కోరలతో!ఈ నరసింహావతారమే ఆయన పదునాల్గవ అవతారము.బలి చక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగాడు వామనావతారములో వచ్చి.ఆయన ఒప్పుకోగానే,ఇంతింతై వటుడింతై మూడు లోకాలనూ ఆక్రమించాడు.ఈ వామనావతారమే పదహైదవ అవతారము.జమదగ్నికి భార్గవరాముడుగా పుట్టడం ఆయన పదహారవ అవతారము.ఈ అవతారములో క్రోధమూర్తిగా ఉంటూ బ్రాహ్మణులకు ద్రోహము తలపెట్టిన క్షత్రియులను తుద ముట్టించాడు.పదహేడవ అవతారములో బాదరాయణుడిగా పుట్టాడు.ఈ అవతారములో కలసిపోయి ఉన్న వేదాలను విభజించాడు.పదునెనిమిదవ అవతారములో శ్రీరాముడిగా జన్మించాడు.ఈ అవతారములో దశరథుడికి పుత్రుడు అయ్యాడు.సముద్రమును దాటి రాక్షస రాజు అయిన రావణాసురుడుని హతమార్చాడు.మునులను కాపాడాడు.పందొమ్మిదో అవతారములో శ్రీకృష్ణుడు,బలరాముడుగా పుట్టాడు.ఈ జన్మలో దుష్టులు అయిన రాక్షసులను,రాజులను తుద ముట్టించారు.అలా భూభారాన్ని తగ్గించారు.కలియుగములో బుద్ధుడి అవతారము ఎత్తుతాడు.మధ్య గయా ప్రదేశమున పుడతాడు.యుగసంధి సమయములో రాజులు చోరప్రాయులు అవుతారు.అప్పుడు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిరూపంతో పుట్టి జనులను ఉద్ధరిస్తాడు.
ఇలా భగవంతుడి లీలల గురించి తెలిపే గ్రంథమే భాగవతము.
Subscribe to:
Posts (Atom)