Sunday, 5 October 2025

వ్యాస నారదుల సంవాదం

నారదుడికి వ్యాసుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు.ఓ నారద మహర్షీ!నీవు బ్రహ్మ దేవుడి కుమారుడివి.మీ తండ్రి సమస్త సృష్టికి కర్త.నీవు ఎప్పుడూ నారాయణుని స్మరిస్తూ,ఆయన సన్నిథిలో కాలం వెళ్ళబుచ్చుతుంటావు.నీ ప్రబోధం అన్ని మూలలూ,దిక్కులూ వ్యాపించి ఉంది.సూర్యుడి గమనంతో సమానంగా నీవు కూడా మూడు లోకాలూ తిరుగుతుంటావు అలుపూ సొలుపూ లేకుండా!నీవు సర్వజ్ఞుడివి.కాబట్టి అందరి మనసులలో మెలగుతూ ఉంటావు.నీకు అన్ని ధర్మాలూ తెలుసు.నా అసంతృప్తి ఏందో,ఎందుకో నిజంగా నీకు తెలియదా?నా ఈ కలవరము,కలత చెప్పి,నా దిగులు,విచారము,మనస్తాపమూ అన్నీ తగ్గేలా చేసేది. వ్యాసుడికి నారదుడు ఇలా ఉత్తరము ఇచ్చాడు.ఓ మునిసత్తమా!నీవు మహాభారతాన్ని రచించావు.అది సర్వ ధర్మాలనూ వివరించింది.కానీ అందులో శ్రీ మహా విష్ణువు యొక్క కధలను చెప్పలేదు.ధర్మాలు,ధర్మసూక్ష్మాలు ఎన్ని చెప్పినా అది అసంపూర్ణమే.ఎందుకంటావా?విష్ణుమూర్తి గుణగణాలను కూడా కీర్తించాలి.ఆ మహావిష్ణువు యొక్క వర్ణనలు,ఆ మహానుభావుడి గుణగానాలు చేయలేదు కాబట్టే నీకు ఆ అసంతృప్తి కలుగుతున్నది.ఆయనను స్తుతించే కావ్యము,రచన బంగారు పద్మాలతో విరాజిల్లే మానస సరోవరం లాగా కళకళలాడుతూ శోభాయమానంగా విరాజిల్లుతుంది.శ్రీహరి నామాల స్తుతి,వర్ణనలు లేని కావ్యము ఎంత ఛందోబద్ధంగా,సుందరంగా ఉన్నా శోభావిహీనంగా ఉంటుంది.పేలవంగా,హృదయంలేని దానిలాగా తేలిపోతుంది.ఒక రకంగా చెప్పాలంటే బురదతో నిండిన నరకకూపంలాగా ఉంటుంది.ఊపిరి ఆడనట్లు ఉంటుంది.పదాలు,పదప్రయోగాలు దోషంతో ఉన్నా విష్ణువు కథలతో ఉంటేచాలు.మనసు,హృదయం ఉన్నట్లు కళకళలాడుతూ ఉంటుంది.అది సర్వ పాపాలను హరిస్తుంది.అంతర్గత శోభతో నిండి ఉంటుంది.ఎందుకంటే హరి భక్తి లేని చోట జ్ఞానవికాసానికి ఆస్కారం లేదు.ప్రతిఫలాక్ష లేకుండా చేసే ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోవాలి.అలా చేయకపోతే దానికి విలువ ఉండదు.భక్తి లేని కర్మ,జ్ఞానములకు అర్థము లేదు.అవి ముమ్మాటికీ నిరర్థకాలే.వ్యాస మహర్షీ!నీవు మహానుభావుడివి.గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడివి.సత్య సంధుడివి.నీవు అన్ని బంధాలనుంచి విముక్తి పొందాలంటే వాసుదేవుని లీలామానుష విశేషాల గురించి ఏకరువు పెట్టు.భక్తి ప్రపత్తులతో ఆ దైవకార్యం నిర్వర్తించు.అన్నీ తెలిసిన వాడు హరి సేవకు నడుము బిగించాలి.కష్టాలు,నష్టాలు,సుఖదుఃఖాలు అనేవి వస్తుంటాయి,పోతుంటాయి.వాటిని చూసి భయపడకూడదు.ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా హరిని,హరి సేవను వదలకూడదు.హరి సేవ చేసుకునేవాడు సంసారము చేస్తున్నా,మానసికంగా ఆ జంఝాటంలో పడడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన అంటీ అంటనట్లు ఉండగలడు.హరినామ స్మరణ జీవిత పరమావధిగా పెట్టుకుంటాడు.అతనికి అంతా విష్ణుమయంగానే ఉంటుంది.హరి అనేవాడు పుణ్యమూర్తి.అతని ఆశ్రయంలో,ఆధీనంలో అంతా మంచే జరుగుతుంది.కోరినవన్నీ దక్కుతాయి.

No comments:

Post a Comment