Monday, 6 October 2025
నారదుడి పూర్వ జన్మ
నారదుడు ఇలా చెప్పసాగాడు.ఓ వ్యాస మునిపుంగవా!సంసారము అనేది మహా సముద్రం లాంటిది.కర్మవాంఛలు అనేవి అలలూ,ఆటూపోట్లు లాంటివి.మనిషి ఆ అల్లకల్లోలంతో వేదన చెందుతాడు.ఆ కష్టాలనుంచి విముక్తిని ఇచ్చే నావ ఈ విష్ణు గుణవర్ణనము.నేను నీకు నా పూర్వ జన్మ వృత్తాంతము గురించి చెబుతాను.నీకు బాగా అర్థం అవుతుంది ఈ విషయము.పూర్వ జన్మలో నేను ఒక దాసి కి పుట్టాను.ఆమె వేదాధ్యయనము చేసే సంపన్నుల ఇంట్లో పనులు చేసేది.ఒకసారి వాళ్ళు నన్ను వానాకాలము నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షలో ఉండే ఋషులకు సేవచేయమని పంపారు.నేను వారికి సేవలు చేసుకుంటూ ఉన్నాను.నేను వయసుకి బాలుడు అయినా తోటి పిల్లలతో ఆడుకునేదానికి పోకుండా ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవలు చేసేవాడిని.వారు నన్ను,నా పనితనాన్ని చూసి ముచ్చట పడ్డారు.
ఆ మునులు ఎప్పుడూ శ్రీమన్నారాయణుని చరిత్ర పారాయణం చేస్తూ ఉండేవారు.ఆ హరి సంకీర్తన నాచెవులకు చాలా ఇంపుగా ఉండేది.నేను కూడా వారితో కలసి ఎప్పడూ హరినామస్మరణచేస్తూ ఉండేవాడిని.వారు సంవాదనల సారము గ్రహించాను.శరీరము మాయా కల్పితము.సంసారము నిస్సారము.
చాతుర్మాస దీక్షఅయిపోయింది.వారంతా తీర్థయాత్రలకు బయలుదేరారు.నా నడవడిక,హరిపై నా అనురక్తి గమనించారు.నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు.నేను భక్తి పారవశ్యముతో వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అని జపించేవాడిని.భగవంతుడి దయవలన నాకు విజ్ఞానము సంప్రాప్తించింది.
No comments:
Post a Comment