Wednesday, 12 November 2025

అర్జునుడి మనోవ్యథ

అర్జునుడు శ్రీకృష్ణుడి గురించి ఇంకా జెబుతున్నాడు.వాళ్ళ సాంగత్యము అవినాభావము కదా!శ్రీకృష్ణుడు నాకు అడుగడుగునా సాయపడ్డాడు.ఎన్నని చేప్పేది?ఏమని చెప్పేది?అతని సహాయము తోటేకదా నేను పాశుపతాస్త్రము సంపాదించుకోగలిగింది.దేవేంద్రుని ప్రక్కన అతని సింహాసనముపై కూర్చోగలిగాను అంటే ఆ మహానుభావుడి అనుగ్రహము ఉండబట్టే కదా!ఇంతేనా!కాలకేయులు,నివాతకవచులు,ఇంకెందరో రాక్షసులను సునాయాసంగా చంపగలిగాను అంటే శ్రీకృష్ణుడి మద్దతుతోనే కదా!గోగ్రహణ సమయంలో అయితేనేమి,కౌరవ వీరులైన కర్ణ,దుర్యోధనాదుల తలపాగాలు తెచ్చి ఉత్తరకు ఇచ్చే విషయంలోగాని,మిగిలిన అన్ని విషయాలలోనూ అతని ఆశీర్వాదము ఉండబట్టే కదా! అసలు ఇవవ్నీ ఒక ఎత్తు,కురుక్షేత్ర యుద్థమప్పుడు రథసారధిగా నాకు తోడుగా ఉండటం ఇంకో ఎత్తు!అసలు నేను వేసే బాణాలు శత్రువుల గుండెలు చీల్చేలోపే తన దృష్టితోనే వాళ్ళను నిర్వీర్యులను చేసేవాడు.అతడు అత్యుత్తమ రధసారథి కాబట్టే శత్రువులు సంథించే ఏ ఒక్క బాణం కూడా నా దరిదాపుల్లోకి వచ్చేది కాదు.యుద్ధమున సైంధవుడిని చంపే సమయంలో నా మాన ప్రాణాలను కాపాడింది ఆ మహనీయుడే కదా! అసలు అతనికి నేనంటే ఎంత ప్రేమ!దానిని అసలు వెల కట్టలేము.ఒకప్పుడు ఏమో సఖా అంటాడు.ఇంకో సారి మిత్రుడా అని సంబోధిస్తాడు.మరింకోసారి ఏమోయ్ బామ్మరిదీ అని కేక వేస్తాడు.ఎన్ని మంచి అనుభూతులు అతని సాంగత్యంలో!బంధుత్వాన్ని పాటిస్తాడు.దాతఅయి దానమిస్తాడు.మంత్రి అయి మంచి సలహాలు,ఆలోచనలు చెప్తాడు.ఒకసారి సరిసాటిలాగా ఆటలాడతాడు.ఇంకోసారి తమాషాలు,ఎకచకాలు పడతాడు.ఎక్కిరిస్తాడు.ఎగతాళి చేస్తాడు.గేలి చేస్తాడు.గౌరవము కాపాడుతాడు.నా పక్కపైనే పడుకుంటాడు.ఇద్దరిదీ ఒకే మంచం ఒకే కంచం లాగా కలసిపోయాము చిన్నతనం నుంచి.నేనేదైనా తప్పుచేస్తే తండ్రిలాగా క్షమిస్తాడు.సుద్దులు,బుద్ధులు చెబుతాడు.నాతోటే కలసి అన్నం తింటాడు.నాకు అతనితో గడిపిన ప్రతి క్షణం మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నది.

No comments:

Post a Comment