Sunday, 26 October 2025

పరీక్షిత్తు పుట్టుక

శ్రీకృష్ణుడు కొంతకాలము తరువాత ద్వారకకు చేరాడు.తన వారినందరినీ సంతోష పెట్టాడు శౌనక మహర్షి సూతుని ఈ ప్రశ్నలు అడిగాడు. ఓ సూతమహర్షీ!అసలు బ్రహ్మ శిరోనామకాస్త్రము అనేది చిన్నా చితకా అస్త్రము కాదు కదా!అలాంటి శక్తివంతమయిన అస్త్రము ఉత్తర గర్భము వైపు దూసుకుని పోయింది కదా!అట్లాంటి విపత్తు నుండి ఉత్తర గర్భములో ఉండే శిశువును శ్రీ కృష్ణుడు ఎలా కాపాడగలిగాడు?ఎట్లా ఆ బిడ్డను బ్రతికించగలిగాడు?ఆ బిడ్డ పెరిగి పెద్ద అయి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?అతని వృత్తాంతము ఏంది?శుక మహర్షి అతనికి విజ్ఞాన మార్గాన్ని ఎట్లా బోధించాడు?అతను దేహాన్ని ఎట్లా విడిచాడు?స్వామీ!ఈ వివరాలన్నీ వినాలని,తెలుసుకోవాలని మాకు ఉత్సాహంగా ఉంది. సూతుడు నిదానంగా చెప్పడం మొదలు పెట్టాడు.ధర్మరాజు ఈ భూమండలాన్ని,గొప్ప సంపదను తన తమ్ముళ్ళతో కలిసి సంపాదించాడు.లెక్కకు మిక్కిలి యాగాలు చేసాడు.కృష్ణుడిని స్పూర్తిగా తీసుకుని దుష్టులను శిక్షించాడు.అలాగే శిష్టులను రక్షించాడు.ఎల్లప్పుడూ భగవన్నామ చింతనతో ఉన్నాడు.కోరికలకు అడ్డుకట్ట వేసాడు.కామక్రోధాలను దయించాడు.రాజ్యాన్ని సస్యశ్యామలంగా పాలించాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము కారణంగా ఉత్తర గర్భములోని శిశువు భరించలేని వేడికి తపించి పోయింది.ఇలా అనుకుంది.అయ్యో!ఈ తాపము,ఈ వేడి నేను తట్టుకోలేక పోతున్నాను.నాకు దిక్కెవరు?నాకు గర్భములోనే జరగరానిది జరిగితే,మా అమ్మ తట్టుకోలేదే!ఆమె కూడా ప్రాణాలను వీడుతుందే!ఆ భగవంతుడికి నా పైన కనికరము కలుగలేదా!నన్ను కాపాడేదానికి రాడా? భగవంతుడికి ఈ సృష్టిలో తెలియనిది,అర్థం కానిదీ ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు కదా!అతను ఆ శిశువు చుట్టూ తన గదతో మండలాకారంలో త్రిప్పాడు.దాని వల్ల చల్లదనం కలిగించాడు.దాని కారణంగా బ్రహ్మాస్త్రపు వేడి బిడ్డను తాకలేక పోయింది.బిడ్డ సునాయాసంగా ఊపిరి పీల్చుకో గలిగాడు.తరువాత కొన్నాళ్ళకు శుభ గ్రహములు కలిసిన శుభలగ్నమున ఉత్తరకు వంశోద్థారకుడు అయిన కుమారుడు జన్మించాడు.

No comments:

Post a Comment