Friday, 24 October 2025

భీష్ముడి స్వాంతన పలుకులు

ధర్మరాజుకు బంధుజనులను కోల్పోయాము అనే దిగులు,దుఃఖము ఎక్కువ అయింది.వ్యాసుడు,ధౌమ్యుడు అతనిని అనునయించే ప్రయత్నము చేసారు.కానీ ధర్మరాజును శాంతింప చేయలేక పోయారు. ఒకరోజు ధర్మరాజు అంపశయ్య పైన ఉండే భీష్ముడుని చూసేదానికి బయలుదేరాడు.మిగిలిన పాండవులు,శ్రీ కృష్ణుడు కూడా అతనిని అనుసరించారు. అందరూ భీష్మ పితామహుడికి నమస్కారము చేసారు.ఆయన దుస్థితికి చాలా బాథ పడ్డారు. ఇంతలో అక్కడకు బృహదశ్వుడు,భరద్వాజుడు,పర్వత నారదులు,వ్యాసుడు వచ్చారు.అప్పుడు భీష్ముడు పాండవులను ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్పాడు. నాయనలారా!మీరు అందరూ ధర్మమార్గము లోనే ధర్మబద్ధంగా నడుచుకునినారు.కానీ చాలా అష్ట కష్టాలకు కూడా గురి అయ్యారు.మీ తండ్రి శాపము కారణంగా పోయాడు.అప్పుడు మీరందరూ చిన్నపిల్లలు.కానీ కుంతీ ధైర్యంగా మిమ్మలను పెంచి పెద్ద చేసింది.ఆమె ఏరోజూ సుఖపడింది లేదు.జన్మంతా కష్టాలే చవి చూసింది. మీకు ఆఖరికి సమరము తప్పలేదు.శ్రీకృష్ణుడు మీకు తోడు ఉన్నందున మీరు విజయపతాకం ఎగుర వేయగలిగారు.ఇంక యుద్ధంలో అయినవారు పోయారని దిగులు పడటం ఆపండి.కాలము అనేదానిని ఎవరూ అతిక్రమించలేరు.దాని చెప్పుచేతల్లోనే మనం నడవాలి. శ్రీకృష్ణుడు మీ మేనత్త కొడుకు.కాబట్టి అతనిని అన్ని రకాలుగా వాడుకున్నారు.ఒకసారి సంథి కోసరం పంపించారు.ఇంకో సారేమో ఏకంగా రథ సారధ్యం చేయించారు.అతను కూడా మీరు ధర్మం పక్షాన ఉన్నారు అనే ఏకైక కారణంతో మీకు తోడుగా నిలిచాడు. శ్రీకృష్ణుడు సర్వసముడు.అతనే సర్వాత్మకుడు అయిన ఈశ్వరుడు.ఇతను భక్తవత్సలుడు.ఇతనికి రాగద్వేషాలు లేవు.అంతటి మహిమాన్వితుడు నా మరణసమయమున నాదగ్గరకు రావడం నా పూర్వ జన్మ సుకృతము.నా ఆనందం ఇంతని చెప్పలేను. భీష్ముడు శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు.తరువాత ధర్మరాజుకు సమస్త ధర్మాలపైన అవగాహన కల్పించాడు.పురుషార్థముల గురించి ఏకరువు పెట్టాడు.అన్నీ సంగ్రహంగా,సమన్వయంతో చెప్పాడు. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రవేశించింది.భీష్ముడు స్వచ్ఛంద మరణమునకు సంసిద్ధుడు అయినాడు.

No comments:

Post a Comment