Thursday, 30 October 2025
ధర్మరాజు అశ్వమేధ యాగము
ధర్మరాజు సద్వర్తన కలిగినవాడు.పాపభీతి ఎక్కువ.యుద్ధంలో తన మన అని లేకుండా అందరినీ చంపారు కదా పాండవులు,వారి తట్టు వాళ్ళు.ఆ పాపము పోయేదానికి అశ్వమేధ యాగము చేయాలనుకున్నాడు.కానీ ప్రజలనుంచి వచ్చే సొమ్ము చాలదు అంతటి బృహత్కార్యానికి.
శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు.పూర్వము మరుత్తరాజు యాగానికని ఉపయోగించగా మిగిలి పోయిన ధనము,బంగారు పాత్రలు మొదలయినవి ఉత్తర దిక్కున ఉన్నాయి.వాటిని వాడుకొనవచ్చు అని.
భీముడు,అర్జునుడు పోయి వాటిని తెచ్చారు.ధర్మరాజు యాగములకు కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాడు.బంధుజనముతో కలిసి మూడు యాగములు చేసాడు.శ్రీకృష్ణుడు ఆ యాగాలను చూసేదానికి వచ్చాడు.కొనినాళ్ళు ఉండి,అర్జునుడిని తోడు తీసుకుని ద్వారకకు పోయాడు.
ఇంతలో విదురుడు తీర్థయాత్రలకు పోయి వచ్చాడు.అక్కడ మైత్రేయుడి వలన ఆత్మజ్ఞానము పొందాడు.ధర్మరాజు విదురుడిని ఆనందంగా స్వాగతించాడు.యాత్రా విశేషాలు అన్నీ వివరంగా కనుక్కున్నాడు.ధర్మరాజు తనే స్వయంగా తీర్ధయాత్రలకు వెళ్ళి వచ్చినట్లు తృప్తి పడ్డాడు.
అప్పటికే సముద్రము పొంగి ద్వారకను ముంచి వేసింది.యాదవులు వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు.ఆ విషయము ధర్మరాజుకు చెబితే చాలా బాధ పడతాడని,విదురుడికి తెలిసినా చెప్పలేదు.
విదురుడు గురించి రెండు మాటలు చెప్పుకుందాము.ఒకసారి యముడు మాండవ్య ముని కోపానికి బలి అయ్యాడు.ఆయన శాపము వలన యముడు శూద్ర వనితకు కుమారుడు రూపములో పుట్టాడు.విదురుడు సౌమ్యుడు.మంచి చెడ్డలు తెలిసిన వాడు.లోకులు పలు కాకులు అంటాము కదా!మంచి చెబితే మంచివాడని మోసేస్తారు.చెడ్డ తెబితే చెడ్డవాడని నిందిస్తారు.అందుకని విదురుడు ఆ దుర్వార్తను ధర్మరాజుకు చెప్పలేదు.మనము చెడును ఆపలేము అని తెలిసిన తరువాత,ఆ విషయంగా ఎదుటి వారిని ఎందుకు బాథ పెట్టడం అని.
Subscribe to:
Post Comments (Atom)
 
No comments:
Post a Comment