Wednesday, 4 March 2026
శ్రీకృష్ణుని లీలలు
విదురుడు శ్రీకృష్ణుని నిర్యాణము,యాదవుల నిర్యాణము తెలుసుకుని చాలా దుఃఖించాడు.కొంచెం సేపటికి తేరుకున్నాడు.ఉద్ధవుడిని ఇలా అడిగాడు.స్వామీ!మీరు కృష్ణుడు భక్తులకే కాకుండా క్రూరులగు రాక్షసులకు కూడా పరమపదము ఇచ్చాడు అని చెప్పారు.అది ఎంత మటుకు సమంజసము?అది తప్పు కదా!
దానికి ఉద్ధవుడు సమాథానం చెప్పనారంభించాడు.విదురా!ఆ రాక్షసులు అందరూ శ్రీకృష్ణుని ఎదిరించారు.నిజమే!కానీ అంత్యకాలంలో శ్రీబరిని చూస్తూ,హరీ!అని పిలుస్తూ ప్రాణాలు వదిలారు.కాబట్టి వాళ్ళకందరికీ కూడా మోక్షము లభించింది.అతని చేతుల్లో పోవడం వాళ్ళు చేసుకున్న పుణ్యం,అంతే!
నీకు నేను శ్రీకృష్ణుని పుట్టుక,చరిత్ర టూకీగా చెబుతాను విను.బ్రహ్మాది దేవతలు భూభారం తగ్గించమని శ్రీహరిని ప్రార్థించారు.సరే అని ఆయన దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు.దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన తనను చంపేవాడు పుడతాడని తెలిసి కంసుడు తన సోదరి బావలను చెరలో పెట్టాడు.కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు.వసుదేవుడు బిడ్డను కాపాడుకునే ప్రయత్నంగా నందుడి ఇంట్లో అర్థరాత్రి వదలిపెట్టి వచ్చాడు.పదకొండు ఏళ్ళు వచ్చేదాకా కృష్ణుడు బలరాముడితో కలసి నందుని ఇంట్లో పెరిగాడు.ఆ సమయంలో అతను శ్రీహరి అని ఎవరికీ అనుమానం రాకుండా జాగరూకత పాటించాడు.తోటి గోపాలకులతో అడవికి వెళ్ళి ఆవులు మేపుకుంటూ సరదా సరదాగా బాల్యం గడిపాడు.వేణుగానం చేస్తూ అందరి మనసులు చూరగొన్నాడు.మథ్య మథ్యలో కంసుడు పంపే రాక్షసులను తనకు తగిన రీతిలో హతమారుస్తూ కాలం గడిపాడు.కాళింది మడుగులో నీటిని విషపూరితం చేస్తున్న కాళియ సర్పాన్ని అక్కడ నుంచి తరిమి వేసాడు.ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని ఆగ్రహించి గోపాలకుల పైన రాళ్ళ వాన కురిపించాడు ఏడు రోజులు.అప్పుడు కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలిపి ఊరి వారందరినీ దాని క్రింద ఉంచి రక్షించాడు.
Monday, 2 March 2026
ఉద్ధవుడి ప్రత్యుత్తరము
విదురుడు అన్ని ప్రశ్నలు ఒకదాని తరువాత ఇంకొకటి,శర పరంపర లాగా వేసాడు.కానీ ఉద్ధవుడి నోటి నుంచి మాట రావడం లేదు.ఎందుకంటే అతను కృష్ణుని పోగొట్టుకునిన దుఃఖం నుంచి ఇంకా బయట పడలేదు.పైగా విదురుడు వారి క్షేమ సమాచారం అడగడంతో ఇంకా పొంగి పొరలు పొరలుగా ఏడుపు ముంచుకొచ్చింది.
శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అంటున్నాడు.ఓ రాజా!ఉద్ధవునికి శ్రీకృష్ణుని పైన అలవిమాలినంత ప్రేమ.అది తెలియని వారు ఎవరూ ఉండరు.ఉద్ధవుడికి ఒక రకంగా కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు.ఎందుకంటే అతను ఏడు ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు తన తోడి బాలురలో ఒకడిని కృష్ణునిగా భావించేవాడు.అతనికి సేవలు చేసేవాడు.వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచినా చెవికెక్కించుకున్వాడు కాదు.అట్లాంటి ఉద్ధవుడు విదురునికి సమాథానం చెప్పక పోవడంలో ఆశ్చర్యము ఏ మాత్రమూ లేదు.ఎందుకంటే కృష్ణుని వియోగము తట్టుకోవడం అతనికి చేతకావటం లేదు.
అయినా ఉద్ధవుడు చిన్నగా తమాయించుకున్నాడు.కానీ గొంతు దుఃఖముతో బొంగురుపోయింది.ఆ గద్గద స్వరంతోటే చెప్పడం ప్రారంభించాడు.అయ్యా!విదురా!నా నోటితో ఏమని చెప్పేది?లోకరక్షకుడు,లోకబాంథవుడు అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడు.భూదేవి దురదృష్టము ఏమని వర్ణించాలి?యాదవులు,వారి రాజ్యము నాశనము అయింది.ధర్మము మట్టి కొట్టుకుని పోయింది.అధర్మము ఊడలు దిగి పటిష్టమయిపోయింది.దానిని పెకిలించేవారు ఇంకెవరూ లేరు.మంచీ,మర్యాదా,మన్ననలు దారి తప్పి ఎటు పోయాయో అర్థం కావడం లేదు.
ధర్మరాజు రాజసూయయాగమపుడు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇచ్చినపుడు లోకాలన్నీ అతని కీర్తినీ,ధర్మనిష్టనీ శ్లాఘించారు కదా!బ్రహ్మ సృష్టికి ఇతనే మూలపురుషుడు అని ఆకాశానికి ఎత్తారు కదా!దుష్టుల విషయంలో అతని కనుబొమలు కోపంతో ముడిపడితేనే భూదేవి భారం సగం తగ్గిపోతుంది కదా!నిర్మల స్వరూపుడు అయిన అతనిని ఏమరుపాటున కూడా ఎవరూ మరువలేరు.శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుని చేసాడు.అతని క్రింద భృత్యుడుగా సంతోషంగా సేవలందించాడు.పూతన అతనిని చంపేదానికి వచ్చిన రాక్షసి.కానీ ఆమెకు యశోదా దేవికి కూడా దక్కని ఉన్నత స్థానం ఇచ్చాడు కదా!శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది.ఆయన లీలలు అమోఘం!
Subscribe to:
Comments (Atom)