Thursday, 16 April 2026
ఉద్థవుడి జీవిత పరమార్థము
శుక మహర్షి చెప్పేదంతా పరీక్షిత్తు విన్నాడు.అతని మనసులో మెదిలిన అనుమానాలను బయటపెట్టాడు.ఓ శుకమహర్షీ!యాదవ వంశంలో అతిరథులు,మహారథులు కాడా చాలా మంది ఉన్నారు కదా!వాళ్ళందరూ కూడా పరస్పర కలహాలతో ఒకళ్ళనొకళ్ళని కొట్టుకుని మరణించారు.శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందాడు కదా!ఇట్లా యాదవ కులంలో అందరూ చనిపోయినా ఈ ఉద్ధవుడు ఒక్కడు మటుకు ఎలా బ్రతికాడు?
దానికి శుకమహర్షి ఇలా సమాథానం చెప్పాడు.శ్రీ మహా విష్ణువు యాదవ కులంలో ఎందుకు జన్మించాడంటావు?బ్రహ్మాది దేవతలు ప్రార్థించారనే కదా!ఈ భూభారం తగ్గించే దానికే కదా!వంశం మొత్తం నాశనమయితే జ్ఞాన తత్త్వము లోకంలో ఎట్లా నిలబడుతుంది?ఆ తత్త్వము లోకములో అందరికీ విశదంగా,వివరంగా చెప్పేవాళ్ళు ఒకరైనా,నిఖార్సు అయినవాళ్ళు ఉండాలి కదా!అందుకే శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బ్రతికించి ఉంచాడు.తత్త్వ ప్రచారానికి అతడు ఒక్కడే యోగ్యుడని భావించాడు.
ఇలా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత విదురుడు మైత్రేయుడిని కలిసేదానికి బయలుదేరాడు.విదురుడు యమునా నదిని దాటాడు.కొన్ని రోజులు ప్రయాణం చేసాడు.పుణ్య క్షేత్రాలలో స్నానం చేసాడు.విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.చిన్నగా గంగా నది దగ్గరకు చేరాడు.అక్కడ అతనికి ముని సత్తముడు అయిన మైత్రేయ మహర్షి కనిపించాడు.
Sunday, 12 April 2026
ఉద్ధవుని భక్తి ప్రపత్తులు
మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీకృష్ణుడు ఉన్న చెట్టు మొదలు దగ్గరకు వచ్చాడు.అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయుడు వింటుండగా ఉద్ధవుడితో ఇలా అన్నాడు.నాయనా!ఉద్ధవా!నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతా విను.నీవు నీ పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేసిన సత్రయాగములో ఒక వసువుగా ఉన్నావు.నీ మనస్సులో ఏమీ కోరికలు లేవు నా పాదారవిందాలు సేవించుకోవాలనే తృష్ణ తప్ప.అందుకనే నేను ఎప్పుడూ నీ మనసులోనే నివసిస్తూ ఉంటాను.నీకు ఇంక మరో జన్మ లేదు.నీవు గొప్ప పుణ్యాత్ముడివి.ఇంకో సంగతి కూడా చెబుతా విను.పద్మకల్పము నందు నా నాభీ పద్మమునందు ఉద్భవించు బ్రహ్మకు నా మహత్త్వము నెరిగించు దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను.అలా ఆ జ్ఞానాన్ని నాకు ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు.కాబట్టి ఆయన ఆనతి మేరకు నేను కల్పాంతము వరకూ ఉండవలసి వస్తుంది.నేను ఇప్పుడు బదరికాశ్రమమునకు పోవుచున్నాను.
ఉద్ధవుడు చెప్పిన మాటలకు విదురుడు దిగులు పడ్డాడు.యాదవ వినాశనము అతనిని కలవర పరచింది.కానీ నిజయోగ సత్త్వమున శోకాన్ని విడనాడాడు.ఉద్ధవుడిని ప్రార్థించాడు.ఓ యాదవోత్తమా!శ్రీకృష్ణుడు నీకు పరతత్త్వము గురించి చెప్పాడు అన్నావు కదా!నాకు కూడా అది బోధించు.నన్ను కూడా కృతార్థుడిని చేయి.మీరు భగవద్భక్తులు,సుజనులు.మీరు మహనీయులు,పరోపకార పరాయణులు.నా మొర ఆలకించండి అని వేడుకున్నాడు.
అప్పుడు ఉద్ధవుడు విదురుడితో ఇలా అన్నాడు.విదురా!మునిసత్తముడు,విష్ణు సమానుడు అయిన మైత్రేయుడు నీకు ఆ తత్త్వమును బోథిస్తాడు అని చెప్పి బదరీవనమునకు బయలుదేరాడు.
Wednesday, 1 April 2026
యాదవ వంశం అధోగతిపాలు
శ్రీకృష్ణుడు ద్వారకలో సుఖంగా ఉన్నాడు.కానీ యాదవులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు.పైత్యం పెరిగిపోతుంది.ఒకరోజు మహా మహా మునులు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చారు.వారితో పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా ఎకసక్కెములు ఆడారు.దానితో మునులకు కోపం వచ్చి మీలో మీరే కొట్టుకుని నశిస్తారు అని శపించి పోతారు.ఆ తరువాత కొన్ని రోజులకు జాతర వచ్చింది.అందరూ ప్రభాస తీర్థమునకు పోయి స్నానాలు చేసారు.ఒళ్ళూ పాయా తెలీనంతగా మద్యపానం సేవించారు.ఆ తరువాత ఒకళ్ళనొకళ్ళు కలహించుకోని,పొడుచుకుని చచ్చిపోయారు.శ్రీకృష్ణుడు అప్పుడు ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి కూర్చున్నాడు.ఉధ్ధవుడిని బదరీవనమునకు పొమ్మని చెప్పి తను ఇంకో తట్టు ఎటో వెళ్ళిపోయాడు.ఉద్ధవుడు ఉండబట్టలేక అతనిని ఎతుక్కుంటూ పోయి ఒక చెట్టు మొదట విశ్రాంతిగా పడుకున్న శ్రీకృష్ణుడిని చూసాడు.
అంతలో వ్యాస మహర్షి శిష్యుడు అయిన మైత్రేయిడు తీర్థ యాత్రలు చేసుకుంటూ అక్కడకు వచ్చాడు.
Subscribe to:
Comments (Atom)