Monday, 22 June 2026
ఆది పురుషుడు
ఆ ఆది పురుషుడు ఆధ్యాత్మిక,ఆధిదైవిక,ఆదిభౌతిక భేదములతో ప్రకాశించాడు.మహదాది తత్త్వముల తలపులను తెలుసుకున్నాడు.అతను వాటి వివిధ వృత్తి లాభమునకై తన చిచ్ఛక్తి చేత తదనుకూల సృష్టికి శ్రీకారం చుట్టాడు.అతని ముఖము నుండి వేదములు,బ్రాహ్మణులు ఉద్భవించారు.అతని బాహువులనుండి క్షత్రియులు పుట్టారు.అతని తొడలనుంచి వ్యవసాయము,గోరక్షణము,వర్తకము చేయువారు పుట్టారు.సేవాధర్మము కలిగిన వారు అతని పాదముల నుండి పుట్టారు.ఈ నాలుగు జాతులు వారి వారికి ఉద్దేశించబడిన కర్మలు చేసుకుంటారు.ఆ పరంథాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు.
నిజము చెప్పాలంటే ఆ పురుషోత్తముడి గురించి ఎవరికీ పూర్తిగా అవగాహన లేదు.ఆఖరుకు అతని నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మకూడా పూర్తిగా తెలుసుకోలేక తెల్ల మొహం వేస్తాడు.అట్లాంటిది మామూలు మానవులు సముద్రంలో నీటి బొట్టు మోయన కూడా అతనిని తెలుసుకొనలేరు.ఆ ఆది పురుషుడి నుంచి వచ్చిన వేదములు కూడా తమలో తాము విశ్లేషణలు,విమర్శలూ చేసుకుంటూ తర్జన భర్జన అవుతాయి తప్ప కూలంకషంగా ఆ దేవదేవుడి గురించి చెప్పజాలవు.
ఇంతెందుకు?ఆఖరుకి ఆ పరమాత్మ అయినా తన శక్తి,బలాన్ని పూర్తిగా బేరీజు వేసుకోగలడో లేదో?మహదాదులు,అష్ట దిక్పాలకులు,బ్రహ్మ,శివునికి కూడా దోరకదేమో ఆ పురాణ పురుషుని పూర్తిగా వీక్షించడము,అర్థం చేసుకోవడము.
Tuesday, 16 June 2026
విశ్వ నిర్మాణం వైపు అడుగులు
కాల మాయాంశ చిహ్నాలు కలిగి,మహదాద్యభిమానమును పొందిన దేవతలు విష్ణు కళలతో కూడినవారు అయి ఉంటారు.మహదాద్యభిమానము అంటే పంచ తత్త్వాలు,జ్ఞానేంద్రియాలు,కర్మేంద్రియాల సమ్మేళనం!అలాంటి మహదాది తత్త్వములు ఐక్యము ఒక్కటే ప్రపంచం కల్పించేదానికి సమర్థంకాదు కాబట్టి అవి శ్రీహరిని పార్ర్థించాయి.భగవంతుడికి అర్థం అయింది.ఆ మహదాది తత్త్వాలకు పరస్పరము ఐకమత్యము కుదరటం లేదు.అందుకే అవి సృష్టి కార్యం చేయడంలో విఫలమవుతున్నాయి అని.ఇంక ఆయనే నడుము బిగించాడు సృష్టి చేసేదానిక్.అతడు కాలవేగమున ఉద్రేకము పొందిన ప్రకృతితో కలిసి,ఇరవై ఏడు తత్త్వములయందు ప్రవేశించి,ఆ తత్త్వములకు విశ్వ నిర్మాణ నైపుణ్యం చూపుతూ,అన్యోన్య భావము కుదిరేటట్లు చూసాడు,చేసాడు.శ్రీహరి హిరణ్మయము,అదే బంగారు మయమైన ఛాయ,అయిన విరాట్ స్వరూపము పొంది ఉన్నాడు.కార్యరూపకలితమగు అతని గర్భము వేయి సంవత్సరములు జలమునందు ఉణ్ణింది.కార్యరూపకలితము అంటే తను అనుకున్న సృష్టి చేయడానికి సంకల్పము,కార్యాచరణ భగవంతుడు మొదలు పెట్టాడు.పరమాత్మకు స్థానమై ఆదిమావతారమగు ఆ దేవదేవుని గర్భమున భూతసమూహము తోడి ప్రపంచం ఉద్భవించింది.భూత సమూహము అంటే అన్ని రకాల జీవకోటి సమూహము,సమాహారము అని అర్థము.
Saturday, 13 June 2026
భగవంతునిచే పంచ భూత సృష్టి
భగవంతుడుచే ఇంద్రియములలో త్వక్కు చక్షుస్సు,శ్రోత్రము,జిహ్వ,ఘ్రాణము అను జ్ఞానేంద్రియములు ఉత్పన్నమయినవి.వాక్కు,పాణి,పాదము,పాయివు,ఉపస్థ అనే ఐదు కర్మేంద్కియములు ఉత్పన్నమయినవి.ఇవి తైజసాహంకారము వలన ఉత్పన్నమయ్యాయి.
తామసాహంకారము వలన శబ్ద స్పర్శ రూప రస గంధములు పుట్టాయి.అందులో శబ్దము నిజగుణమైన శబ్దము వలన ఆకాశమును పుట్టించెను.గగనము స్పర్శ తన్మాత్రల వలన వాయువును పుట్టించెను.వాయువు నభోతలమున రూపతన్మాత్రము వలన లోకమునకే లోచనమయిన తేజస్సును ఉత్పాదించెను.తేజస్సు వాయువుతో గూడి రసతన్మాత్ర వలన
జలమును పుట్టించెను.సలిలము తేజోయుక్తమయిన గంధ గుణము వలన పృథివిని పుట్టించెను.వీనిలో గగనమునకు శబ్దము,వాయువునకు శబ్ద స్పర్శలు,తేజస్సునకు శబ్ద స్పర్శరూపములు,జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు,పృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధములు గుణములై ఉండును.
Subscribe to:
Posts (Atom)