Wednesday, 29 July 2026
భాగవతమునకు నాందీ ప్రస్తావన
విదురుడు మైత్రేయుడిని ఇంకా ఇలా అడిగాడు.స్వామీ!మీరు నాకు ఈ భూమికి క్రింద,మీద ఉండు లోకాల గురించి చెప్పాలి.అక్కడ స్థితి గతులు గురించి చెప్పాలి.అంతేనా?అలాగే దేవ,రాక్షస,గరుడ,గంధర్వ,నాగ,సిద్ధ సాధ్యులు,గగన చరుల గురించి చెప్పాలి.గర్భజ,అండజ,స్వేదజ పద్ధతుల గురించి వివరణ ఇవ్వాలి.సత్త్వరజస్తమోగుణములు ప్రధానముగా గల అవతారములు వివరించాలి.వాటి వలన ఏర్పడిన జగదుత్పత్తి స్థితి లయముల గూర్చి చెప్పాలి.వేదములు,బ్రాహ్మణాది వర్ణక్రమము తెలియచెప్పాలి.ఆశ్రమ ధర్మాలు,యోగమార్గాలు,జ్ఞానమార్గాలు,వాటికి సాథనాలు విశ్లేషించాలి.సాంఖ్య యోగములు,శాస్త్రములు,పాషండ ధర్మములు,జీవుల గుణ కర్మలు విపులంగా వివరించాలి.ధర్మము ,మోక్షము గురించి చర్చించుకోవాలి.పరస్పర విరోధము లేని సాథనములు,రాజనీతి,దండనీతి,పితృకర్మల విధానముల గురించి తెలియచెయ్యాలి.ఇంతే కాదు.ఇంకా చాలా తెలుసుకోవాలి.కాల చక్రమున నక్షత్రములు,గ్రహములు వసించు విథములు తెలుసుకోవాలి.తపోదానములు,వాని ఫలములు,ధర్మములు,ప్రజల కర్మములు గురించి తెలుపగోరుతాను.విలయ భేదములు,భక్తుల గురించి,జీవ బ్రహ్మములు ఐక్య సిద్థి,ఉపనిషత్తులు చెప్పే జ్ఞానము,శిష్య ప్రయోజనములు,విజ్ఞాన సాథనముల గురించి వివరం కావాలి.నా ఈ అనుమానాలు తీర్చారంటే మీకు యజ్ఞములు,దానములు చేసిన ఫలం దక్కుతుంది.వేదాధ్యయనము చేసిన పుణ్యం దక్కుతుంది.ఆర్తజనులను రక్షించిన పుణ్యము దక్కుతుంది.
ఈ విషయాలను శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.శుకుడు ఇలా అన్నాడు.ఓ రాజా!మీ వంశమును ప్రజలు ఎప్పుడూ పొగుడుతుంటారు.శ్రీహరి కథలు ప్రతి దినము వింటుంటావు.ఆ కారణంగా మీ వంశము పవిత్రమయినది.మమూలు ప్రజానీకం అల్పమయిన సుఖమూ,అధికమయిన దుఃఖమూ అనుభవిస్తుంటుంది సహజంగా.వారి దుఃఖము పోగొట్టగలిగేది భాగవతము ఒక్కటే!అది నీకు చెబుతాను.
Thursday, 16 July 2026
విదురుడి జ్ఞాన పిపాస
విదురుడికి మైత్రేయుడిని చూస్తుంటే ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపన ఎక్కువ అవుతుంది.అది అణచుకోలేక పోతున్నాడు.ఆ ముని పుంగవుడిని అడుగుతున్నాడు.స్వామీ!నాకు ఇంకొంచెం అనుమానాలు ఉన్నాయి.మీరు ఎంతో సమర్థవంతులు.కాబట్టి అడుగుతున్నాను.ఇంద్రియములతో మహదాదులు ఉన్నాయి కదా!మహదాదులు అంటే సృష్టి కి మూలకారణమయిన ప్రకృతి,మహత్తత్వం(బుద్ధి), అహంకారము,పంచతన్మాత్రలు,పంచభూతాలు,ఇంద్రియములు,ఇంద్రియార్థములు మున్నగునవి కదా!భగవంతుడు వాని పరస్పరానుషంగమున విరాట్టుని పుట్టించాడు కదా!అందు తానే వసించును కదా!విరాట్పురుషుడు అంటే మాటలు కాదు కదా!సహస్ర శిరస్సులు,వేయి బాహువులు,సహస్ర పాదములు ఉన్న అతనిని చూచి లోకములు అన్నీ అలజడి చెంది,అతలాకుతలం కాకుండా ఎలా ఉండగలుగుతున్నాయి?పది ప్రాణములు,ఇంద్రియార్థములు,ఇంద్రియములు,బ్రాహ్మణాది వర్ణములు పుట్టాయి కదా!పుత్ర పౌత్ర సంపద గలిగిన వంశముతో ప్రజలు ఎట్లా కలిగారు?ఆ ప్రజలతో జగములు ఎట్లా ఉండినవి?శ్రీహరి ప్రజాపతులకు అందరికీ ప్రభువు కదా!ఆయన స్రష్టలచే,నవబ్రహ్మలచేత ప్రపంచాన్ని ఎట్లా సృజించాడు?వాని భేదములు ఏవి?మనుకులములు,మను వంశాధీశ్వరులు,మను వంశాను చరితములు ఏవి?వాటన్నిటి గురించి వివరముగా చెప్పు,స్వామీ!
Sunday, 12 July 2026
విదురుడి సంశయ నివృత్తి
మైత్రేయుడి మాటలు విదురుడి బుర్రలోకి బాగా ఎక్కాయి.తన మోదము ఇలా ప్రకటించాడు.ఓ మునీంద్రా!నాలో ఉండే చాలా అనుమానాలకు మీరు సమాధానం చెప్పారు.నాకు నారాయణుడు లోకానికి అంతటికీ ఏకైక నాయకుడు ఎలా అయ్యాడో బోథ పడింది.శరీర ధారులు అయిన జీవులకు కర్మ బంధములు ఎట్లా ఏర్పడతాయో అవగతమయింది.నేను ఇప్పుడు ఖరాఖండిగా చెప్పగలను...లోకములకు శ్రీహరి యే ప్రభువు అని.జీవుడు పరతంత్రుడు అనే విషయం తెలుసుకున్నాను.అజ్ఞానము,అవిద్య ఆ భగవంతుని యందలి భక్తి ప్రభావము చేతనే పటాపంచలు అవుతుంది.భగవంతుడు నిరాథారుడు..।కానీ సమస్త సృష్టికీ ఆయనే కారణభూతుడు.శరీరాభిమానము మానవుడుని మూఢుని చేస్తుంది.సంసారంలో గానుగెద్దు చందాన అక్కడక్కడే తిరిగేలా చేస్తుంది.కానీ ఏ క్షణాన భక్తి మార్గములోకి వస్తాడో,ఆ రోజు భగవంతుడికి దగ్గర అవుతాడు.సుఖాలకూ,దుఃఖాలకూ స్పందించడం మానకపోతే మానవుడు దుఃఖాల ఊబిలోనే కూరుకుపోతాడు.నారాయణుని భజన సమస్త దుఃఖాలకూ చరమ గీతం పాడుతుంది.
Friday, 10 July 2026
విదురుడి అనుమానం
మైత్రేయుడు ఆదిపురుషుడు గురించి విదురుడికి చెప్పినదంతా శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు.ఇంకా ఇలా చెబుతున్నాడు.రాజా!మైత్రేయుడు చెప్పినదంతా విన్న తరువాత విదురుడి మనసులో తేనెతుట్టిలాగా అనుమానాలు రేకెత్తాయి.ఇంక ఉండబట్టలేకపోయాడు.అడిగేసాడు.ఓ మహామునీ!మీరే చెప్పారు కదా,భగవంతుడు అనే వాడు అగుణుడు అని.మరి అతను సృష్టి,స్థితి,లయ కార్యములు ఎట్లా చేయగలిగాడు?అసలు ఎట్లా సంభవమయ్యాయి?త్రిగుణాత్మకమయిన మాయతో కూడి లోకాలను సృజించాడు అంటే ఎట్లా కుదురుతుంది?అంతా ఆషామాషీ వ్యవహారము కాదు కదా!అనంత ప్రాణి కోటిలోని ప్రతి ప్రాణి యందు అతను నివసిస్తాడు అని అంటున్నావు కదా!ఆయనే ఉన్నప్పుడు,ఆయనే అంతా అయినప్పుడు....జీవికి కష్టము అనేది ఎట్లా సంభవిస్తున్నది.అలా జరుగకూడదు కదా!
మైత్రేయుడు చిరు నవ్వు నవ్వి ఇలా సమాథానం చెప్పాడు.విదురా!కుతర్క వాదాలు చేసి,ఆయన గొప్పదనము,ఆయన మాయను మానవ మాత్రులము మనము తెలుసుకోలేము.భగవంతుడు నిత్యుడు,అనంతుడు,నిత్య శోభనయుతుడు.అతనికి విపద్దశ అనేది లేదు.కొన్నిటిని అడుగ కూడదు.ఒప్పుకోవాల్సిందే!నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.చందమామ ఆకాశం లో ఉంటుంది.దాని ప్రతిబింబం మనకు నీటిలో కనిపిస్తుంది.నీళ్ళు కదులుతుంటే ఏమవుతుంది?చందమామ కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా!నిజంగా ఆకాశంలో చందమామ కదలదు కదా!కదిలినట్లు కాదు కదా!అట్లాగే కర్మ బంథాలు జీవులకు మాత్రమే!ఆ మహామహునికి కాదు.జీవునికి ముఖ్యంగా అజ్ఞానం కారణం వలనే కర్మ బంథాలు కలుగుతున్నాయి.ఆ పరాత్పరుడి ఆశ్రయంలోకి వస్తే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.ఎంత సేపూ ఏమి తినాలి,ఎప్పుడు తినాలి,ఎక్కడ తినాలి,ఎంత తినాలి?లాంటి యావల నుంచి బయటపడి శ్రీహరి చరణాలను నమ్ముకోవాలి.అప్పుడు కైవల్యంకు అర్హత సంపాదిస్తారు.
Subscribe to:
Posts (Atom)