Monday, 21 September 2026

యుగములు….epoch or era

యుగములు నాలుగు.అవి కృత యుగము,త్రేతాయుగము,ద్వాపర యగము మరియు కలి యుగము.ఇందులో కృత యుగము నాలుగు వేల దివ్య వర్షములు నడుస్తుంది.దాని సంధ్య ఎనిమిది వందల ఏండ్లు.త్రేతా యుగము మూడు వేల దివ్య వర్షములు ఉంటుంది.దాని సంధ్య ఆరు వందల ఏండ్లు.ద్వాపర యుగము రెండు వేల వత్సరములు.దాని సంధ్య నాలుగు వందల ఏండ్లు.కలి యుగము వేయి సంవత్సరములు.దాని సంధ్య రెండు వందల ఏండ్లు.సంధ్యాంశ మధ్యములో ధర్మము ఎక్కువగా ఉంటుంది.సంధ్యాంతమున ధర్మము తక్కువగా ఉంటుంది. ధర్మ దేవత కృత యుగములో నాలుగు పాదాల మీద ఉంటుంది.త్రేతా యుగములో మూడు పాదాల పైన ఉంటుంది.ద్వాపర యుగములో రెండు పాదాలతో సంచరిస్తుంది.కలి యుగము వచ్చేటప్పటికి ఒక్క పాదం పైన నడుస్తుంది.అంటే పాదములు తగ్గే కొద్దీ ధర్మము తగ్గుతూ వస్తుంది,అలాగే అధర్మము పెరుగుతూ వస్తుంది. భూలోకము,భువర్లోకము,స్వర్ణ/సువర్లోకములకు పైగా బ్రహ్మ నివసించే సత్య లోకము ఉంది. వేయి యుగ చతుష్టయములు జరిగితే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది.అతనికి రాత్రి కూడా వేయి యుగ చతుష్టయములు అవుతుంది.ఆయన నిద్రించే సమయములో లోకాలు నశిస్తాయి.మేలుకుని ఉంటే లోకములు ఏర్పడతాయి. /////:::::/// Epoch or era or yugamu..... We have four epochs or yugamulu in our mythology.They are Krutha yugamu,Threthaa yugamu,Dwaapara yugamu and Kali yugamu.Time period of Krutha yugamu is four thousand celestial years.Its twilight or dusk period is eight hundred years.Threthaa yugamu period is three thousand celestial years.Its dusk is for six hundred years.Time period of Dwaapara yugamu is two thosand years.Its dusk is four hundred years.Kali yugamu has the time span of thousand years.Its dusk is for two hundred yeras.Righteousness or Dharma flourishes during first part of Sandhya or dusk.It diminishes as it reaches the fag end. Goddess of righteousness or Dharma devatha is considered to be a cow and walks on its all the four legs during Krutha yugamu.During Threthaayugamu it walks on three legs.During Dwaapara yugamu,it walks on two legs.During Kali yugamu,it walks on only one leg.We can conclude that as the legs of Dharmadevatha lessen,dharma or righteousness is also degrading while Adharma is on the increasing mode. Above Bhuloka,Bhuvarloka and Swarna /Suvar loka,there is Sathya lokam.Brahma lives there.Thousand yuga chathushtayamulu,all the four yugas,make one day for Brahma.Similarly another thousand yuga chathushtayamulu make one night for Brahma.All the lokas or universe is destroyed when Brahma sleeps and are formed again when he wakes up.

Wednesday, 9 September 2026

కాల లక్షణము

మైత్రేయుడు కాల లక్షణము గురించి చెప్పడము మొదలు పెట్టాడు.విదురా!లేత సూర్యుని కిరణ సంగతమయి గగనస్థమగునది త్రస రేణువు.అంటే సూర్య కిరణాలు పడే దగ్గర ఆ వెలుగులో సూక్ష్మ ధూళి కణాలు చూస్తాము కదా!అవి అన్నమాట.దాని ఆరవ భాగము పరమాణువు ఉంటుంది.అదే సూక్ష్మ కాలము.సూర్య మండలము లోకము నందు పండ్రెండు రాశులలో చరించు కాలము మహా కాలము.రెండు పరమాణువులు కలిస్తే అణువు అవుతుంది.మూడు అణువులు ఒక త్రస రేణువు.మూడు త్రస రేణువులు ఒక్క తృటి.నూరు తృటులు ఒక వేధ.మూడు వేధములు ఒక లవము.మూడు లవములు ఒక నిమేషము.మూడు నిమేషములు ఒక క్షణము.అయిదు క్షణములు ఒక కాష్ఠ.పది కాష్ఠలు ఒక లఘువు.పదహైదు లఘువులు ఒక నాడి.రెండు నాడులు ఒక ముహూర్తము.ఆరు,ఏడు నాడులు మనుష్యులకు ఒక ప్రహరము.దీనినే యామము అని కూడా అంటారు.నాలుగు యామములు ఒక పగలు.నాలుగు యామములు రాత్రి.ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక దినము.పదహైదు దినములు ఒక పక్షము.శుక్ల పక్షము,కృష్ణ పక్షము అని రెండు పక్షములు ఉంటాయి.రెండు పక్షములు ఒక మాసము.ఒక మాసము పితృ దేవతలకు ఒక దినము.రెండు మాసములు ఒక ఋతువు.ఆరు మాసములు ఒక అయనము.ఉత్తరాయనము,దక్షినాయనము అని రెండు అయనములు ఉన్నాయి.రెండు అయనములు ఒక సంవత్సరము లేదా పన్నెండు మాసములు.ఒక సంవత్సరము దేవతలకు ఒక దినము.నూరు సంవత్సరములు మనుష్యుల ఆయుఃప్రమాణము.సూర్యుడు కాలాత్ముడు,విశ్వమయుడు.అతను నక్షత్ర గ్రహ మండలము నుండి పరమాణువు మొదలుకొని సంవత్సర కాలమానములోని చాలా మాసములలో కనుపిస్తుంటూ ఉంటాడు.ఆ మాసములు సౌరము,బార్హస్వత్యము,సావనము,చాంద్రము మరియు నాక్షత్రము అనునవి.కాల మానము సంవత్సరము,పరీవత్సరము,ఇడా వత్సరము,అనుత్సరము,వత్సరము అను భేదములు కలగి ఉంటుంది.సూర్యుడు ఈ వత్సర పంచక ప్రవర్తకుడు.ఆయన ఆయురాది వ్యయమున విషయాసక్తిని మళ్ళిస్కూ,కోరికలు కలవారికి యజ్ఞముల మూలమున స్వర్గాది ఫలములను చేకూరుస్తుంటాడు.

Wednesday, 2 September 2026

దేవ వర్గము సృష్టి

దేవ వర్గము ఎనిమిది రకాలుగా విభజన కాబడ్డది.అందులో విబుధులు,పితృ దేవతలు మరియు సురాదులు అని మూడు భేదములు;గంధర్వులు,అప్సరసలు ఒక తెగ;యక్షులు,రక్షసులు ఒక తెగ;భూత ప్రేత పిశాచములు ఒక విధము;సిద్ధులు,విద్యాధరులు,చారణలు ఒక తెగ;కిన్నర కింపురుషులు ఒక తెగ;ఇట్లా ఎనిమిది రకములుగా విభజన కావించబడినది.ఈ దేవ వర్గమును కూడా కలుపుకంటే మొత్తము సృష్టి పది రకములు. కల్పాంతమున అమోఘ సంకల్పుడు అయిన శ్రీహరి రజో గుణముతో కూడి,తానే సృష్టి కర్త అగుచూ స్వస్వరూపమున విశ్వమును కల్పించాడు.అంతా ఆయన మాయే!ఇంకేమీ వేరే లేదు.దాని ప్రభావము వలన పూర్వాపర భావములు తెలియ కుండా గందర గోళం అనిపిస్తుంది.నిజానికి చెప్పాలంటే సుడి గుండం లో పడిన చెట్లు ఎట్లా తిరుగుతుంటాయో,అలా ఉంటుంది పరిస్థితి.ఈ కల్పములో ఉండే దేవతలు,అసురులు ప్రతి మన్వంతరములోనూ నామ రూపాలు కలిగి ఉంటారు.దేవ సృష్టి లోనే కౌమార సృష్టి అని ఇంకొకటి ఉంది.అది ప్రాకృత,వైకృత ఉభయాత్మకము అయి ఉంటుంది.అదే సనత్కుమారాది సృష్టి.వీరిలో దేవత్వమూ,మానుషత్వమూ రెండూ కలగలిపి ఉంటాయి.

Sunday, 30 August 2026

సృష్టి వివరణ…తొమ్మిది రకములు

సృష్టి అనేది తొమ్మిది విథములుగా ఉంది.వాటిలో ప్రాకృతములు,వైకృతములు ఉంటాయి.అవి కాల,ద్రవ్య,గుణ భేదములచే ప్రతిసంక్రమములు అవుతుంటాయి.మహతత్త్వము మొదటి సృష్టి.అది నారాయణ సకాశమున గుణవైషమ్యము పొందుతుంది.అంటే సత్త్వ రజస్తమో గుణాలు సృష్టికి పూర్వము సమతుల్యంగా ఉంటాయి.కానీ సృష్టి మొదలు అయిన తరువాత వాటిలో అసమానత ఏర్పడుతుంది.దానినే గుణ వైషమ్యము అని అంటారు.ద్రవ్య,జ్ఞాన,క్రియాత్మకమయిన అహంకార తత్త్వము రెండవ సృష్టి.శబ్ద,స్పర్శ,రూప,రసగంధములు అనే పంచభూతన్మాత్ర ద్రవ్యశక్తితో కూడిన పృథివి మున్నగు పంచభూతముల సృష్టి మూడవది.త్వక్కు,చక్షుస్సు,శ్రోత్రము,జిహ్వ,ఘ్రాణము అనే అయిదు జ్ఞానేంద్రియములు,వాక్ పాణి,పాద పయూపస్థములు అనే అయిదు కర్మేంద్రియములు నాలుగవ సృష్టి.పాయువు అనగా మలద్వారము,గుదము...శరీర విసర్జన కు సంబంధించినవి.ఉపస్థ అనగా జననేంద్రియములు...సంతానోత్పత్తికి వినియోగపడే ఇంద్రియములు.సాత్త్వికాహంకారమున పుట్టిన దేవతా గణము ఐదవ సృష్టి.అది మనోమయము అయి ఉంటుంది.జీవలోకమునకు అబుద్ధి వలన ఆవరణలను కలిగించు తామసము ఆరవ సృష్టి.పైన పేర్కొనబడిన ఆరూ భగవంతునికి విలాసార్థమయిన ప్రాకృత సృష్టులు.ఏడవ సృష్టి నుంచి వైకృత సృష్టులు ప్రారంభమవుతాయి.పూవులు లేకనే ఫలములను ఇచ్చు రావి మొదలగు వనస్పతి వృక్షములు,పుష్పించి ఫలించు ఆకులు గల చెట్లు,ఓషధులు,లతలు,వెదుళ్ళు,దుంపలు,మామిడి మున్నగు వృక్షములు ఏడవ సృష్టి.ఎనిమిదవ సృష్టి ఇరవై ఎనిమిది భేదములు గలది.జ్ఞాన శూన్యములై చీలిన గిట్టలు గల వృషభములు,గోవులు,దున్నలు,మేకలు,పందులు,ఒంటెలు మున్నగునివి;చీలని గిట్టలు గల గుర్రములు,గాడిదలు,శరభములు(ఎనిమిది కాళ్ళుగల అతి శక్తివంతమయిన పౌరాణిక మృగములు),చమరీ మృగములు లేదా జడల బర్రెలు;ఐదేసి గోళ్ళు గల కుక్క,నక్క,తోడేలు,పిల్లి,పులి,కుందేలు,సింహము,కోతి,ఏనుగు మున్నగునవి;మొసలి మున్నగు జలచరములు;గ్రద్ద,డేగ,నెమలి,హంస,చక్రవాకము,కాకి,గుడ్ల గూబ మున్నగు పక్షులు;వీటినన్నిటినీ తిర్యగ్గణంబులు అని అంటారు.అంటే జంతు పశు పక్ష్యాదులు.వీటికి వెన్నెముక అడ్జంగా ఉండి,నేలపైన అడ్డంగా నడుస్తాయి. మానవుడు తొమ్మిదవ సృష్టి.అది రజోగుణ ప్రేరితము అయి,పనులు చేయుటకు తగ్గి దుఃఖమునందును సుఖము కోరుకుంటుంది.ఈ మూడు సృష్టులూ వైకృత సృష్టులు.

Friday, 28 August 2026

బ్రహ్మ సృజన

బ్రహ్మ శ్రీహరిని స్తుతించడము అంతా మైత్రేయుడు విదురుడికి చెప్పాడు.ఒక ముఖ్యమయిన విషయము చెబుతూ చెబుతూ మధ్యలో ఆపితే ఎలాఉంటుంది?ఉత్కంఠ తట్టుకోలేము కదా!విదురుడి పరిస్థితి కూడా అలానే ఉంది.ఉండబట్టలేక మైత్రేయుడిని అడుగుతున్నాడు.స్వామీ!శ్రీహరి బ్రహ్మను దీవించి అంతర్థానం అయ్యాడు అని చెప్పారు కదా!ఆ తరువాత బ్రహ్మ ఏమి చేసాడు?దేవ సంబంథమునను,మానవ సంబంథమునను ఈ సృష్టి ఎట్లా చేయగలిగాడు?నాకు వివరంగా చెప్పండి,స్వామీ! విదురుడి మాటలకు ప్రసన్నుడు అయిన మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు.పుండరీకాక్షుడు బ్రహ్మను దీవించాడు అని చెప్పాను కదా.ఆయన సూచన మేర బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు.ఆ తపోబలముతో తనకు నివాసము అయిన పద్మమును,వాయువును,జలమును కనుగొన్నాడు.తన తపశ్శక్తి వలన చేకూరిన విద్యాబలముతో వాయువును బంధించాడు.గగన వ్యాపి సగు జలమును కనుగొన్నాడు.శ్రీహరి నుంచి తన ధ్యానము,ధ్యాస మరల్చకుండా తదేకంగా మనసు నిలిపి గగన తలమున పద్మమును చూచి,ఆ పద్మకోశములో అణగియున్న లోకములను గమనించాడు.తనకు తానే తెలుసుకున్నాడు.ఏమని?ఈ బ్రహ్మాండ కోటి సృష్టికి శ్రీహరి తనను ఎంచుకున్నాడని.ఇంక జాగు చేయదలచుకోలేదు.ఆ పద్మములోనికి పోయి,అక్కడ ముల్లోకాలను చూసాడు.పదునాలుగు లోకాలను సృజించాడు.తదుపరి దేవతలను సృష్టించాడు.ఆ తరువాత మనుష్యులను సృష్టించాడు.పిదప తిర్యక్కులను సృజించాడు.తిర్యక్కులు అనగా పశుపక్ష్యాదులు అని అర్థము.తరువాత స్థావరములు సృష్టించాడు.స్థావరములు అనగా స్థిరముగా ఒకే చోట ఉండేవి...అనగా చెట్లు. విదురుడికి ఇంకా ఇంకా చెప్పించుకోవాలని ఉంది.అందుకని ఇలా అడిగాడు.ఓ మైత్రేయ మహర్షీ!నీవు ఇప్పుడు చెప్పావు కదా,విష్ణుదేవుని మహిమ వల్లనే లోకములు అన్నీ ఏర్పడ్డాయి అని.ఆ మహిమాన్వితుడు అయిన విష్ణుమూర్తి గురించి చెప్పు.మైత్రేయుడు చెప్పాడు.విదురా!శ్రీహరి కాలానురూపము గైకొని తన్ను తాను ఇట్లా సృజించుకున్నాడు.అతడు సర్వలోకాలలో ఉంటాడు.తనలోనే సర్వ లోకాలూ ఉంటాయి.ఆయనను తప్పించుకోవడము ఎవరికీ కుదరదు.కావున ఈ విశ్వానికి అంతటికీ కర్త,కర్మ,క్రియ అతనే!ఈ విశ్వము అంతా అతని శరీరము నుండే వెలుపలకు వచ్చింది.అది అతని మాయ వల్లనే పుడుతుంది,పెరుగుతుంది,విలయము అవుతుంది.అంతా ఆయన ఇష్టమే!

Monday, 24 August 2026

శ్రీహరి సుముఖం

బ్రహ్మ స్తుతించడం చాలా బాగుంది.అది శ్రీహరికి కూడా నచ్చింది.హరి ముదమారగా ప్రసన్నుడయినాడు.బ్రహ్మతో ఇలా అన్నాడు.ఓయీ!సృష్టి కార్యము చేయలేకపోతున్నాను అని దిగులు పడవద్దు.దానికి కావలసిన జ్ఞానము కోసరము నియమ నిష్టలు పాటిస్తూ తపస్సు చేయుము.అపుడు నేను నీకు సాక్షాత్కారము అవుతాను.నేను ఇందుగలడందులేడని సందేహము వద్దు.నేను సర్వ వ్యాపకుడిని.సర్వాంతర్యామిని.సకల జీవులలో ఉండేది నేనే.ఇక్కడైతేనే ఉంటాను.అక్కడికి రాను.అట్లా ఏమీ లేదు.ఈ సృష్టిలోని అణువు అణువులో నేను ఉన్నాను.అది తెలుసుకొని,మసలుకో!కాబట్టి ఈ ప్రకృతి,చరాచర జగత్తును అంతా సేవించి,తరించు.అప్పుడు నీ దోషములు అన్నీ పటాపంచలు అవుతాయి.నీ మదిలో ఎప్పుడూ ఇదే ధ్యాస ఉండాలి.పరాత్పరుడు,పరంధాముడు అయిన శ్రీహరే భూతేంద్రియ గుణాత్ముడు,జగన్మయుడు అని అర్థం చేసుకో.నీవు పద్మ నాళ వివర మార్గమున వేలకు వేల మైళ్ళు నీటిలో వెదికావు కదా,నా కోసము!ఇదుగో!నీ ముందే ఉన్నాను.చూడు!నేను విలాసార్థము సగుణుడుని అయ్యాను,జగములను కల్పించానని తెలుసుకున్నావు.నన్ను స్తుతించావు.నాకు సంతోషము కలిగించావు.నాకు ఇష్టమై నిన్ను సృజించాను.నా లోపల నిశ్చల గతిని లోకములు అన్నీ ఉన్నాయి కదా!అహంకార మూల తత్త్వమును పొంది నీవు సృజన చేయి.ఇలా చెప్పి అలా అంతర్థానమయ్యాడు మన అయ్యవారు.

Saturday, 22 August 2026

జ్ఞాన భిక్ష కోరిన బ్రహ్మ

బ్రహ్మ ఆనందానికి అవథులు లేకుండా ఉన్నాయి.పరమాత్ముడి దర్శనంతో దశ,దిశ తిరిగిపోయిందని భలే సంతోషిస్తున్నాడు.భగవంతుడిని చూసిన ఆ క్షణం మళ్ళీ మళ్ళీ తలచుకుని,పులకరించిపోతున్నాడు.ఇంకా ఇలా పొగుతున్నాడు.కానీ అవన్నీ పచ్చి నిజాలే!అతిశయోక్తులు ఏమాత్రమూ కావు.హే పరంథామా!ఓ పరాత్పరా!నీ పాదపద్మములు సేవించే భాగ్యము కలగడం పెద్ద అదృష్టం!ఆ భాగ్యము కలిగితే,ఇంక భయానికి తావు లేదు.శోకానికి అవకాశం లేదు.ముక్తి మార్గానికి మనకు అనుమతి,ఆమోదము లభించినట్లే!స్వామీ!కొందరు మూర్ఖులు ఉంటారు.వారు నీ నామస్మరణ చేయకుండా సమస్త పాపాలనూ మూటగట్టుకుంటారు.తప్పు దారిలో పోతారు.ఇంద్రియ నిగ్రహము లేకుండా అమంగళ కార్యములు చేస్తారు.ఎంత సేపూ క్షుత్పిపాస దుఃఖము ...అంటే ఆకలి దప్పులతో బాధపడుతుంటారు.మానవుడు తను వేరు,ఆత్మ వేరు,ఆత్మ వేరు పరమాత్మ వేరు..।నేను నేనే...నువ్వు నువ్వే...అనుకునేటంత కాలమూ సంసారమనే సాగరాన్ని దాటలేడు.ఎక్కడికక్కడ మునకలు వేస్తుంటాడు.మనిషి యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కానీ పరమపురుషుని పాదారవిందములు కానలేడు.నిష్కామ భక్తులకు భగవంతుడు ప్రసన్నుడు అయినట్టు దేవతలను కూడా కాడు.నీ నామ స్మరణతోటే మానవుడికి జన్మ జన్మల పాపాలు నాశనం అయిపోతాయి.మోక్షము పొందుతాడు. ఓ దేవ దేవా!కల్పాంతమున పద్మము నందు ఉద్భవించిన నేను నీ స్వరూపము కనుక్కోవాలని ఉబలాట పడ్డాను.ఎన్నో ఏళ్ళు తపస్సు చేసాను.చాలా యాగములు జేసాను.భలే దిగులు పడ్డాను.నీవు నా పైన దయ తలచి నాకు కనిపించావు.నా జన్మ ధన్యమయింది.నీవే నాకు దిక్కు,దిశ,దశ చూపించాలి.నీవు పంచభూత ప్రవర్తకమగు మాయకు చిక్కకుండా,నీ జఠరము నందు ముల్లోకాలనూ ఉంచావు.పాల కడలిలో శేషశయనుడివై యోగనిద్రలో గడిపావు.కొంత కాలానికి మేలుకున్నావు.నీ వాభి కమలము నుంచి ముల్లోకాలనూ సృజించావు.ఇదంతా ఏ జ్ఞానముతో చేసావో,ఆ జ్ఞానము నాకు ప్రసాదించు.నాకు సృష్టి నిర్మాణము చేయాలని సంకల్పము ఉంది.కానీ చేతకావడం లేదు.నీవు కరుణతో జ్ఞానభిక్ష చేసావంటే నేను కృతార్థుడను అవుతాను.

Saturday, 15 August 2026

బ్రహ్మకు జ్ఞానోదయము

బ్రహ్మ అతని నాభీ సరస్సున పుట్టిన పద్మము,జలము,వాయువు,ఆకాశము మటుకు చూడగలిగాడు.రజోగుణ యుక్తుడు అయిన బ్రహ్మకు సృష్టి చేసేదానికి సరి అయిన మార్గము తోచలేదు.పని చేయాలనే తపన,వ్యామోహము,అహంభావము,అశాంతి,ఇంద్రియభోగాల పట్ల అమితమయిన కోరికలు...ఇవి రజోగుణము ఉన్నవారి లక్షణాలు.కానీ ఎలాగో సర్వమునకు శ్రీహరి మూలాథారము అని తెలుసుకున్నాడు.ఆ దేవదేవుడితో మొర పెట్టుకున్నాడు.ఓ జగన్నాథా!ఓ దేవదేవా!నువ్వు ఒక్కటే సత్యమూ,నిత్యమూ.నీ స్వరూపమే నాకు జ్ఞాన మార్గము చూపించింది.నీ దివ్యరూపము చూడగలగడమే నా అజ్ఞానానికి చరమగీతం పాడింది.నాలో వివేకము,విజ్ఞత వికసించాయి.మంచి వాళ్ళనూ,సత్పురుషులనూ అనుగ్రహించేదానికి నీవు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటావు.దాని వలన ఎన్నో అవతారాలు ఎత్తి ఉంటావు,ఎత్తుతూ ఉంటావు.నీవు ఈ విషయంలో అలుపూ సొలుపూ,అనాసక్తత అసలు ప్రదర్శించవు.నీ రూపము చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించేలా మనసును ఊరిస్తున్నది.నీ స్వరూపము ముందర నేను చూడగలిగాను.నా జన్మ ధన్యమయినది.ఈ ప్రపంచాన్ని పుట్టించింది నీవే!నా రూపము భూతేంద్రియాత్మకము అనగా పంచభూతములు మరియు ఇంద్రియములచే కార్యరూపము దాల్చినది.కానీ నేను సదా నిన్ను సేవించుకుంటాను,నీ ఆశ్రయము కోరుకుంటాను.పనికిమాలిన తర్కములు చేసేవారికి నీ మహిమలు,నీ గొప్పదనం తెలియదు.కృతార్థులు అయిన మహాత్ములే నిన్ను సంపూర్ణంగా కనుగొనగలరు.ఎల్లప్పుడూ నీ పాదారవిందముల సేవలో మునిగి తేలుతూ ఉంటారు.నీ పాదకమలాలను ఎన్నటికీ విడనాడరు.

Thursday, 13 August 2026

శేషశయనుడు సాకారము

బ్రహ్మకు ఏమీ అర్థం కావటం లేదు.బుర్ర నిండా ప్రశ్నలే!అనుమానాలే!దానికి ఆరంభం...అంతం కనిపించడం లేదు.అసలు ఈ జలము ఎక్కడిది?ఈ జలములో ఈ పద్మము ఎలా పుట్టింది?ఈ పద్మం పైకి నేను ఎట్లా వచ్చాను?అసలు నా పుట్టుకకు కారణమేంది?నేను ఎవరు?నా పేరు ఏంది?అసలు ఈ పద్మనాళము యొక్క మూలము ఎక్కడుంది?ఈ అనుమానం మదిలో రేకెత్తగానే ఒకచోట కుదురుగా కూర్చోలేకపోయాడు.ముందు వెనక ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు.ఆ పద్మనాళము యొక్క మొదలు కనుక్కునేదానికి దానిని అనుసరించాడు.ఇలా ఒక రోజా?ఒక నెలా?ఒక సంవత్సరమా?కాదు,కాదు.ఏకంగా వేయి దివ్య సంవత్సరాలు వెతికాడు.అయినా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు.భగవంతుడి మాయ వలన ఏమీ తెలియలేదు,తేలలేదు.గమ్మున వెనకకు తిరిగి వచ్చాడు.తను ఉద్భవించిన కమలము మధ్యలో ఉన్న పీఠము పైన కూర్చున్నాడు.అష్టాంగ యోగమున పవనమును బంథించి నూరేండ్లు సమాథిలో ఉన్నాడు.ఆ యోగశక్తి వలన తనకు జ్ఞానము కలిగినది.కానీ తన పుట్టుటకు కారణమయిన వాడు,తనలోనే వాడు అయిన శ్రీహరిని కనుక్కోలేక పోయాడు,కానలేకపోయైడు.ఇంక నిశ్చలమయిన భక్తి యోగమును ఆశ్రయించాడు.దాని మహిమ వలన శేషనాగు శయ్య పైన శయనించి ఉన్న శంఖచక్రధరుడైన పరమాత్మను తిలకించాడు.శ్రీహరి ఎలా కనిపించాడు?పీతాంబరములతో,బంగారు కిరీటంతో ధగధగమని వెలిగి పోతున్నాడు.ముత్యాల హారాలు,తులసీదామాలతో అలరారుతున్నాడు.ఆ పరాత్పరుడి దేహము అపరిచ్ఛన్నముగా,అనగా సంపూర్ణంగా ఉన్నది.ముల్లోకాలలో ఆ శరీర శోభకు సాటి లేదు.అతని శరీరకాంతులు ఎలా ఉన్నాయి అంటే వాటి వెలుగుల వలన ఆయన ధరించిన ఆభూషణములకు వన్నె వచ్చింది,వింత శోభ చేకూరింది.అతని పాదపద్మ యుగము,అనగా తామర పువ్వుల వలె సుకుమారంగా ఉండే పాదములు,భక్తుల కోర్కెలు తీర్చే కామధేనువు.అతనిని సరిగ్గా వర్ణింప గలిగే వారు ముల్లోకాలలో లేరు.అంతటి దివ్యమయిన,తేజోమయమయిన రూపము.అతనే సర్వేశ్వరుడు.ఆది అంతములు లేనివాడు.కర్త,కర్మ,క్రియ అన్నీ తానే అయిన జగదేక పూజ్యుడు.బ్రహ్మ జీవితం ధన్యమయింది ఆ పరాత్పరుడి దర్శనంతో!

Sunday, 2 August 2026

సృష్టికార్యమునకు సంకల్పము-బ్రహ్మ పుట్టుక

ప్రళయము వచ్చింది.జగత్తు మొత్తమూ జలమయము అయిపోయింది.ఆ జలము మధ్యలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్నాడు.చిచ్ఛక్తితో కూడి కపట నిద్రలో ఉన్నాడు.నిమీలితాక్షుడు వేయి తలలు గల శేషనాగుపై శయన ముద్రలో ఉన్నాడు.పక్కరోజు పరీక్ష ఉందంటేనే మనకు రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు.అట్లాంటిది జగన్నాటక సూత్రథారికి ఎలా పడుతుంది?అందుకనే కపట నిద్ర అని అన్నారు.అతడు యోగమాయకు దూరముగా వేయి యుగములు శయన నిద్రలో ఉన్నాడు.ఆ తరువాత సృష్టి కార్యమునకు సంకల్పము చేసుకున్నాడు.అంత వరకూ అన్ని లోకములూ అతనిలో అణగి ఉన్నాయి.మరలా వాటిని సృజించేదానికి సాథనము అయిన సూక్ష్మార్థమును గ్రహించాడు.అప్పుడు రజో గుణమును పుట్టించాడు.దాని వలన అతని నాభి యందు పద్మ నాళము పుట్టింది.దాని నుంచి పద్మము ఉద్భవించింది.ఆ పద్మము నుంచి చతుర్ముఖుడు అయిన బ్రహ్మ పుట్టాడు.ఆ బ్రహ్మకు అంతా కొత్తగా ఉంది.అతను ఆ తామర పువ్వు కర్ణిక పైన నిలుచుకున్నాడు.కర్ణిక అంటే తామర పువ్వు మధ్య భాగము.తన నాలుగు ముఖాలలో ఉండే కన్నులు విప్పి ఆకాశం చూసాడు.నలు దిక్కులనూ కలియ చూసాడు.ఆయనకు అంతా అయోమయంగా ఉంది.ఏమీ అర్థం కావడం లేదు.

Wednesday, 29 July 2026

భాగవతమునకు నాందీ ప్రస్తావన

విదురుడు మైత్రేయుడిని ఇంకా ఇలా అడిగాడు.స్వామీ!మీరు నాకు ఈ భూమికి క్రింద,మీద ఉండు లోకాల గురించి చెప్పాలి.అక్కడ స్థితి గతులు గురించి చెప్పాలి.అంతేనా?అలాగే దేవ,రాక్షస,గరుడ,గంధర్వ,నాగ,సిద్ధ సాధ్యులు,గగన చరుల గురించి చెప్పాలి.గర్భజ,అండజ,స్వేదజ పద్ధతుల గురించి వివరణ ఇవ్వాలి.సత్త్వరజస్తమోగుణములు ప్రధానముగా గల అవతారములు వివరించాలి.వాటి వలన ఏర్పడిన జగదుత్పత్తి స్థితి లయముల గూర్చి చెప్పాలి.వేదములు,బ్రాహ్మణాది వర్ణక్రమము తెలియచెప్పాలి.ఆశ్రమ ధర్మాలు,యోగమార్గాలు,జ్ఞానమార్గాలు,వాటికి సాథనాలు విశ్లేషించాలి.సాంఖ్య యోగములు,శాస్త్రములు,పాషండ ధర్మములు,జీవుల గుణ కర్మలు విపులంగా వివరించాలి.ధర్మము ,మోక్షము గురించి చర్చించుకోవాలి.పరస్పర విరోధము లేని సాథనములు,రాజనీతి,దండనీతి,పితృకర్మల విధానముల గురించి తెలియచెయ్యాలి.ఇంతే కాదు.ఇంకా చాలా తెలుసుకోవాలి.కాల చక్రమున నక్షత్రములు,గ్రహములు వసించు విథములు తెలుసుకోవాలి.తపోదానములు,వాని ఫలములు,ధర్మములు,ప్రజల కర్మములు గురించి తెలుపగోరుతాను.విలయ భేదములు,భక్తుల గురించి,జీవ బ్రహ్మములు ఐక్య సిద్థి,ఉపనిషత్తులు చెప్పే జ్ఞానము,శిష్య ప్రయోజనములు,విజ్ఞాన సాథనముల గురించి వివరం కావాలి.నా ఈ అనుమానాలు తీర్చారంటే మీకు యజ్ఞములు,దానములు చేసిన ఫలం దక్కుతుంది.వేదాధ్యయనము చేసిన పుణ్యం దక్కుతుంది.ఆర్తజనులను రక్షించిన పుణ్యము దక్కుతుంది. ఈ విషయాలను శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు.శుకుడు ఇలా అన్నాడు.ఓ రాజా!మీ వంశమును ప్రజలు ఎప్పుడూ పొగుడుతుంటారు.శ్రీహరి కథలు ప్రతి దినము వింటుంటావు.ఆ కారణంగా మీ వంశము పవిత్రమయినది.మమూలు ప్రజానీకం అల్పమయిన సుఖమూ,అధికమయిన దుఃఖమూ అనుభవిస్తుంటుంది సహజంగా.వారి దుఃఖము పోగొట్టగలిగేది భాగవతము ఒక్కటే!అది నీకు చెబుతాను.

Thursday, 16 July 2026

విదురుడి జ్ఞాన పిపాస

విదురుడికి మైత్రేయుడిని చూస్తుంటే ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపన ఎక్కువ అవుతుంది.అది అణచుకోలేక పోతున్నాడు.ఆ ముని పుంగవుడిని అడుగుతున్నాడు.స్వామీ!నాకు ఇంకొంచెం అనుమానాలు ఉన్నాయి.మీరు ఎంతో సమర్థవంతులు.కాబట్టి అడుగుతున్నాను.ఇంద్రియములతో మహదాదులు ఉన్నాయి కదా!మహదాదులు అంటే సృష్టి కి మూలకారణమయిన ప్రకృతి,మహత్తత్వం(బుద్ధి), అహంకారము,పంచతన్మాత్రలు,పంచభూతాలు,ఇంద్రియములు,ఇంద్రియార్థములు మున్నగునవి కదా!భగవంతుడు వాని పరస్పరానుషంగమున విరాట్టుని పుట్టించాడు కదా!అందు తానే వసించును కదా!విరాట్పురుషుడు అంటే మాటలు కాదు కదా!సహస్ర శిరస్సులు,వేయి బాహువులు,సహస్ర పాదములు ఉన్న అతనిని చూచి లోకములు అన్నీ అలజడి చెంది,అతలాకుతలం కాకుండా ఎలా ఉండగలుగుతున్నాయి?పది ప్రాణములు,ఇంద్రియార్థములు,ఇంద్రియములు,బ్రాహ్మణాది వర్ణములు పుట్టాయి కదా!పుత్ర పౌత్ర సంపద గలిగిన వంశముతో ప్రజలు ఎట్లా కలిగారు?ఆ ప్రజలతో జగములు ఎట్లా ఉండినవి?శ్రీహరి ప్రజాపతులకు అందరికీ ప్రభువు కదా!ఆయన స్రష్టలచే,నవబ్రహ్మలచేత ప్రపంచాన్ని ఎట్లా సృజించాడు?వాని భేదములు ఏవి?మనుకులములు,మను వంశాధీశ్వరులు,మను వంశాను చరితములు ఏవి?వాటన్నిటి గురించి వివరముగా చెప్పు,స్వామీ!

Sunday, 12 July 2026

విదురుడి సంశయ నివృత్తి

మైత్రేయుడి మాటలు విదురుడి బుర్రలోకి బాగా ఎక్కాయి.తన మోదము ఇలా ప్రకటించాడు.ఓ మునీంద్రా!నాలో ఉండే చాలా అనుమానాలకు మీరు సమాధానం చెప్పారు.నాకు నారాయణుడు లోకానికి అంతటికీ ఏకైక నాయకుడు ఎలా అయ్యాడో బోథ పడింది.శరీర ధారులు అయిన జీవులకు కర్మ బంధములు ఎట్లా ఏర్పడతాయో అవగతమయింది.నేను ఇప్పుడు ఖరాఖండిగా చెప్పగలను...లోకములకు శ్రీహరి యే ప్రభువు అని.జీవుడు పరతంత్రుడు అనే విషయం తెలుసుకున్నాను.అజ్ఞానము,అవిద్య ఆ భగవంతుని యందలి భక్తి ప్రభావము చేతనే పటాపంచలు అవుతుంది.భగవంతుడు నిరాథారుడు..।కానీ సమస్త సృష్టికీ ఆయనే కారణభూతుడు.శరీరాభిమానము మానవుడుని మూఢుని చేస్తుంది.సంసారంలో గానుగెద్దు చందాన అక్కడక్కడే తిరిగేలా చేస్తుంది.కానీ ఏ క్షణాన భక్తి మార్గములోకి వస్తాడో,ఆ రోజు భగవంతుడికి దగ్గర అవుతాడు.సుఖాలకూ,దుఃఖాలకూ స్పందించడం మానకపోతే మానవుడు దుఃఖాల ఊబిలోనే కూరుకుపోతాడు.నారాయణుని భజన సమస్త దుఃఖాలకూ చరమ గీతం పాడుతుంది.

Friday, 10 July 2026

విదురుడి అనుమానం

మైత్రేయుడు ఆదిపురుషుడు గురించి విదురుడికి చెప్పినదంతా శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు.ఇంకా ఇలా చెబుతున్నాడు.రాజా!మైత్రేయుడు చెప్పినదంతా విన్న తరువాత విదురుడి మనసులో తేనెతుట్టిలాగా అనుమానాలు రేకెత్తాయి.ఇంక ఉండబట్టలేకపోయాడు.అడిగేసాడు.ఓ మహామునీ!మీరే చెప్పారు కదా,భగవంతుడు అనే వాడు అగుణుడు అని.మరి అతను సృష్టి,స్థితి,లయ కార్యములు ఎట్లా చేయగలిగాడు?అసలు ఎట్లా సంభవమయ్యాయి?త్రిగుణాత్మకమయిన మాయతో కూడి లోకాలను సృజించాడు అంటే ఎట్లా కుదురుతుంది?అంతా ఆషామాషీ వ్యవహారము కాదు కదా!అనంత ప్రాణి కోటిలోని ప్రతి ప్రాణి యందు అతను నివసిస్తాడు అని అంటున్నావు కదా!ఆయనే ఉన్నప్పుడు,ఆయనే అంతా అయినప్పుడు....జీవికి కష్టము అనేది ఎట్లా సంభవిస్తున్నది.అలా జరుగకూడదు కదా! మైత్రేయుడు చిరు నవ్వు నవ్వి ఇలా సమాథానం చెప్పాడు.విదురా!కుతర్క వాదాలు చేసి,ఆయన గొప్పదనము,ఆయన మాయను మానవ మాత్రులము మనము తెలుసుకోలేము.భగవంతుడు నిత్యుడు,అనంతుడు,నిత్య శోభనయుతుడు.అతనికి విపద్దశ అనేది లేదు.కొన్నిటిని అడుగ కూడదు.ఒప్పుకోవాల్సిందే!నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.చందమామ ఆకాశం లో ఉంటుంది.దాని ప్రతిబింబం మనకు నీటిలో కనిపిస్తుంది.నీళ్ళు కదులుతుంటే ఏమవుతుంది?చందమామ కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా!నిజంగా ఆకాశంలో చందమామ కదలదు కదా!కదిలినట్లు కాదు కదా!అట్లాగే కర్మ బంథాలు జీవులకు మాత్రమే!ఆ మహామహునికి కాదు.జీవునికి ముఖ్యంగా అజ్ఞానం కారణం వలనే కర్మ బంథాలు కలుగుతున్నాయి.ఆ పరాత్పరుడి ఆశ్రయంలోకి వస్తే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది.ఎంత సేపూ ఏమి తినాలి,ఎప్పుడు తినాలి,ఎక్కడ తినాలి,ఎంత తినాలి?లాంటి యావల నుంచి బయటపడి శ్రీహరి చరణాలను నమ్ముకోవాలి.అప్పుడు కైవల్యంకు అర్హత సంపాదిస్తారు.

Monday, 22 June 2026

ఆది పురుషుడు

ఆ ఆది పురుషుడు ఆధ్యాత్మిక,ఆధిదైవిక,ఆదిభౌతిక భేదములతో ప్రకాశించాడు.మహదాది తత్త్వముల తలపులను తెలుసుకున్నాడు.అతను వాటి వివిధ వృత్తి లాభమునకై తన చిచ్ఛక్తి చేత తదనుకూల సృష్టికి శ్రీకారం చుట్టాడు.అతని ముఖము నుండి వేదములు,బ్రాహ్మణులు ఉద్భవించారు.అతని బాహువులనుండి క్షత్రియులు పుట్టారు.అతని తొడలనుంచి వ్యవసాయము,గోరక్షణము,వర్తకము చేయువారు పుట్టారు.సేవాధర్మము కలిగిన వారు అతని పాదముల నుండి పుట్టారు.ఈ నాలుగు జాతులు వారి వారికి ఉద్దేశించబడిన కర్మలు చేసుకుంటారు.ఆ పరంథాముడిని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు. నిజము చెప్పాలంటే ఆ పురుషోత్తముడి గురించి ఎవరికీ పూర్తిగా అవగాహన లేదు.ఆఖరుకు అతని నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మకూడా పూర్తిగా తెలుసుకోలేక తెల్ల మొహం వేస్తాడు.అట్లాంటిది మామూలు మానవులు సముద్రంలో నీటి బొట్టు మోయన కూడా అతనిని తెలుసుకొనలేరు.ఆ ఆది పురుషుడి నుంచి వచ్చిన వేదములు కూడా తమలో తాము విశ్లేషణలు,విమర్శలూ చేసుకుంటూ తర్జన భర్జన అవుతాయి తప్ప కూలంకషంగా ఆ దేవదేవుడి గురించి చెప్పజాలవు. ఇంతెందుకు?ఆఖరుకి ఆ పరమాత్మ అయినా తన శక్తి,బలాన్ని పూర్తిగా బేరీజు వేసుకోగలడో లేదో?మహదాదులు,అష్ట దిక్పాలకులు,బ్రహ్మ,శివునికి కూడా దోరకదేమో ఆ పురాణ పురుషుని పూర్తిగా వీక్షించడము,అర్థం చేసుకోవడము.

Tuesday, 16 June 2026

విశ్వ నిర్మాణం వైపు అడుగులు

కాల మాయాంశ చిహ్నాలు కలిగి,మహదాద్యభిమానమును పొందిన దేవతలు విష్ణు కళలతో కూడినవారు అయి ఉంటారు.మహదాద్యభిమానము అంటే పంచ తత్త్వాలు,జ్ఞానేంద్రియాలు,కర్మేంద్రియాల సమ్మేళనం!అలాంటి మహదాది తత్త్వములు ఐక్యము ఒక్కటే ప్రపంచం కల్పించేదానికి సమర్థంకాదు కాబట్టి అవి శ్రీహరిని పార్ర్థించాయి.భగవంతుడికి అర్థం అయింది.ఆ మహదాది తత్త్వాలకు పరస్పరము ఐకమత్యము కుదరటం లేదు.అందుకే అవి సృష్టి కార్యం చేయడంలో విఫలమవుతున్నాయి అని.ఇంక ఆయనే నడుము బిగించాడు సృష్టి చేసేదానిక్.అతడు కాలవేగమున ఉద్రేకము పొందిన ప్రకృతితో కలిసి,ఇరవై ఏడు తత్త్వములయందు ప్రవేశించి,ఆ తత్త్వములకు విశ్వ నిర్మాణ నైపుణ్యం చూపుతూ,అన్యోన్య భావము కుదిరేటట్లు చూసాడు,చేసాడు.శ్రీహరి హిరణ్మయము,అదే బంగారు మయమైన ఛాయ,అయిన విరాట్ స్వరూపము పొంది ఉన్నాడు.కార్యరూపకలితమగు అతని గర్భము వేయి సంవత్సరములు జలమునందు ఉణ్ణింది.కార్యరూపకలితము అంటే తను అనుకున్న సృష్టి చేయడానికి సంకల్పము,కార్యాచరణ భగవంతుడు మొదలు పెట్టాడు.పరమాత్మకు స్థానమై ఆదిమావతారమగు ఆ దేవదేవుని గర్భమున భూతసమూహము తోడి ప్రపంచం ఉద్భవించింది.భూత సమూహము అంటే అన్ని రకాల జీవకోటి సమూహము,సమాహారము అని అర్థము.

Saturday, 13 June 2026

భగవంతునిచే పంచ భూత సృష్టి

భగవంతుడుచే ఇంద్రియములలో త్వక్కు చక్షుస్సు,శ్రోత్రము,జిహ్వ,ఘ్రాణము అను జ్ఞానేంద్రియములు ఉత్పన్నమయినవి.వాక్కు,పాణి,పాదము,పాయివు,ఉపస్థ అనే ఐదు కర్మేంద్కియములు ఉత్పన్నమయినవి.ఇవి తైజసాహంకారము వలన ఉత్పన్నమయ్యాయి. తామసాహంకారము వలన శబ్ద స్పర్శ రూప రస గంధములు పుట్టాయి.అందులో శబ్దము నిజగుణమైన శబ్దము వలన ఆకాశమును పుట్టించెను.గగనము స్పర్శ తన్మాత్రల వలన వాయువును పుట్టించెను.వాయువు నభోతలమున రూపతన్మాత్రము వలన లోకమునకే లోచనమయిన తేజస్సును ఉత్పాదించెను.తేజస్సు వాయువుతో గూడి రసతన్మాత్ర వలన జలమును పుట్టించెను.సలిలము తేజోయుక్తమయిన గంధ గుణము వలన పృథివిని పుట్టించెను.వీనిలో గగనమునకు శబ్దము,వాయువునకు శబ్ద స్పర్శలు,తేజస్సునకు శబ్ద స్పర్శరూపములు,జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు,పృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధములు గుణములై ఉండును.

Thursday, 23 April 2026

శ్రీకృష్ణుడు మైత్రేయుడికి జ్ఞాన ప్రబోధము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు అని చెబుతున్నాడు.విదురుడి ప్రశ్నలకు మైత్రేయుడు సమాథానం చెప్పడం మొదలు పెట్టాడు.విదురా!నీవు భగవత్ భక్తుడివి.నీవు నన్ను ఈ ప్రశ్నలు అడగడం సముచితంగా ఉంది.నాకు సంతోషంగా కూడా ఉంది.శ్రీకృష్ణుడి నిర్యాణం సమయంలో నేను అతని దగ్గరే ఉన్నాను అని చెప్పాను కదా!అప్పుడు ఆ మహానుభావుడు నన్ను దగ్గరకు పిలిచి జ్ఞానము అంతటినీ ఉపదేశించాడు.ఆయన నాకు చెప్పినదంతా తు చ తప్పకుండా నీకు వివరిస్తాను.భక్తి శ్రద్ధలతో వినుము. భగవంతుడు సృష్టికి పూర్వము తన మాయా ప్రభావం చేత సమస్తమునూ లయమొందించాడు.అతను ఒక్కడే దివ్యమయిన తేజస్సుతో వెలుగ సాగెను.ఆ తరువాత కాలంలో తాను పురుషాకృతిలో ఉండి,ఆత్మాంశమున స్ఫురించిన శక్తిని నిలిపి,తన యుదరమునందణగియున్న విశ్వమును పుట్టించెను.మాయ వలన మహాతత్త్వమునందు సత్త్వగుణము,రజోగుణము మరియు తమోగుణకమయిన అహంకార తత్త్వము ఉత్పన్నమయింది.సాత్త్వికాహంకారము వలన మనస్సు,దేవతా గణము పుట్టినవి.

Wednesday, 22 April 2026

మైత్రేయుడి ముందు విదురుడి ప్రశ్నలు

మైత్రేయుడిని చూడగానే విదురుడు మహదానందపడిపోయాడు.వెంటనే ఆ మహర్షికి సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు.చేతులు జోడించి శర సంథానం లాగ ప్రశ్నలు గుప్పించాడు.మునీంద్రా!లోకములో ప్రజలు కనిపించిందంతా కావాలనుకుంటారు.వారి ఆశలకు హద్దూ పద్దూ ఉండదు.ఆయా సుఖములకు హేతువులైన కర్మములు అన్నీ చేస్తారు.కానీ తగిన ఫలితం దక్కలేదని బాథ పడుతుంటారు.నిజానికి కర్మములు బంధకాలు కదా!దుఃఖ హేతువులు కూడా!అవి సౌఖ్యదాయకాలు కానేరవు.ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్టమయినది.ఎందుకంటే మానవుడు ఒకసారి ఈ సంసారమనే చట్రంలో ఇరుక్కున్నాడంటే,ఇంక బయట పడేమార్గమే ఉండదు.ఒక రకంగా చెప్పాలంటే వీరంతా మూఢులు లాగ,పశుప్రాయులు లాగా వ్యవహరిస్తున్నారు.బహుశ ఇలాంటి అజ్ఞానులను ఉద్ధరించి,సన్మార్గంలోకి తీసుకెళ్ళేదానికే మీలాంటి మహానుభావులు ఈ భూమి పైన సంచరిస్తుంటారు. ఈ మాయ ఉందే,ఇది త్రిగుణాత్మకమయినది.భగవంతుడే ఇదంతా నియామకం చేసింది.ఆ భగవంతుడు ఏయే కర్మములను ఆచరించాడు?భగవంతుడు అనేవాడు సామాన్యుడికి దారి చూపాలి కదా!అసలు ఓంకారంగా ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు?ఎట్లా త్రిభువనాలని పాలించాడు?యోగమాయ యందు ఎలా ఉన్నాడు?ఈ చరాచర సృష్టి కర్త బ్రహ్మాండమునందు ఏ లీలలు చేసాడు?బ్రహ్మాది రూపములను ఎట్లా పొందాడు?పరి పరి విథముల ఎలా క్రీడించాడు?దశావతారాలు ధరించి భూసురులను,గోవులను,సురాదులను,దీనులను ఎలా పరిరక్షించాడు?మానవుడికి ఏయే ప్రయోజనాలు తీర్చాడు?జనులకు కర్మ నామ రూప భేదములు ఎట్లా నిర్దేశించాడు?మానవ జన్మ మరణాది సకల దుఃఖములకు నిలయము.పాప కర్మముల వలన ప్రాప్తమయినది.ఈ సంసార బంధము అంత తేలికగా తెగదు.ఆ భగవంతుడి చరిత్ర వింటే గానీ మనం ముక్తి సాథించలేను.కాబట్టి ఆ దేవ దేవుడి గాథలు మీరు చెప్పారంటే,విని నేను తరిస్తాను.నా జీవితం ధన్యమయింది అని తృప్తి పడతాను.

Thursday, 16 April 2026

ఉద్థవుడి జీవిత పరమార్థము

శుక మహర్షి చెప్పేదంతా పరీక్షిత్తు విన్నాడు.అతని మనసులో మెదిలిన అనుమానాలను బయటపెట్టాడు.ఓ శుకమహర్షీ!యాదవ వంశంలో అతిరథులు,మహారథులు కాడా చాలా మంది ఉన్నారు కదా!వాళ్ళందరూ కూడా పరస్పర కలహాలతో ఒకళ్ళనొకళ్ళని కొట్టుకుని మరణించారు.శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందాడు కదా!ఇట్లా యాదవ కులంలో అందరూ చనిపోయినా ఈ ఉద్ధవుడు ఒక్కడు మటుకు ఎలా బ్రతికాడు? దానికి శుకమహర్షి ఇలా సమాథానం చెప్పాడు.శ్రీ మహా విష్ణువు యాదవ కులంలో ఎందుకు జన్మించాడంటావు?బ్రహ్మాది దేవతలు ప్రార్థించారనే కదా!ఈ భూభారం తగ్గించే దానికే కదా!వంశం మొత్తం నాశనమయితే జ్ఞాన తత్త్వము లోకంలో ఎట్లా నిలబడుతుంది?ఆ తత్త్వము లోకములో అందరికీ విశదంగా,వివరంగా చెప్పేవాళ్ళు ఒకరైనా,నిఖార్సు అయినవాళ్ళు ఉండాలి కదా!అందుకే శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని బ్రతికించి ఉంచాడు.తత్త్వ ప్రచారానికి అతడు ఒక్కడే యోగ్యుడని భావించాడు. ఇలా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత విదురుడు మైత్రేయుడిని కలిసేదానికి బయలుదేరాడు.విదురుడు యమునా నదిని దాటాడు.కొన్ని రోజులు ప్రయాణం చేసాడు.పుణ్య క్షేత్రాలలో స్నానం చేసాడు.విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.చిన్నగా గంగా నది దగ్గరకు చేరాడు.అక్కడ అతనికి ముని సత్తముడు అయిన మైత్రేయ మహర్షి కనిపించాడు.

Sunday, 12 April 2026

ఉద్ధవుని భక్తి ప్రపత్తులు

మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీకృష్ణుడు ఉన్న చెట్టు మొదలు దగ్గరకు వచ్చాడు.అప్పుడు శ్రీకృష్ణుడు మైత్రేయుడు వింటుండగా ఉద్ధవుడితో ఇలా అన్నాడు.నాయనా!ఉద్ధవా!నీ పూర్వజన్మ వృత్తాంతం చెబుతా విను.నీవు నీ పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేసిన సత్రయాగములో ఒక వసువుగా ఉన్నావు.నీ మనస్సులో ఏమీ కోరికలు లేవు నా పాదారవిందాలు సేవించుకోవాలనే తృష్ణ తప్ప.అందుకనే నేను ఎప్పుడూ నీ మనసులోనే నివసిస్తూ ఉంటాను.నీకు ఇంక మరో జన్మ లేదు.నీవు గొప్ప పుణ్యాత్ముడివి.ఇంకో సంగతి కూడా చెబుతా విను.పద్మకల్పము నందు నా నాభీ పద్మమునందు ఉద్భవించు బ్రహ్మకు నా మహత్త్వము నెరిగించు దివ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను.అలా ఆ జ్ఞానాన్ని నాకు ఆ కృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు.కాబట్టి ఆయన ఆనతి మేరకు నేను కల్పాంతము వరకూ ఉండవలసి వస్తుంది.నేను ఇప్పుడు బదరికాశ్రమమునకు పోవుచున్నాను. ఉద్ధవుడు చెప్పిన మాటలకు విదురుడు దిగులు పడ్డాడు.యాదవ వినాశనము అతనిని కలవర పరచింది.కానీ నిజయోగ సత్త్వమున శోకాన్ని విడనాడాడు.ఉద్ధవుడిని ప్రార్థించాడు.ఓ యాదవోత్తమా!శ్రీకృష్ణుడు నీకు పరతత్త్వము గురించి చెప్పాడు అన్నావు కదా!నాకు కూడా అది బోధించు.నన్ను కూడా కృతార్థుడిని చేయి.మీరు భగవద్భక్తులు,సుజనులు.మీరు మహనీయులు,పరోపకార పరాయణులు.నా మొర ఆలకించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఉద్ధవుడు విదురుడితో ఇలా అన్నాడు.విదురా!మునిసత్తముడు,విష్ణు సమానుడు అయిన మైత్రేయుడు నీకు ఆ తత్త్వమును బోథిస్తాడు అని చెప్పి బదరీవనమునకు బయలుదేరాడు.

Wednesday, 1 April 2026

యాదవ వంశం అధోగతిపాలు

శ్రీకృష్ణుడు ద్వారకలో సుఖంగా ఉన్నాడు.కానీ యాదవులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు.పైత్యం పెరిగిపోతుంది.ఒకరోజు మహా మహా మునులు శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలని వచ్చారు.వారితో పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా ఎకసక్కెములు ఆడారు.దానితో మునులకు కోపం వచ్చి మీలో మీరే కొట్టుకుని నశిస్తారు అని శపించి పోతారు.ఆ తరువాత కొన్ని రోజులకు జాతర వచ్చింది.అందరూ ప్రభాస తీర్థమునకు పోయి స్నానాలు చేసారు.ఒళ్ళూ పాయా తెలీనంతగా మద్యపానం సేవించారు.ఆ తరువాత ఒకళ్ళనొకళ్ళు కలహించుకోని,పొడుచుకుని చచ్చిపోయారు.శ్రీకృష్ణుడు అప్పుడు ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి కూర్చున్నాడు.ఉధ్ధవుడిని బదరీవనమునకు పొమ్మని చెప్పి తను ఇంకో తట్టు ఎటో వెళ్ళిపోయాడు.ఉద్ధవుడు ఉండబట్టలేక అతనిని ఎతుక్కుంటూ పోయి ఒక చెట్టు మొదట విశ్రాంతిగా పడుకున్న శ్రీకృష్ణుడిని చూసాడు. అంతలో వ్యాస మహర్షి శిష్యుడు అయిన మైత్రేయిడు తీర్థ యాత్రలు చేసుకుంటూ అక్కడకు వచ్చాడు.

Saturday, 28 March 2026

శ్రీకృష్ణుడు శత్రు సంహారం ,మిత్ర సహకారం

శ్రీకృష్ణుడి లీలలు ఒకటా,రెండా?చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి.మనం అలసి పోవాలి అంతే!శ్రీకృష్ణుడు నరకుడిని చంపిన తరువాత అతని చెరలో ఉన్న పదహారు వేల రాజకన్యలను విడిపించాడు.వారి ప్రార్థనపై వారందరినీ వివాహం చేసుకున్నాడు.కాలయవన,సాళ్వ,జరాసంథులు చతురంగబలాలతో వచ్చి మథురను చుట్టుముట్టాయి.వాళ్ళందరినీ సంహరించాడు.పాండవులు ఎప్పుడూ శ్రీకృష్ణుడిని నమ్ముకోని ఉన్నారు.వాళ్ళకు విజయం చేకూరేలా సహాయం చేసాడు.అలా కూడా శత్రు సంహారం అయింది.బలరాముడితో కలసి బాణుడు,శంబరుడు,మురుడు,పల్వలుడు మున్నగు రాక్షసులను చంపాడు.దంత వక్త్రుడు అనే రాక్షసుడిని యుద్ధంలో చంపాడు.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించి పాండవ నాశనంకు ఒడి కట్టాడు.అప్పుడు ఉత్తర గర్భంలో బిడ్డ బ్రతికి బట్ట కట్టేలా చేసాడు.పాండవుల వంశం నిలబెట్టి వారికి మహోపకారం చేసాడు.తరువాత కాలంలో ఆ బిడ్డ పరీక్షిత్తుగా గొప్ప పేరు తెచ్చుకునినాడు.శ్రీకృష్ణుడు లౌకిక,వైదిక మార్గములను నడుపుతూ నిస్సంగుడైనాడు.ద్వారకానగరంలో సుఖముగా కాలం గడిపాడు.

Monday, 23 March 2026

గోపికాలోలుని గొప్పదనం

శ్రీకృష్ణుడు తన వేణుగానంతో బృందావనంలో గోపికల మనసులు దోచుకున్నాడు.అంతేనా?వలువలూ దోచుకున్నాడు.వారికి మోక్షం కలిగించేదానికి.ఆ రాసక్రీడలలో రేపల్లె తడిసి ముద్దయి పోయింది.పెద్దా చిన్నా అనిలేకుండా ఆ మాథవుడు అందరినీ అలరించాడు.అందరి మనసులూ చూరగొన్నాడు.బలరాముడితో కలసి మధురా పట్టణానికి పయనమయ్యాడు.అక్కడ కంసుని సంహారం చేసాడు.తల్లిదండ్రులను చెరనుంచి విడిపించాడు.సాందీపునికి శిష్యుడు అయినాడు.వేదవేదాంగములను,అరువది నాలుగు విద్యలనూ గ్రహించాడు.ప్రభాస తీర్థమునకు పోయి సముద్రములో మునిగిపోయి మరణించిన గురుపుత్రుని బ్రతికించి తీసుకుని వచ్చాడు.అలా గురువుకు గురుదక్షిణ ఇచ్చాడు.ఎదిరించిన రాజులను అందరినీ తరిమి భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణిని వివాహము చేసుకున్నాడు.నగ్నజిత్తు అనే రాజు తన దగ్గర ఉన్న పొగరెక్కిన సప్త వృషభములను ఎవరు లొంగదీస్తారో వారికి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానన్నాడు.ఎవరికీ వల్లగాలేదు.అప్పుడు శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుని నాగ్నజితిని పెండ్లాడాడు.సత్యభామ కోరిక మేర దేవతలను ఓడించి పారిజాత వృక్షాన్ని భూమికి తీసుకుని వచ్చాడు.నరకాసురుడు భూదేవికి పుత్రుడు.లోక కంటకుడు అయిన అతనిని తన చక్రంతో సంహరించాడు.ఆ పైన అతని కొడుకుకు రాజ్యాభిషేకం చేసాడు.

Wednesday, 4 March 2026

శ్రీకృష్ణుని లీలలు

విదురుడు శ్రీకృష్ణుని నిర్యాణము,యాదవుల నిర్యాణము తెలుసుకుని చాలా దుఃఖించాడు.కొంచెం సేపటికి తేరుకున్నాడు.ఉద్ధవుడిని ఇలా అడిగాడు.స్వామీ!మీరు కృష్ణుడు భక్తులకే కాకుండా క్రూరులగు రాక్షసులకు కూడా పరమపదము ఇచ్చాడు అని చెప్పారు.అది ఎంత మటుకు సమంజసము?అది తప్పు కదా! దానికి ఉద్ధవుడు సమాథానం చెప్పనారంభించాడు.విదురా!ఆ రాక్షసులు అందరూ శ్రీకృష్ణుని ఎదిరించారు.నిజమే!కానీ అంత్యకాలంలో శ్రీబరిని చూస్తూ,హరీ!అని పిలుస్తూ ప్రాణాలు వదిలారు.కాబట్టి వాళ్ళకందరికీ కూడా మోక్షము లభించింది.అతని చేతుల్లో పోవడం వాళ్ళు చేసుకున్న పుణ్యం,అంతే! నీకు నేను శ్రీకృష్ణుని పుట్టుక,చరిత్ర టూకీగా చెబుతాను విను.బ్రహ్మాది దేవతలు భూభారం తగ్గించమని శ్రీహరిని ప్రార్థించారు.సరే అని ఆయన దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు.దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన తనను చంపేవాడు పుడతాడని తెలిసి కంసుడు తన సోదరి బావలను చెరలో పెట్టాడు.కృష్ణుడు చెరసాలలోనే పుట్టాడు.వసుదేవుడు బిడ్డను కాపాడుకునే ప్రయత్నంగా నందుడి ఇంట్లో అర్థరాత్రి వదలిపెట్టి వచ్చాడు.పదకొండు ఏళ్ళు వచ్చేదాకా కృష్ణుడు బలరాముడితో కలసి నందుని ఇంట్లో పెరిగాడు.ఆ సమయంలో అతను శ్రీహరి అని ఎవరికీ అనుమానం రాకుండా జాగరూకత పాటించాడు.తోటి గోపాలకులతో అడవికి వెళ్ళి ఆవులు మేపుకుంటూ సరదా సరదాగా బాల్యం గడిపాడు.వేణుగానం చేస్తూ అందరి మనసులు చూరగొన్నాడు.మథ్య మథ్యలో కంసుడు పంపే రాక్షసులను తనకు తగిన రీతిలో హతమారుస్తూ కాలం గడిపాడు.కాళింది మడుగులో నీటిని విషపూరితం చేస్తున్న కాళియ సర్పాన్ని అక్కడ నుంచి తరిమి వేసాడు.ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని ఆగ్రహించి గోపాలకుల పైన రాళ్ళ వాన కురిపించాడు ఏడు రోజులు.అప్పుడు కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలిపి ఊరి వారందరినీ దాని క్రింద ఉంచి రక్షించాడు.

Monday, 2 March 2026

ఉద్ధవుడి ప్రత్యుత్తరము

విదురుడు అన్ని ప్రశ్నలు ఒకదాని తరువాత ఇంకొకటి,శర పరంపర లాగా వేసాడు.కానీ ఉద్ధవుడి నోటి నుంచి మాట రావడం లేదు.ఎందుకంటే అతను కృష్ణుని పోగొట్టుకునిన దుఃఖం నుంచి ఇంకా బయట పడలేదు.పైగా విదురుడు వారి క్షేమ సమాచారం అడగడంతో ఇంకా పొంగి పొరలు పొరలుగా ఏడుపు ముంచుకొచ్చింది. శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో ఇలా అంటున్నాడు.ఓ రాజా!ఉద్ధవునికి శ్రీకృష్ణుని పైన అలవిమాలినంత ప్రేమ.అది తెలియని వారు ఎవరూ ఉండరు.ఉద్ధవుడికి ఒక రకంగా కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ అని చెప్పవచ్చు.ఎందుకంటే అతను ఏడు ఏండ్ల బాలుడుగా ఉన్నప్పుడు తన తోడి బాలురలో ఒకడిని కృష్ణునిగా భావించేవాడు.అతనికి సేవలు చేసేవాడు.వాళ్ళ అమ్మ అన్నానికి పిలిచినా చెవికెక్కించుకున్వాడు కాదు.అట్లాంటి ఉద్ధవుడు విదురునికి సమాథానం చెప్పక పోవడంలో ఆశ్చర్యము ఏ మాత్రమూ లేదు.ఎందుకంటే కృష్ణుని వియోగము తట్టుకోవడం అతనికి చేతకావటం లేదు. అయినా ఉద్ధవుడు చిన్నగా తమాయించుకున్నాడు.కానీ గొంతు దుఃఖముతో బొంగురుపోయింది.ఆ గద్గద స్వరంతోటే చెప్పడం ప్రారంభించాడు.అయ్యా!విదురా!నా నోటితో ఏమని చెప్పేది?లోకరక్షకుడు,లోకబాంథవుడు అయిన శ్రీకృష్ణుడు అస్తమించాడు.భూదేవి దురదృష్టము ఏమని వర్ణించాలి?యాదవులు,వారి రాజ్యము నాశనము అయింది.ధర్మము మట్టి కొట్టుకుని పోయింది.అధర్మము ఊడలు దిగి పటిష్టమయిపోయింది.దానిని పెకిలించేవారు ఇంకెవరూ లేరు.మంచీ,మర్యాదా,మన్ననలు దారి తప్పి ఎటు పోయాయో అర్థం కావడం లేదు. ధర్మరాజు రాజసూయయాగమపుడు శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇచ్చినపుడు లోకాలన్నీ అతని కీర్తినీ,ధర్మనిష్టనీ శ్లాఘించారు కదా!బ్రహ్మ సృష్టికి ఇతనే మూలపురుషుడు అని ఆకాశానికి ఎత్తారు కదా!దుష్టుల విషయంలో అతని కనుబొమలు కోపంతో ముడిపడితేనే భూదేవి భారం సగం తగ్గిపోతుంది కదా!నిర్మల స్వరూపుడు అయిన అతనిని ఏమరుపాటున కూడా ఎవరూ మరువలేరు.శ్రీకృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుని చేసాడు.అతని క్రింద భృత్యుడుగా సంతోషంగా సేవలందించాడు.పూతన అతనిని చంపేదానికి వచ్చిన రాక్షసి.కానీ ఆమెకు యశోదా దేవికి కూడా దక్కని ఉన్నత స్థానం ఇచ్చాడు కదా!శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది.ఆయన లీలలు అమోఘం!

Saturday, 28 February 2026

అయినవాళ్ళ యోగక్షేమాలు అడిగిన విదురుడు

ఉద్ధవుడిని చూడగానే విదురుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది.వడివడిగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు.కుశల ప్రశ్నలు అడిగాడు.ఇంక నెమ్మదిగా మిగిలిన వారి కుశలం కనుక్కోవడం మొదలు పెట్టాడు.ఎవరికైనా తనా మనా ఉండడం సహజమే కదా! ఉద్ధవా!పుణ్యాత్ములు,శ్రీహరి భక్తులు,శత్రుమర్దనులు అయిన కుంతీ పుత్రులు క్షేమంగా ఉన్నారు కదా!బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తే అతడు బలరామ కృష్ణులు లాగా జన్మించారు కదా!వారిరువురూ క్షేమమే కదా!వసుదేవుడు,రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు,సాంబుడు,ఉగ్రసేనుడు,అక్రూరుడు,సాత్యకీ,దేవకీదేవి అందరూ కుశలమే గదా!వాసుదేవుడు,సంకర్షణుడు,అనిరుద్థుడు,చారుదేష్ణగాదులు సంతోషంగా ఉన్నారు కదా?శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల సంతానం పదిమంది.వారిలో చారుదేష్ణ,సుదేష్ణ,చారుదేహ,చారుగుప్త అనువారు ముఖ్యులు.పాండవులూ అయిదుగురూ,కుంతీదేవి కుశలమే గదా?ధృతరాష్ట్రుడు క్షేమమే గదా?అతని కొడుకులు నవ్ను సభనుంచి తరిమివేయునపుడు నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండెను.అప్పుడు నాకు కలిగిన చిత్త క్షోభ అంతా ఇంతా కాదు.దానికి కారణమయిన అతడు తప్పకుండా నరకం ఊచలు లెక్కబెడతాడు. నీకు ఆశ్చర్యమనిపిస్తుందేమో?విదురుడు చాలా సౌమ్యుడు కదా!కోపతాపలకు అసలు చోటివ్వడు కదా!శాంతానికి మారు పేరు కదా!మరి ఇతనికి ఏంది?ఇంత కోపమేంది?ఇంత దుఃఖమేంది?అని.భగవంతుని మాయ వలన నాకు మోహము కలగకుండా ఉంటుందా?ఆ భగవంతుడే మానవరూపము దాల్చి ధర్మబద్ధులు అయిన పాండవుల పక్షాన నిలిచాడు.వాళ్ళకోసం రాయబారం చేసాడు.అప్పుడు దుష్ట దుర్యోధనాదులు ఏమి చేసారు?ఆ దేవతామూర్తిని పట్టి బంథించే దానికి ప్రయత్నం చేసారు.అతను తిరిగి వాళ్ళను ఏమీ చేయలేడని వారి థీమా.యుద్ధంలో వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఆ సభలో శ్రీకృష్ణుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాడు.వాళ్ళ దుర్భాషలన్నిటినీ మౌనంగా భరించాడు.ఆ లీలా మానుష విగ్రహుడు,ఆ పరంథామ,ఆ శ్రీకృష్ణుడు తన అగ్రజుడు అయిన బలరాముడుతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా? విదురుడు శర పరంపరలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వేశాడు.

Wednesday, 25 February 2026

విదురుడికి అవమానము

విదురుడు ధృతరాష్ట్రుడికి హితము చెప్పడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు.కోపం నషాళానికి అంటింది.కర్ణుడు,శకుని,దుశ్శాసనుల వైపు చూస్తూ ఇలా అన్నాడు.విదురుడు దాసీ పుత్రుడు.ఇతనికి,ఇతని మాటలకు ఇంత ప్రాముఖ్యత, గౌరవము ఇవ్వాల్సిన పని లేదు.అసలు ఎవరు రానిచ్చారు అతనిని ఈ సమావేశానికి?మర్యాద నిలబెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు అవాకులు,చెవాకులు పేలుతున్నాడు.ఇతనిని ఉపేక్షించాల్సిన అవసరము మనకు ఏమాత్రమూ లేదు.ముందర వీడిని తరిమివేయండి అంటూ హుకుం జారీ చేసాడు. పెద్దా,చిన్నా అనే తారతమ్యము లేకుండా తండ్రి అంతటి వాడిని అలా అవమానకరంగా మాట్లాడటంతో విదురుడు నిర్ఘాంతపోయాడు.ఆ తరువాత కుమిలిపోయాడు.మనసుకు చాలా కష్టం వేసింది.సమాథానము చెప్పకుండా,మౌనంగా,కోపం దిగమింగుకుని,విల్లమ్ములను అక్కడే వదలి పెట్టేసి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు. అతను పవిత్రములయిన విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.గంగ మున్నగు పుణ్య నదులలో స్నానం చేసాడు.సిద్థాశ్రమాలను సందర్శించాడు.ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు.కూరలు కాయలను నీటిని మటుకు ఆహారంగా స్వీకరిస్తూ అవధూత వేషము ధరించి తిరగసాగాడు. ఆ సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది.కౌరవులు కొట్టుకుపోయారు,కాటికి పోయారు.విదురుడికి ఈ వార్త తను ప్రభాస తీర్థంలో ఉండేటప్పుడు తెలిసింది.ఎంతైనా అందరూ తన వాళ్ళే కదా!చాలా దుఃఖించాడు.ఇంక అక్కడ కుదురుగా ఉండ లేక పోయాడు.పోయి సరస్వతీ నదిలో స్నానము చేసాడు.పృథు,భార్గవాది తీర్థాలలో స్నానాలు చేసాడు.పవిత్రమయిన ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ మత్స్య,కురు,జాంగల దేశాలు దాటాడు.యమునా నదీ తీరానికి చేరాడు.అక్కడ అతనికి ఉద్ధవుడు కనిపించాడు.ఉద్ధవుడు సకల సద్గుణశీలి.పరమ భాగవతోత్తముడు.

Tuesday, 24 February 2026

దుర్యోధనుడి దుష్ట బుద్ధి—విదురుడు వివరణ

తండ్రికేమో పక్షపాతము,సంకుచిత స్వభావము.కొడుకేమో దుందుడుకు,దుష్ట బుద్ధి.ఇంక వాళ్ళను ఎవరైనా పట్టగలరా? దుర్యోధనుడు మాయా జూదములో పాండవులను అడవులకు పంపాడు.రాజ్యాన్ని అపహరించాడు.ధర్మం కోసరము పాండవులు అరణ్య వాసము,అజ్ఞాత వాసము చేసి వచ్చి రాజ్యము అడిగినా ససేమిరా అన్నాడు.ఇంక పాండవులకు పాలుపోలేదు.శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు.శ్రీకృష్ణుడు సరే అని వారి తరఫున రాయబారానికి వెళ్ళాడు.ధృతరాష్ట్రునికి కృష్ణుడు శత విథాలా చెప్పిచూసాడు.మాత్సర్యము వద్దు,తగదు.కౌరవులు,పాండవులు...ఇద్దరూ నీకు సమానమే!తమ్ముడి బిడ్డలకు అన్యాయము చేయవద్దు.రాజ్యము ఇద్దరికీ సమానంగా పంచి పెట్టు అని సలహా ఇచ్చాడు. ఇలా అసలు విషయం ముందరకు జరగడం లేదని కృష్ణుడు గ్రహించాడు.విదురుడిని పిలిపించాడు. విదురుడు విషయం అర్థం చేసుకున్నాడు.ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. కౌరవరాజా!ధృతరాష్ట్రా!పాండురాజు ఎవరో కాదు.నీ సొంత తమ్ముడు.అతని బిడ్డలను కాపాడడం నీ ధర్మము.అది న్యాయ సమ్మతము కూడానూ.నీవు అలా చేసావంటే నీ వంశము వృద్ధి చెందుతుంది.మీరందరూ సకల సుఖాలూ,సమస్త భోగాలూ అనుభవించగలరు.ఇద్దరూ కలిసి కట్టుగా ఉంటే శత్రు రాజులు మీ వైపు కన్నెత్తి చూసేదానికి కూడా భయపడతారు.శ్రీకృష్ణుడు తన మాటకు మీరు విలువ ఇచ్చారని సంతోషిస్తాడు.మీకు మేలు చేస్తాడు. అట్లా కాదంటే కౌరవులు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుంది నాకు,తలచుకుంటేనే! అటు చూస్తే ఏమో,భీముడు కాలు త్రొక్కిన పాములాగ కస్సుమని కాటేసేదానికి సిద్థంగా ఉన్నాడు.నేను ఈ విషయం చాలా సార్లు మొత్తుకున్నాను.నీ కొడుకులకు అతని వల్లే గండం!నీ వాళ్ళందరూ అతని చేతిలో పిట్టల్లాగ రాలిపోతారు.ఇది ఖాయం! నువ్వు ఇంకా అమాయకంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.నాకేమి?నా కొడుకులు వీరులు,శూరులు,విక్రమార్కులు అని భ్రమిస్తున్నట్లున్నావు.నీ కొడుకుల శౌర్యము,భీష్మ,ద్రోణ,కృపాచార్యుల అండ దండలు ఉన్నాయని విర్రవీగుతున్నావేమో?కర్ణుడి ఆర్భాటాలు,ప్రగల్భాలూ నిజమని మురిసి పోతున్నావేమో?ఇక్కడ ఎంత మంది దిగ్గజాలు ఉన్నా,ఆ తట్టు శ్రీకృష్ణుడు ఉన్నాడు.ఒక్కడు చాలు ఒంటి చేత్తో పాండవులను విజయమార్గంలో నడిపించేదానికి.ఈ నిజాన్ని కలలో కూడా నువ్వు మరవవద్దు. కాబట్టి మర్యాదగా పాండవులకు దక్కాల్సిన రాజ్యం వారికి ఇచ్చేయి.అట్లా చేస్తే నీ సంతానమూ,నీ బంథుజనము ప్రాణాలతో ఊపిరి తీసుకుంటారు.అట్లా కాకుండా లోభి,కంటకుడు,దుష్టుడు అయిన సుయోధనుడి మాటలు వింటే ఇంక ఇంతే సంగతులు,చిత్తగించవలెను అవుతుంది.ఒకరి మూర్ఖపు పట్టుదల కోసరము వంశాన్ని నాశనం చేసుకుంటావో,సుయోధనుని మాట ప్రక్కన పెడతావో,నీవే తేల్చుకో!

Friday, 20 February 2026

ధృతరాష్ట్రుని సంకుచితము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు.రాజా!ధృతరాష్ట్రుడికి చాలా మంది పిల్లలు పుట్టారు కదా!వారిని ధృతరాష్ట్రుడు బహు ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు.ఇంతలో తన తమ్ముడు,పాండురాజు నిధనుడయినాడు.అప్పటికి అతని బిడ్డలు కూడా చిన్నవాళ్ళే.మాద్రి సతీసహగమనం చేయడంతో,కుంతీదేవి పిల్లల నందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చింది.అందరూ కలిసి పెరగసాగారు.ఐక్యమత్యంతో కాదు.అసహనం,అసూయలతో. ముఖ్యంగా దుర్యోధనుడికి అతని తమ్ములకు పాండవుల పైన అసూయ కలిగింది.వారు జన్మతః కృూర స్వభావులు.కాబట్టి పాండవులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.ఒకసారి విషపు అన్నము పెట్టి చంపబోయారు.ఇంకొక సారి త్రాళ్ళతో కట్టి గంగానదిలో పడవేసారు.కొంచెం పెద్దయిన తరువాత ధర్మం తప్పి రాజ్యము నుండి వెడలగొట్టారు.ఇట్లా ఒకటా రెండా!చాలా సార్లు పాండవులను ఇబ్బందుల పాలు చేసారు.పాండవులు నిద్రించే సమయములో లక్క గృహానికి నిప్పు అంటించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నము చేసారు.దేవుని దయ వలన అది సఫలము కాలేదు. వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ట వారు ద్రౌపదీ దేవిని ఏకవస్త్రగా ఉన్న సమయంలో కొప్పు పట్టిలాగుతూ సభలోకి ఈడ్చుకుని రావడం.వారి నాశనానికి ఇదే నాంది అయింది. ధృతరాష్ట్రుడికి కళ్ళులేని గ్రుడ్డితనమే కాదు,మానసికంగా కూడా అంథుడే.పుత్రప్రేమతో తన బిడ్డల తప్పులను సరిదిద్దలేదు కదా.కనీసం ఎత్తిచూపనైనా లేదు.వారి ప్రతి ఆగడం వెనుక అతని మౌనమయిన అర్థంగీకారము నిబిడీకృతమయి ఉన్నది.

Tuesday, 17 February 2026

తృతీయ స్కంధము…విదురుని యాత్ర

పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశము చేసేదానికి సంసిద్ధుడు అయినాడు.అతనితో శుక మహర్షి ఇలా చెప్పాడు.పరీక్షిత్తు మహారాజా!పాండవులు యుద్ధము లో కౌరవులను ఓడించారు.ఆ రాజ్య సంపద స్వీకరించి,రాజ్యమును సుశ్యామలంగా పాలించుతూ ఉన్నారు.అప్పుడు విదురుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. దారిలో ఒక వనములో అతనికి మహా తపశ్శాలి అయిన మైత్రేయ మహర్షి కానవచ్చాడు.విదురుడు నేరుగా ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి,ఆయన ఆశీస్సులు పొందాడు.చిన్నగా ఆయనతో తన మనసులో మాట బయట పెట్టాడు.మహాత్మా!నా కొక సందేహము కలిగినది.దయయుంచి నా సందేహము తీర్చవలెను అని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు భగవంతుడు అని మన అందరికీ తెలుసు.పాండవులు మంచి వారు కావున వారికి సహాయము చెయ్యాలనుకున్నాడు.సహజమే!వారి రాయబారిగా దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కదా.దుర్యోధనుడు ఎంత బ్రతిమిలాడినా వారి దగ్గర భుజించలేదు.కానీ మా ఇంటికి వచ్చి మా సేవలు అంది పుచ్చుకుని,మా ఇంట భోంచేసాడు.దీనికి కారణము ఏంది?నాకు తెలిపేది. పరీక్షిత్తుకు ఆదుర్దా ఎక్కువ అన్నిటినీ తెలుసుకోవాలని.శుకుడు చెప్పబోతుండగానే గబగబా ఇలా అడిగాడు.మహాత్మా!విదురుడు మైత్రేయుడిని ఇంకా ఏమేమి రహస్యాలు అడిగాడు?ఆ ముని వాటన్నిటికీ ఏమి సమాథానాలు తెప్పాడు?విదురుడు తీర్థ యాత్రలకు వెళ్ళాడు అన్నారు కదా!ఏ ఏ స్థలాలూ,ప్రదేశాలు చూసాడు?నాకు అన్నీ పూస గుచ్చినట్లుగా,వివరంగా,విపులంగా చెప్పాలి అని ప్రార్థించాడు.

Monday, 16 February 2026

సూతుడు,శౌనకుడు సంవాదము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు తేలిక అయిన భాషలో సర్గ విసర్గాదులు మరియు ఆశ్రయము గురించి వివరించాడు.ఇప్పుడు అంతా టూకీగా చెప్పాడు.ఇంక సవివరంగా చెబుతాను అని సెలవిచ్చాడు. ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మునులకు తెలిపాడు.అప్పుడు శౌనకుడు సూత మహర్షిని అడిగాడు.ఓ మునిసత్తమా!భాగవతోత్తముడు అయిన విదురుడు తీర్థయాత్రలకు పోయాడన్నారు కదా.అక్కడ అన్ని పుణ్య క్షేత్రములు సందర్శించాడు కదా.అటు పిమ్మట తిరిగి వచ్చాడు అన్నారు.అప్పుడు మైత్రేయుని వలన ఆధ్యాత్మ బోథను పొందాడు అని ఉటంకించారు.ఆ విషయాలు అన్నీ వివరంగా తెలుసుకోవాలని మా అందరి మనసులూ ఉవ్విళ్ళూరుతున్నాయి.మా కోరిక మన్నించి అవన్నీ మాకు విశదీకరించేది. శౌనకుడి మాటలకు సూతుడు చిన్నగా మందహాసం చేసాడు.ఇలా అన్నాడు.శౌనకా!మీరు ఇప్పుడు నన్ను అడిగారు కదా!అచ్ఛం ఇలానే మునుపు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని బ్రతిమలాడాడు.అప్పుడు ఎట్లయితే శుకుడు అతనికి చెప్పాడో,అచ్ఛం అలానే నేను కూడా ఆ వృత్తాంతము అంతా సవివరంగా మీకు చెబుతాను.

Sunday, 15 February 2026

ఆశ్రయము,సృష్టి

శుక మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఉత్పత్తి,స్థితి,లయము అనే మూడూ ఎక్కడ పుడుతూ వెల్లడి అవుతాయో అదే ఆశ్రయము.పరమాత్మ అన్నా అదే.బ్రహ్మ అన్నా అదే.ఆత్మ ఆధ్యాత్మికము,ఆధిదైవికము,ఆధిభౌతికము అని మూడు రకములు.ఆధ్యాత్మికము అనునది చక్షురాది గోళకములకు అంతర్వర్తియై ఉంటుంది.చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుడే ఆధి దైవికము.చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాదితేజోవిగ్రహుడగుచూ,ఎవ్వనియందు ఈ రెండు విభాగములు కలుగుతాయో అతడు ఆధి భౌతికుడు.ఆ ఆధిభౌతికుడే విరాట్ పురుషుడు.ద్రష్ట,దృక్కు,దృశ్యము...ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏమీ కానరాదు.కనిపించదు.ఈ మూడింటి గురించి ఎవ్వరికి క్షుణ్ణంగా తెలుసో,అతనే పరమాత్మ.అతనే సర్వాంతర్యామి.సర్వలోకాలకూ,ప్రాణులకూ ఆశ్రయము ఇచ్చిన దాత. ఆ జగద్రక్షకుడూ,జగద్వ్యాపకుడూ విలాసము కొరకు సృజింపదలచాడు.తనకు ఎక్కడ,ఎలా సుఖంగా ఉంటుందో పరికించాడు.ముందర జలమును సృజించాడు.అది మహా సముద్రము రూపములో నున్న జలరాశి అయింది.ఆ జలరాశిలో అతను శయనించాడు.జలములకు నారములు అని ఇంకో పేరు ఉంది.ఆ నారములు పరమాత్మ వాసస్థాన మగుటచే అతనికి నారాయణుడు అనే పేరు వచ్చింది. అతని సృజన కారణంగానే ప్రాణాదులు,పంచభూతములు,ఇంద్రియములు,మనస్సు,బుద్ధి ఉద్భవించాయి.ఇంతే కాదు.అతను ప్రజాపతులు,ఋషులు,పితృదేవతలు,సుర,సిద్థ,విద్యాధరులు,మున్నగువారిని కూడా సృజించాడు.పక్షి,మృగ,వృక్ష సంతతిని కూడా సృజించాడు. ఇంత చేసినా అతను వీటన్నిటికీ కర్తృత్వము వహించడు.అంతా తన మాయాకల్పితంగానే తోచేటట్లు చేస్తాడు.ఆ మహామహడు,సర్వవ్యాపి నిరవద్యుడు,నిరంజనుడు,పరుడు,పరాత్పరుడు,నిష్కళంకుడు,నిత్యుడు మరియు సత్యుడు.

Saturday, 14 February 2026

సర్గ,విసర్గాదుల వివరణ

పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి వివరం తెలుపుతున్నాడు.రాజా!మహత్తు,అహంకారము,పంచ తన్మాత్రలు,పంచ భూతములు,పంచేంద్రియములు....వీటన్నిటినీ సర్గము అని అంటారు. బ్రహ్మ విరాట్పురుషుని వలన జనించాడు కదా!అతను చరాచర సృష్టిని చేయడం వినర్గమని అంటారు. ఈ ప్రపంచమును హింసించే రాజులు ఉంటరు కదా!వారిని సంహరించడం,ధర్మ సంస్థాపన చేయడం,ఆ శ్రీమహా విష్ణువు యొక్క విజయ పరంపర తెల్పడం స్థానము అని అంటారు. శ్రీహరి సర్వేశ్వరుడు,అనంతుడు కదా!అతను భక్తులను ఉద్థరించే ప్రక్రియను పోషణము అని అంటారు. ఊతలు అనగా కర్మవాసనలు. ఆది శేషువు పైన కొలువు అయిన శ్రీమన్నారాయణుడు అనుగ్రహ కటాక్షము వలన విభూతిని పొందిన లోకపాలకులు ఉంటారు కదా!వారు అందరూ ధర్మమును వివరించడాన్ని మన్వంతరము అని అంటారు. శ్రీహరి యొక్క అవతారాలు ఒకటీ రెండు కాదు కదా!కోకొల్లలు.ఆ అవతారాలను సవివరంగా చెప్పడం,అతని చరిత్రను విస్తారంగా ప్రబోథించడాన్ని ఈశానుచరితం అని అంటారు. సర్వాంతర్యామి,సర్వరక్షకుడు అయిన గోవిందుడు తన ఉపాధి శక్తులతో కూడి శేషతల్పముపై సుఖంగా శయనించి ఉంటాడు.అతను యోగనిద్రలో ఉంటాడు.ఆ సమయంలో సమస్త ప్రాణికోటి కూడా తమ తమ వ్యాపారలని మర్చిపోతుంటారు.ఆ అవస్థా విశేషములను అన్నిటినీ స్పష్టంగా,సవివరంగా తెలియజెప్పేదే నిరోధము.

Friday, 13 February 2026

భాగవత మూలము

శ్రీహరి బ్రహ్మకు చెప్పాల్సిన సుద్దులు,బుద్ధులు చెప్పి అంతర్థానము అయిపోయడు.బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకుని,మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు.సమస్త ప్రపంచాన్ని సృజించాడు.అతడు స్వలాభం చూసుకోలేదు.సకల లోక హితము కోరుకున్నాడు.దానికి తగిన విథంగానే ముందుకు అడుగులు వేసాడు.ఆయన సంకల్పం ధృఢమయినది. ఇట్లా ఉంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరకు నారదుడు వచ్చాడు.ఆయనకు ఆదుర్దా ఎక్కువ కదా!రావటం రావటం నాకు భగవంతుని మాయా విలాసాలగురించి చెప్పు అని తొందర చేసాడు. బ్రహ్మ చిద్విలాసంగా,చిన్మయానందంతో భగవంతుడు వలన తెలుసుకున్న భాగవతాన్ని నారదునకు చెప్పాడు.నారదుడు ఆ తరువాత వ్యాసుడికి చెప్పాడు.వ్యాసుడు అటు పిమ్మట శుకుడికి బోధించాడు.ఆ వృత్తాంతము అంతా పరీక్షిత్తు కోరిక మేర శుకుడు చెప్పేదానికి ఒప్పుకున్నాడు. శుకుడు పరీక్షిత్తుతో అంటున్నాడు.రాజా!నీవు నన్ను అడిగావు కదా,విరాట్పురుషుని వలన ఈ లోకాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అని.వాటన్నిటికీ సమాథానము భాగవతములో ఉంది.అది నీకు నేను నేర్పిస్తాను. అది సర్గము,విసర్గము,స్థానము,పోషణము,ఊతులు,మన్వంతరములు,ఈశానుచరితములు,నిరోథము,ముక్తి,ఆశ్రయము అను పది లక్షణములతో కలిసి ఉంటుంది.వీటిలో మొదటి తొమ్మిది లక్షణములు పదవ లక్షణమయిన ఆశ్రయము విశుద్థి కొరకే చెప్పబడినది. అంటే మనము స్థిరమైన ఆనందం కోసరము భగవంతుడిని నమ్ముకోవడంలో పవిత్రముగా తయారుకావడము.

Thursday, 12 February 2026

శ్రీహరి గురించి శ్రీహరి

శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది. జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను. మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు. ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.

Monday, 9 February 2026

బ్రహ్మ భక్తి బహు బాగు

బ్రహ్మ తన నాలుగు శిరస్సులు వంచి శ్రీహరికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు.శ్రీహరికి ఆ ఆత్మార్పణం నచ్చింది.సంతోషించాడు. బ్రహ్మతో ఇలా అన్నాడు.కుమారా!వత్సా!కపటముగా కొంత మంది మునులు ఉంటారు.వాళ్ళు జీవితకాలం అంతా తపస్సు చేసినా నాకు సంతోషము కలుగదు.నీవు నిష్కపటుడివి.అందువల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది.నీ యెడల నేను ప్రసన్న చిత్తంతో ఉన్నాను.అందుకే నా లోకము నీకు చూపించాను.నీ తపస్సు కొక్కదానికే మటుకు కాదు.తప అని నేను అన్న మాటను బట్టే కదా నీవు ఇంత ఘోర తపస్సు చేసావు.ఆ తపస్సు చేయడం వల్లనే నీకు మోహము నశించింది.నీకు నా మీద అంతులేని భక్తి కలిగింది.నాకు చాలా తృప్తిగా ఉంది నీ విషయంలో.నీకు ఏ వరము కావాలో కోరుకో!ఏమీ మొహమాటం లేదు. శ్రీహరి మాటలకు బ్రహ్మ ఈ విథంగా జవాబు ఇచ్చాడు.హే దేవా!హే పరంథామా!ఈ సమస్త సృష్టిలో నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు.ఎందుకంటే దీనికంతా కర్త,కర్మ,క్రియా నీవే గనుక.అలాంటిది నా మనసులో ఉండే కోరిక నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?కానీ నీవు అడిగావు.కాబట్టి నేను చెప్తాను. ఓ దేవా!నీ స్థూల సూక్ష్మ రూపములు అవ్యక్తములు కదా!నీవే బ్రహ్మాదిరూపములను ధరిస్తావు.ఈ జగత్తు ఉత్పత్తి ,స్థితి,లయ కార్యములను చేపడతావు.నీవు అమోఘ సంకల్పుడివి.రకరకాల విభూతులతో ఆటలాడుకుంటావు.నిన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము.నీ మహిమలను తెలుసుకోవడం ఇంకా క్లిష్టం.వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానము,పరిజ్ఞానము నాకు ప్రసాదించు. నీ ఆనతి మేర నేను సృష్టి చేస్తాను.కానీ నాకు తెలియకుండానే అహంకారానికి లోనవుతానేమో అని అనుమానంగా,భయంగా ఉంది.అందువలన ఎప్పుడూ అహంకారము అనేది నాకు కలుగకుండా చేయి స్వామీ!ఆ ఒక్క వరము ప్రసాదించి నన్ను ధన్యుడిని చేయి.

Monday, 2 February 2026

వైకుంఠ పురము వైభవోపేతము

బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు. అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి. ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది. మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు. అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు. సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.

Sunday, 1 February 2026

బ్రహ్మ తపస్సు ఫలదాయకం

బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది? అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు. ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు. వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.

Saturday, 31 January 2026

పరీక్షిత్తు శుకుని సంభాషణ

పరీక్షిత్తు శుక మహర్షిని ఇలా అడిగాడు.ఓ మునీశ్వరా!బ్రహ్మ నారదునికి భగవంతుడి దర్శనము ఎలా అయిందో ఎట్లా చెప్పాడు?సకల భూత సంసర్గము లేని ఆత్మకు సంసర్గము ఎలా కలిగింది?సంసర్గము అంటే కలయిక,సంపర్కం,సాంగత్యము అని అర్థము. శుకుడు జవాబు చెప్పాడు.ఓ రాజా!భగవంతుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు భాగవతము ఉపదేశించాడు అని చెప్పాను కదా!ఆ విషయం నీకు వివరంగా చెబుతాను.నీ కు అన్నీ మంచిగా అర్థం అవుతాయి. జ్ఞాన స్వరూపుడు అయిన జీవికి భగవంతుని మాయవలనే దేహసంబంధం కలుగుతుంది.ముక్తిని సంపాదించాలంటే జ్ఞానము అత్యవసరము.ఆ జ్ఞాన సముపార్జన కలగాలంటే భగవంతుని సేవలో తరించడమే ఏకైక మార్గము.అందుకే బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి కరుణించాడు.జీవుడికి భగవద్భక్తి వలనే మోక్షం సిద్ధిస్తుంది అని నొక్కి వక్కాణించాడు దీనికి ఒక ఇతిహాసము కూడా జోడు అయి ఉంది.

Tuesday, 27 January 2026

ఇతర అవతారములు

భగవద్గీతలోని పదవ అధ్యాయము,విభూతి యోగములో దేవదేవుని రూపాలు అర్థం అవుతాయి.ఇక్కడ ఇంకొన్ని అవతారాలు తెలుసుకుందాము. విష్ణువు పరాశరునికి పుత్రుడుగా జన్మించాడు.అతను వేదములను విభజించాడు.అందుకనే వేదవ్యాసుడనే నామము ఖాయమయినది.ఇద వ్యాసావతార కథ. పాషాండ మతావలంబకులు అధర్మముగా ప్రవర్తిస్తూ ఉండినారు.రాక్షసంగా కార్యాలు చేస్తూ వచ్చారు.అప్పుడు శ్రీహరి బుద్ధావతారము ఎత్తి వారిని నశింపజేసాడు.ఇది బుద్ధావతార కథ. ప్రజలు దైవ భక్తిని విడిచి పెట్టారు.యజ్ఞయాగాదుల ఊసే లేదు.నోరు తెరిస్తే అబద్థాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు.పాషాండాలలాగా కఠినాత్ములు అయిపోయారు.అప్పుడు శ్రీమహా విష్ణువు కల్కి అవతారమెత్తాడు.అధర్మాన్ని వశింపజేసాడు.ధర్మ ప్రతిష్ఠాపన చేసాడు.ఇది కల్కి అవతార కథ. ఇంతటితో బ్రహ్మ ఆపేస్తూ ఈ మాటలు అన్నాడు.నారదా!భగవంతుని లీలావతారములు ఒకటా!రెండా!అనంతము!ఏదో నాకు తెలిసినవి నీకు చెప్పాను.అన్నీ వివరంగా చెప్పే శక్తిమంతుడిని కాను.అతను మాయా వినోదుడు.అతనిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. ఈ విషయాలు అన్నీ పరీక్షిత్తు శుక మహర్షి ద్వారా తెలుసుకునినాడు.

Monday, 26 January 2026

కృష్ణావతారము

రాక్షస అంశతో పుట్టిన రాజులు ధర్మం తప్పారు.ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ,భూమిని అనేక రకాలుగా బాధ పెట్టసాగారు.ఆ పాపుల బరువు,ఆ పాపపు బరువు భూదేవి మోయలేక పోయింది.శ్రీమహా విష్ణువును వేడుకొంది.అప్పుడు శ్రీహరి ఆమె భారం తగ్గించే దానికి నడుము బిగించాడు.ఆ దుష్ట రాజులను సంహరించేదానికి బలరాముడు,శ్రీకృష్ణుడు రూపాలతో అవతరించెను. వసుదేవుని భార్యలలో రోహిణికి బలరాముడు పుత్రుడు.దేవకీదేవికి శ్రీకృష్ణుడు పుత్రుడు.శ్రీకృష్ణుడు పురిటిలో ఉండగానే పూతన అనే రాక్షసిని చంపాడు.మూడు నెలల వయసులో శకటాసురుని చంపాడు.పెంచిన తల్లి యశోద కృష్ణుని అల్లరి భరించలేక రోటికి కట్టింది.ఆ రోలును ఈడ్చుకుంటూ పోయి మద్ది చెట్లను నేలకొరిగేలా చేసాడు. మట్టి తింటున్నావా అని గదమాయించిన యశోదకు తన నోటిలో ముల్లోకాలు,చరాచర జగత్తు అంతా చూపించాడు.త్రాగునీటిని కలుషితం చేస్తున్న కాళియ నాగుని మర్దించాడు.కార్చిచ్చును ఆపి గోపబాలురను సంరక్షించాడు.ఒకసారి నందుడు యమునానదిలో స్నానం చేస్తున్నాడు.అప్పుడు వరుణుడు అతనిని బంధించాడు.కృష్ణుడు నందుని బంధ విముక్తుడిని చేసాడు. ఇంకొకసారి రాక్షస మాయవల్ల గుహలో గోపాలకులు చిక్కుకున్నారు.వాళ్ళందరినీ రక్షించి,ఆ రాక్షసుడిని దునుమాడాడు. ఇంద్రుడు తనకు పూజలు చేయలేదని జడివానలు కురిపించాడు.అపుడు కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి గోపాలకులను కాపాడాడు.దుష్టుడు కంసుడు మేనమామ అయినా తన తల్లిదండ్రులను చెరలో పెట్టాడని చంపాడు. శంఖచూడుడు అనే రాక్షసుడు గోపికలను ఎత్తుకెళ్ళాడు.వాడికి గర్వభంగము చేసి వారిని విడిపించాడు.నరకుడు మొదలు చాలా మంది రాక్షసులను సంహరించాడు.దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు.భగవద్గీతను మనకు అందించాడు.ధర్మం ప్రక్కన ఉన్న పాండవ పక్షానికి సహాయ సహకారాలు అందించి కురు వంశం నేలమట్టమయ్యేలా చేసాడు. ఇది కృష్ణావతార కథ.

Wednesday, 21 January 2026

పరశురామ,రామావతార కథలు

హైహయవంశ రాజులు చెలరేగిపోయి లోకములను బాధించడం మొదలుపెట్టారు.వాళ్ళ అకృత్యాలకూ,కృూరత్వాలకూ అడ్డూ ఆపూ లేకుండాపోయాయి. అప్పుడు విష్ణువు జమదగ్ని మహామునికి రాముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.పరశువును ధరించడం వలన పరశురాముడుగా ప్రసిద్ధికెక్కాడు.ఆ గండ్రగొడ్డలిని అతను శివుడునుంచి పొందాడు. పరశురాముడు లోకకంటకులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దాడి చేసి చంపాడు.ఆ సంహారాల అనంతరం వారి భూములను బ్రాహ్మణులకు ఇచ్చాడు.ఇది పరశురామావతారము. శ్రీహరి దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అతడు కోసల దేశ రాజు.శ్రీరాముడు అనే పేరుతో జన్మించాడు.భరత,లక్ష్మణ,శత్రుఘ్నులు అతని సోదరులు.శ్రీరాముడు శివధనుస్సును వించి జనక పుత్రిక అయిన సీతను వివాహము చేసుకున్నాడు.తండ్రి,పినతల్లి కోరిక మేర కానలకేగాడు.సీత,లక్ష్మణులు అతని వెంట వెళ్ళారు.ఆ అడవులలో క్రూరులైన రాక్షసులను చంపి,మునులకు అభయమిచ్చాడు. ఖరదూషణులు రావణుని తమ్ముళ్ళు.వారి చెల్లెలు శూర్పణఖ రాముడుని మోహించి పెళ్ళి చేసుకోవాలనుకుంది.అప్పుడు ఆమె ముక్కుచెవులు లక్ష్మణుడు కోసివేస్తాడు.ఆ అవమానానికి ప్రతీకగా ఆమె సోదరులు పదునాలుగు వేలమంది రాక్షసులతో యుద్ధానికి వస్తారు రాముడు పైకి.రాముడు వారందరిని సంహారం చేస్తాడు. సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుని మైత్రి అగ్ని సాక్షిగా కోరాడు.హనుమంతుడి సహాయంతో సీత జాడ కనుగొని,రావణ సంహారం చేసాడు.రావణుడి తమ్ముడు విభీషణుడిని లంకకు రాజును చేసాడు. అయోధ్యకు సతీసమేతంగా వచ్చి రాజ్యానికి సుపరిపాలన అందించాడు. ఇది శ్రీరామావతార కథ.

Sunday, 18 January 2026

వామన,హంస,మనువు,ధన్వంతరి అవతారములు

శ్రీహరి అదితి,కశ్యపులకు వామన రూపంలో జన్మించాడు.ఇంద్రుడికి తమ్ముడు అయినాడు.బలి చక్రవర్తి రాక్షస రాజు.అతనిని ఈ బ్రాహ్మణుడిగా వెళ్ళి మూడడుగులు దానం అడిగాడు.బలికి వచ్చింది శ్రీమహా విష్ణువే అని తెలుసు.కానీ ఒప్పుకున్నాడు.అంతలో వామనుడు ఇంతింతై వటుడింతై ముల్లోకాలనూ ఆక్రమించాడు.మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సు చూపిస్తాడు బలి చక్రవర్తి.రాక్షస గురువు చాలా వారిస్తాడు వద్దని,వచ్చింది ఆ పురుషోత్తముడని.కానీ బలి వినలేదు,వినిపించుకోలేదు. భగవంతుడికే దానమిచ్చిన ఘనత బలి చక్రవర్తిది.వామనుడు అంతట తన మూడో అడుగు బలి తల పైన ఉంచి అధః పాతాళానికి అణగద్రొక్కాడు.ఇంద్రునికి స్వర్గాన్ని అప్పగించాడు. ఇది వామన అవతారము. బ్రహ్మ నారదుడితోటి హంస అవతారము గురించి చెబుతున్నాడు.ఓ నారదా!ఆ విశ్వ వ్యాపకుడు నా దైవభక్తి యోగానికి చాలా సంతోషించాడు.అప్పుడు హంస రూపము దాల్చాడు.హంస అయి ఆత్మ తత్త్వాన్ని వివరించే భాగవత పురాణాన్ని నాకు బోధించాడు.ఇది హంసావతార కథ. ఆ దేవదేవుడు మనువుగా పుట్టాడు.గొప్ప తేజస్సుతో మెలిగాడు.అప్రతిహతమయిన చక్రాయుధాన్ని ధరించాడు.ఇక దుష్ట శిక్షణకు నడుము బిగించాడు.దుష్టులయిన రాజులనందరినీ దునుమాడుతూ శిష్టులను పాలించాడు.ఇది మనువు అవతారము. ఆ చక్రథారి,ఆ మహావిష్ణువు ధన్వంతరిగా అవతరించాడు.ఆయుర్వేదమును నిర్మించాడు,కనుగొన్నాడు.ఆయన తన నామము స్మరిస్తేనే జనుల రోగములు నశింపచేసేవాడు.ఇది ధన్వంతరి అవతార సారము.

Friday, 9 January 2026

నృసింహావతార,ఆది మూలావతార కథ

పూర్వము హిరణ్య కశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.రాక్షస ప్రవృత్తి అంటే ఇంక క్రూరత్వము కరడు గట్టి ఉంటుంది కదా!అతడు గదను ఆయుధముగా చేసుకుని దేవతలను చాలా ఇక్కట్లపాలు చేసాడు.చాలా బాధలు పెట్టాడు.స్వర్గము ఛిందరవందరమయింది.ఎక్కడ చూసినా కల్లోలమూ,భీభత్సమే!అప్పుడు అసుర సంహారము కోసము శ్రీమహా విష్ణువు నృసింహ రూపం ధరించాడు. ఇల్లూ వాకిలీ కాకుండా గడప పైన కూర్చుని,పగలూ రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో,ఏ అస్త్ర శస్త్రాలు వాడకుండా తన గోళ్ళతో ఆ దుష్టుడిని చీల్చి చంపాడు.ఈ కార్యంతో ముల్లోకాలకూ మేలు చేసాడు.అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేసాడు.ఇది నృసింహావతార కథ. గజేంద్రుడు ఒకసారి నీటికోసరం మడుగులోకి దిగాడు.అప్పుడు ఒక మొసలి దాని కాలును నోట పట్టుకుంది.అప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి తో వేయి ఏండ్లు పోరాడాడు దాని పట్టు నుంచి విడిపించుకునేదానికి.కానీ తన శక్తి యుక్తులు చాలలేదు.అప్పుడు గజేంద్రుడు శ్రీహరిని శరణు కోరాడు.లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యే.....అంటూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మిని వదలి,వైకుంఠపురాన్ని వదలి,పై పంచే జారి పోతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసాడు భక్తుడిని రక్షించేదానికి.తన విష్ణు చక్రంతో మొసలిని తుదముట్టించి గజేంద్రుడిని కాపాడాడు. ఇది శ్రీమహా విష్ణువు యొక్క ఆదిమూలావతారము.

Wednesday, 7 January 2026

మత్స్య,కూర్మావతారాలు

బ్రహ్మ చెబుతున్నాడు నారదుడికి.నారదా!వైవస్వత మనువు కాలంలో యుగము అంతము అయింది.అప్పుడు జలప్రళయము సంభవించింది.అప్పుడు విష్ణువు విచిత్రమయిన మత్స్యరూపము ధరించాడు.ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ,చాలా స్వల్ప వ్యవథిలో బ్రహ్మాండంగా పెరిగింది.ఆ చేప సృష్టి అంతరించకుండా కాపాడింది.సృష్టికి ఆధారములు అయిన వస్తువులు,జీవరాశులులో నిండి,ఆ మనువు ఎక్కి ఉండే నావ మునిగి పోకుండా కాపాడింది. ఆ సమయంలో నానుంచి వేదాలను రాక్షసులు అపహరించి ఉన్నారు.దేవతల ప్రార్థన మేరకు ఆ వేదములును తిరిగి నాకు అప్పగించింది. ఇది మత్స్యావతార కథ. ఒకానొకప్పుడు దేవతలు,దానవులు అమృతము కోసము కష్టపడ్డారు.మంధర పర్వతాన్ని కవ్వములాగా చేసుకున్నారు.వాసుకిని కవ్వము చిలికేదానికి వాడే త్రాడు లాగా కట్టారు.పాల సముద్రాన్ని ఏక బిగిన చిలకటం మొదలుపెట్టారు చెరొక ప్రక్కన నిలబడి.కొంచెం సేపటికి ఆ పర్వతము మునిగి పోబోయింది.అప్పుడు భగవంతుడు కూర్మరూపంలో సముద్రం అడుగుకు వెళ్ళి,కవ్వము మునిగిపోకుండా తన వీపుపై పెట్టుకున్నాడు.ఆ పట్టు ఇచ్చాడు కాబట్టే దానవులు,దేవతలు అమృతము చిలకగలిగారు. ఇది కూర్మావతార కథ.

Tuesday, 6 January 2026

వృషభుడు,హయగ్రీవుడు

అగ్నీధ్రుడు అనేవాని పుత్రుడు నాభి.ఆ నాభి భార్య మేరుదేవి.ఆమెకు సుదేవి అనే పేరు కూడా వాడుకలో ఉంది.ఆ దంపతులకు వృషభుడు అనే కొడుకు పుట్టాడు.వృషభుడు ఎవరో కాదు!విష్ణువే ఆ పేరుతో వారికి పుట్టాడు. వృషభుడు శాంతమూర్తి.సర్వసంగ పరిత్యాగి.ఆయన పరమ హంస అయి మునులందరి ప్రశంసలు పొందాడు.ఇది వృషభావతార కథ. హయగ్రీవుడు బంగారు మేని ఛాయ గలవాడు.భగవదంశ సంభూతుడు.అతడు బ్రహ్మ ముఖమునుండి పుట్టాడు.అతను వేదాలలో దిట్ట.ఒకరకంగా చెప్పాలంటే వేదమయుడు.యజ్ఞ పురుషుడు.హయగ్రీవుడు ఎంతటి మహానుభావుడు అంటే అతని నాసిక నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్లనే వేదములు పుట్టాయి.ఇది హయగ్రీవావతార వృత్తాంతము.

Sunday, 4 January 2026

ధృవుడు,పృథుడు

ధృవుడు ఉత్తానపాదుడు అనే రాజుకు పుత్రుడు.అతను విష్ణువు అంశతో జన్మించాడు.అతని చిన్న వయసులో తండ్రి ఒళ్ళోకూర్చోబోయాడు.సవతి తల్లికి ఒప్పలేదు.తండ్రి తొడపై కూర్చుని,మురిపాలు పోవాలి అనే ఆ చిన్న బాలుడి కోర్కె తీరని కోరికే అయింది.ఆ సవతి తల్లి మాటలు ఆ చిన్నారి గుండెల్లో గునపాల్లా గ్రుచ్చుకున్నాయి.మానవుల ప్రేమలు సమంగా ఉండవు.భగవంతుడే సర్వకాల సర్వావస్థలయందు అందరినీ సమంగా ప్రేమిస్తాడు అని కన్న తల్లి చెప్పింది.ఎవరైతే తనను తననుగా ప్రేమిస్తారో,వారి ప్రేమ పొందితే చాలు అని తల్లి చెప్పిన మాటలు తలకెక్కాయి.అంతట తక్షణం ఆ పరమాత్ముడిని అన్వేషిస్తూ కానలకెళ్ళాడు. అడవిలో విష్ణువు కోసం ఘోర తపస్సు చేసాడు.ఆ భగవంతుడు అతనికి అత్యున్నతమయిన ధృవ స్థానం కల్పించాడు.భృగువు,మిగిలిన మునులు అతనిని స్తుతించారు.ధృవ మండలము సప్తర్షి మండలానికి పైభాగాన ఉంటుంది.ఇది ధృవావతార కథ. మునుపు వేనుడు అని ఒక రాజు ఉన్నాడు.భలే కృూరుడు.దుష్ట ప్రవర్తనకు తగినట్లుగా అతనికి బ్రాహ్మణ శాపం తగిలింది.దాని దెబ్బకు భాగ్యము అంతా పోయింది.ధనంతోటే పౌరుషము కూడా కనుమరుగు అవుతుంది కదా! పృథువు ఆ వేనుని పుత్రుడు.తండ్రి దుష్ట బుద్ధి ఇసుమంతకూడా అంటలేదు.అతను లోకములకు హితము కూర్చిన మహనీయుడు.ఇతను కూడా విష్ణు అంశతో పుట్టాడు.చక్రవర్తి అయ్యాడు.ఇతను భూమిని గోవుగా చేసాడు.సమస్త వస్తువులను పిదికాడు.పుత్రుడుగా తన ధర్మం నిర్వర్తించాడు.తండ్రికి ఉత్తమ గతి కల్పించాడు. ఇది పృథువు అవతార కథ.

Friday, 2 January 2026

సనకాదులు,నరనారాయణులు

బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.నేను ఒకానొకప్పుడు కల్పాదినీ,లోకాలనూ సృజింపదలచాను.అందుకని తపస్సు చేయఢం మొదలుపెట్టాను.అప్పుడు నా నోటి నుండి సన అనే శబ్దము వెలువడింది.అందువల్ల సన అనే పేరుగల నలుగురు మానస పుత్రులు కలిగారు నాకు.వారే సనకుడు,సనందనుడు,సనత్కుమారుడు మరియు సనత్సుజాతుడు.పోయిన కల్పాంతంలో వారే ఆత్మతత్త్వాన్ని తిరిగి నెలకొల్పారు.వారు వేరుగా కనిపించినా నలుగురూ విష్ణువు అంశమే.ఇది అందరూ గ్రహించాలి. ఇదే సనకాదుల వృత్తాంతము. ఇక నరనారాయణుల గురించి చెబుతాను.మూర్తి అనునామె దక్షపుత్రిక.ఆమెకు,ధర్మునికి ఇద్దరు కుమారులు పుట్టారు.వారే నరనారాయణులు.వారిరువురూ మంచి గుణములు కలవారు.పరమ పావన మూర్తులు.వారు మునులు అయినారు.బదరీ వనంలో ఘోరమయిన తపస్సు చేయసాగారు.దేవేంద్రుడికి భయం పట్టుకుంది.వారి తపోబలం వలన తన పదవికి భంగం కలుగుతుందేమో అని.ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే గదా!వారి తపస్సు భగ్నం చేసేదానికి అప్సరసలను రంగంలోకి దించాడు. ఆ అప్సరసలు దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు తమ తమ శక్తియుక్తులు అన్నీ ప్రదర్శించారు.కానీ నరనారాయణులు చలించలేదు.మామూలు మునులు అయి ఉంటే ఎప్పుడో వాళ్ళను భస్మంచేసి ఉండేవాళ్ళు.కానీ వీరిరువురూ సత్త్వగుణసంపన్నులు.కాబట్టి కోపం తెచ్చుకోలేదు.శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. నారాయణుడు తన యూరువును చీల్చగా,అందుండి ఒక సౌందర్యవతి ఉద్భవించినది.ఆమె అతిలోక సుందరి.ఆమె కాలి గోటికి కూడా సరికాదు ఈ అప్సరసల అందచందాలు.వారు సిగ్గుతో తల వంచుకున్నారు.ఊరువు వలన ఉద్భవించినది కావున ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చినది.అప్సరసలు అవమానభారంతో వెనుతిరిగారు.ఇది నర నారాయణావతార వృత్తాంతము.

Thursday, 1 January 2026

కపిలుడు,దత్తాత్రేయుడు

కర్దమ ప్రజాపతికి,దేవహూతికి తొమ్మిది మంది సోదరీమణులతో కలిపి కపిలుడు జన్మించాడు.సాంఖ్య యోగము అనేది భగవంతుడు అయిన శ్రీహరిని పొందేదానికి అనువైన మార్గము.ఆ సాంఖ్య యోగాన్ని తన తల్లికి ఉపదేశించాడు.పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి విశదీకరించాడు.ఆ పై ముక్తిని పొందే మార్గము బోధించాడు.ఇది కపిలావతార కథ. అత్రి మహాముని తపస్వులలోకి ఉత్తముడు.అతను పుత్రుడు కావాలని శ్రీహరిని ప్రార్థించాడు.ఆ భగవంతుడు నేను నీకు దత్తుడను అంటూ అత్రి మహామునికి కొడుకుగా పుట్టాడు.అతడే దత్తాత్రేయుడు.దత్తుడు అయిన శ్రీహరి అత్రి మహామునికి పుత్రుడు అయినాడు కాబట్టి ఆత్రేయుడు అయినాడు.హరికి దత్తాత్రేయ నామము కలిగే దానికి ఇదే కారణము. దత్తాత్రేయుడి పాద ధూళితో హైహయ వంశీయులు,యాదవులు పవిత్రులు అయినారు.వారందరూ ఐహిక సుఖాలను అనుభవించారు.అలాగే పరలోక సుఖాలనూ ఆస్వాదించారు.ఇది దత్తాత్రేయావతార కథ.