Tuesday, 24 February 2026
దుర్యోధనుడి దుష్ట బుద్ధి—విదురుడు వివరణ
తండ్రికేమో పక్షపాతము,సంకుచిత స్వభావము.కొడుకేమో దుందుడుకు,దుష్ట బుద్ధి.ఇంక వాళ్ళను ఎవరైనా పట్టగలరా?
దుర్యోధనుడు మాయా జూదములో పాండవులను అడవులకు పంపాడు.రాజ్యాన్ని అపహరించాడు.ధర్మం కోసరము పాండవులు అరణ్య వాసము,అజ్ఞాత వాసము చేసి వచ్చి రాజ్యము అడిగినా ససేమిరా అన్నాడు.ఇంక పాండవులకు పాలుపోలేదు.శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు.శ్రీకృష్ణుడు సరే అని వారి తరఫున రాయబారానికి వెళ్ళాడు.ధృతరాష్ట్రునికి కృష్ణుడు శత విథాలా చెప్పిచూసాడు.మాత్సర్యము వద్దు,తగదు.కౌరవులు,పాండవులు...ఇద్దరూ నీకు సమానమే!తమ్ముడి బిడ్డలకు అన్యాయము చేయవద్దు.రాజ్యము ఇద్దరికీ సమానంగా పంచి పెట్టు అని సలహా ఇచ్చాడు.
ఇలా అసలు విషయం ముందరకు జరగడం లేదని కృష్ణుడు గ్రహించాడు.విదురుడిని పిలిపించాడు.
విదురుడు విషయం అర్థం చేసుకున్నాడు.ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు.
కౌరవరాజా!ధృతరాష్ట్రా!పాండురాజు ఎవరో కాదు.నీ సొంత తమ్ముడు.అతని బిడ్డలను కాపాడడం నీ ధర్మము.అది న్యాయ సమ్మతము కూడానూ.నీవు అలా చేసావంటే నీ వంశము వృద్ధి చెందుతుంది.మీరందరూ సకల సుఖాలూ,సమస్త భోగాలూ అనుభవించగలరు.ఇద్దరూ కలిసి కట్టుగా ఉంటే శత్రు రాజులు మీ వైపు కన్నెత్తి చూసేదానికి కూడా భయపడతారు.శ్రీకృష్ణుడు తన మాటకు మీరు విలువ ఇచ్చారని సంతోషిస్తాడు.మీకు మేలు చేస్తాడు.
అట్లా కాదంటే కౌరవులు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుంది నాకు,తలచుకుంటేనే!
అటు చూస్తే ఏమో,భీముడు కాలు త్రొక్కిన పాములాగ కస్సుమని కాటేసేదానికి సిద్థంగా ఉన్నాడు.నేను ఈ విషయం చాలా సార్లు మొత్తుకున్నాను.నీ కొడుకులకు అతని వల్లే గండం!నీ వాళ్ళందరూ అతని చేతిలో పిట్టల్లాగ రాలిపోతారు.ఇది ఖాయం!
నువ్వు ఇంకా అమాయకంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.నాకేమి?నా కొడుకులు వీరులు,శూరులు,విక్రమార్కులు అని భ్రమిస్తున్నట్లున్నావు.నీ కొడుకుల శౌర్యము,భీష్మ,ద్రోణ,కృపాచార్యుల అండ దండలు ఉన్నాయని విర్రవీగుతున్నావేమో?కర్ణుడి ఆర్భాటాలు,ప్రగల్భాలూ నిజమని మురిసి పోతున్నావేమో?ఇక్కడ ఎంత మంది దిగ్గజాలు ఉన్నా,ఆ తట్టు శ్రీకృష్ణుడు ఉన్నాడు.ఒక్కడు చాలు ఒంటి చేత్తో పాండవులను విజయమార్గంలో నడిపించేదానికి.ఈ నిజాన్ని కలలో కూడా నువ్వు మరవవద్దు.
కాబట్టి మర్యాదగా పాండవులకు దక్కాల్సిన రాజ్యం వారికి ఇచ్చేయి.అట్లా చేస్తే నీ సంతానమూ,నీ బంథుజనము ప్రాణాలతో ఊపిరి తీసుకుంటారు.అట్లా కాకుండా లోభి,కంటకుడు,దుష్టుడు అయిన సుయోధనుడి మాటలు వింటే ఇంక ఇంతే సంగతులు,చిత్తగించవలెను అవుతుంది.ఒకరి మూర్ఖపు పట్టుదల కోసరము వంశాన్ని నాశనం చేసుకుంటావో,సుయోధనుని మాట ప్రక్కన పెడతావో,నీవే తేల్చుకో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment