Friday, 20 February 2026
ధృతరాష్ట్రుని సంకుచితము
శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు.రాజా!ధృతరాష్ట్రుడికి చాలా మంది పిల్లలు పుట్టారు కదా!వారిని ధృతరాష్ట్రుడు బహు ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు.ఇంతలో తన తమ్ముడు,పాండురాజు నిధనుడయినాడు.అప్పటికి అతని బిడ్డలు కూడా చిన్నవాళ్ళే.మాద్రి సతీసహగమనం చేయడంతో,కుంతీదేవి పిల్లల నందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చింది.అందరూ కలిసి పెరగసాగారు.ఐక్యమత్యంతో కాదు.అసహనం,అసూయలతో.
ముఖ్యంగా దుర్యోధనుడికి అతని తమ్ములకు పాండవుల పైన అసూయ కలిగింది.వారు జన్మతః కృూర స్వభావులు.కాబట్టి పాండవులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.ఒకసారి విషపు అన్నము పెట్టి చంపబోయారు.ఇంకొక సారి త్రాళ్ళతో కట్టి గంగానదిలో పడవేసారు.కొంచెం పెద్దయిన తరువాత ధర్మం తప్పి రాజ్యము నుండి వెడలగొట్టారు.ఇట్లా ఒకటా రెండా!చాలా సార్లు పాండవులను ఇబ్బందుల పాలు చేసారు.పాండవులు నిద్రించే సమయములో లక్క గృహానికి నిప్పు అంటించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నము చేసారు.దేవుని దయ వలన అది సఫలము కాలేదు.
వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ట వారు ద్రౌపదీ దేవిని ఏకవస్త్రగా ఉన్న సమయంలో కొప్పు పట్టిలాగుతూ సభలోకి ఈడ్చుకుని రావడం.వారి నాశనానికి ఇదే నాంది అయింది.
ధృతరాష్ట్రుడికి కళ్ళులేని గ్రుడ్డితనమే కాదు,మానసికంగా కూడా అంథుడే.పుత్రప్రేమతో తన బిడ్డల తప్పులను సరిదిద్దలేదు కదా.కనీసం ఎత్తిచూపనైనా లేదు.వారి ప్రతి ఆగడం వెనుక అతని మౌనమయిన అర్థంగీకారము నిబిడీకృతమయి ఉన్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment