Wednesday, 25 February 2026
విదురుడికి అవమానము
విదురుడు ధృతరాష్ట్రుడికి హితము చెప్పడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు.కోపం నషాళానికి అంటింది.కర్ణుడు,శకుని,దుశ్శాసనుల వైపు చూస్తూ ఇలా అన్నాడు.విదురుడు దాసీ పుత్రుడు.ఇతనికి,ఇతని మాటలకు ఇంత ప్రాముఖ్యత, గౌరవము ఇవ్వాల్సిన పని లేదు.అసలు ఎవరు రానిచ్చారు అతనిని ఈ సమావేశానికి?మర్యాద నిలబెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు అవాకులు,చెవాకులు పేలుతున్నాడు.ఇతనిని ఉపేక్షించాల్సిన అవసరము మనకు ఏమాత్రమూ లేదు.ముందర వీడిని తరిమివేయండి అంటూ హుకుం జారీ చేసాడు.
పెద్దా,చిన్నా అనే తారతమ్యము లేకుండా తండ్రి అంతటి వాడిని అలా అవమానకరంగా మాట్లాడటంతో విదురుడు నిర్ఘాంతపోయాడు.ఆ తరువాత కుమిలిపోయాడు.మనసుకు చాలా కష్టం వేసింది.సమాథానము చెప్పకుండా,మౌనంగా,కోపం దిగమింగుకుని,విల్లమ్ములను అక్కడే వదలి పెట్టేసి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు.
అతను పవిత్రములయిన విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.గంగ మున్నగు పుణ్య నదులలో స్నానం చేసాడు.సిద్థాశ్రమాలను సందర్శించాడు.ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు.కూరలు కాయలను నీటిని మటుకు ఆహారంగా స్వీకరిస్తూ అవధూత వేషము ధరించి తిరగసాగాడు.
ఆ సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది.కౌరవులు కొట్టుకుపోయారు,కాటికి పోయారు.విదురుడికి ఈ వార్త తను ప్రభాస తీర్థంలో ఉండేటప్పుడు తెలిసింది.ఎంతైనా అందరూ తన వాళ్ళే కదా!చాలా దుఃఖించాడు.ఇంక అక్కడ కుదురుగా ఉండ లేక పోయాడు.పోయి సరస్వతీ నదిలో స్నానము చేసాడు.పృథు,భార్గవాది తీర్థాలలో స్నానాలు చేసాడు.పవిత్రమయిన ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ మత్స్య,కురు,జాంగల దేశాలు దాటాడు.యమునా నదీ తీరానికి చేరాడు.అక్కడ అతనికి ఉద్ధవుడు కనిపించాడు.ఉద్ధవుడు సకల సద్గుణశీలి.పరమ భాగవతోత్తముడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment