Monday, 9 February 2026
బ్రహ్మ భక్తి బహు బాగు
బ్రహ్మ తన నాలుగు శిరస్సులు వంచి శ్రీహరికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు.శ్రీహరికి ఆ ఆత్మార్పణం నచ్చింది.సంతోషించాడు.
బ్రహ్మతో ఇలా అన్నాడు.కుమారా!వత్సా!కపటముగా కొంత మంది మునులు ఉంటారు.వాళ్ళు జీవితకాలం అంతా తపస్సు చేసినా నాకు సంతోషము కలుగదు.నీవు నిష్కపటుడివి.అందువల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది.నీ యెడల నేను ప్రసన్న చిత్తంతో ఉన్నాను.అందుకే నా లోకము నీకు చూపించాను.నీ తపస్సు కొక్కదానికే మటుకు కాదు.తప అని నేను అన్న మాటను బట్టే కదా నీవు ఇంత ఘోర తపస్సు చేసావు.ఆ తపస్సు చేయడం వల్లనే నీకు మోహము నశించింది.నీకు నా మీద అంతులేని భక్తి కలిగింది.నాకు చాలా తృప్తిగా ఉంది నీ విషయంలో.నీకు ఏ వరము కావాలో కోరుకో!ఏమీ మొహమాటం లేదు.
శ్రీహరి మాటలకు బ్రహ్మ ఈ విథంగా జవాబు ఇచ్చాడు.హే దేవా!హే పరంథామా!ఈ సమస్త సృష్టిలో నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు.ఎందుకంటే దీనికంతా కర్త,కర్మ,క్రియా నీవే గనుక.అలాంటిది నా మనసులో ఉండే కోరిక నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?కానీ నీవు అడిగావు.కాబట్టి నేను చెప్తాను.
ఓ దేవా!నీ స్థూల సూక్ష్మ రూపములు అవ్యక్తములు కదా!నీవే బ్రహ్మాదిరూపములను ధరిస్తావు.ఈ జగత్తు ఉత్పత్తి ,స్థితి,లయ కార్యములను చేపడతావు.నీవు అమోఘ సంకల్పుడివి.రకరకాల విభూతులతో ఆటలాడుకుంటావు.నిన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము.నీ మహిమలను తెలుసుకోవడం ఇంకా క్లిష్టం.వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానము,పరిజ్ఞానము నాకు ప్రసాదించు.
నీ ఆనతి మేర నేను సృష్టి చేస్తాను.కానీ నాకు తెలియకుండానే అహంకారానికి లోనవుతానేమో అని అనుమానంగా,భయంగా ఉంది.అందువలన ఎప్పుడూ అహంకారము అనేది నాకు కలుగకుండా చేయి స్వామీ!ఆ ఒక్క వరము ప్రసాదించి నన్ను ధన్యుడిని చేయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment