Thursday, 12 February 2026
శ్రీహరి గురించి శ్రీహరి
శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది.
జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను.
మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు.
ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment