Wednesday, 22 April 2026
మైత్రేయుడి ముందు విదురుడి ప్రశ్నలు
మైత్రేయుడిని చూడగానే విదురుడు మహదానందపడిపోయాడు.వెంటనే ఆ మహర్షికి సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు.చేతులు జోడించి శర సంథానం లాగ ప్రశ్నలు గుప్పించాడు.మునీంద్రా!లోకములో ప్రజలు కనిపించిందంతా కావాలనుకుంటారు.వారి ఆశలకు హద్దూ పద్దూ ఉండదు.ఆయా సుఖములకు హేతువులైన కర్మములు అన్నీ చేస్తారు.కానీ తగిన ఫలితం దక్కలేదని బాథ పడుతుంటారు.నిజానికి కర్మములు బంధకాలు కదా!దుఃఖ హేతువులు కూడా!అవి సౌఖ్యదాయకాలు కానేరవు.ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్టమయినది.ఎందుకంటే మానవుడు ఒకసారి ఈ సంసారమనే చట్రంలో ఇరుక్కున్నాడంటే,ఇంక బయట పడేమార్గమే ఉండదు.ఒక రకంగా చెప్పాలంటే వీరంతా మూఢులు లాగ,పశుప్రాయులు లాగా వ్యవహరిస్తున్నారు.బహుశ ఇలాంటి అజ్ఞానులను ఉద్ధరించి,సన్మార్గంలోకి తీసుకెళ్ళేదానికే మీలాంటి మహానుభావులు ఈ భూమి పైన సంచరిస్తుంటారు.
ఈ మాయ ఉందే,ఇది త్రిగుణాత్మకమయినది.భగవంతుడే ఇదంతా నియామకం చేసింది.ఆ భగవంతుడు ఏయే కర్మములను ఆచరించాడు?భగవంతుడు అనేవాడు సామాన్యుడికి దారి చూపాలి కదా!అసలు ఓంకారంగా ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు?ఎట్లా త్రిభువనాలని పాలించాడు?యోగమాయ యందు ఎలా ఉన్నాడు?ఈ చరాచర సృష్టి కర్త బ్రహ్మాండమునందు ఏ లీలలు చేసాడు?బ్రహ్మాది రూపములను ఎట్లా పొందాడు?పరి పరి విథముల ఎలా క్రీడించాడు?దశావతారాలు ధరించి భూసురులను,గోవులను,సురాదులను,దీనులను ఎలా పరిరక్షించాడు?మానవుడికి ఏయే ప్రయోజనాలు తీర్చాడు?జనులకు కర్మ నామ రూప భేదములు ఎట్లా నిర్దేశించాడు?మానవ జన్మ మరణాది సకల దుఃఖములకు నిలయము.పాప కర్మముల వలన ప్రాప్తమయినది.ఈ సంసార బంధము అంత తేలికగా తెగదు.ఆ భగవంతుడి చరిత్ర వింటే గానీ మనం ముక్తి సాథించలేను.కాబట్టి ఆ దేవ దేవుడి గాథలు మీరు చెప్పారంటే,విని నేను తరిస్తాను.నా జీవితం ధన్యమయింది అని తృప్తి పడతాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment