Friday, 2 January 2026

సనకాదులు,నరనారాయణులు

బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.నేను ఒకానొకప్పుడు కల్పాదినీ,లోకాలనూ సృజింపదలచాను.అందుకని తపస్సు చేయఢం మొదలుపెట్టాను.అప్పుడు నా నోటి నుండి సన అనే శబ్దము వెలువడింది.అందువల్ల సన అనే పేరుగల నలుగురు మానస పుత్రులు కలిగారు నాకు.వారే సనకుడు,సనందనుడు,సనత్కుమారుడు మరియు సనత్సుజాతుడు.పోయిన కల్పాంతంలో వారే ఆత్మతత్త్వాన్ని తిరిగి నెలకొల్పారు.వారు వేరుగా కనిపించినా నలుగురూ విష్ణువు అంశమే.ఇది అందరూ గ్రహించాలి. ఇదే సనకాదుల వృత్తాంతము. ఇక నరనారాయణుల గురించి చెబుతాను.మూర్తి అనునామె దక్షపుత్రిక.ఆమెకు,ధర్మునికి ఇద్దరు కుమారులు పుట్టారు.వారే నరనారాయణులు.వారిరువురూ మంచి గుణములు కలవారు.పరమ పావన మూర్తులు.వారు మునులు అయినారు.బదరీ వనంలో ఘోరమయిన తపస్సు చేయసాగారు.దేవేంద్రుడికి భయం పట్టుకుంది.వారి తపోబలం వలన తన పదవికి భంగం కలుగుతుందేమో అని.ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే గదా!వారి తపస్సు భగ్నం చేసేదానికి అప్సరసలను రంగంలోకి దించాడు. ఆ అప్సరసలు దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు తమ తమ శక్తియుక్తులు అన్నీ ప్రదర్శించారు.కానీ నరనారాయణులు చలించలేదు.మామూలు మునులు అయి ఉంటే ఎప్పుడో వాళ్ళను భస్మంచేసి ఉండేవాళ్ళు.కానీ వీరిరువురూ సత్త్వగుణసంపన్నులు.కాబట్టి కోపం తెచ్చుకోలేదు.శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. నారాయణుడు తన యూరువును చీల్చగా,అందుండి ఒక సౌందర్యవతి ఉద్భవించినది.ఆమె అతిలోక సుందరి.ఆమె కాలి గోటికి కూడా సరికాదు ఈ అప్సరసల అందచందాలు.వారు సిగ్గుతో తల వంచుకున్నారు.ఊరువు వలన ఉద్భవించినది కావున ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చినది.అప్సరసలు అవమానభారంతో వెనుతిరిగారు.ఇది నర నారాయణావతార వృత్తాంతము.

No comments:

Post a Comment