Friday, 28 August 2026
బ్రహ్మ సృజన
బ్రహ్మ శ్రీహరిని స్తుతించడము అంతా మైత్రేయుడు విదురుడికి చెప్పాడు.ఒక ముఖ్యమయిన విషయము చెబుతూ చెబుతూ మధ్యలో ఆపితే ఎలాఉంటుంది?ఉత్కంఠ తట్టుకోలేము కదా!విదురుడి పరిస్థితి కూడా అలానే ఉంది.ఉండబట్టలేక మైత్రేయుడిని అడుగుతున్నాడు.స్వామీ!శ్రీహరి బ్రహ్మను దీవించి అంతర్థానం అయ్యాడు అని చెప్పారు కదా!ఆ తరువాత బ్రహ్మ ఏమి చేసాడు?దేవ సంబంథమునను,మానవ సంబంథమునను ఈ సృష్టి ఎట్లా చేయగలిగాడు?నాకు వివరంగా చెప్పండి,స్వామీ!
విదురుడి మాటలకు ప్రసన్నుడు అయిన మైత్రేయుడు చెప్పడం ప్రారంభించాడు.పుండరీకాక్షుడు బ్రహ్మను దీవించాడు అని చెప్పాను కదా.ఆయన సూచన మేర బ్రహ్మ నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసాడు.ఆ తపోబలముతో తనకు నివాసము అయిన పద్మమును,వాయువును,జలమును కనుగొన్నాడు.తన తపశ్శక్తి వలన చేకూరిన విద్యాబలముతో వాయువును బంధించాడు.గగన వ్యాపి సగు జలమును కనుగొన్నాడు.శ్రీహరి నుంచి తన ధ్యానము,ధ్యాస మరల్చకుండా తదేకంగా మనసు నిలిపి గగన తలమున పద్మమును చూచి,ఆ పద్మకోశములో అణగియున్న లోకములను గమనించాడు.తనకు తానే తెలుసుకున్నాడు.ఏమని?ఈ బ్రహ్మాండ కోటి సృష్టికి శ్రీహరి తనను ఎంచుకున్నాడని.ఇంక జాగు చేయదలచుకోలేదు.ఆ పద్మములోనికి పోయి,అక్కడ ముల్లోకాలను చూసాడు.పదునాలుగు లోకాలను సృజించాడు.తదుపరి దేవతలను సృష్టించాడు.ఆ తరువాత మనుష్యులను సృష్టించాడు.పిదప తిర్యక్కులను సృజించాడు.తిర్యక్కులు అనగా పశుపక్ష్యాదులు అని అర్థము.తరువాత స్థావరములు సృష్టించాడు.స్థావరములు అనగా స్థిరముగా ఒకే చోట ఉండేవి...అనగా చెట్లు.
విదురుడికి ఇంకా ఇంకా చెప్పించుకోవాలని ఉంది.అందుకని ఇలా అడిగాడు.ఓ మైత్రేయ మహర్షీ!నీవు ఇప్పుడు చెప్పావు కదా,విష్ణుదేవుని మహిమ వల్లనే లోకములు అన్నీ ఏర్పడ్డాయి అని.ఆ మహిమాన్వితుడు అయిన విష్ణుమూర్తి గురించి చెప్పు.మైత్రేయుడు చెప్పాడు.విదురా!శ్రీహరి కాలానురూపము గైకొని తన్ను తాను ఇట్లా సృజించుకున్నాడు.అతడు సర్వలోకాలలో ఉంటాడు.తనలోనే సర్వ లోకాలూ ఉంటాయి.ఆయనను తప్పించుకోవడము ఎవరికీ కుదరదు.కావున ఈ విశ్వానికి అంతటికీ కర్త,కర్మ,క్రియ అతనే!ఈ విశ్వము అంతా అతని శరీరము నుండే వెలుపలకు వచ్చింది.అది అతని మాయ వల్లనే పుడుతుంది,పెరుగుతుంది,విలయము అవుతుంది.అంతా ఆయన ఇష్టమే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment