bhaagavatham balpasandugaa
Thursday, 23 October 2025
కుంతీదేవి ఆనంద పారవశ్యము
కుంతీదేవి ఆనందానికి అవథులు లేవు.శ్రీకృష్ణుని మనసారా స్తుతించింది.హే దేవా!నీవు అవ్యయుడవు.నీకు మించిన ప్రకృతి ఇంక వేరే ఏమీలేదు.నీకు ఇవే నా నమస్కారాలు.సభ ముందరకు రాకుండా,తెర వెనక ఉండి నాట్యము చేసే నటుడివి నీవు.ఎందుకంటావా?నీవు ఎప్పుడూ మాయా యవనికాంతరమున నిలిచి చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తూ ఉంటావు.నీ మహిమ మాలాంటి మామూలు మనుష్యులకు ఏమి అర్థమవుతుంది?ఎలా అర్థమవుతుంది?ఎంతని అర్థమవుతుంది?
నన్నూ,నా బిడ్డలనూ లక్క గృహములో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడావు.మాకు ప్రాణ భిక్ష పెట్టావు.దుర్యోధనుడు కుటిల బుద్థితో భీముడికి విషం కలిపిన ఆహారము పెడితే,దాని నుంచి కాపాడావు.ద్రౌపదికి నిండు సభలో అవమానము జరిగినప్పుడు,ఆమెకు వలువలు ఇచ్చి,విలువలు పెంచి మానసంరక్షణ చేసావు.పాండవ కౌరవ యుద్ధములో మా వెంట ఉండి,నా పుత్రులు విజయ పతాకం ఎగుర వేసేలాగా చేసావు.ఇప్పుడు ఉత్తర గర్భమును కాపాడావు.
అలనాడు కంసుడు మీ అమ్మను బాథలు పెట్టాడు.ఆ ఇక్కట్లనుంచి మీ అమ్మను కాపాడుకునినట్లు,ఇప్పుడు కౌరవుల చేతిలో నేను కష్టాలు పడకుండా కాపాడావు.
నీ మత్స్య,కూర్మ,వరాహావతారాలు అన్నీ మామూలు మనుష్యులను మాయ చేసేదానికే కదా!నీవు జన్మ కర్మ రహితుడవు.నీకు చావు పుట్టుకలు లేవు.దేవకీ వసుదేవులు తమ సంతానంగా నీవు పుట్టాలని ఎంతో తపస్సు చేసారు.వాళ్ళ కోరిక తీర్చడం కొరకే నీవు యాదవ కులములో పుట్టావు.
సముద్రములో నావ బరువు ఎక్కువ అయితే ముణిగి పోతుంది.అలాగే పాపుల యొక్క పాప భారంతో బరువెక్కిన ఈ భూదేవిని ఉద్థరించేదానికే నీవు ఈ జన్మ ఎత్తావు.
ఇలా కుంతి తన ఆనందానిని,కృష్ణుని పైన తనకు ఉండే నమ్మకాన్నీ వ్యక్త పరచింది.ధర్మరాజు ,కుంతీ దేవి కోరికమేరకు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇంకొన్ని రోజులు ఉండేదానికి ఒప్పుకున్నాడు.
Sunday, 19 October 2025
ఉత్తర గర్భమందలి బిడ్డ క్షేమం!
శ్రీకృష్ణుడు ద్వారకకు రథము ఎక్కి బయలు దేరబోతున్నాడు.ఇంతలో ఉత్తర అక్కడకు భయముతో వణికి పోతూ వచ్చింది.ఒళ్ళంతా భయంతో తడిసిపోతుంది.దీనంగా,పీల గొంతుతో,మాటకూడా సరిగా రావటం లేదు.అలానే శ్రీకృష్ణుడితో చెప్పింది.ఓ దేవదేవా!ప్రళయ కాలాగ్నితో సమానమై నిప్పులు గ్రక్కుతూ ఒక బాణం నా గర్భస్థ శిశువును దహించే దానికి వస్తుంది.నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు వేరే ఇంకెవరూ లేకు.ఆ బాణం నా తట్టు రాకుండా,నా గర్భంలో ఉండే బిడ్డను ఏమీ చేయకుండా ఆగేలా చూడు స్వామీ!నా బిడ్డను రక్షించే భారము నీదేనయ్యా!
శ్రీ కృష్ణుడికి అర్థం అయింది.అది లోకములో పాండవులు మిగిలి ఉండకుండా చేసేదానికి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము.దివ్యాస్త్రము బ్రహ్మశిరోనామకమైనది అని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు.వెంటనే తన చక్రాయుధాన్ని పంపాడు దానిని అడ్డుకునేదానికి.ఆ బ్రహ్మాస్త్రమునకు అసలు తిరుగులేదు.కాని అది శ్రీకృష్ణుని చక్రాయుధము ముందర నిలువలేక పోయింది.ఒక్కసారిగా నిర్వీర్యమయిపోయింది.
ఈ రకంగా శ్రీకృష్ణుడు ఉత్తర గర్భము లోని బిడ్డను ఆపద నుండి రక్షించాడు.కుంతీ దేవి చిన్నగా ఊపిరి పీల్చుకునింది,వంశము నిలబడినదానికి.ఆమె శ్రీకృష్ణుడిని స్తుతించింది.మాథవా!మథుసూదనా!నీవు సృష్ఠి స్థితి లయ కారుడవు.అలాంటప్పుడు అశ్వత్థామ సంధించిన అస్త్రము ఆపడం నీకు ఒక లెక్కా?చిన్న చిటికె వేసినంత సులభము.మా వంశము రక్షించినదానికి నీకు శత కోటి నమస్కారాలు.
Saturday, 18 October 2025
భీముడి కోపం నషాళానికి!
ధర్మరాజు శాంతి కాముకుడు.కాబట్టి ద్రౌపది మాటలు అతనికి నచ్చాయి.నకులుడు,సహదేవుడు,సాత్యకి,శ్రీకృష్ణార్జునులకు కూడా నచ్చాయి.అందరూ సరే అన్నారు.కానీ భీముడికి భలే కోపం వచ్చింది.మొదటి సారి ద్రౌపది మాటలు నచ్చలేదు.
తన ఆక్రోశం ఇలా వెళ్ళగక్కాడు.ఈ ద్రౌపది ఒఠ్ఠి వెర్రిబాగులది.తన కొడుకులను పొట్టన పెట్టుకున్న దురాత్ముడిని విడిచి పెట్టమని చెబుతుంది.బుర్రుండి మాట్లాడుతుందా అసలు?బిడ్డలను చంపిన ఈ కర్కోటకుడు బ్రాహ్మణుడా?ఈ నీచుడిని వదలి పెట్టే మార్గమే లేదు.నరికి పోగులు పెట్టాల్సిందే!మీరు ఎవ్వరూ వీడిని చంపక పోతే,నేనే నా ఒకే ఒక్క పిడి గుద్దుతో వీడి తలను నుజ్జు నుజ్జు చేస్తాను.
ఇలా అంటూ భీముడు అశ్వత్థామ పైకి ఉరికాడు.ద్రౌపది అడ్డు పడింది.ఆమె శక్తి చాలదని తలచి శ్రీకృష్ణుడు తన నాలుగు భుజాలలో రెండు భుజాలతో భీముడిని ఆపాడు.ఇంకో రెండు భుజాలతో ద్రౌపదిని భీముడు అశ్వత్థామల మథ్య నుంచి ప్రక్కకు లాగాడు.
శ్రీకృష్ణుడు భీముడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇలా అన్నాడు.భీమా!నీవు అన్నది ముమ్మాటికీ నిజమే!ఈ నీచ నికృష్టుడిని శిక్షించాల్సిందే!కానీ బ్రాహ్మణో న హంతవ్యః అని వేద ధర్మము ఉంది కదా!అంటే బ్రాహ్మణుడిని చంపరాదు అని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకుంటే వీడిని చంపకుండా వదలివేయటమే ఉత్తమము.చిన్నగా భీముడిని శాంతపరచారు.
అందరూ కలసి బాగా ఆలోచించారు.ద్రౌపది,భీముడు ఒప్పుకోవాలి.అర్జునుడి ప్రతిజ్ఞ భంగము కాకూడదు.ధర్మబద్థంగా ఉండాలి.వాళ్ళకు ఒక ఉపాయము తట్టింది.
అర్జునుడు అశ్వత్థామకు శిరోముండనం చేసాడు.అతని తలలో ఉండే చూడారత్నమును తీసేసుకున్నాడు.కట్లు విప్పి,అక్కడ నుంచి కుక్కను తరిమినట్లు తరిమేశాడు.
చివరకు గురుపుత్రుడు,బాలహంతకుడు అనే మాయని మచ్చతో,తేజో విహీనుడు అయి,మణిని కోల్పోయి,కళావిహీనంగా,సిగ్గుతో,పాపపు భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పాండవులు,పాంచాలి తమ విగత పుత్రులను తలచుకుని రోదించారు.మృతులు అయిన బంథువులకందరికీ దహన సంస్కారాలు చేసారు.అందరూ వారి స్త్రీలను తోడు తీసుకుని శ్రీకృష్ణునితో కలసి గంగా తీరానికి పోయారు.మృతి చెందిన వారందరికీ తిలోదకాలు సమర్పించి,గంగలో స్నానాలు చేసారు.
శ్రీకృష్ణుడు పుత్రశోకముతో విలపిస్తున్న గాంథారి,ధృతరాష్ట్రుడు,కుంతీ దేవి,ద్రౌపది మున్నగువారిని మంచి మాటలతో శాంత బరచాడు.బంధు జన మరణము వలన కలిగిన దుఃఖము ఉపశమనము పొందేలా చేసాడు.
అలా శ్రీకృష్ణుడు యుద్థములో పాండవులచేత కౌరవులను చంపించాడు.విజయలక్ష్మి పాండవులను వరించేలా చేసాడు.ధర్మరాజుకు రాజ్యము చేకూరేలా చేసాడు.ఇంక నిశ్చింతగా ద్వారకా నగరానికి పోయేదానికి సమాయత్తమయ్యాడు.
Friday, 17 October 2025
అశ్వత్థామను ద్రౌపది నిలదీయుట
అర్జునుడు అశ్వత్థామను ఈడ్చుకుని వచ్చి ద్రౌపది ముందర పడేశాడు.అశ్వత్థామకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.సిగ్గుతో,తను చేసిన నీచ నికృష్ట పనికి,తల దించుకున్నాడు.
ద్రౌపది అడిగింది.ఏమయ్యా!నీ తండ్రి ద్రోణాచార్యుడు.అతను పాండవులకు గురువు.గురు పుత్రుడు అయిన నీవు కూడా గురువు లాంటి వాడివే.ఆ లెక్కన పాండవులందరూ నీకు శిష్యులే!అట్లాంటిది,బ్రాహ్మణ పుటక పుట్టి కర్కశంగా శిష్యుల కుమారులను హతమార్చావు.గురువు అనే పదానికి నీ కృత్యం తలవంపులు కాదా!అసలు అది న్యాయబద్ధమా?నా బిడ్డలు నీ పై పైకి ఉద్రేకంతో వచ్చారా?నన్ను నేను కాపాడుకునేదానికి వాళ్ళను చంపాను అని సంజాయిషీ ఇచ్చుకునేదానికి!నీ కేమైనా ద్రోహము తల పెట్టారా?ద్రోహము తలపెట్టారు కాబట్టి మట్టు పెట్టాను అని సమర్థించుకునేదానికి!వాళ్ళు చిన్న పిల్లలు.చక్కని వారు.యుద్ధ విద్యలో నిష్ణాతులు కాదు.యుద్ధానికి సన్నద్ధులై లేరు.ఆదమరచి రాత్రిపూట నిద్ర పోతూ ఉండినారు.అట్లాంటి అమాయకులను పొట్టన పెట్టుకునేదానికి నీ మనసు ఎట్లా ఒప్పింది?ఎట్లా చేతులాడాయి?అంత కర్కోటకుడివిగా ఎలా మారావు?నీవు జన్మతః బ్రాహ్మణుడివి.దయా,కరుణా,జాలి ఉండే వాడివి.చిన్న బిడ్డలను చంపటం రాక్షసకృత్యమని తట్టలేదా?ఇది అధర్మమని అనిపించలేదా?
ద్రౌపది ఇంకా ఇలా మాట్లాడింది.అర్జునుడు నిన్ను కాళ్ళూ చేతులూ కట్టి తెచ్చాడు.నిన్ను చంపేదానికి సిద్ధముగా ఉన్నాడని మీ తల్లి దండ్రులకు తెలిసి ఉంటుంది కదా ఇప్పటికే.వాళ్ళు ఎంత బాథ పడుతుంటారో ఆలోచించు.
ఆమె శ్రీకృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అనింది.ద్రోణుడు యుద్థంలో మరణించినా ఆయన భార్య సతీ సహగమనము చేయలేదు.మీరు అశ్వత్థామను తాళ్ళతో కట్టి,బలి పశువును తెచ్చినట్లు లాక్కొచ్చారని తెలిసి ఎంత కుమిలి పోతూ ఉంటుంది?పుత్రశోకము ఎంత బాధకలిగిస్తుందో నాకు తెలుసు.మీరు ఇప్పుడు అశ్వత్థామను చంపి పాపము మూటకట్టుకోవద్దు.ఇతనిని హింసించ వద్దు.మీరిప్పుడు ఇతనిని చంపితే కృపికు కోపం వస్తుంది.బ్రాహ్మణులకు కోపం రావటం క్షత్రియులకు క్షేమదాయకం కాదు.హాని కలుగుతుంది కానీ మేలు జరగదు.కాబట్టి ఇతనిని వదిలి పెట్టండి.
ద్రౌపది ఇలా గొప్పగా,ధర్మయుక్తంగా,శ్లాఘనీయంగా మాట్లాడింది.
Thursday, 16 October 2025
బ్రహ్మాస్త్రము ప్రయోగము
అర్జునుడు శ్రీకృష్ణుడు రథ సారథిగా బయలుదేరాడు.శస్త్రాస్త్రములు అన్నిటినీ తీసుకుని రథముపై అశ్వత్థామను వెంబడించాడు.అశ్వత్థామ తన పిక్కబలం అంతా చూపించి పరుగెత్తాడు.కానీ అర్జునుడిని తప్పించుకుని,పారిపోవటం చేతకాలేదు.ఇంక తనను తాను రక్షించుకునేదానికి,తనకు తెలిసిన మార్గం ఎన్నుకున్నాడు.అర్జునుడు పైకి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.అశ్వత్థామకు అంతా సగం సగం జ్ఞానము.అతనికి బ్రహ్మాస్త్రం ఉపయోగించడం తెలుసుకానీ,ఉపసంహరించడం తెలియదు.అది నిప్పులు చిమ్ముతూ అర్జునుడి పైకి రాసాగింది.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాడని అర్జునుడికి అర్థం కాలేదు.కానీ శ్రీకృష్ణుడికి అర్థం అయింది.వెంటనే అర్జునుడిని అప్రమత్తం చేసాడు.నీ పైకి వచ్చేది బ్రహ్మాస్త్రం.దానికి విరుగుడుగా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ఉపయోగించాలి.అప్పుడు అర్జునుడు మంత్రం చదివి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు.రెండూ ఢీకొన్నాయి.ఆ రాపిడికి పైకెగసిన మంటలు ముల్లోకాలూ భీతి చెందేలా చేసాయి.
అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.అర్జునా!నీ బ్రహ్మాస్త్రంతో పాటు అశ్వత్థామ వదిలిన దానిని కూడా ఉపసంహరించు.ఎందుకంటే అతనికి ఉపసంహరించడం తెలియదు.అర్జునుడు అలాగే చేసాడు.
అర్జునుడు మళ్ళీ అశ్వత్థామను వెంబడించాడు.పట్టుకుని,యాగపశువును తాళ్ళతో కట్టినట్లు కట్టి,బంథించి తమ శిబిరానికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు.శ్రీకృష్ణుడికి అశ్వత్థామను చూడగానే కోపం మిన్నంటింది.అర్జునుడితో ఇలా అన్నాడు.అర్జునా!ఈ క్రూరుడిని తప్పకుండా శిక్షించాలి.అసమర్థులను,అస్త్ర విద్య తెలియని వారును,ఎదిరించలేని వారును,బాలురను,నిద్రించుచున్న వారును అయిన ఉపపాండవులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడా?మహాపాపాత్ముడు!వీడికి పుట్టగతులు ఉండవు.
ఇప్పుడేమో సిగ్గూ ఎగ్గూ లేకుండా,ప్రాణభీతితో వణుకుతూ,వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు,పరమ నీచుడు వీడు.వీడి పైన ఇసుమంతైనా దయా,జాలి చూపించాల్సిన అవసరము అస్సలు లేదు.అర్జునా!ఎవడైతే తన ప్రాణాలను రక్షించుకునేదానికోసం ఇతరుల ప్రాణాలు తీస్తాడో వాడు అత్యంత అథముడు.వాడు అథోలోకాలకు పోతాడు.వాడు చేసిన పాపాలు,అకృత్యాలకు రాజదండన అనుభవిస్తే కానీ ఉత్తమలోకాలు దక్కవు.ఇతనిని తక్షణమే శిక్షించు.
అప్పుడు అర్జునుడు ధర్మం తెలిసినవాడుగా ఇలా అన్నాడు.బ్రాహ్మణుడు ఎంతటి మహాపాపాలు చేసినా,అతనిని చంపకూడదు కదా!అతనిని శిబిరానికి తీసుకుని వచ్చాడు.
Tuesday, 14 October 2025
అశ్వత్థామ ఘాతుకం
సూతుడు శౌనకాది మునులకు మాట ఇచ్చాడు.ఏమని?వారికి పరీక్షిత్తు మహారాజు వృత్తాంతము,పాండవుల మహా ప్రస్థానము మరియు శ్రీకృష్ణుని వృత్తాంతము చెబుతాను అని.ఇలా మొదలు పెట్టాడు అన్నట్టుగానే.
మునులారా!కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో కౌరవ వీరులు అందరూ గతించారు.పాండవుల పక్షంనుంచి కూడా చాలా మంది విగతజీవులు అయ్యారు.భీముడు గదాఘాతం వలన దుర్యోధనుడి తొడలు విరిగి పోయాయి.విజయలక్ష్మి పాండవులను వరించింది.
దుర్యోధనుడి దీన స్ధితి చూసి అశ్వత్థామ చాలా బాథ పడ్డాడు.దుర్యోధనుడికి సంతోషం కలగాలంటే ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు.అర్థరాత్రి వెళ్ళి,నిద్రలో ఉన్న ఉపపాండవులను దొంగచాటుగా చంపేసాడు.ఆ సమయంలో అందరూ నిద్రలు పోతున్నారు.అప్పుడు ఇలాంటి ఘాతుకం చేబట్టాడు ద్రోణ పుత్రుడు అయిన అశ్వత్థామ.విషయం అందరికీ తెలిసి పోయింది.ద్రౌపది దుంఖాన్ని ఆపేవారే లేకపోయారు.అంత హృదయవికారంగా రోదించింది.
అప్పుడు అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.నీవు శోకించవద్దు.నీవు రాజపుత్రివి.నీకు తగదు.అశ్వత్థామ కరుణ అనే మాట లేకుండా,నిద్రలో ఉండే బాలురను చంపాడు.నేను వెళ్ళి అతనిని చంపి,అతని తలను నీకు కానుకగా ఇస్తాను.నీవు నీ కసి,కోపం పోయేదాకా కాళ్ళతో అతని తలను తన్ను.
కృష్ణుడు కూడా అదే సరైనది అని అన్నాడు.
Sunday, 12 October 2025
నారదుడు అస్ఖలిత బ్రహ్మచారి
నారదుడు ఇంకా ఇలా కొనసాగించాడు ఆ మునికి చెప్పడము.
ఓ మునివర్యా!ఆ అశరీరవాణి మాటలు నన్ను చాలా సంతృప్తి పరచాయి.నాకు చాలా సంతోషం వేసింది.నేను వినమ్రతతో శిరసు వంచి ఆ అశరీర వాణికి దండ ప్రమాణాలు సమర్పించుకున్నాను.ఇంక అప్పటి నుండి కామక్రోథాలను వదలి పెట్టేశాను.ఆ భగవంతుని నామ జపంతోటే కాలము వెళ్ళ బుచ్చాను.అతని చరిత్రనే మననం చేసుకుంటూ ఉన్నాను.నిర్మల మయిన మనసుతో,ప్రశాంత చిత్తముతో నిరంతరమూ ఆ దేవదేవుడిని మనోఫలకం మీద ఉంచుకున్నాను.అతని మీదే బుద్ధి నిలిపి,ఏకాగ్ర చిత్తంతో కాలం గడపసాగాను.ఇంతలో నాకు మరణం సంభవించింది.నేను నా శరీరాన్ని వీడి శుద్ధ సత్త్వమయమైన భాగవత శరీరాన్ని పొందాను.అంతలో ప్రళయము సంభవించింది.
శ్రీమన్నారాయణుడు సముద్రము మథ్యలో శయనించి ఉన్నాడు.అతని నాభి నుండి వచ్చిన కమలంలో బ్రహ్మ కానవచ్చాడు.బ్రహ్మ విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించబోయాడు.అతని నిశ్వాసతో పాటే నేను కూడా అతనిలోకి వెళ్ళిపోయాను.ఇలా వేయి యుగములు గడచిపోయాయి.బ్రహ్మకు మెలకువ వచ్చింది.ఇంక సృష్టి కార్యము మొదలు పెట్టాడు.ఆ బ్రహ్మ వలన మరీచి,ఇంకా చాలా మంది మునులు,నేను కూడా పుట్టాము.
నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయినాను.మహావిష్ణువు కృపాకటాక్షము నా మీద ప్రసరించడం వలన ముల్లోకాలూ సంచరిస్తుంటాను.నన్ను ఎవరూ ఆపరు.ఎవరి ప్రమేయం లేకుండానే సప్త స్వరాలు పలికే మహతి వీణ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము వలన నాకు దక్కింది.ఇంక ఆ వీణను మీటుతూ నారాయణుని కథలను గానం చేయటమే నా వృత్తి,ప్రవృత్తి.
నేను ఈ గానం తన్మయత్వంతో చేస్తుంటే,నేను పిలిచినట్లుగా నా మనోఫలకం పైన ఆ భగవంతుడు కనిపిస్తాడు.నాకు విష్ణునామ సంకీర్తన వలన కలిగే మనశ్శాంతి,నాకు వేరే ఇంకేమి చేసినా దక్కదు.స్వయానా యముడుని నియంత్రించ గలిగే యోగము నేర్చుకుని ఉన్నా నాకు అంత మహదానందము దక్కదు.హే మునీంద్రా!ఇది స్వయానా నా అనుభవము.కాబట్టి నా ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను.
ఆ మాటలు చెప్పి నారదుడు తన మహతి వీణను మీటుకుంటూ విష్ణు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి పోయాడు.
Subscribe to:
Comments (Atom)