Thursday, 30 October 2025

ధర్మరాజు అశ్వమేధ యాగము

ధర్మరాజు సద్వర్తన కలిగినవాడు.పాపభీతి ఎక్కువ.యుద్ధంలో తన మన అని లేకుండా అందరినీ చంపారు కదా పాండవులు,వారి తట్టు వాళ్ళు.ఆ పాపము పోయేదానికి అశ్వమేధ యాగము చేయాలనుకున్నాడు.కానీ ప్రజలనుంచి వచ్చే సొమ్ము చాలదు అంతటి బృహత్కార్యానికి. శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు.పూర్వము మరుత్తరాజు యాగానికని ఉపయోగించగా మిగిలి పోయిన ధనము,బంగారు పాత్రలు మొదలయినవి ఉత్తర దిక్కున ఉన్నాయి.వాటిని వాడుకొనవచ్చు అని. భీముడు,అర్జునుడు పోయి వాటిని తెచ్చారు.ధర్మరాజు యాగములకు కావలసిన సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాడు.బంధుజనముతో కలిసి మూడు యాగములు చేసాడు.శ్రీకృష్ణుడు ఆ యాగాలను చూసేదానికి వచ్చాడు.కొనినాళ్ళు ఉండి,అర్జునుడిని తోడు తీసుకుని ద్వారకకు పోయాడు. ఇంతలో విదురుడు తీర్థయాత్రలకు పోయి వచ్చాడు.అక్కడ మైత్రేయుడి వలన ఆత్మజ్ఞానము పొందాడు.ధర్మరాజు విదురుడిని ఆనందంగా స్వాగతించాడు.యాత్రా విశేషాలు అన్నీ వివరంగా కనుక్కున్నాడు.ధర్మరాజు తనే స్వయంగా తీర్ధయాత్రలకు వెళ్ళి వచ్చినట్లు తృప్తి పడ్డాడు. అప్పటికే సముద్రము పొంగి ద్వారకను ముంచి వేసింది.యాదవులు వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు.ఆ విషయము ధర్మరాజుకు చెబితే చాలా బాధ పడతాడని,విదురుడికి తెలిసినా చెప్పలేదు. విదురుడు గురించి రెండు మాటలు చెప్పుకుందాము.ఒకసారి యముడు మాండవ్య ముని కోపానికి బలి అయ్యాడు.ఆయన శాపము వలన యముడు శూద్ర వనితకు కుమారుడు రూపములో పుట్టాడు.విదురుడు సౌమ్యుడు.మంచి చెడ్డలు తెలిసిన వాడు.లోకులు పలు కాకులు అంటాము కదా!మంచి చెబితే మంచివాడని మోసేస్తారు.చెడ్డ తెబితే చెడ్డవాడని నిందిస్తారు.అందుకని విదురుడు ఆ దుర్వార్తను ధర్మరాజుకు చెప్పలేదు.మనము చెడును ఆపలేము అని తెలిసిన తరువాత,ఆ విషయంగా ఎదుటి వారిని ఎందుకు బాథ పెట్టడం అని.

Sunday, 26 October 2025

విష్ణురాతుడి జాతకము

అభిమన్యుడికి కొడుకు పుట్టాడు.ఆ ఆనందంలో ధర్మరాజు బ్రాహ్మణులకు గోదానము,భూదానము,హిరణ్యదానము..।ఇలా చాలా రకాల దానాలు చేశాడు.వారుకూడా బాలుడిని,పాండవ వంశాన్నీ కీర్తించారు,ఆశీర్వదించారు.వంశము అంతరించకుండా శ్రీమహా విష్ణువు కాపాడాడు కాబట్టి,ఆ బిడ్డకు విష్ణురాతుడు అని నామకరణం చేసారు.శత్రువులను నాశనం చేస్తాడని దీవించారు. దానికి ధర్మరాజు ఇలా అడిగాడు.ఓ బ్రాహ్మణోత్తములారా!నా మాట వినండి.మా వంశములో పెద్దలు అందరూ పుణ్యాత్ములు.గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించారు.దయాశీలురుగా ఉన్నారు.రాజర్షులు అయ్యారు.ఈ చిన్నారి కూడా అలాగే హరి భక్తుడు అవుతాడా? దానికి బ్రాహ్మణులు ముక్త కంఠంతో చెప్పారు.రాజా!నీవు ఎలాంటి దిగులూ పెట్టుకోనక్కరలేదు.నీ మనవడు ఇక్ష్వాకువు లాగా ప్రజలను రక్షిస్తాడు.శ్రీరామచంద్రుడి లాగా సత్య ప్రతిజ్ఞుడు అవుతాడు.శిబి చక్రవర్తి లాగా శరణాగత రక్షకుడు అవుతాడు.దుష్యంతుడి పుత్రుడు భరతుడు లాగా బంథువర్గానికి అంతా కీర్తి కలిగిస్తాడు.తాత అర్జునుడులాగా,కార్తవీర్యునిలాగా గొప్ప ధనుర్థరుడు అవుతాడు.సూర్యడిలాగా ప్రతాపశాలి అవుతాడు.వాసుదేవుడు లాగా సర్వభూతములకు హితుడు అవుతాడు.అశ్వమేథ యాగాలు చేస్తాడు.ఇతని పుత్రులుకూడా ఇతనిలాగే గొప్పవాళ్ళు అవుతారు.అందులో ఢోకా లేదు.ఇతను చాలా ఏళ్ళు బ్రతుకుతాడు. ఇతనికి బ్రాహ్మణ శాపం ఉంది. దాని కారణంగా తక్షకుడు అనే విషము వల్ల ప్రాణ గండము ఉంది. అది అతను ముందే తెలుసుకుంటాడు.మరణం తధ్యం అని తెలుసుకుని భగవంతుని సేవిస్తాడు.శుక మహర్షి అనుగ్రహంతో ఆత్మజ్ఞానము పొందుతాడు.గంగా తీరములో దేహమును విడచి పుణ్యలోకాలకు పయనమవుతాడు. విష్ణురాతుడు తన తల్లి గర్భములో ఉన్నప్పుడు భగవంతుడిని చూసాడు కదా?ఆ భగవంతుడు లోకమంతా ఉన్నాడు అని ఎప్పుడూ పరీక్షించేవాడు.అందుకని అతనికి పరీక్షిత్తు అనే పేరు కూడా ఉంది.

పరీక్షిత్తు పుట్టుక

శ్రీకృష్ణుడు కొంతకాలము తరువాత ద్వారకకు చేరాడు.తన వారినందరినీ సంతోష పెట్టాడు శౌనక మహర్షి సూతుని ఈ ప్రశ్నలు అడిగాడు. ఓ సూతమహర్షీ!అసలు బ్రహ్మ శిరోనామకాస్త్రము అనేది చిన్నా చితకా అస్త్రము కాదు కదా!అలాంటి శక్తివంతమయిన అస్త్రము ఉత్తర గర్భము వైపు దూసుకుని పోయింది కదా!అట్లాంటి విపత్తు నుండి ఉత్తర గర్భములో ఉండే శిశువును శ్రీ కృష్ణుడు ఎలా కాపాడగలిగాడు?ఎట్లా ఆ బిడ్డను బ్రతికించగలిగాడు?ఆ బిడ్డ పెరిగి పెద్ద అయి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?అతని వృత్తాంతము ఏంది?శుక మహర్షి అతనికి విజ్ఞాన మార్గాన్ని ఎట్లా బోధించాడు?అతను దేహాన్ని ఎట్లా విడిచాడు?స్వామీ!ఈ వివరాలన్నీ వినాలని,తెలుసుకోవాలని మాకు ఉత్సాహంగా ఉంది. సూతుడు నిదానంగా చెప్పడం మొదలు పెట్టాడు.ధర్మరాజు ఈ భూమండలాన్ని,గొప్ప సంపదను తన తమ్ముళ్ళతో కలిసి సంపాదించాడు.లెక్కకు మిక్కిలి యాగాలు చేసాడు.కృష్ణుడిని స్పూర్తిగా తీసుకుని దుష్టులను శిక్షించాడు.అలాగే శిష్టులను రక్షించాడు.ఎల్లప్పుడూ భగవన్నామ చింతనతో ఉన్నాడు.కోరికలకు అడ్డుకట్ట వేసాడు.కామక్రోధాలను దయించాడు.రాజ్యాన్ని సస్యశ్యామలంగా పాలించాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము కారణంగా ఉత్తర గర్భములోని శిశువు భరించలేని వేడికి తపించి పోయింది.ఇలా అనుకుంది.అయ్యో!ఈ తాపము,ఈ వేడి నేను తట్టుకోలేక పోతున్నాను.నాకు దిక్కెవరు?నాకు గర్భములోనే జరగరానిది జరిగితే,మా అమ్మ తట్టుకోలేదే!ఆమె కూడా ప్రాణాలను వీడుతుందే!ఆ భగవంతుడికి నా పైన కనికరము కలుగలేదా!నన్ను కాపాడేదానికి రాడా? భగవంతుడికి ఈ సృష్టిలో తెలియనిది,అర్థం కానిదీ ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు కదా!అతను ఆ శిశువు చుట్టూ తన గదతో మండలాకారంలో త్రిప్పాడు.దాని వల్ల చల్లదనం కలిగించాడు.దాని కారణంగా బ్రహ్మాస్త్రపు వేడి బిడ్డను తాకలేక పోయింది.బిడ్డ సునాయాసంగా ఊపిరి పీల్చుకో గలిగాడు.తరువాత కొన్నాళ్ళకు శుభ గ్రహములు కలిసిన శుభలగ్నమున ఉత్తరకు వంశోద్థారకుడు అయిన కుమారుడు జన్మించాడు.

Saturday, 25 October 2025

భీష్ముడి శ్రీకృష్ణ స్తుతి

భీష్ముడికి చాలా సంతోషంగా ఉంది,శ్రీకృష్ణుడు తనను చూసేదానికి వచ్చాడని.ఆ ఆనందాన్ని ఇలా బయటపెట్టాడు.హే కృష్ణా!నీలమేఘ శ్యాముడివి.ముల్లోకాలను మోహ సముద్రములో ఓలలాడిస్తావు.నల్లని ముంగురులతో నీ ముఖం మనోహరంగా మెరిసి పోతుంది.నీవు కట్టిన వస్త్రాలు లేత సూర్యుని రంగులో వెలిగిపోతున్నాయి.ఎల్లప్పుడూ అర్జునుడి జతలోనే ఉంటావు.అలానే నా మనోఫలకంపైన స్థిరంగా ఉంటావు. అర్జునుడు మనసు కలత పడి యుద్ధం ఛేయనంటే,అతను మనసు కుదుట పడేలా చేసావు.సుద్దులూ,బుద్ధులూ చెప్పి కార్యోన్ముఖుడిని చేసావు.అలాంటి నీ నామస్మరణే నా జీవనవేదం.సర్వ మునిగణాలూ నిన్ను స్తుతిస్తాయి.అలాంటి నిన్ను భక్తి శ్రద్థలతో సేవించడమే నా ధ్యేయము. ఎలాంటి భేషజాలకూ పోకుండా అర్జునుడికి రథ సారధ్యం చేసావు.అతను మనసా వాచా కర్మణా నిన్నే నమ్ముకున్నాడు కదా!గుర్రాలను రణరంగంలో పరుగులెత్తించావు.సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా కనిపిస్తాడు.అట్లనే భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు కూడా ఎవరికి తగినట్లుగా వారికి కనిపిస్తుంటాడు. భీష్ముడు ఇలా భగవంతుడు అయిన శ్రీకృష్ణుడిని మనసు నిండా నింపుకుని,ఉఛ్వాసనిశ్వాలను ఆపి పరమపదం పొందాడు. ధర్మరాజు చింతించాడు.తరువాత భీష్మపితామహుడికి పరలోక క్రియలు జరిపించాడు.సోదరులు,శ్రీకృష్ణుడుతో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు,గాంథారీల అంగీకారము తీసుకుని ధర్మమార్గములో రాజ్యపాలన చేసాడు.ధర్మరాజు బంధువులను యుద్ధంలో పోగొట్టుకున్న దుఃఖంలో తనకూ ఏ సుఖాలూ,రాజ్యాలూ వద్దన్నాడు.కానీ శ్రీకృష్ణుడు అతనికి కర్తవ్యం గుర్తుచేసి,రాజ్యము అరాచకం కాకుండా ఉండాలంటే సుపరిపాలన ఉండాలి అని అర్థం అయ్యేలా చేసాడు.ధర్మరాజును రాజ్యపాలకుడిగా నియమించాడు.

Friday, 24 October 2025

భీష్ముడి స్వాంతన పలుకులు

ధర్మరాజుకు బంధుజనులను కోల్పోయాము అనే దిగులు,దుఃఖము ఎక్కువ అయింది.వ్యాసుడు,ధౌమ్యుడు అతనిని అనునయించే ప్రయత్నము చేసారు.కానీ ధర్మరాజును శాంతింప చేయలేక పోయారు. ఒకరోజు ధర్మరాజు అంపశయ్య పైన ఉండే భీష్ముడుని చూసేదానికి బయలుదేరాడు.మిగిలిన పాండవులు,శ్రీ కృష్ణుడు కూడా అతనిని అనుసరించారు. అందరూ భీష్మ పితామహుడికి నమస్కారము చేసారు.ఆయన దుస్థితికి చాలా బాథ పడ్డారు. ఇంతలో అక్కడకు బృహదశ్వుడు,భరద్వాజుడు,పర్వత నారదులు,వ్యాసుడు వచ్చారు.అప్పుడు భీష్ముడు పాండవులను ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్పాడు. నాయనలారా!మీరు అందరూ ధర్మమార్గము లోనే ధర్మబద్ధంగా నడుచుకునినారు.కానీ చాలా అష్ట కష్టాలకు కూడా గురి అయ్యారు.మీ తండ్రి శాపము కారణంగా పోయాడు.అప్పుడు మీరందరూ చిన్నపిల్లలు.కానీ కుంతీ ధైర్యంగా మిమ్మలను పెంచి పెద్ద చేసింది.ఆమె ఏరోజూ సుఖపడింది లేదు.జన్మంతా కష్టాలే చవి చూసింది. మీకు ఆఖరికి సమరము తప్పలేదు.శ్రీకృష్ణుడు మీకు తోడు ఉన్నందున మీరు విజయపతాకం ఎగుర వేయగలిగారు.ఇంక యుద్ధంలో అయినవారు పోయారని దిగులు పడటం ఆపండి.కాలము అనేదానిని ఎవరూ అతిక్రమించలేరు.దాని చెప్పుచేతల్లోనే మనం నడవాలి. శ్రీకృష్ణుడు మీ మేనత్త కొడుకు.కాబట్టి అతనిని అన్ని రకాలుగా వాడుకున్నారు.ఒకసారి సంథి కోసరం పంపించారు.ఇంకో సారేమో ఏకంగా రథ సారధ్యం చేయించారు.అతను కూడా మీరు ధర్మం పక్షాన ఉన్నారు అనే ఏకైక కారణంతో మీకు తోడుగా నిలిచాడు. శ్రీకృష్ణుడు సర్వసముడు.అతనే సర్వాత్మకుడు అయిన ఈశ్వరుడు.ఇతను భక్తవత్సలుడు.ఇతనికి రాగద్వేషాలు లేవు.అంతటి మహిమాన్వితుడు నా మరణసమయమున నాదగ్గరకు రావడం నా పూర్వ జన్మ సుకృతము.నా ఆనందం ఇంతని చెప్పలేను. భీష్ముడు శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు.తరువాత ధర్మరాజుకు సమస్త ధర్మాలపైన అవగాహన కల్పించాడు.పురుషార్థముల గురించి ఏకరువు పెట్టాడు.అన్నీ సంగ్రహంగా,సమన్వయంతో చెప్పాడు. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రవేశించింది.భీష్ముడు స్వచ్ఛంద మరణమునకు సంసిద్ధుడు అయినాడు.

Thursday, 23 October 2025

కుంతీదేవి ఆనంద పారవశ్యము

కుంతీదేవి ఆనందానికి అవథులు లేవు.శ్రీకృష్ణుని మనసారా స్తుతించింది.హే దేవా!నీవు అవ్యయుడవు.నీకు మించిన ప్రకృతి ఇంక వేరే ఏమీలేదు.నీకు ఇవే నా నమస్కారాలు.సభ ముందరకు రాకుండా,తెర వెనక ఉండి నాట్యము చేసే నటుడివి నీవు.ఎందుకంటావా?నీవు ఎప్పుడూ మాయా యవనికాంతరమున నిలిచి చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తూ ఉంటావు.నీ మహిమ మాలాంటి మామూలు మనుష్యులకు ఏమి అర్థమవుతుంది?ఎలా అర్థమవుతుంది?ఎంతని అర్థమవుతుంది? నన్నూ,నా బిడ్డలనూ లక్క గృహములో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడావు.మాకు ప్రాణ భిక్ష పెట్టావు.దుర్యోధనుడు కుటిల బుద్థితో భీముడికి విషం కలిపిన ఆహారము పెడితే,దాని నుంచి కాపాడావు.ద్రౌపదికి నిండు సభలో అవమానము జరిగినప్పుడు,ఆమెకు వలువలు ఇచ్చి,విలువలు పెంచి మానసంరక్షణ చేసావు.పాండవ కౌరవ యుద్ధములో మా వెంట ఉండి,నా పుత్రులు విజయ పతాకం ఎగుర వేసేలాగా చేసావు.ఇప్పుడు ఉత్తర గర్భమును కాపాడావు. అలనాడు కంసుడు మీ అమ్మను బాథలు పెట్టాడు.ఆ ఇక్కట్లనుంచి మీ అమ్మను కాపాడుకునినట్లు,ఇప్పుడు కౌరవుల చేతిలో నేను కష్టాలు పడకుండా కాపాడావు. నీ మత్స్య,కూర్మ,వరాహావతారాలు అన్నీ మామూలు మనుష్యులను మాయ చేసేదానికే కదా!నీవు జన్మ కర్మ రహితుడవు.నీకు చావు పుట్టుకలు లేవు.దేవకీ వసుదేవులు తమ సంతానంగా నీవు పుట్టాలని ఎంతో తపస్సు చేసారు.వాళ్ళ కోరిక తీర్చడం కొరకే నీవు యాదవ కులములో పుట్టావు. సముద్రములో నావ బరువు ఎక్కువ అయితే ముణిగి పోతుంది.అలాగే పాపుల యొక్క పాప భారంతో బరువెక్కిన ఈ భూదేవిని ఉద్థరించేదానికే నీవు ఈ జన్మ ఎత్తావు. ఇలా కుంతి తన ఆనందానిని,కృష్ణుని పైన తనకు ఉండే నమ్మకాన్నీ వ్యక్త పరచింది.ధర్మరాజు ,కుంతీ దేవి కోరికమేరకు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇంకొన్ని రోజులు ఉండేదానికి ఒప్పుకున్నాడు.

Sunday, 19 October 2025

ఉత్తర గర్భమందలి బిడ్డ క్షేమం!

శ్రీకృష్ణుడు ద్వారకకు రథము ఎక్కి బయలు దేరబోతున్నాడు.ఇంతలో ఉత్తర అక్కడకు భయముతో వణికి పోతూ వచ్చింది.ఒళ్ళంతా భయంతో తడిసిపోతుంది.దీనంగా,పీల గొంతుతో,మాటకూడా సరిగా రావటం లేదు.అలానే శ్రీకృష్ణుడితో చెప్పింది.ఓ దేవదేవా!ప్రళయ కాలాగ్నితో సమానమై నిప్పులు గ్రక్కుతూ ఒక బాణం నా గర్భస్థ శిశువును దహించే దానికి వస్తుంది.నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు వేరే ఇంకెవరూ లేకు.ఆ బాణం నా తట్టు రాకుండా,నా గర్భంలో ఉండే బిడ్డను ఏమీ చేయకుండా ఆగేలా చూడు స్వామీ!నా బిడ్డను రక్షించే భారము నీదేనయ్యా! శ్రీ కృష్ణుడికి అర్థం అయింది.అది లోకములో పాండవులు మిగిలి ఉండకుండా చేసేదానికి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము.దివ్యాస్త్రము బ్రహ్మశిరోనామకమైనది అని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు.వెంటనే తన చక్రాయుధాన్ని పంపాడు దానిని అడ్డుకునేదానికి.ఆ బ్రహ్మాస్త్రమునకు అసలు తిరుగులేదు.కాని అది శ్రీకృష్ణుని చక్రాయుధము ముందర నిలువలేక పోయింది.ఒక్కసారిగా నిర్వీర్యమయిపోయింది. ఈ రకంగా శ్రీకృష్ణుడు ఉత్తర గర్భము లోని బిడ్డను ఆపద నుండి రక్షించాడు.కుంతీ దేవి చిన్నగా ఊపిరి పీల్చుకునింది,వంశము నిలబడినదానికి.ఆమె శ్రీకృష్ణుడిని స్తుతించింది.మాథవా!మథుసూదనా!నీవు సృష్ఠి స్థితి లయ కారుడవు.అలాంటప్పుడు అశ్వత్థామ సంధించిన అస్త్రము ఆపడం నీకు ఒక లెక్కా?చిన్న చిటికె వేసినంత సులభము.మా వంశము రక్షించినదానికి నీకు శత కోటి నమస్కారాలు.

Saturday, 18 October 2025

భీముడి కోపం నషాళానికి!

ధర్మరాజు శాంతి కాముకుడు.కాబట్టి ద్రౌపది మాటలు అతనికి నచ్చాయి.నకులుడు,సహదేవుడు,సాత్యకి,శ్రీకృష్ణార్జునులకు కూడా నచ్చాయి.అందరూ సరే అన్నారు.కానీ భీముడికి భలే కోపం వచ్చింది.మొదటి సారి ద్రౌపది మాటలు నచ్చలేదు. తన ఆక్రోశం ఇలా వెళ్ళగక్కాడు.ఈ ద్రౌపది ఒఠ్ఠి వెర్రిబాగులది.తన కొడుకులను పొట్టన పెట్టుకున్న దురాత్ముడిని విడిచి పెట్టమని చెబుతుంది.బుర్రుండి మాట్లాడుతుందా అసలు?బిడ్డలను చంపిన ఈ కర్కోటకుడు బ్రాహ్మణుడా?ఈ నీచుడిని వదలి పెట్టే మార్గమే లేదు.నరికి పోగులు పెట్టాల్సిందే!మీరు ఎవ్వరూ వీడిని చంపక పోతే,నేనే నా ఒకే ఒక్క పిడి గుద్దుతో వీడి తలను నుజ్జు నుజ్జు చేస్తాను. ఇలా అంటూ భీముడు అశ్వత్థామ పైకి ఉరికాడు.ద్రౌపది అడ్డు పడింది.ఆమె శక్తి చాలదని తలచి శ్రీకృష్ణుడు తన నాలుగు భుజాలలో రెండు భుజాలతో భీముడిని ఆపాడు.ఇంకో రెండు భుజాలతో ద్రౌపదిని భీముడు అశ్వత్థామల మథ్య నుంచి ప్రక్కకు లాగాడు. శ్రీకృష్ణుడు భీముడిని ఉద్దేశించి చిరునవ్వుతో ఇలా అన్నాడు.భీమా!నీవు అన్నది ముమ్మాటికీ నిజమే!ఈ నీచ నికృష్టుడిని శిక్షించాల్సిందే!కానీ బ్రాహ్మణో న హంతవ్యః అని వేద ధర్మము ఉంది కదా!అంటే బ్రాహ్మణుడిని చంపరాదు అని వేదాలు ఘోషిస్తున్నాయి.కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకుంటే వీడిని చంపకుండా వదలివేయటమే ఉత్తమము.చిన్నగా భీముడిని శాంతపరచారు. అందరూ కలసి బాగా ఆలోచించారు.ద్రౌపది,భీముడు ఒప్పుకోవాలి.అర్జునుడి ప్రతిజ్ఞ భంగము కాకూడదు.ధర్మబద్థంగా ఉండాలి.వాళ్ళకు ఒక ఉపాయము తట్టింది. అర్జునుడు అశ్వత్థామకు శిరోముండనం చేసాడు.అతని తలలో ఉండే చూడారత్నమును తీసేసుకున్నాడు.కట్లు విప్పి,అక్కడ నుంచి కుక్కను తరిమినట్లు తరిమేశాడు. చివరకు గురుపుత్రుడు,బాలహంతకుడు అనే మాయని మచ్చతో,తేజో విహీనుడు అయి,మణిని కోల్పోయి,కళావిహీనంగా,సిగ్గుతో,పాపపు భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాండవులు,పాంచాలి తమ విగత పుత్రులను తలచుకుని రోదించారు.మృతులు అయిన బంథువులకందరికీ దహన సంస్కారాలు చేసారు.అందరూ వారి స్త్రీలను తోడు తీసుకుని శ్రీకృష్ణునితో కలసి గంగా తీరానికి పోయారు.మృతి చెందిన వారందరికీ తిలోదకాలు సమర్పించి,గంగలో స్నానాలు చేసారు. శ్రీకృష్ణుడు పుత్రశోకముతో విలపిస్తున్న గాంథారి,ధృతరాష్ట్రుడు,కుంతీ దేవి,ద్రౌపది మున్నగువారిని మంచి మాటలతో శాంత బరచాడు.బంధు జన మరణము వలన కలిగిన దుఃఖము ఉపశమనము పొందేలా చేసాడు. అలా శ్రీకృష్ణుడు యుద్థములో పాండవులచేత కౌరవులను చంపించాడు.విజయలక్ష్మి పాండవులను వరించేలా చేసాడు.ధర్మరాజుకు రాజ్యము చేకూరేలా చేసాడు.ఇంక నిశ్చింతగా ద్వారకా నగరానికి పోయేదానికి సమాయత్తమయ్యాడు.

Friday, 17 October 2025

అశ్వత్థామను ద్రౌపది నిలదీయుట

అర్జునుడు అశ్వత్థామను ఈడ్చుకుని వచ్చి ద్రౌపది ముందర పడేశాడు.అశ్వత్థామకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.సిగ్గుతో,తను చేసిన నీచ నికృష్ట పనికి,తల దించుకున్నాడు. ద్రౌపది అడిగింది.ఏమయ్యా!నీ తండ్రి ద్రోణాచార్యుడు.అతను పాండవులకు గురువు.గురు పుత్రుడు అయిన నీవు కూడా గురువు లాంటి వాడివే.ఆ లెక్కన పాండవులందరూ నీకు శిష్యులే!అట్లాంటిది,బ్రాహ్మణ పుటక పుట్టి కర్కశంగా శిష్యుల కుమారులను హతమార్చావు.గురువు అనే పదానికి నీ కృత్యం తలవంపులు కాదా!అసలు అది న్యాయబద్ధమా?నా బిడ్డలు నీ పై పైకి ఉద్రేకంతో వచ్చారా?నన్ను నేను కాపాడుకునేదానికి వాళ్ళను చంపాను అని సంజాయిషీ ఇచ్చుకునేదానికి!నీ కేమైనా ద్రోహము తల పెట్టారా?ద్రోహము తలపెట్టారు కాబట్టి మట్టు పెట్టాను అని సమర్థించుకునేదానికి!వాళ్ళు చిన్న పిల్లలు.చక్కని వారు.యుద్ధ విద్యలో నిష్ణాతులు కాదు.యుద్ధానికి సన్నద్ధులై లేరు.ఆదమరచి రాత్రిపూట నిద్ర పోతూ ఉండినారు.అట్లాంటి అమాయకులను పొట్టన పెట్టుకునేదానికి నీ మనసు ఎట్లా ఒప్పింది?ఎట్లా చేతులాడాయి?అంత కర్కోటకుడివిగా ఎలా మారావు?నీవు జన్మతః బ్రాహ్మణుడివి.దయా,కరుణా,జాలి ఉండే వాడివి.చిన్న బిడ్డలను చంపటం రాక్షసకృత్యమని తట్టలేదా?ఇది అధర్మమని అనిపించలేదా? ద్రౌపది ఇంకా ఇలా మాట్లాడింది.అర్జునుడు నిన్ను కాళ్ళూ చేతులూ కట్టి తెచ్చాడు.నిన్ను చంపేదానికి సిద్ధముగా ఉన్నాడని మీ తల్లి దండ్రులకు తెలిసి ఉంటుంది కదా ఇప్పటికే.వాళ్ళు ఎంత బాథ పడుతుంటారో ఆలోచించు. ఆమె శ్రీకృష్ణార్జునులను ఉద్దేశించి ఇలా అనింది.ద్రోణుడు యుద్థంలో మరణించినా ఆయన భార్య సతీ సహగమనము చేయలేదు.మీరు అశ్వత్థామను తాళ్ళతో కట్టి,బలి పశువును తెచ్చినట్లు లాక్కొచ్చారని తెలిసి ఎంత కుమిలి పోతూ ఉంటుంది?పుత్రశోకము ఎంత బాధకలిగిస్తుందో నాకు తెలుసు.మీరు ఇప్పుడు అశ్వత్థామను చంపి పాపము మూటకట్టుకోవద్దు.ఇతనిని హింసించ వద్దు.మీరిప్పుడు ఇతనిని చంపితే కృపికు కోపం వస్తుంది.బ్రాహ్మణులకు కోపం రావటం క్షత్రియులకు క్షేమదాయకం కాదు.హాని కలుగుతుంది కానీ మేలు జరగదు.కాబట్టి ఇతనిని వదిలి పెట్టండి. ద్రౌపది ఇలా గొప్పగా,ధర్మయుక్తంగా,శ్లాఘనీయంగా మాట్లాడింది.

Thursday, 16 October 2025

బ్రహ్మాస్త్రము ప్రయోగము

అర్జునుడు శ్రీకృష్ణుడు రథ సారథిగా బయలుదేరాడు.శస్త్రాస్త్రములు అన్నిటినీ తీసుకుని రథముపై అశ్వత్థామను వెంబడించాడు.అశ్వత్థామ తన పిక్కబలం అంతా చూపించి పరుగెత్తాడు.కానీ అర్జునుడిని తప్పించుకుని,పారిపోవటం చేతకాలేదు.ఇంక తనను తాను రక్షించుకునేదానికి,తనకు తెలిసిన మార్గం ఎన్నుకున్నాడు.అర్జునుడు పైకి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.అశ్వత్థామకు అంతా సగం సగం జ్ఞానము.అతనికి బ్రహ్మాస్త్రం ఉపయోగించడం తెలుసుకానీ,ఉపసంహరించడం తెలియదు.అది నిప్పులు చిమ్ముతూ అర్జునుడి పైకి రాసాగింది.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాడని అర్జునుడికి అర్థం కాలేదు.కానీ శ్రీకృష్ణుడికి అర్థం అయింది.వెంటనే అర్జునుడిని అప్రమత్తం చేసాడు.నీ పైకి వచ్చేది బ్రహ్మాస్త్రం.దానికి విరుగుడుగా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ఉపయోగించాలి.అప్పుడు అర్జునుడు మంత్రం చదివి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు.రెండూ ఢీకొన్నాయి.ఆ రాపిడికి పైకెగసిన మంటలు ముల్లోకాలూ భీతి చెందేలా చేసాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.అర్జునా!నీ బ్రహ్మాస్త్రంతో పాటు అశ్వత్థామ వదిలిన దానిని కూడా ఉపసంహరించు.ఎందుకంటే అతనికి ఉపసంహరించడం తెలియదు.అర్జునుడు అలాగే చేసాడు. అర్జునుడు మళ్ళీ అశ్వత్థామను వెంబడించాడు.పట్టుకుని,యాగపశువును తాళ్ళతో కట్టినట్లు కట్టి,బంథించి తమ శిబిరానికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు.శ్రీకృష్ణుడికి అశ్వత్థామను చూడగానే కోపం మిన్నంటింది.అర్జునుడితో ఇలా అన్నాడు.అర్జునా!ఈ క్రూరుడిని తప్పకుండా శిక్షించాలి.అసమర్థులను,అస్త్ర విద్య తెలియని వారును,ఎదిరించలేని వారును,బాలురను,నిద్రించుచున్న వారును అయిన ఉపపాండవులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడా?మహాపాపాత్ముడు!వీడికి పుట్టగతులు ఉండవు. ఇప్పుడేమో సిగ్గూ ఎగ్గూ లేకుండా,ప్రాణభీతితో వణుకుతూ,వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు,పరమ నీచుడు వీడు.వీడి పైన ఇసుమంతైనా దయా,జాలి చూపించాల్సిన అవసరము అస్సలు లేదు.అర్జునా!ఎవడైతే తన ప్రాణాలను రక్షించుకునేదానికోసం ఇతరుల ప్రాణాలు తీస్తాడో వాడు అత్యంత అథముడు.వాడు అథోలోకాలకు పోతాడు.వాడు చేసిన పాపాలు,అకృత్యాలకు రాజదండన అనుభవిస్తే కానీ ఉత్తమలోకాలు దక్కవు.ఇతనిని తక్షణమే శిక్షించు. అప్పుడు అర్జునుడు ధర్మం తెలిసినవాడుగా ఇలా అన్నాడు.బ్రాహ్మణుడు ఎంతటి మహాపాపాలు చేసినా,అతనిని చంపకూడదు కదా!అతనిని శిబిరానికి తీసుకుని వచ్చాడు.

Tuesday, 14 October 2025

అశ్వత్థామ ఘాతుకం

సూతుడు శౌనకాది మునులకు మాట ఇచ్చాడు.ఏమని?వారికి పరీక్షిత్తు మహారాజు వృత్తాంతము,పాండవుల మహా ప్రస్థానము మరియు శ్రీకృష్ణుని వృత్తాంతము చెబుతాను అని.ఇలా మొదలు పెట్టాడు అన్నట్టుగానే. మునులారా!కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో కౌరవ వీరులు అందరూ గతించారు.పాండవుల పక్షంనుంచి కూడా చాలా మంది విగతజీవులు అయ్యారు.భీముడు గదాఘాతం వలన దుర్యోధనుడి తొడలు విరిగి పోయాయి.విజయలక్ష్మి పాండవులను వరించింది. దుర్యోధనుడి దీన స్ధితి చూసి అశ్వత్థామ చాలా బాథ పడ్డాడు.దుర్యోధనుడికి సంతోషం కలగాలంటే ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు.అర్థరాత్రి వెళ్ళి,నిద్రలో ఉన్న ఉపపాండవులను దొంగచాటుగా చంపేసాడు.ఆ సమయంలో అందరూ నిద్రలు పోతున్నారు.అప్పుడు ఇలాంటి ఘాతుకం చేబట్టాడు ద్రోణ పుత్రుడు అయిన అశ్వత్థామ.విషయం అందరికీ తెలిసి పోయింది.ద్రౌపది దుంఖాన్ని ఆపేవారే లేకపోయారు.అంత హృదయవికారంగా రోదించింది. అప్పుడు అర్జునుడు ఆమె దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.నీవు శోకించవద్దు.నీవు రాజపుత్రివి.నీకు తగదు.అశ్వత్థామ కరుణ అనే మాట లేకుండా,నిద్రలో ఉండే బాలురను చంపాడు.నేను వెళ్ళి అతనిని చంపి,అతని తలను నీకు కానుకగా ఇస్తాను.నీవు నీ కసి,కోపం పోయేదాకా కాళ్ళతో అతని తలను తన్ను. కృష్ణుడు కూడా అదే సరైనది అని అన్నాడు.

Sunday, 12 October 2025

నారదుడు అస్ఖలిత బ్రహ్మచారి

నారదుడు ఇంకా ఇలా కొనసాగించాడు ఆ మునికి చెప్పడము. ఓ మునివర్యా!ఆ అశరీరవాణి మాటలు నన్ను చాలా సంతృప్తి పరచాయి.నాకు చాలా సంతోషం వేసింది.నేను వినమ్రతతో శిరసు వంచి ఆ అశరీర వాణికి దండ ప్రమాణాలు సమర్పించుకున్నాను.ఇంక అప్పటి నుండి కామక్రోథాలను వదలి పెట్టేశాను.ఆ భగవంతుని నామ జపంతోటే కాలము వెళ్ళ బుచ్చాను.అతని చరిత్రనే మననం చేసుకుంటూ ఉన్నాను.నిర్మల మయిన మనసుతో,ప్రశాంత చిత్తముతో నిరంతరమూ ఆ దేవదేవుడిని మనోఫలకం మీద ఉంచుకున్నాను.అతని మీదే బుద్ధి నిలిపి,ఏకాగ్ర చిత్తంతో కాలం గడపసాగాను.ఇంతలో నాకు మరణం సంభవించింది.నేను నా శరీరాన్ని వీడి శుద్ధ సత్త్వమయమైన భాగవత శరీరాన్ని పొందాను.అంతలో ప్రళయము సంభవించింది. శ్రీమన్నారాయణుడు సముద్రము మథ్యలో శయనించి ఉన్నాడు.అతని నాభి నుండి వచ్చిన కమలంలో బ్రహ్మ కానవచ్చాడు.బ్రహ్మ విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించబోయాడు.అతని నిశ్వాసతో పాటే నేను కూడా అతనిలోకి వెళ్ళిపోయాను.ఇలా వేయి యుగములు గడచిపోయాయి.బ్రహ్మకు మెలకువ వచ్చింది.ఇంక సృష్టి కార్యము మొదలు పెట్టాడు.ఆ బ్రహ్మ వలన మరీచి,ఇంకా చాలా మంది మునులు,నేను కూడా పుట్టాము. నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయినాను.మహావిష్ణువు కృపాకటాక్షము నా మీద ప్రసరించడం వలన ముల్లోకాలూ సంచరిస్తుంటాను.నన్ను ఎవరూ ఆపరు.ఎవరి ప్రమేయం లేకుండానే సప్త స్వరాలు పలికే మహతి వీణ ఈశ్వరుడు యొక్క అనుగ్రహము వలన నాకు దక్కింది.ఇంక ఆ వీణను మీటుతూ నారాయణుని కథలను గానం చేయటమే నా వృత్తి,ప్రవృత్తి. నేను ఈ గానం తన్మయత్వంతో చేస్తుంటే,నేను పిలిచినట్లుగా నా మనోఫలకం పైన ఆ భగవంతుడు కనిపిస్తాడు.నాకు విష్ణునామ సంకీర్తన వలన కలిగే మనశ్శాంతి,నాకు వేరే ఇంకేమి చేసినా దక్కదు.స్వయానా యముడుని నియంత్రించ గలిగే యోగము నేర్చుకుని ఉన్నా నాకు అంత మహదానందము దక్కదు.హే మునీంద్రా!ఇది స్వయానా నా అనుభవము.కాబట్టి నా ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను. ఆ మాటలు చెప్పి నారదుడు తన మహతి వీణను మీటుకుంటూ విష్ణు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి పోయాడు.

Friday, 10 October 2025

భగవంతుడి అనుగ్రహం

నారదుడు ఇలా కొనసాగించాడు.వ్యాసా!నేను అప్పుడు ఒక ఘోరారణ్యము మధ్యలో ఉన్నాను.అది అన్ని రకాల కృూరమృగాలకు పుట్టినిల్లు.అయినా నేను ఏ మాత్రమూ భయపడలేదు.నా ప్రయాణము సాగించాను.ఒకచోట వెదురు పొదలు,పూలతీగెలు కనిపించాయి.దగ్గరలో ఒక గుహ కూడా కానవచ్చింది.అక్కడే ఉన్న రావి చెట్టు దగ్గరకు పోయాను.అక్కడ పద్మాసనం వేసుకుని నా హృదయగతుడు,పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీహరి గురించి తపస్సు చేసాను.అలా దైవధ్యానంలో ఉన్న నా కళ్ళ వెంబడి నీరు కారాయి.అవి ఆనందాశ్రువులు.శరీరము జలదరించింది.ఆ భగవంతుడి పాదపద్మాలను ధ్యానించే క్రమంలో ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపము కనిపించింది.నేను ఆనందసాగరంలో ఓలలాడాను.ఆ తన్మయత్వం నేను వివరించనలవికాదు.నేను చూసింది అతనినే అనే స్పృహ లేదు.తటాలున లేచేసాను.మళ్ళీ మళ్ళీ ఆ దివ్యస్వరూపాన్ని చూడాలని తహ తహలాడాను.పిచ్చివాడిలాగా ఆ అడవి అంతా తిరిగాను.అప్పుడు నాకు ఈ మాటలు వినిపించాయి. నాయనా!ఎందుకు అంత దిగులు పడుతున్నావు?ఎందుకు తిండీ తిప్పలు లేకుండా శరీరాన్ని శుష్కింప చేస్తున్నావు?నీవు ఎంత విచారించినా,ఎంత ఏడ్చి గీ పెట్టినా ఈ జన్మకు ఇంక నన్ను చూడలేవు.ఎందుకంటే చెపుతాను,విను. కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము అనే అంతశ్శత్రువులు ఆరు ఉన్నాయి.వాటిని అన్నిటినీ జయించాలి.కర్మములను అన్నిటినీ నిర్మూలనము చేసుకోవాలి.అలాంటి పరిశుద్ధుడు అయిన యోగి తప్ప వేరే ఇంకెవరూ నన్ను చూడదాలరు.నీకోరిక తీర్చాలని నీకు నా నిజస్వరూపము చూపించాను.నీ కోరిక వృథా కాదు.అది నీహృదయములోని దోషాలను అన్నిటినీ పటాపంచలు చేస్తుంది.కానీ నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు.నా సేవ చేసుకుంటూ ఉండు.నీ భక్తి వృద్ధి అవుతుంది.నీ మనస్సు నా మీదే లగ్నము అయి ఉంటుంది సర్వదా.నీవు ఈ శరీరం విడిచి వేరే జన్మ ఎత్తుతావు.అప్పుడు నా భక్తులు అందరిలోకి గొప్పవాడివి అవుతావు.నాయనా!వత్సా!ఈ సృష్టి లయము పొంది వేయి యుగాలు గడుస్తాయి.తరువాత లోకమంతా అంధకార బంధుర మవుతుంది.మళ్ళీ సృష్టి మొదలు అవుతుంది.అప్పుడు నీవు ఎలాంటి దోషాలు లేకుండా జన్మాంతర స్మృతితో పుడతావు.నా దయాదృష్టి వలన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు.సాత్త్వికులలో అగ్రగణ్యుడువు అవుతావు.

Thursday, 9 October 2025

నారదుడి తల్లి మృతి

నారదుడిని వ్యాసుడు ఇంకా ఇంకా తన జన్మ వృత్తాంతము,విశేషాలు తెలుపమని ఇలా అడిగాడు.ఓ నారద మహర్షీ!నీకు ఆ మహనీయులు నారాయణ మంత్రము ఉపదేశించారు అని అన్నావు.దాని సహాయంతో విజ్ఞాన సముపార్జన చేసాను అన్నావు.బాగానే ఉంది.అసలు నీవు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు ఏమేమి చేసావు.నీవు దాసీ పుతృడవు కదా!ఆ దాస్యము ఎట్లా పోయింది?పూర్వజ్ఞానము అనేది అందరికీ అంత సులువుగా దక్కదు కదా!నీకెట్లా అబ్బింది?ఈ విషయాలు అన్నీ వివరంగా విశద పరిచేది. నారదుడు వ్యాసుడి తపనను అర్థం చేసుకున్నాడు.ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.వ్యాసా!నీకు చెప్పినట్లుగా నాకు యోగుల దయ వల్ల జ్ఞానము లభించింది.మా అమ్మకూడా మంచి జ్ఞానము గల శాంత మూర్తి.ఆమె తన యజమానుల ఇంటి పనులను శ్రద్ధగా చేస్తూ ఉండేది.భక్తి భావంతో ఒక యజ్ఞంలాగా నిష్టగా,నియమ బద్థంగా చేసేది.ఇంక ఆ పనిలో పడితే రాత్రి లేదు,పగలు లేదు.అయ్యో అలసిపోయాను,కొంచెం సేద దీరుతామనే స్పృహ ఉండేది కాదు.విసుగు,చీదర,చిరాకు అనేవి ఆమెకు అస్సలు తెలియదు.అలాగే ఒకరోజు రాత్రిపూట చీకటిలో పాలు పితికేదానికి పోయి,పామును తొక్కింది.పాముకు తన,మన అని ఉండగు కదా!అది దాని సహజగుణంతో కాటేసింది.పాము కాటుకు ఆమె మరణించింది.నాకు దిగులు,విచారము అనిపించలేదు.ఒకరకమైన నిర్వికారము,నిర్విచారములకు లోనైనాను.మాఅమ్మ ఆఇంట్లో పని చేసేది కాబట్టి అక్కడ ఇన్ని రోజులు ఉన్నాను.ఆమే లేనప్పుడు ఆ ఇంటితో నాకు ఇంక ఏ సంబంధం లేదు కదా!అందుకని ఆ ఇల్లు విడిచి ఉత్రదిక్కుగా నడచి వెళ్ళిపోయాను.ఎన్నో ఊళ్ళూ,ఇంకెన్నో పట్టణాలూ,గ్రామాలూ,ప్రాంతాలూ దాటుకుంటూ వెళ్ళాను.ఆకలి,దాహం పీడిస్తున్నాయి.దారిలో మంచి నీటితో ఉన్న నది కనిపించింది.అక్కడే స్నానము చేసి,దాహము తీర్చుకున్నాను.నా అలుపు,అలసట,ఆకలిదప్పులూ అన్నీ మాయమైపోయాయి.

Monday, 6 October 2025

నారదుడి పూర్వ జన్మ

నారదుడు ఇలా చెప్పసాగాడు.ఓ వ్యాస మునిపుంగవా!సంసారము అనేది మహా సముద్రం లాంటిది.కర్మవాంఛలు అనేవి అలలూ,ఆటూపోట్లు లాంటివి.మనిషి ఆ అల్లకల్లోలంతో వేదన చెందుతాడు.ఆ కష్టాలనుంచి విముక్తిని ఇచ్చే నావ ఈ విష్ణు గుణవర్ణనము.నేను నీకు నా పూర్వ జన్మ వృత్తాంతము గురించి చెబుతాను.నీకు బాగా అర్థం అవుతుంది ఈ విషయము.పూర్వ జన్మలో నేను ఒక దాసి కి పుట్టాను.ఆమె వేదాధ్యయనము చేసే సంపన్నుల ఇంట్లో పనులు చేసేది.ఒకసారి వాళ్ళు నన్ను వానాకాలము నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షలో ఉండే ఋషులకు సేవచేయమని పంపారు.నేను వారికి సేవలు చేసుకుంటూ ఉన్నాను.నేను వయసుకి బాలుడు అయినా తోటి పిల్లలతో ఆడుకునేదానికి పోకుండా ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటూ సేవలు చేసేవాడిని.వారు నన్ను,నా పనితనాన్ని చూసి ముచ్చట పడ్డారు. ఆ మునులు ఎప్పుడూ శ్రీమన్నారాయణుని చరిత్ర పారాయణం చేస్తూ ఉండేవారు.ఆ హరి సంకీర్తన నాచెవులకు చాలా ఇంపుగా ఉండేది.నేను కూడా వారితో కలసి ఎప్పడూ హరినామస్మరణచేస్తూ ఉండేవాడిని.వారు సంవాదనల సారము గ్రహించాను.శరీరము మాయా కల్పితము.సంసారము నిస్సారము. చాతుర్మాస దీక్షఅయిపోయింది.వారంతా తీర్థయాత్రలకు బయలుదేరారు.నా నడవడిక,హరిపై నా అనురక్తి గమనించారు.నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు.నేను భక్తి పారవశ్యముతో వాసుదేవ,ప్రద్యుమ్న,సంకర్షణ,అనిరుద్ధ అని జపించేవాడిని.భగవంతుడి దయవలన నాకు విజ్ఞానము సంప్రాప్తించింది.

Sunday, 5 October 2025

వ్యాస నారదుల సంవాదం

నారదుడికి వ్యాసుడు ఇలా సమాధానం ఇస్తున్నాడు.ఓ నారద మహర్షీ!నీవు బ్రహ్మ దేవుడి కుమారుడివి.మీ తండ్రి సమస్త సృష్టికి కర్త.నీవు ఎప్పుడూ నారాయణుని స్మరిస్తూ,ఆయన సన్నిథిలో కాలం వెళ్ళబుచ్చుతుంటావు.నీ ప్రబోధం అన్ని మూలలూ,దిక్కులూ వ్యాపించి ఉంది.సూర్యుడి గమనంతో సమానంగా నీవు కూడా మూడు లోకాలూ తిరుగుతుంటావు అలుపూ సొలుపూ లేకుండా!నీవు సర్వజ్ఞుడివి.కాబట్టి అందరి మనసులలో మెలగుతూ ఉంటావు.నీకు అన్ని ధర్మాలూ తెలుసు.నా అసంతృప్తి ఏందో,ఎందుకో నిజంగా నీకు తెలియదా?నా ఈ కలవరము,కలత చెప్పి,నా దిగులు,విచారము,మనస్తాపమూ అన్నీ తగ్గేలా చేసేది. వ్యాసుడికి నారదుడు ఇలా ఉత్తరము ఇచ్చాడు.ఓ మునిసత్తమా!నీవు మహాభారతాన్ని రచించావు.అది సర్వ ధర్మాలనూ వివరించింది.కానీ అందులో శ్రీ మహా విష్ణువు యొక్క కధలను చెప్పలేదు.ధర్మాలు,ధర్మసూక్ష్మాలు ఎన్ని చెప్పినా అది అసంపూర్ణమే.ఎందుకంటావా?విష్ణుమూర్తి గుణగణాలను కూడా కీర్తించాలి.ఆ మహావిష్ణువు యొక్క వర్ణనలు,ఆ మహానుభావుడి గుణగానాలు చేయలేదు కాబట్టే నీకు ఆ అసంతృప్తి కలుగుతున్నది.ఆయనను స్తుతించే కావ్యము,రచన బంగారు పద్మాలతో విరాజిల్లే మానస సరోవరం లాగా కళకళలాడుతూ శోభాయమానంగా విరాజిల్లుతుంది.శ్రీహరి నామాల స్తుతి,వర్ణనలు లేని కావ్యము ఎంత ఛందోబద్ధంగా,సుందరంగా ఉన్నా శోభావిహీనంగా ఉంటుంది.పేలవంగా,హృదయంలేని దానిలాగా తేలిపోతుంది.ఒక రకంగా చెప్పాలంటే బురదతో నిండిన నరకకూపంలాగా ఉంటుంది.ఊపిరి ఆడనట్లు ఉంటుంది.పదాలు,పదప్రయోగాలు దోషంతో ఉన్నా విష్ణువు కథలతో ఉంటేచాలు.మనసు,హృదయం ఉన్నట్లు కళకళలాడుతూ ఉంటుంది.అది సర్వ పాపాలను హరిస్తుంది.అంతర్గత శోభతో నిండి ఉంటుంది.ఎందుకంటే హరి భక్తి లేని చోట జ్ఞానవికాసానికి ఆస్కారం లేదు.ప్రతిఫలాక్ష లేకుండా చేసే ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోవాలి.అలా చేయకపోతే దానికి విలువ ఉండదు.భక్తి లేని కర్మ,జ్ఞానములకు అర్థము లేదు.అవి ముమ్మాటికీ నిరర్థకాలే.వ్యాస మహర్షీ!నీవు మహానుభావుడివి.గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడివి.సత్య సంధుడివి.నీవు అన్ని బంధాలనుంచి విముక్తి పొందాలంటే వాసుదేవుని లీలామానుష విశేషాల గురించి ఏకరువు పెట్టు.భక్తి ప్రపత్తులతో ఆ దైవకార్యం నిర్వర్తించు.అన్నీ తెలిసిన వాడు హరి సేవకు నడుము బిగించాలి.కష్టాలు,నష్టాలు,సుఖదుఃఖాలు అనేవి వస్తుంటాయి,పోతుంటాయి.వాటిని చూసి భయపడకూడదు.ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా హరిని,హరి సేవను వదలకూడదు.హరి సేవ చేసుకునేవాడు సంసారము చేస్తున్నా,మానసికంగా ఆ జంఝాటంలో పడడు.తామరాకు మీద నీటి బొట్టు చందాన అంటీ అంటనట్లు ఉండగలడు.హరినామ స్మరణ జీవిత పరమావధిగా పెట్టుకుంటాడు.అతనికి అంతా విష్ణుమయంగానే ఉంటుంది.హరి అనేవాడు పుణ్యమూర్తి.అతని ఆశ్రయంలో,ఆధీనంలో అంతా మంచే జరుగుతుంది.కోరినవన్నీ దక్కుతాయి.

గీతా గంగా చ గాయత్రీ…గీత పేర్లు

గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ। బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహినీ॥ అర్థమాత్రా చిదానందా భవఘ్నీ భ్రాంతినాశినీ। వేదత్రయీ పరాఽనంతా తత్వార్థ జ్ఞానమంజరీ॥ ఇత్యేతాని జపేన్నిత్యం నరో నిశ్చల మానసః। జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాన్తే పరమం పదమ్॥ గీతకు మొత్తం పద్దెనిమిది పేర్లు ఉన్నాయి.అవి.... గీత గంగ గాయత్రీ సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్థమాత్ర చిదానంద భవఘ్ని భ్రాంతినాశిని వేదత్రయి పర అనంత తత్త్వార్థ జ్ఞానమంజరి. ఈ పేర్లను,ఈ గీత యొక్క నామాలను ఎవరు నిశ్చలమయిన మనసుతో సతతం జపిస్తూ ఉంటాడో,అతనికి త్వరితగతిని జ్ఞానము సమకూరుతుంది.జ్ఞానసముపార్జన వలన సునాయాసంగా పరమాత్మ యొక్క సన్నిధానము,ఆ పరమ పవిత్రమయిన పరమ పదము దక్కుతుంది.

Wednesday, 1 October 2025

నారదుడు అక్కడకు వచ్చాడు

వ్యాసుడు దిగులు పడుతున్నాడు.అక్కడకు నారదుడు వచ్చాడు.ఆయన ఎప్పుడూ మహతీ వీణను వాయించికుంటూ,నారాయణ స్మరణ అనునిత్యం చేసుకుంటూ తిరుగుతుంటాడు కదా!నిజంగా మహానుభావుడు!వ్యాసుడు నారదుడి రాకను దూరంనుంచి చూసాడు.ఆనందంగా,ఆదరంగా ఆయనకు ఎదురు వెళ్ళాడు.సంతోషంగా ఆయనను తీసుకుని వచ్చి,అర్ఘ్యపాద్యాలతో సత్కరించుకున్నాడు.నారదుడికి వ్యాసుడిని చూడగానే అర్థమయిపోయింది ఎందుకో ఎడతెరిపి లేకుండా దిగులు పడుతున్నాడని.నారదుడు ఆప్యాయంగా,అనునయంగా వ్యాసుడితో ఇలా మాటలాడటం మొదలు పెట్టాడు.ఓ మహర్షీ!నువ్వు చిన్నా చితకా వాడివి కాదు.వేదాలను విభజించిన ప్రతిభాపాటవాలు ఉన్న వాడివి.భారతము అంటే పంచమ వేదము అంటారు.ఆ మహాకావ్యాన్నే రచించావు.కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే సునాయాసంగా జయించావు.నీకు బ్రహ్మతత్త్వము తెలుసు.మునులుకు,యోగులకు,సాథువులకు నాయకుడివి.ఇన్ని గొప్ప గుణాలు ఉన్న నీకు దిగులుకు కారణం ఏంది?ఎందుకు అంత బేలగా,పిరికివాడిలాగా దిగులు విచారంలో మునిగి ఉన్నావు?