Thursday, 16 October 2025

బ్రహ్మాస్త్రము ప్రయోగము

అర్జునుడు శ్రీకృష్ణుడు రథ సారథిగా బయలుదేరాడు.శస్త్రాస్త్రములు అన్నిటినీ తీసుకుని రథముపై అశ్వత్థామను వెంబడించాడు.అశ్వత్థామ తన పిక్కబలం అంతా చూపించి పరుగెత్తాడు.కానీ అర్జునుడిని తప్పించుకుని,పారిపోవటం చేతకాలేదు.ఇంక తనను తాను రక్షించుకునేదానికి,తనకు తెలిసిన మార్గం ఎన్నుకున్నాడు.అర్జునుడు పైకి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.అశ్వత్థామకు అంతా సగం సగం జ్ఞానము.అతనికి బ్రహ్మాస్త్రం ఉపయోగించడం తెలుసుకానీ,ఉపసంహరించడం తెలియదు.అది నిప్పులు చిమ్ముతూ అర్జునుడి పైకి రాసాగింది.అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాడని అర్జునుడికి అర్థం కాలేదు.కానీ శ్రీకృష్ణుడికి అర్థం అయింది.వెంటనే అర్జునుడిని అప్రమత్తం చేసాడు.నీ పైకి వచ్చేది బ్రహ్మాస్త్రం.దానికి విరుగుడుగా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ఉపయోగించాలి.అప్పుడు అర్జునుడు మంత్రం చదివి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు.రెండూ ఢీకొన్నాయి.ఆ రాపిడికి పైకెగసిన మంటలు ముల్లోకాలూ భీతి చెందేలా చేసాయి. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.అర్జునా!నీ బ్రహ్మాస్త్రంతో పాటు అశ్వత్థామ వదిలిన దానిని కూడా ఉపసంహరించు.ఎందుకంటే అతనికి ఉపసంహరించడం తెలియదు.అర్జునుడు అలాగే చేసాడు. అర్జునుడు మళ్ళీ అశ్వత్థామను వెంబడించాడు.పట్టుకుని,యాగపశువును తాళ్ళతో కట్టినట్లు కట్టి,బంథించి తమ శిబిరానికి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు.శ్రీకృష్ణుడికి అశ్వత్థామను చూడగానే కోపం మిన్నంటింది.అర్జునుడితో ఇలా అన్నాడు.అర్జునా!ఈ క్రూరుడిని తప్పకుండా శిక్షించాలి.అసమర్థులను,అస్త్ర విద్య తెలియని వారును,ఎదిరించలేని వారును,బాలురను,నిద్రించుచున్న వారును అయిన ఉపపాండవులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నవాడు బ్రాహ్మణుడా?మహాపాపాత్ముడు!వీడికి పుట్టగతులు ఉండవు. ఇప్పుడేమో సిగ్గూ ఎగ్గూ లేకుండా,ప్రాణభీతితో వణుకుతూ,వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు,పరమ నీచుడు వీడు.వీడి పైన ఇసుమంతైనా దయా,జాలి చూపించాల్సిన అవసరము అస్సలు లేదు.అర్జునా!ఎవడైతే తన ప్రాణాలను రక్షించుకునేదానికోసం ఇతరుల ప్రాణాలు తీస్తాడో వాడు అత్యంత అథముడు.వాడు అథోలోకాలకు పోతాడు.వాడు చేసిన పాపాలు,అకృత్యాలకు రాజదండన అనుభవిస్తే కానీ ఉత్తమలోకాలు దక్కవు.ఇతనిని తక్షణమే శిక్షించు. అప్పుడు అర్జునుడు ధర్మం తెలిసినవాడుగా ఇలా అన్నాడు.బ్రాహ్మణుడు ఎంతటి మహాపాపాలు చేసినా,అతనిని చంపకూడదు కదా!అతనిని శిబిరానికి తీసుకుని వచ్చాడు.

No comments:

Post a Comment