Sunday, 26 October 2025
విష్ణురాతుడి జాతకము
అభిమన్యుడికి కొడుకు పుట్టాడు.ఆ ఆనందంలో ధర్మరాజు బ్రాహ్మణులకు గోదానము,భూదానము,హిరణ్యదానము..।ఇలా చాలా రకాల దానాలు చేశాడు.వారుకూడా బాలుడిని,పాండవ వంశాన్నీ కీర్తించారు,ఆశీర్వదించారు.వంశము అంతరించకుండా శ్రీమహా విష్ణువు కాపాడాడు కాబట్టి,ఆ బిడ్డకు విష్ణురాతుడు అని నామకరణం చేసారు.శత్రువులను నాశనం చేస్తాడని దీవించారు.
దానికి ధర్మరాజు ఇలా అడిగాడు.ఓ బ్రాహ్మణోత్తములారా!నా మాట వినండి.మా వంశములో పెద్దలు అందరూ పుణ్యాత్ములు.గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించారు.దయాశీలురుగా ఉన్నారు.రాజర్షులు అయ్యారు.ఈ చిన్నారి కూడా అలాగే హరి భక్తుడు అవుతాడా?
దానికి బ్రాహ్మణులు ముక్త కంఠంతో చెప్పారు.రాజా!నీవు ఎలాంటి దిగులూ పెట్టుకోనక్కరలేదు.నీ మనవడు ఇక్ష్వాకువు లాగా ప్రజలను రక్షిస్తాడు.శ్రీరామచంద్రుడి లాగా సత్య ప్రతిజ్ఞుడు అవుతాడు.శిబి చక్రవర్తి లాగా శరణాగత రక్షకుడు అవుతాడు.దుష్యంతుడి పుత్రుడు భరతుడు లాగా బంథువర్గానికి అంతా కీర్తి కలిగిస్తాడు.తాత అర్జునుడులాగా,కార్తవీర్యునిలాగా గొప్ప ధనుర్థరుడు అవుతాడు.సూర్యడిలాగా ప్రతాపశాలి అవుతాడు.వాసుదేవుడు లాగా సర్వభూతములకు హితుడు అవుతాడు.అశ్వమేథ యాగాలు చేస్తాడు.ఇతని పుత్రులుకూడా ఇతనిలాగే గొప్పవాళ్ళు అవుతారు.అందులో ఢోకా లేదు.ఇతను చాలా ఏళ్ళు బ్రతుకుతాడు.
ఇతనికి బ్రాహ్మణ శాపం ఉంది. దాని కారణంగా తక్షకుడు అనే విషము వల్ల ప్రాణ గండము ఉంది. అది అతను ముందే తెలుసుకుంటాడు.మరణం తధ్యం అని తెలుసుకుని భగవంతుని సేవిస్తాడు.శుక మహర్షి అనుగ్రహంతో ఆత్మజ్ఞానము పొందుతాడు.గంగా తీరములో దేహమును విడచి పుణ్యలోకాలకు పయనమవుతాడు.
విష్ణురాతుడు తన తల్లి గర్భములో ఉన్నప్పుడు భగవంతుడిని చూసాడు కదా?ఆ భగవంతుడు లోకమంతా ఉన్నాడు అని ఎప్పుడూ పరీక్షించేవాడు.అందుకని అతనికి పరీక్షిత్తు అనే పేరు కూడా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment