Friday, 10 October 2025
భగవంతుడి అనుగ్రహం
నారదుడు ఇలా కొనసాగించాడు.వ్యాసా!నేను అప్పుడు ఒక ఘోరారణ్యము మధ్యలో ఉన్నాను.అది అన్ని రకాల కృూరమృగాలకు పుట్టినిల్లు.అయినా నేను ఏ మాత్రమూ భయపడలేదు.నా ప్రయాణము సాగించాను.ఒకచోట వెదురు పొదలు,పూలతీగెలు కనిపించాయి.దగ్గరలో ఒక గుహ కూడా కానవచ్చింది.అక్కడే ఉన్న రావి చెట్టు దగ్గరకు పోయాను.అక్కడ పద్మాసనం వేసుకుని నా హృదయగతుడు,పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీహరి గురించి తపస్సు చేసాను.అలా దైవధ్యానంలో ఉన్న నా కళ్ళ వెంబడి నీరు కారాయి.అవి ఆనందాశ్రువులు.శరీరము జలదరించింది.ఆ భగవంతుడి పాదపద్మాలను ధ్యానించే క్రమంలో ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపము కనిపించింది.నేను ఆనందసాగరంలో ఓలలాడాను.ఆ తన్మయత్వం నేను వివరించనలవికాదు.నేను చూసింది అతనినే అనే స్పృహ లేదు.తటాలున లేచేసాను.మళ్ళీ మళ్ళీ ఆ దివ్యస్వరూపాన్ని చూడాలని తహ తహలాడాను.పిచ్చివాడిలాగా ఆ అడవి అంతా తిరిగాను.అప్పుడు నాకు ఈ మాటలు వినిపించాయి.
నాయనా!ఎందుకు అంత దిగులు పడుతున్నావు?ఎందుకు తిండీ తిప్పలు లేకుండా శరీరాన్ని శుష్కింప చేస్తున్నావు?నీవు ఎంత విచారించినా,ఎంత ఏడ్చి గీ పెట్టినా ఈ జన్మకు ఇంక నన్ను చూడలేవు.ఎందుకంటే చెపుతాను,విను.
కామ,క్రోధ,లోభ,మద,మోహ,మాత్సర్యము అనే అంతశ్శత్రువులు ఆరు ఉన్నాయి.వాటిని అన్నిటినీ జయించాలి.కర్మములను అన్నిటినీ నిర్మూలనము చేసుకోవాలి.అలాంటి పరిశుద్ధుడు అయిన యోగి తప్ప వేరే ఇంకెవరూ నన్ను చూడదాలరు.నీకోరిక తీర్చాలని నీకు నా నిజస్వరూపము చూపించాను.నీ కోరిక వృథా కాదు.అది నీహృదయములోని దోషాలను అన్నిటినీ పటాపంచలు చేస్తుంది.కానీ నీ కోరిక ఈ జన్మలో నెరవేరదు.నా సేవ చేసుకుంటూ ఉండు.నీ భక్తి వృద్ధి అవుతుంది.నీ మనస్సు నా మీదే లగ్నము అయి ఉంటుంది సర్వదా.నీవు ఈ శరీరం విడిచి వేరే జన్మ ఎత్తుతావు.అప్పుడు నా భక్తులు అందరిలోకి గొప్పవాడివి అవుతావు.నాయనా!వత్సా!ఈ సృష్టి లయము పొంది వేయి యుగాలు గడుస్తాయి.తరువాత లోకమంతా అంధకార బంధుర మవుతుంది.మళ్ళీ సృష్టి మొదలు అవుతుంది.అప్పుడు నీవు ఎలాంటి దోషాలు లేకుండా జన్మాంతర స్మృతితో పుడతావు.నా దయాదృష్టి వలన బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు.సాత్త్వికులలో అగ్రగణ్యుడువు అవుతావు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment