Saturday, 28 February 2026

అయినవాళ్ళ యోగక్షేమాలు అడిగిన విదురుడు

ఉద్ధవుడిని చూడగానే విదురుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది.వడివడిగా వెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు.కుశల ప్రశ్నలు అడిగాడు.ఇంక నెమ్మదిగా మిగిలిన వారి కుశలం కనుక్కోవడం మొదలు పెట్టాడు.ఎవరికైనా తనా మనా ఉండడం సహజమే కదా! ఉద్ధవా!పుణ్యాత్ములు,శ్రీహరి భక్తులు,శత్రుమర్దనులు అయిన కుంతీ పుత్రులు క్షేమంగా ఉన్నారు కదా!బ్రహ్మ శ్రీహరిని ప్రార్థిస్తే అతడు బలరామ కృష్ణులు లాగా జన్మించారు కదా!వారిరువురూ క్షేమమే కదా!వసుదేవుడు,రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు,సాంబుడు,ఉగ్రసేనుడు,అక్రూరుడు,సాత్యకీ,దేవకీదేవి అందరూ కుశలమే గదా!వాసుదేవుడు,సంకర్షణుడు,అనిరుద్థుడు,చారుదేష్ణగాదులు సంతోషంగా ఉన్నారు కదా?శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిల సంతానం పదిమంది.వారిలో చారుదేష్ణ,సుదేష్ణ,చారుదేహ,చారుగుప్త అనువారు ముఖ్యులు.పాండవులూ అయిదుగురూ,కుంతీదేవి కుశలమే గదా?ధృతరాష్ట్రుడు క్షేమమే గదా?అతని కొడుకులు నవ్ను సభనుంచి తరిమివేయునపుడు నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండెను.అప్పుడు నాకు కలిగిన చిత్త క్షోభ అంతా ఇంతా కాదు.దానికి కారణమయిన అతడు తప్పకుండా నరకం ఊచలు లెక్కబెడతాడు. నీకు ఆశ్చర్యమనిపిస్తుందేమో?విదురుడు చాలా సౌమ్యుడు కదా!కోపతాపలకు అసలు చోటివ్వడు కదా!శాంతానికి మారు పేరు కదా!మరి ఇతనికి ఏంది?ఇంత కోపమేంది?ఇంత దుఃఖమేంది?అని.భగవంతుని మాయ వలన నాకు మోహము కలగకుండా ఉంటుందా?ఆ భగవంతుడే మానవరూపము దాల్చి ధర్మబద్ధులు అయిన పాండవుల పక్షాన నిలిచాడు.వాళ్ళకోసం రాయబారం చేసాడు.అప్పుడు దుష్ట దుర్యోధనాదులు ఏమి చేసారు?ఆ దేవతామూర్తిని పట్టి బంథించే దానికి ప్రయత్నం చేసారు.అతను తిరిగి వాళ్ళను ఏమీ చేయలేడని వారి థీమా.యుద్ధంలో వాళ్ళను నామరూపాలు లేకుండా చెయ్యాలనే ఆ సభలో శ్రీకృష్ణుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాడు.వాళ్ళ దుర్భాషలన్నిటినీ మౌనంగా భరించాడు.ఆ లీలా మానుష విగ్రహుడు,ఆ పరంథామ,ఆ శ్రీకృష్ణుడు తన అగ్రజుడు అయిన బలరాముడుతో కలిసి సంతోషంగా ఉన్నాడు కదా? విదురుడు శర పరంపరలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వేశాడు.

Wednesday, 25 February 2026

విదురుడికి అవమానము

విదురుడు ధృతరాష్ట్రుడికి హితము చెప్పడం దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు.కోపం నషాళానికి అంటింది.కర్ణుడు,శకుని,దుశ్శాసనుల వైపు చూస్తూ ఇలా అన్నాడు.విదురుడు దాసీ పుత్రుడు.ఇతనికి,ఇతని మాటలకు ఇంత ప్రాముఖ్యత, గౌరవము ఇవ్వాల్సిన పని లేదు.అసలు ఎవరు రానిచ్చారు అతనిని ఈ సమావేశానికి?మర్యాద నిలబెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు అవాకులు,చెవాకులు పేలుతున్నాడు.ఇతనిని ఉపేక్షించాల్సిన అవసరము మనకు ఏమాత్రమూ లేదు.ముందర వీడిని తరిమివేయండి అంటూ హుకుం జారీ చేసాడు. పెద్దా,చిన్నా అనే తారతమ్యము లేకుండా తండ్రి అంతటి వాడిని అలా అవమానకరంగా మాట్లాడటంతో విదురుడు నిర్ఘాంతపోయాడు.ఆ తరువాత కుమిలిపోయాడు.మనసుకు చాలా కష్టం వేసింది.సమాథానము చెప్పకుండా,మౌనంగా,కోపం దిగమింగుకుని,విల్లమ్ములను అక్కడే వదలి పెట్టేసి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు. అతను పవిత్రములయిన విష్ణు క్షేత్రాలను సందర్శించాడు.గంగ మున్నగు పుణ్య నదులలో స్నానం చేసాడు.సిద్థాశ్రమాలను సందర్శించాడు.ఋషుల ఆశ్రమాలకు వెళ్ళాడు.కూరలు కాయలను నీటిని మటుకు ఆహారంగా స్వీకరిస్తూ అవధూత వేషము ధరించి తిరగసాగాడు. ఆ సమయంలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది.కౌరవులు కొట్టుకుపోయారు,కాటికి పోయారు.విదురుడికి ఈ వార్త తను ప్రభాస తీర్థంలో ఉండేటప్పుడు తెలిసింది.ఎంతైనా అందరూ తన వాళ్ళే కదా!చాలా దుఃఖించాడు.ఇంక అక్కడ కుదురుగా ఉండ లేక పోయాడు.పోయి సరస్వతీ నదిలో స్నానము చేసాడు.పృథు,భార్గవాది తీర్థాలలో స్నానాలు చేసాడు.పవిత్రమయిన ప్రదేశాలు అన్నీ చూసుకుంటూ మత్స్య,కురు,జాంగల దేశాలు దాటాడు.యమునా నదీ తీరానికి చేరాడు.అక్కడ అతనికి ఉద్ధవుడు కనిపించాడు.ఉద్ధవుడు సకల సద్గుణశీలి.పరమ భాగవతోత్తముడు.

Tuesday, 24 February 2026

దుర్యోధనుడి దుష్ట బుద్ధి—విదురుడు వివరణ

తండ్రికేమో పక్షపాతము,సంకుచిత స్వభావము.కొడుకేమో దుందుడుకు,దుష్ట బుద్ధి.ఇంక వాళ్ళను ఎవరైనా పట్టగలరా? దుర్యోధనుడు మాయా జూదములో పాండవులను అడవులకు పంపాడు.రాజ్యాన్ని అపహరించాడు.ధర్మం కోసరము పాండవులు అరణ్య వాసము,అజ్ఞాత వాసము చేసి వచ్చి రాజ్యము అడిగినా ససేమిరా అన్నాడు.ఇంక పాండవులకు పాలుపోలేదు.శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు.శ్రీకృష్ణుడు సరే అని వారి తరఫున రాయబారానికి వెళ్ళాడు.ధృతరాష్ట్రునికి కృష్ణుడు శత విథాలా చెప్పిచూసాడు.మాత్సర్యము వద్దు,తగదు.కౌరవులు,పాండవులు...ఇద్దరూ నీకు సమానమే!తమ్ముడి బిడ్డలకు అన్యాయము చేయవద్దు.రాజ్యము ఇద్దరికీ సమానంగా పంచి పెట్టు అని సలహా ఇచ్చాడు. ఇలా అసలు విషయం ముందరకు జరగడం లేదని కృష్ణుడు గ్రహించాడు.విదురుడిని పిలిపించాడు. విదురుడు విషయం అర్థం చేసుకున్నాడు.ధృతరాష్ట్రునికి హితవు చెప్పాడు. కౌరవరాజా!ధృతరాష్ట్రా!పాండురాజు ఎవరో కాదు.నీ సొంత తమ్ముడు.అతని బిడ్డలను కాపాడడం నీ ధర్మము.అది న్యాయ సమ్మతము కూడానూ.నీవు అలా చేసావంటే నీ వంశము వృద్ధి చెందుతుంది.మీరందరూ సకల సుఖాలూ,సమస్త భోగాలూ అనుభవించగలరు.ఇద్దరూ కలిసి కట్టుగా ఉంటే శత్రు రాజులు మీ వైపు కన్నెత్తి చూసేదానికి కూడా భయపడతారు.శ్రీకృష్ణుడు తన మాటకు మీరు విలువ ఇచ్చారని సంతోషిస్తాడు.మీకు మేలు చేస్తాడు. అట్లా కాదంటే కౌరవులు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుంది నాకు,తలచుకుంటేనే! అటు చూస్తే ఏమో,భీముడు కాలు త్రొక్కిన పాములాగ కస్సుమని కాటేసేదానికి సిద్థంగా ఉన్నాడు.నేను ఈ విషయం చాలా సార్లు మొత్తుకున్నాను.నీ కొడుకులకు అతని వల్లే గండం!నీ వాళ్ళందరూ అతని చేతిలో పిట్టల్లాగ రాలిపోతారు.ఇది ఖాయం! నువ్వు ఇంకా అమాయకంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది.నాకేమి?నా కొడుకులు వీరులు,శూరులు,విక్రమార్కులు అని భ్రమిస్తున్నట్లున్నావు.నీ కొడుకుల శౌర్యము,భీష్మ,ద్రోణ,కృపాచార్యుల అండ దండలు ఉన్నాయని విర్రవీగుతున్నావేమో?కర్ణుడి ఆర్భాటాలు,ప్రగల్భాలూ నిజమని మురిసి పోతున్నావేమో?ఇక్కడ ఎంత మంది దిగ్గజాలు ఉన్నా,ఆ తట్టు శ్రీకృష్ణుడు ఉన్నాడు.ఒక్కడు చాలు ఒంటి చేత్తో పాండవులను విజయమార్గంలో నడిపించేదానికి.ఈ నిజాన్ని కలలో కూడా నువ్వు మరవవద్దు. కాబట్టి మర్యాదగా పాండవులకు దక్కాల్సిన రాజ్యం వారికి ఇచ్చేయి.అట్లా చేస్తే నీ సంతానమూ,నీ బంథుజనము ప్రాణాలతో ఊపిరి తీసుకుంటారు.అట్లా కాకుండా లోభి,కంటకుడు,దుష్టుడు అయిన సుయోధనుడి మాటలు వింటే ఇంక ఇంతే సంగతులు,చిత్తగించవలెను అవుతుంది.ఒకరి మూర్ఖపు పట్టుదల కోసరము వంశాన్ని నాశనం చేసుకుంటావో,సుయోధనుని మాట ప్రక్కన పెడతావో,నీవే తేల్చుకో!

Friday, 20 February 2026

ధృతరాష్ట్రుని సంకుచితము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పడం మొదలు పెట్టాడు.రాజా!ధృతరాష్ట్రుడికి చాలా మంది పిల్లలు పుట్టారు కదా!వారిని ధృతరాష్ట్రుడు బహు ప్రేమతో పెంచుకుంటూ ఉన్నాడు.ఇంతలో తన తమ్ముడు,పాండురాజు నిధనుడయినాడు.అప్పటికి అతని బిడ్డలు కూడా చిన్నవాళ్ళే.మాద్రి సతీసహగమనం చేయడంతో,కుంతీదేవి పిల్లల నందరినీ తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చింది.అందరూ కలిసి పెరగసాగారు.ఐక్యమత్యంతో కాదు.అసహనం,అసూయలతో. ముఖ్యంగా దుర్యోధనుడికి అతని తమ్ములకు పాండవుల పైన అసూయ కలిగింది.వారు జన్మతః కృూర స్వభావులు.కాబట్టి పాండవులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.ఒకసారి విషపు అన్నము పెట్టి చంపబోయారు.ఇంకొక సారి త్రాళ్ళతో కట్టి గంగానదిలో పడవేసారు.కొంచెం పెద్దయిన తరువాత ధర్మం తప్పి రాజ్యము నుండి వెడలగొట్టారు.ఇట్లా ఒకటా రెండా!చాలా సార్లు పాండవులను ఇబ్బందుల పాలు చేసారు.పాండవులు నిద్రించే సమయములో లక్క గృహానికి నిప్పు అంటించి పాండవులను తుదముట్టించాలని ప్రయత్నము చేసారు.దేవుని దయ వలన అది సఫలము కాలేదు. వాళ్ళ అకృత్యాలకు పరాకాష్ట వారు ద్రౌపదీ దేవిని ఏకవస్త్రగా ఉన్న సమయంలో కొప్పు పట్టిలాగుతూ సభలోకి ఈడ్చుకుని రావడం.వారి నాశనానికి ఇదే నాంది అయింది. ధృతరాష్ట్రుడికి కళ్ళులేని గ్రుడ్డితనమే కాదు,మానసికంగా కూడా అంథుడే.పుత్రప్రేమతో తన బిడ్డల తప్పులను సరిదిద్దలేదు కదా.కనీసం ఎత్తిచూపనైనా లేదు.వారి ప్రతి ఆగడం వెనుక అతని మౌనమయిన అర్థంగీకారము నిబిడీకృతమయి ఉన్నది.

Tuesday, 17 February 2026

తృతీయ స్కంధము…విదురుని యాత్ర

పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశము చేసేదానికి సంసిద్ధుడు అయినాడు.అతనితో శుక మహర్షి ఇలా చెప్పాడు.పరీక్షిత్తు మహారాజా!పాండవులు యుద్ధము లో కౌరవులను ఓడించారు.ఆ రాజ్య సంపద స్వీకరించి,రాజ్యమును సుశ్యామలంగా పాలించుతూ ఉన్నారు.అప్పుడు విదురుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. దారిలో ఒక వనములో అతనికి మహా తపశ్శాలి అయిన మైత్రేయ మహర్షి కానవచ్చాడు.విదురుడు నేరుగా ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి,ఆయన ఆశీస్సులు పొందాడు.చిన్నగా ఆయనతో తన మనసులో మాట బయట పెట్టాడు.మహాత్మా!నా కొక సందేహము కలిగినది.దయయుంచి నా సందేహము తీర్చవలెను అని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణుడు భగవంతుడు అని మన అందరికీ తెలుసు.పాండవులు మంచి వారు కావున వారికి సహాయము చెయ్యాలనుకున్నాడు.సహజమే!వారి రాయబారిగా దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు కదా.దుర్యోధనుడు ఎంత బ్రతిమిలాడినా వారి దగ్గర భుజించలేదు.కానీ మా ఇంటికి వచ్చి మా సేవలు అంది పుచ్చుకుని,మా ఇంట భోంచేసాడు.దీనికి కారణము ఏంది?నాకు తెలిపేది. పరీక్షిత్తుకు ఆదుర్దా ఎక్కువ అన్నిటినీ తెలుసుకోవాలని.శుకుడు చెప్పబోతుండగానే గబగబా ఇలా అడిగాడు.మహాత్మా!విదురుడు మైత్రేయుడిని ఇంకా ఏమేమి రహస్యాలు అడిగాడు?ఆ ముని వాటన్నిటికీ ఏమి సమాథానాలు తెప్పాడు?విదురుడు తీర్థ యాత్రలకు వెళ్ళాడు అన్నారు కదా!ఏ ఏ స్థలాలూ,ప్రదేశాలు చూసాడు?నాకు అన్నీ పూస గుచ్చినట్లుగా,వివరంగా,విపులంగా చెప్పాలి అని ప్రార్థించాడు.

Monday, 16 February 2026

సూతుడు,శౌనకుడు సంవాదము

శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు తేలిక అయిన భాషలో సర్గ విసర్గాదులు మరియు ఆశ్రయము గురించి వివరించాడు.ఇప్పుడు అంతా టూకీగా చెప్పాడు.ఇంక సవివరంగా చెబుతాను అని సెలవిచ్చాడు. ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మునులకు తెలిపాడు.అప్పుడు శౌనకుడు సూత మహర్షిని అడిగాడు.ఓ మునిసత్తమా!భాగవతోత్తముడు అయిన విదురుడు తీర్థయాత్రలకు పోయాడన్నారు కదా.అక్కడ అన్ని పుణ్య క్షేత్రములు సందర్శించాడు కదా.అటు పిమ్మట తిరిగి వచ్చాడు అన్నారు.అప్పుడు మైత్రేయుని వలన ఆధ్యాత్మ బోథను పొందాడు అని ఉటంకించారు.ఆ విషయాలు అన్నీ వివరంగా తెలుసుకోవాలని మా అందరి మనసులూ ఉవ్విళ్ళూరుతున్నాయి.మా కోరిక మన్నించి అవన్నీ మాకు విశదీకరించేది. శౌనకుడి మాటలకు సూతుడు చిన్నగా మందహాసం చేసాడు.ఇలా అన్నాడు.శౌనకా!మీరు ఇప్పుడు నన్ను అడిగారు కదా!అచ్ఛం ఇలానే మునుపు పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని బ్రతిమలాడాడు.అప్పుడు ఎట్లయితే శుకుడు అతనికి చెప్పాడో,అచ్ఛం అలానే నేను కూడా ఆ వృత్తాంతము అంతా సవివరంగా మీకు చెబుతాను.

Sunday, 15 February 2026

ఆశ్రయము,సృష్టి

శుక మహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు.ఉత్పత్తి,స్థితి,లయము అనే మూడూ ఎక్కడ పుడుతూ వెల్లడి అవుతాయో అదే ఆశ్రయము.పరమాత్మ అన్నా అదే.బ్రహ్మ అన్నా అదే.ఆత్మ ఆధ్యాత్మికము,ఆధిదైవికము,ఆధిభౌతికము అని మూడు రకములు.ఆధ్యాత్మికము అనునది చక్షురాది గోళకములకు అంతర్వర్తియై ఉంటుంది.చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుడే ఆధి దైవికము.చక్షురాద్యధిష్టానాభిమాన దేవతయై సూర్యాదితేజోవిగ్రహుడగుచూ,ఎవ్వనియందు ఈ రెండు విభాగములు కలుగుతాయో అతడు ఆధి భౌతికుడు.ఆ ఆధిభౌతికుడే విరాట్ పురుషుడు.ద్రష్ట,దృక్కు,దృశ్యము...ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఏమీ కానరాదు.కనిపించదు.ఈ మూడింటి గురించి ఎవ్వరికి క్షుణ్ణంగా తెలుసో,అతనే పరమాత్మ.అతనే సర్వాంతర్యామి.సర్వలోకాలకూ,ప్రాణులకూ ఆశ్రయము ఇచ్చిన దాత. ఆ జగద్రక్షకుడూ,జగద్వ్యాపకుడూ విలాసము కొరకు సృజింపదలచాడు.తనకు ఎక్కడ,ఎలా సుఖంగా ఉంటుందో పరికించాడు.ముందర జలమును సృజించాడు.అది మహా సముద్రము రూపములో నున్న జలరాశి అయింది.ఆ జలరాశిలో అతను శయనించాడు.జలములకు నారములు అని ఇంకో పేరు ఉంది.ఆ నారములు పరమాత్మ వాసస్థాన మగుటచే అతనికి నారాయణుడు అనే పేరు వచ్చింది. అతని సృజన కారణంగానే ప్రాణాదులు,పంచభూతములు,ఇంద్రియములు,మనస్సు,బుద్ధి ఉద్భవించాయి.ఇంతే కాదు.అతను ప్రజాపతులు,ఋషులు,పితృదేవతలు,సుర,సిద్థ,విద్యాధరులు,మున్నగువారిని కూడా సృజించాడు.పక్షి,మృగ,వృక్ష సంతతిని కూడా సృజించాడు. ఇంత చేసినా అతను వీటన్నిటికీ కర్తృత్వము వహించడు.అంతా తన మాయాకల్పితంగానే తోచేటట్లు చేస్తాడు.ఆ మహామహడు,సర్వవ్యాపి నిరవద్యుడు,నిరంజనుడు,పరుడు,పరాత్పరుడు,నిష్కళంకుడు,నిత్యుడు మరియు సత్యుడు.

Saturday, 14 February 2026

సర్గ,విసర్గాదుల వివరణ

పరీక్షిత్తు మహారాజుకు శుక మహర్షి వివరం తెలుపుతున్నాడు.రాజా!మహత్తు,అహంకారము,పంచ తన్మాత్రలు,పంచ భూతములు,పంచేంద్రియములు....వీటన్నిటినీ సర్గము అని అంటారు. బ్రహ్మ విరాట్పురుషుని వలన జనించాడు కదా!అతను చరాచర సృష్టిని చేయడం వినర్గమని అంటారు. ఈ ప్రపంచమును హింసించే రాజులు ఉంటరు కదా!వారిని సంహరించడం,ధర్మ సంస్థాపన చేయడం,ఆ శ్రీమహా విష్ణువు యొక్క విజయ పరంపర తెల్పడం స్థానము అని అంటారు. శ్రీహరి సర్వేశ్వరుడు,అనంతుడు కదా!అతను భక్తులను ఉద్థరించే ప్రక్రియను పోషణము అని అంటారు. ఊతలు అనగా కర్మవాసనలు. ఆది శేషువు పైన కొలువు అయిన శ్రీమన్నారాయణుడు అనుగ్రహ కటాక్షము వలన విభూతిని పొందిన లోకపాలకులు ఉంటారు కదా!వారు అందరూ ధర్మమును వివరించడాన్ని మన్వంతరము అని అంటారు. శ్రీహరి యొక్క అవతారాలు ఒకటీ రెండు కాదు కదా!కోకొల్లలు.ఆ అవతారాలను సవివరంగా చెప్పడం,అతని చరిత్రను విస్తారంగా ప్రబోథించడాన్ని ఈశానుచరితం అని అంటారు. సర్వాంతర్యామి,సర్వరక్షకుడు అయిన గోవిందుడు తన ఉపాధి శక్తులతో కూడి శేషతల్పముపై సుఖంగా శయనించి ఉంటాడు.అతను యోగనిద్రలో ఉంటాడు.ఆ సమయంలో సమస్త ప్రాణికోటి కూడా తమ తమ వ్యాపారలని మర్చిపోతుంటారు.ఆ అవస్థా విశేషములను అన్నిటినీ స్పష్టంగా,సవివరంగా తెలియజెప్పేదే నిరోధము.

Friday, 13 February 2026

భాగవత మూలము

శ్రీహరి బ్రహ్మకు చెప్పాల్సిన సుద్దులు,బుద్ధులు చెప్పి అంతర్థానము అయిపోయడు.బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.భగవంతుడు చెప్పిన మాటలు మననం చేసుకుని,మనసులో నిక్షిప్తం చేసుకున్నాడు.సమస్త ప్రపంచాన్ని సృజించాడు.అతడు స్వలాభం చూసుకోలేదు.సకల లోక హితము కోరుకున్నాడు.దానికి తగిన విథంగానే ముందుకు అడుగులు వేసాడు.ఆయన సంకల్పం ధృఢమయినది. ఇట్లా ఉంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరకు నారదుడు వచ్చాడు.ఆయనకు ఆదుర్దా ఎక్కువ కదా!రావటం రావటం నాకు భగవంతుని మాయా విలాసాలగురించి చెప్పు అని తొందర చేసాడు. బ్రహ్మ చిద్విలాసంగా,చిన్మయానందంతో భగవంతుడు వలన తెలుసుకున్న భాగవతాన్ని నారదునకు చెప్పాడు.నారదుడు ఆ తరువాత వ్యాసుడికి చెప్పాడు.వ్యాసుడు అటు పిమ్మట శుకుడికి బోధించాడు.ఆ వృత్తాంతము అంతా పరీక్షిత్తు కోరిక మేర శుకుడు చెప్పేదానికి ఒప్పుకున్నాడు. శుకుడు పరీక్షిత్తుతో అంటున్నాడు.రాజా!నీవు నన్ను అడిగావు కదా,విరాట్పురుషుని వలన ఈ లోకాలన్నీ ఎలా ఏర్పడ్డాయి అని.వాటన్నిటికీ సమాథానము భాగవతములో ఉంది.అది నీకు నేను నేర్పిస్తాను. అది సర్గము,విసర్గము,స్థానము,పోషణము,ఊతులు,మన్వంతరములు,ఈశానుచరితములు,నిరోథము,ముక్తి,ఆశ్రయము అను పది లక్షణములతో కలిసి ఉంటుంది.వీటిలో మొదటి తొమ్మిది లక్షణములు పదవ లక్షణమయిన ఆశ్రయము విశుద్థి కొరకే చెప్పబడినది. అంటే మనము స్థిరమైన ఆనందం కోసరము భగవంతుడిని నమ్ముకోవడంలో పవిత్రముగా తయారుకావడము.

Thursday, 12 February 2026

శ్రీహరి గురించి శ్రీహరి

శ్రీహరి బ్రహ్మ మాటలు విన్నాడు.అతను తన్మయత్వంలో ముణిగిపోవడం గమనించాడు.చిద్విలాసంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.ఓ కమలగర్భా!నీవేమీ ఆందోళన చెందనవసరం లేదు.నా స్వరూప స్వభావాలు నీకు తెలుస్తాయి.అలాగే నా మహిమావతారకర్మములు అన్నీ కూడా తెలుసుకునే ప్రక్రియ,విజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు లభిస్తుంది. జాగ్రత్తగా విను.సృష్టికి పూర్వము నేను ఒక్కడినే కర్మ విహీనుడుగా ఉంటాను.కల్ప ప్రళయాంతరమున,ఆద్యంత విరహితమగు క్రియతో,పరిపూర్ణ నిత్య మహిమతో పరమాత్ముడునై ఉంటాను. మహాభూతములు భౌతికములు అయిన ఘటపటాదులు యందు ప్రవేశించి ఉంటాయి కదా!అచ్ఛంగా అలానే నేను భూత భౌతికములు అయిన సర్వకార్యములయందు,సత్త్వాది రూపములయందు ప్రవేశించి ఉంటాను.భూత భౌతికములు కారణావస్థను పొంది నాయందు అభివ్యక్తములు అయి ఉండవు.సర్వ దేశములందునూ,సర్వకాలములందునూ ఏది బోధితము అయి ఉంటుందో అదే పరబ్రహ్మ స్వరూపము.ఇది నా తత్త్వము.తత్త్వాత్మకమయిన ఈ అర్థమును నీ మనసు నందు గ్రహించుకో!అలా అయినప్పుడు నీవు సృష్టి కర్మములు చేసేటప్పుడు మోహమునకు గురి కావు.గర్వానికి పోవు.సమన్వయం పాటిస్తావు. ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానం అయిపోయాడు.

Monday, 9 February 2026

బ్రహ్మ భక్తి బహు బాగు

బ్రహ్మ తన నాలుగు శిరస్సులు వంచి శ్రీహరికి సాష్టాంగ నమస్కారాలు చేసాడు.శ్రీహరికి ఆ ఆత్మార్పణం నచ్చింది.సంతోషించాడు. బ్రహ్మతో ఇలా అన్నాడు.కుమారా!వత్సా!కపటముగా కొంత మంది మునులు ఉంటారు.వాళ్ళు జీవితకాలం అంతా తపస్సు చేసినా నాకు సంతోషము కలుగదు.నీవు నిష్కపటుడివి.అందువల్ల నీ మనస్సు నన్ను ఆకర్షించింది.నీ యెడల నేను ప్రసన్న చిత్తంతో ఉన్నాను.అందుకే నా లోకము నీకు చూపించాను.నీ తపస్సు కొక్కదానికే మటుకు కాదు.తప అని నేను అన్న మాటను బట్టే కదా నీవు ఇంత ఘోర తపస్సు చేసావు.ఆ తపస్సు చేయడం వల్లనే నీకు మోహము నశించింది.నీకు నా మీద అంతులేని భక్తి కలిగింది.నాకు చాలా తృప్తిగా ఉంది నీ విషయంలో.నీకు ఏ వరము కావాలో కోరుకో!ఏమీ మొహమాటం లేదు. శ్రీహరి మాటలకు బ్రహ్మ ఈ విథంగా జవాబు ఇచ్చాడు.హే దేవా!హే పరంథామా!ఈ సమస్త సృష్టిలో నీకు తెలియనిది అంటూ ఏమీ లేదు.ఎందుకంటే దీనికంతా కర్త,కర్మ,క్రియా నీవే గనుక.అలాంటిది నా మనసులో ఉండే కోరిక నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?కానీ నీవు అడిగావు.కాబట్టి నేను చెప్తాను. ఓ దేవా!నీ స్థూల సూక్ష్మ రూపములు అవ్యక్తములు కదా!నీవే బ్రహ్మాదిరూపములను ధరిస్తావు.ఈ జగత్తు ఉత్పత్తి ,స్థితి,లయ కార్యములను చేపడతావు.నీవు అమోఘ సంకల్పుడివి.రకరకాల విభూతులతో ఆటలాడుకుంటావు.నిన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము.నీ మహిమలను తెలుసుకోవడం ఇంకా క్లిష్టం.వాటన్నిటినీ తెలుసుకోగలిగే జ్ఞానము,పరిజ్ఞానము నాకు ప్రసాదించు. నీ ఆనతి మేర నేను సృష్టి చేస్తాను.కానీ నాకు తెలియకుండానే అహంకారానికి లోనవుతానేమో అని అనుమానంగా,భయంగా ఉంది.అందువలన ఎప్పుడూ అహంకారము అనేది నాకు కలుగకుండా చేయి స్వామీ!ఆ ఒక్క వరము ప్రసాదించి నన్ను ధన్యుడిని చేయి.

Monday, 2 February 2026

వైకుంఠ పురము వైభవోపేతము

బ్రహ్మదేవుడికి విష్ణువు కనిపించగానే మూడులోకాలు కనిపించినట్లు అయింది.అతనికి తత్ క్షణమ్ వైకుంఠ పురము కనిపించింది.అది దేదీప్యమానంగా,గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది.అంతే కాదు.ఆ విష్ణు విలాసము కేవల సత్త్వగుణమునకు ఆవాసము.అన్ని లోకాలకంటే ఉత్తమమయినది,ఉన్నతమయినది.దేవతలు నిరంతరము స్తుతిస్తూ ఉండే విష్ణు ఆవాసము.అది లోభము,మోహము,భయము అనే తుచ్ఛగుణాలు లేని ప్రదేశము.అది దివ్యమంగళ విలాస మహిమతో ఒప్పారుతున్నది.బ్రహ్మకు తన కళ్ళు చాలడం లేదు ఆ వైభవము చూసేదానికి.ఎంత చూసినా తనివి తీరడం లేదు. అక్కడి చిలుకలు సదా న దైవం కేశవాత్పరం అని పలుకుతున్నాయి.గోరువంకలు కూడా ఎందులోనూ తీసిపోవడం లేదు.అవి సర్వం విష్ణుమయం జగత్ అని అంటున్నాయి.కోకిలలు ఏమాత్రం వెనకబడటం లేదు.అందులో వాటి గాత్రం సుమథురం కదా!అవి మంగళం మధుసూదన అని రాగయుక్తంగా పిలుపునిస్తున్నాయి. ఆ నగర శోభ ఇంత అని చెప్పలేని విథంగా కాంతులు విరజిమ్ముతూ,శోభాయమానంగా,కన్నులకింపుగా కానవస్తుంది. మనకు ఇక్కడ ఏమో వీథి సర్పంచ్ కూడా రాజు వెడలె రవితేజము లలరగ అన్న పంథాన ఉంటుంది కదా!అక్కడ ఏమో విష్ణువుకు,విష్ణు పార్శ్వచరులకు భేదము అస్సలు తెలియడం లేదు. అందరూ శ్యామల దేహము కలిగి ఉన్నారు.అందరూ పీతాంబరాలు ధరించి ఉన్నారు.అందరి ముఖములు,కళ్ళు పద్మములలాగా అందముగా ఉన్నాయి.అందరూ రత్న ఖచిత ఆభరణాలు ధరించి ఉన్నారు.నిత్య యవ్వనంతో కళకళలాడుతున్నారు. సునందుడు,నందుడు,అర్హణుడు,ప్రబలుడు,మిగిలిన పార్శ్వచరులు శ్రీహరిని కొలుచుకుంటూ ఉన్నారు.లక్ష్మీ దేవి శ్రీహరి పాదాలు ఒత్తుతూ ప్రసన్నంగా ఉంది.ఆ దేవదేవుడు కానరాగానే బ్రహ్మ ఆనందానికి అవథులు లేవు.శరీరము జలదరించింది.పులకరించింది.విష్ణు సాక్షాత్కారము అంటే మాటలు కాదు కదా!ఆనందబాష్పాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు.తన నాలుగు శిరస్సులతో శ్రీహరి పాదపద్మాలకు వినమ్రంగా ప్రణమిల్లాడు.

Sunday, 1 February 2026

బ్రహ్మ తపస్సు ఫలదాయకం

బ్రహ్మ పద్మములో నుంచి ఆవిర్భవించాడు కదా!చటుక్కున ఒకసారి ఆయనకు అనిపించింది.నేను కూర్చుని ఉన్న ఈ పద్మము మూలస్థానము ఏది? అది తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.ఇంక ఉండబట్టలేక క్రిందికి పోయి చూడసాగాడు.ఎంత దూరము పోయినా మూలము కనిపించడం లేదు.ఆయనకు విసుగు వచ్చేసింది.ఏంది ఇదంతా అని.ఇది ఇంక అయ్యేపని కాదని తేల్చుకుని,తిరిగి వెనుకకు వచ్చేసాడు.తన ఆసనము అయిన పద్మములోకూర్చుని,సృష్టికార్యము సాగించాలని సంకల్పము చేసుకున్నాడు.కానీ ఏమీ అర్థం కాలేదు.ఏమీ తోచడం లేదు. ఇంతలో అతనికి రెండు సార్లు తప అనే శబ్దము వినిపించింది.ఆ శబ్దము ఎక్కడనుంచి వచ్చింది?అసలు ఎవరు పలికారు?ఈ అనుమానాలతో నాలుగు దిక్కులకూ పోయి వెదికాడు.ఏమీ తెలియలేదు. వెనకకు వచ్చి తన ఆసనముపైన కూర్చున్నాడు.ఆలోచించాడు.ఇంకా ఆలోచించాడు.తప అంటే ఏంది అర్థము? తపస్సు చేయమని కదా!ఎవరో దేవతా మూర్తి నన్ను తపస్సు చేయమని సలహా ఇస్తున్నాడు.కాదు,కాదు. ఆజ్ఞాపిస్తున్నాడు.కాబట్టి నేను తక్షణము తపస్సు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంక ఏకాగ్ర చిత్తముతోటి వేయి దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు కరుణించి,ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయినాడు.