Monday, 1 December 2025

శమీకునికి అవమానం

ఒకరోజు పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళాడు.చాలా వన్య మృగాలను చంపాడు.అన్నింటిని చంపితే అలసిపోవడం సహజం కదా!అలసటతోపాటు బాగా దాహం వేసింది.దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది.మంచి నీళ్ళ కోసం అక్కడకు వెళ్ళాడు.ఆ ఆశ్రమము శమీక మహామునిది.ఆయన ఆ సమయంలో కళ్ళు రెండూ మూసుకుని యోగసమాధిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఈయనకేమో దాహం అయిపోయా!మంచి నీళ్ళు కావాలని అడిగాడు ఆ మహర్షిని.భగవద్ధ్యానంలో ఉన్న ఆయనకు ఈయన పలుకులు వినపడలేదు.కాబట్టి జవాబు ఇవ్వలేదు,అలాగే మంచి నీరూ ఇవ్వలేదు. ఎవరి పిచ్చి వారిదే అని అంటారు కదా!ఇక్కడ కూడా అదే జరిగింది.ఈయనకు ఏమో విపరీతమయిన దాహం!దానితో పాటు ముని ధ్యానంలో ఉన్నాడు కాబట్టి నీరు ఇవ్వలేదు అనే ఇంగితం లోపించింది.కోపంతో పళ్ళు కొరికాడు.ఏంది?ఈ ముని ఎంత సేపటికీ కళ్ళు తెరవడు?ఇక్కడ నేను దాహంతో,గొంతు పిడచ కట్టుకుని పోతూ అల్లాడుతుంటే?ఇంతోటి రాజును ఇక్కడ నిలుచుకుని దాహం దాహం అంటుంటే ఉలుకూ పలుకు లేదే?రాజు అనే కనీస గౌరవ మర్యాదలు లేవా?ఎంత గొప్ప ముని అయితే ఏమి?దాహం అంటే మంచి నీళ్ళివ్వబళ్ళేదా? ఆ విచక్షణారహిత కోపంతో ఆ బ్రాహమణోత్తముడి మెడలో దగ్గరలో పడి ఉన్న చచ్చిన పామును వేసి తన నగరానికి వెళ్ళిపోయాడు.