Wednesday, 3 December 2025
శృంగి శాపం
ఈ పై వ్యవహారం అంతా దగ్గరలో ఉన్న ముని కుమారులు గమనించారు.శమీకుని కుమారుడు శృంగి.మునికుమారులు పరుగులు తీస్తూ వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పారు.శృంగికి విపరీతమయిన కోపం వచ్చింది. ఔరా!ఈ రాజులు ఎలాంటి వారు?బలికి పెట్టిన మెతుకులు తిని బలిసిన కాకులు లాంటి వారు.ప్రజలను రక్షించేవారి లాగా ఎన్నుకోబడతారు.చివరకు బ్రాహ్మణులను ఇంత నీచంగా అవమానిస్తున్నారు!శ్రీకృష్ణుడు లేక పోవడంతో వీళ్ళందరికీ బాగా అలుసు అయిపోయింది.దండించేవారులేరనే అహం!దుర్జనులు,దురాత్ములు విజృంభించి సాధుజనులను ఇక్కట్లపాలు చేస్తున్నారు,తుస్కారంగా చూస్తున్నారు.
ఇలా అని,అనుకుని శృంగి నదికి పోయాడు.అక్కడ ఆచమనము చేసుకుని,ఇలా శపించాడు.నా తండ్రిపైన చచ్చిన పామును పడవేసి చేసిన రాజు హరిహరాదులు అడ్డు వచ్చినా సరే....ఈ రోజు నుండి ఏడవరోజున తక్షకుని విషము వలన మరణించుగాక!
శృంగి ఆశ్రమానికి వచ్చాడు.తన తండ్రి ఇంకా యోగనిష్టలో ఉన్నాడు.అతని పైన పాము వేలాడుతూ ఉంది.అది ఏమైనా తన తండ్రిని కాటేస్తుందేమో అని భీతి చెందాడు.దానిని తొలగించలేక పోయాడు.ఏడుస్తూ చుట్టు పక్కల ఉన్న మునులను గట్టిగా పిలవడం మొదలు పెట్టాడు.
ఈ గలభా గందరగోళానికి శమీకుడు సమాధి చాలించాడు.మెల్లగా రెండు కళ్ళూ తెరిచాడు.తన పైన వ్రేలాడుతున్న పామును తీసి ప్రక్కకు వేసాడు.శృంగి ఏడవటం చూసాడు.చిన్నగా అడిగాడు.శృంగీ!ఏమైంది?ఎందుకు ఏడుస్తున్నావు?నా పైకి ఈ చచ్చిన పాము ఎలా వచ్చింది?
దానికి కొంచెం స్థిమిత పడిన శృంగి చెప్పడం మొదలు పెట్టాడు.రాజు తన తండ్రి పైన చచ్చిన పామును వేయడం,అది తెలుసుకుని తను ఆ రాజును శపించడమూను.
శమీకుడు విషయం తెలుసుకుని చాలా చింతించాడు.ఎందుకు నాయనా!ఇలా చేసావు?ఎందుకు అంత తొందరపాటు నీకు?ఆ రాజు పరీక్షిత్తు మహారాజు.అతను తల్లి గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రం వేడికి దగ్ధుడు అయినాడు.శ్రీకృష్ణుని కృపా కటాక్షం వలన తిరిగి బతికి బట్ట కట్టాడు.అతను ప్రజలను ఎంత బాగా పరిపాలిస్తున్నాడు!అంత మంచి రాజును శపించవచ్చా?అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయవచ్చా?
నీకు ఈ విషయం తెలుసా అసలు?రాజ్యములో రాజు లేకపోతే బలవంతుడు బలహీనుడిని విచక్షణా రహితంగా బాధిస్తాడు.మనము కష్టపడి సంపాదించుకున్న సంపదకు రక్షణ ఉండదు.మన స్త్రీలకు అంతా కన్నా రక్షణ ఉండదు.జారులు,చోరులు పేట్రేగిపోతారు.అదుపూ ఆజ్ఞ ఉండవు.ప్రజలలో భయం,భక్తిలేక పరస్పరము కలహాలతో కాపురం చేస్తారు.వర్ణాశ్రమ ధర్మాలు నశించిపోతాయి.
నీకు అసలు అవగాహన ఏమైనా ఉందా?పరీక్షిత్తు భగవంతుడికి గొప్ప భక్తుడు.సుశ్రేష్టమయిన భరత వంశంలో పుట్టాడు.ఎన్నో అశ్వమేథ యాగాలు నిర్వహించిన మహనీయుడు.అతను రాక రాక మన ఆశ్రమానికి వస్తే ఆదరించడం,గౌరవించడం మన కనీస కర్తవ్యం.అట్లాంటిది అతనిని శపిస్తావా?ఇది నీకు సబబేనా?ఇది అసలు న్యాయమా?
ఇలా శమీకుడు పరిపరి విథాల విచారించసాగాడు.దానికితోడు శృంగికి శాపం ఇవ్వటం మటుకే వచ్చు,ఉపసంహరణ తెలియదు.శమీకుడు కూడా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు.రాజుకు ఈ వార్త తెలపడం తన కనీస ధర్మం అనుకున్నాడు.అందుకని వెంటనే ఒక శిష్యుడిని రాజు దగ్గరకు పంపాడు విషయం వివరించమని.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment