Sunday, 7 December 2025

శుక మహర్షి ఆగమనం

అక్కడ ఉండే మునులు,ఋషులు అందరూ పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నారు.హే రాజా!నీ చరిత్ర అంతా విచిత్రంగా సాగింది.మీ తాతలు తపస్సులు చేసారు.రాజ సింహాసనము,రాజ భోగాలకంటే విష్ణుపథం కోరుకున్నారు.విష్ణువు సాంగత్యం కోరుకున్నారు.నీవు కూడా నీ పూర్వీకులలాగే భగవద్ సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటున్నావు. నీవు రజోరహితమయిన ఉత్తమలోకాలను చేరుకునేదాక,మేము అందరమూ ఎక్కడకూ వెళ్ళము.ఇక్కడే ఉంటాము.నీవు చెప్పే మంచి వాక్యాలను వింటూ,నీ ప్రభవము,ప్రభావము ఆస్వాదిస్తూ ఉంటాము. వారి మాటలకు పరీక్షిత్తు ఇలా సమాథానం చెప్పాడు.ఓ యోగివర్యులారా!ఓ మహామునులారా!నా జీవితానికి ఇంక ఏడు రోజుల వ్యనథి మటుకే ఉంది.ఇది చాలా తక్కువ సమయం.ఈ సమయంలోపలే నేను సంసార బంథాలనుంచి విడివడేలా చేసి,ముక్తి పొందే మార్గం సూచించండి.మీరందరూ హేమాహేమీలు.పరతత్త్వం బోధించడంలో సిద్థ హస్తులు.మీకు దయాగుణం ఎక్కువ!మీకు తెలియని విషయాలు అంటూ ఏమీ ఉండవు. పరీక్షిత్తు వారిని జ్ఞానబోథ చేయమని బ్రతిమలాడే సమయంలో అక్కడకు శుక మహర్షి వచ్చాడు.ఆయన దిగంబరుడు.అతని నుదుటిపైన ముంగురులు కమలముపై తుమ్మెదలు మూగినట్లు వ్రేలాడుతున్నాయి.అతను అవధూత.అతనకి ఎలాంటి కోపతాపాలు,కోరికలు,క్షణికావేశాలు లేవు.నిర్మల మనస్కుడు.అతను ఎవరినించీ ఏమీ ఆశించడు.ఎవరి తోడు నీడ కోరుకోడు.తన పాటికి తాను తిరుగుతూ ఆ సమయానికి దొరికిన దానితో తృప్తి పడుతుంటాడు. అతనిని చూడగానే అక్కడ ఉన్న మునులు అందరూ గౌరవభావంతో లేచి నిల్చుకున్నారు.పరీక్షిత్తు అయితే ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణాలు చేసాడు.సాదరంగా అతిథి మర్యాదలు చేసాడు.ఇలా విన్నవించుకున్నాడు.ఓ మునిసత్తమా!మంచి సమయానికి వచ్చారు.శ్రీకృష్ణుడు,ఆ భగవంతుడు,మా తాతలను సర్వదా వెంట ఉండి రక్షించాడు.వాళ్ళకు రాజ్యం సంపాదించి ఇచ్చాడు.మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్ర ప్రభావం నుంచి నా ప్రాణాలు కాపాడాడు.ఇప్పుడు ఆయన లేడు.నేను ఒకరకంగా అనాథను అయ్యాను.నన్ను రక్షించేవారే లేరు.త్వరలోనే దేహాన్ని త్యజిస్తున్నాను. నీవు పాలు పిదికినంత సేపుకంటే ఎక్కువ సమయం ఎక్కడా నిలవవు.అలాంటిది,ఈ రోజు నీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం.నా జన్మ ధన్యమయింది.నాకు ముక్తి మార్గం తెలిపే దానికి నీకంటే ఘనాపాటి ఇంకొకరు లేరు. నాకు నీవే దిక్కు.ఇది నా ప్రార్థన అని పరీక్షిత్తు ముకుళిత హస్తాలతో శుక మహర్షిని ప్రార్థించాడు.

No comments:

Post a Comment