Saturday, 6 December 2025
పరీక్షిత్తు ప్రాయోపవేశము
పరీక్షిత్తు గంగాతీరమున ప్రాయోపవేశమునకు సిద్థంగా ఉన్నాడు అని అందరికీ తెలిసింది.అత్రి,విశ్వామిత్రుడు,మైత్రేయుడు,భృగువు,వసిష్ఠుడు,పరాశరుడు,చ్యవనుడు,భరద్వాజుడు,పరశురాముడు,దేవలుడు,గౌతముడు,కశ్యపుడు,కణ్వుడు,అగస్త్యుడు,వ్యాసుడు,పర్వతుడు,నారదుడు మున్నగు మహామునులు తమ తమ శిష్య,ప్రశిష్య గణంతో అక్కడకు చేరుకున్నారు.
రాజు అందరినీ సాదరంగా ఆహ్వానించాడు.సముచితంగా సత్కరించాడు.తన వృత్తాంతము అంతా చెప్పాడు.ముక్తాయింపుగా ఇలా అన్నాడు.ఓ మహామునులారా!ఉరగ విషాగ్నికి నా శరీరాన్ని అర్పించేదానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను.ఇది భగవద్ సంకల్పము,కాబట్టి తప్పదు.నాకు ఈ జన్మకు ఇంకేమీ కోరికలు లేవు.నా మరు జన్మలో హరి పాద పద్మ సేవ కలిగేలా మీరందరూ నన్ను ఆశీర్వదించండి.మీరందరూ కూడా ఈ ఏడు రోజులూ భగవంతుని కీర్తించండి.నాకు ముక్తి కలిగేలా సహాయం చేయండి అని ముకుళిత హస్తాలతో వారందరినీ ప్రార్థించాడు.
పరీక్షిత్తు గంగ దక్షిణపు ఒడ్డున దర్భాసనముపై ఉత్తరాభి ముఖుడై కూర్చున్నాడు.తన కుమారుడు అయిన జనమేజయుని రప్పించాడు.అతనికి రాజ్యాన్ని అప్పగించాడు.
ఇంక తనదేమీ లేదని ప్రాయోపవిష్ఠుడయినాడు.దేవతలు అందరూ అతనిని మెచ్చుకున్నారు.దివి నుండి పూలవర్షము కురిపించారు.దుందుభులను మ్రోగించారు.జయ జయ నాదాలు చేసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment