Tuesday, 16 December 2025

పరీక్షిత్తు అనుమానాలు

పరీక్షిత్తు మహారాజు శుకయోగి చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు.ఆయన మస్తిష్కంలో సవాలక్ష సందేహాలు.అవి అన్నీ శుకయోగి దగ్గర తీర్చుకోవాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా ప్రశ్నలు సంథించడం మొదలు పెట్టాడు. పరీక్షిత్తుకు ఇప్పుడు మృత్యువు అంటే భయం పోయింది.ధర్మార్థకామాలను విడిచేపెట్టేయాలని నిర్ణయించుకునినాడు.ఆ సర్వ్యాంతర్యామి అయిన పురుషోత్తముడి పైనే మనసు నిలపాలని ప్రతిజ్ఞ పూనాడు.ఇంక హరి లీలావిలాసాలను విని తరించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.శుక యోగిని ఉద్దేశించి ఇలా అన్నాడు.ఓ మునిపుంగవా!నీవు చెప్పిన విషయాలు,బోధన వలన నా అనుమానాలు,శంకలు మటుమాయమయినాయి.ఇంకొక్క విషయం అడుగుతాను.ఏమీ అనుకోవద్దు.అసలు విష్ణువు ఈ విశ్వాన్ని ఎలా సృజించాడు?అసలు ఎట్లా రక్షిస్తాడు?ఇంకెట్లా సంహారం చేస్తాడు?అలా చేయలేదంటే కారణం ఏమై ఉంటుంది?ఏమైనా లోపమా!ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను,మీ దగ్గర. శుకుడు పరీక్షిత్తు జిజ్ఞాసను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.మనము అయితే...ఇదేందిరా బాబూ!ఒకటి చెబితే వంద అడుగుతున్నాడు అని విసుక్కుంటాము.కానీ ఆయన ఓపికగా చెప్పడం మొదలు పెట్టాడు. ఓ రాజా!ఈ విషయాలపై అనుమానాలు నీకే కాదు.ఇంతకు ముందు చాలా మంది మహనీయులకు కూడా వచ్చాయి.మొట్టమొదటిసారి నారదుడు బ్రహ్మను అడిగాడు.బ్రహ్మ అంతకు ముందు ఈ విషయాలను విష్ణు దేవుడి దగ్గర తెలుసుకుని ఉన్నాడు.కాబట్టి నారదుడికి చెప్పాడు.నేను నారదుని దగ్గర తెలుసుకున్నాను.నాకు తెలిసినదంతా నీకు ఎరుక పరుస్తాను.

No comments:

Post a Comment