Wednesday, 3 December 2025

పరీక్షిత్తు అంతర్ మథనం

శమీకుడి శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వచ్చాడు.పరీక్షిత్తు శమీకుడి మెడలో చచ్చిన పాము వేసి వెళ్ళిపోయిన అనంతరం అక్కడ జరిగిన పరిణామాలు,శృంగి శాపం...అన్నీ వివరంగా చెప్పాడు. పరీక్షిత్తు విషయం తెలుసుకుని ఖిన్నుడైనాడు.తనలో తాను ఇలా అనుకున్నాడు.అయ్యో!నేను వేటకు అడవికి ఎందుకు పోయాను?ఒళ్ళూ పాయా తెలియనంతగా ఎందుకు వేటాడాను?ఎంత దాహము అనిపించినా,ముని నీరు ఇవ్వలేదని వాని మెడలో చచ్చిన పామును ఎందుకు వేసాను?అంతగా విచక్షణ ఎందుకు కోల్పోయాను?ఆ మహర్షి సమాధిలో ఉన్నాడని కళ్ళకు కనిపిస్తున్నా,బుర్రకు ఎందుకు అర్థం కాలేదు?ఎందుకంత అర్థం పర్థం లేని పని చేసి నా గొంతు నేనే కోసుకున్నాను? ఏది ఏమైనా దైవయోగాన్ని ఎవరూ తప్పించలేరు!ఇలా తనను తానే దూషించుకుంటూ,చాలా సేపు కుమిలి పోయాడు.అయింది అయిపోయింది.శాపం విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు.కానీ నా చేతుల్లో ఉండే పని నేను చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఈ లోపల నేను కామక్రోధాదులను జయించేదానికి ప్రయత్నించవచ్చు అనుకున్నాడు.తరువాత విరక్తుడై రాజ్యమును వదిలేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.తదుపరి గంగకు పోయి ప్రాయోపవేశమున ప్రాణాలు విడవాలి అనుకున్నాడు.ఇంక ఆ క్షణం నుంచి మనసులో ఆ దేవదేవుడు అయిన గోవిందుడినే నిలుపుకున్నాడు.మౌనవ్రతం ఆచరించాడు.గందరగోళం,తత్తరపాటు లేకుండా,ప్రశాంత మనస్కుడై,నిస్సంగుడుగా మారిపోయాడు.

No comments:

Post a Comment