Monday, 22 December 2025

వరాహ,సుయజ్ఞ అవతారములు

ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతి క్రూరుడు.ఒకసారి భూమిని చాపలా చుట్టేసి,తీసుకుని పోతున్నాడు.అప్పుడు శ్రీమహా విష్ణువు యజ్ఞ వరాహ రూపము దాల్చాడు.ఆ రాక్షసుడిని ఎదిరించాడు.సముద్ర మధ్యంలో తన వాడి కోరలతో పొడిచి చంపాడు.ఇది భగవంతుని వరాహావతారము. అకూతి స్వాయంభువు మనువు కుమార్తె.ఆమెకు ప్రజాపతికి సుయజ్ఞుడు అనే కుమారుడు కలిగాడు.సుయజ్ఞుడి భార్య దక్షిణ.వారికి సుయములు అనే పేరుగల అమరులు చాలామంది పుట్టారు.సుయజ్ఞుడు ఇంద్ర పదవిని అలంకరించాడు.ఉపేంద్రుడు లాగా కష్టాలు తొలగించి ప్రజలను కాపాడాడు.మనువుకు చాలా సంతోషమయింది తన మనవడి గొప్పదనంచూసి.అతను తన మనవడు గొప్ప పుణ్యాత్ముడని కొనియాడాడు.సుయజ్ఞుడు సాక్షాత్తు భగవంతుడే అని నమ్మి కొనియాడాడు.అందువలన సుయజ్ఞుడు,జ్ఞాననిథి,అవతారమూర్తి అయ్యాడు.ఇది సుయజ్ఞ అవాతార కథ.

Sunday, 21 December 2025

బ్రహ్మ నారదుల సంవాదము

ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరకు పోయాడు.బ్రహ్మను స్తుతించడం మొదలు పెట్టాడు.తండ్రీ!నీవు చతుర్ముఖుడవు.వేల్పులలో మొదటివాడవ.ునాలుగు వేదాలు నీ నాలుగు ముఖాలనుండే వెలువడ్డాయి.భారతీదేవి నీ ఇల్లాలు.నీవు జ్ఞానివి.నీకు తెలియనిదంటూ ఏమీ లేదు.నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.వాటిని నీవు తీరుస్తావని ఆశగా నీ దగ్గరకు వచ్చాను. ఈ సర్వ సృష్టిని ఎవరు ప్రారంభించారు?దీనికి ఆథారము ఏంది?కారణాలు ఏంది?దీనికంతటికీ నీవే కారణం అని నేను అనుకుంటున్నాను.నిజమేకదా!లేక నీకంటే ఘనుడు,పరాత్పరుజు ఇంక వేరే ఎవరైనా ఉన్నారా? నీవు సృష్టి కర్తవు కదా!ఏమి లాభంకోరి ఇదంతా సృష్టించావు?ఈ ప్రాణికోటి అంతా ఎక్కడ పుజుతున్నది?ఎక్కజ లయమవుతున్నది?నీవు చాలా ఉచ్ఛమయిన పదవిలో ఉన్నావు కదా!నీవే చాలా గొప్పవాడివి.అట్లాంటిది,నీవు ఇంకెవరి గురించి తపస్సు చేసావు?నా ఈ ఆనుమానాలు అన్నీ నాకు అర్థం అయేరీతిలో చెప్పేది.

Friday, 19 December 2025

బ్రహ్మ జవాబు

బ్రహ్మ నారదుడు అడిగిన ప్రశ్నలు అన్నీ ఓపికగా విన్నాడు.ఇలా జవాబు చెప్పాడు. నాయనా!నారద!ఈ విశ్వాన్ని పాలించే,నియంత్రించేటంతటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు.శ్రీహరి నాకంటే చాలా గొప్పవాడు.అతని ఆదేశాల ప్రకారమే మేమంతా నడుచుకుంటాము.మేమంతా ఎవరెవరు అని కదా నీ అనుమానం.చెబుతాను విను.సూర్యుడు,చంద్రుడు,గ్రహములు,నక్షత్రములు..।ఇంతెందుకు?ఈ విశ్వంలోని అణువణువు అతని ఆథీనంలో ఉంది.అతని ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది.ఆ అందరిలో నేనూ ఒకడిని,అంతే!అతని నియామకంలోనే నేను సృష్టిని నడుపుతున్నాను.నేను నిమిత్తమాత్రుడిని. ఇది తెలుసుకోలేనివారు నేనే లోకేశ్వరుడిని అనుకుంటున్నారు.నాకు నవ్వు వస్తుంది.సృష్టి,స్థితి,లయకారకుడు ఆ విశ్వాత్మే!ఆ నారాయణుడికి నేను ఎప్పుడూ నమస్కరిస్తాను. నీకు ఈ విషయం తెలుసా?నిజానికి భగవంతుడు నిర్గుణుడు.ఈ విశ్వాన్ని అంతా సృజించేదానికిగానూ సగుణుడు అవుతున్నాడు.అంటే అతని కోసం కాదు,మనకోసం ఆయన ఈ అవతారాలు ఎత్తుతున్నాడు. అతను విశ్వేశ్వరుడు.విశ్వాత్మకుడు.విశ్వమయుడు.అందరికీ ప్రభువు.ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాడు.అతనికి జనన మరణాలు లేవు.ఈ విశ్వమంతా ఆయనలో నిక్షిప్తమయి ఉంది.విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు.అంటే సూక్ష్మం లో సూక్ష్మం కానీ విశ్వవ్యాపకం. అతని లీలలు ఒకటా రెండా?కోకొల్లలు.అతని లీలావతారములు అనంతములు.కానీ నాకు తెలిసిన కొన్ని,ముఖ్యమయినవి నీకు తెలియపరుస్తాను.

Tuesday, 16 December 2025

పరీక్షిత్తు అనుమానాలు

పరీక్షిత్తు మహారాజు శుకయోగి చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు.ఆయన మస్తిష్కంలో సవాలక్ష సందేహాలు.అవి అన్నీ శుకయోగి దగ్గర తీర్చుకోవాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా ప్రశ్నలు సంథించడం మొదలు పెట్టాడు. పరీక్షిత్తుకు ఇప్పుడు మృత్యువు అంటే భయం పోయింది.ధర్మార్థకామాలను విడిచేపెట్టేయాలని నిర్ణయించుకునినాడు.ఆ సర్వ్యాంతర్యామి అయిన పురుషోత్తముడి పైనే మనసు నిలపాలని ప్రతిజ్ఞ పూనాడు.ఇంక హరి లీలావిలాసాలను విని తరించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.శుక యోగిని ఉద్దేశించి ఇలా అన్నాడు.ఓ మునిపుంగవా!నీవు చెప్పిన విషయాలు,బోధన వలన నా అనుమానాలు,శంకలు మటుమాయమయినాయి.ఇంకొక్క విషయం అడుగుతాను.ఏమీ అనుకోవద్దు.అసలు విష్ణువు ఈ విశ్వాన్ని ఎలా సృజించాడు?అసలు ఎట్లా రక్షిస్తాడు?ఇంకెట్లా సంహారం చేస్తాడు?అలా చేయలేదంటే కారణం ఏమై ఉంటుంది?ఏమైనా లోపమా!ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను,మీ దగ్గర. శుకుడు పరీక్షిత్తు జిజ్ఞాసను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.మనము అయితే...ఇదేందిరా బాబూ!ఒకటి చెబితే వంద అడుగుతున్నాడు అని విసుక్కుంటాము.కానీ ఆయన ఓపికగా చెప్పడం మొదలు పెట్టాడు. ఓ రాజా!ఈ విషయాలపై అనుమానాలు నీకే కాదు.ఇంతకు ముందు చాలా మంది మహనీయులకు కూడా వచ్చాయి.మొట్టమొదటిసారి నారదుడు బ్రహ్మను అడిగాడు.బ్రహ్మ అంతకు ముందు ఈ విషయాలను విష్ణు దేవుడి దగ్గర తెలుసుకుని ఉన్నాడు.కాబట్టి నారదుడికి చెప్పాడు.నేను నారదుని దగ్గర తెలుసుకున్నాను.నాకు తెలిసినదంతా నీకు ఎరుక పరుస్తాను.

Monday, 15 December 2025

భక్తి మార్గము ఉత్తమము

పూర్వము బ్రహ్మ దేవుడు అన్నీ ఒకటికి పది సార్లు పరీక్షించాడు.ఏమని?మోక్షము దక్కాలంటే భక్తి మార్గము తప్ప ఇంక వేరే మార్గము ఇంకేదీ లేదని.ఇలా నిశ్చయానికి వచ్చాడు.వచ్చిన వెంటనే నిర్వికారుడు అయ్యాడు.చంచలత్వాన్ని వీడాడు.స్థిరమయిన మనసుతో శ్రీహరిని ఆరాధించాడు.భగవంతుడు సర్వవ్యాపకుడు కదా!సర్వభూతాలలోనూ ఆవరించి ఉన్నాడు కదా!ఆ సర్వేశ్వరుడిని ఆరాధించడం,కీర్తించడం మొదలు పెట్టాడు.హరి నామస్మరణ,లేకపోతే హరి కథలను వింటూ తరించాడు. మనకు సహజమయిన ఆరాటం,తపన,యావ,చంచలత్వం...వీటన్నిటినీ వదలి పెట్టాడు.మొదట మనము అంతా విష్ణుమయము,విష్ణులీల అని అర్థం చేసుకోవాలి.సర్వ సంగ పరిత్యాగి కావాలి.అప్పుడే మోక్షము లభిస్తుంది. శుకుడు పరీక్షిత్తుకు ఇంకా ఇలా చెబుతున్నాడు.ఓ రాజా!విష్ణు కీర్తనలు వినని వాడి చెవులు కొండ బిలముల లెక్క!శంఖ చక్ర గదాపాణి పై పద్యములు చదువని జిహ్వ కప్ప నాలుకతో సమానము.ఆ లక్ష్మీకాంతుడు,లక్ష్మీవల్లభుని చూడని కళ్ళు నెమలి పింఛములోని కళ్ళతో సమానం.అంటే ఆకార పుష్ఠి,నైవేద్య నష్ఠి అన్నమాట! కమలనాభుడు,కమలాక్షుడిని పూజింపని చేతులు...ఉన్నా ఒకటే...లేకున్నా ఒకటే!శుద్ధ దండగ!విష్ణువు పాదపద్మాలపై ఉన్న తులసీ దళం వాసన చూడనేరని ముక్కు పంది ముక్కుతో సమానం.గోవిందుడు,గరుడ గమనుని చెంతకు పోలేని పాదములు మోడైన చెట్లుతో సమానము.నారాయణుని నామ సంకీర్తనకు కరగని మనసు చలనము లేని ఒక బండరాయి.శ్రీమహా విష్ణువు కథలకు పులకించని శరీరము ఒక మొద్దు.మాధవుడు,మథుసూదనుడికి మ్రొక్కని వాని తలపైన ఉండేది కిరీటంకాదు,ఒఠ్ఠి కట్టెల మోపు.ఆ నారాయణుడి సేవకి ఉపయోగ పడని సంపద అడవి గాచిన వెన్నెల.ఆ బ్రహ్మాండ నాయకుడిని సేవించలేనివాడు జీవించి ఉన్నా జీవం లేని వాడే.ఆ ఆపద మ్రొక్కులవాడి పాదపద్మాలను చూడలేని వాడి బ్రతుకు పత్తికాయలోని పురుగుతో సమానము.

Friday, 12 December 2025

ధారణ అంటే?

శుక యోగి పరీక్షిత్తుకు ధారణాబలము ఉంటే ఏమైనా సాథించ వచ్చు అని చెప్పాడు.అది వినగానే పరీక్షిత్తు అడిగాడు.స్వామీ!ధారణ అంటే ఏంది?దాని స్వరూప,స్వభావాలు ఎలా ఉంటాయి?అది మనం ఏమి చేస్తే లభ్యం అవుతుంది? పరీక్షిత్తు సంథించిన ప్రశ్నలకు శుక మహర్షి ఇలా జవాబు ఇచ్చాడు.రాజా!ధారణ ప్రక్రియ అంతా నీకు సావథానంగా వివరిస్తాను.ముందుగా మనలో ఉన్న వాయువును బంధించాలి.తరువాత,చంచలము,బలవత్తరములు అయిన ఇంద్రియాలను నిగ్రహించాలి.సర్వ సంగములను మనస్పూర్తిగా పరిత్యజించాలి. అటు పిమ్మట విరాట్ స్వరూపుడు అయిన శ్రీహరిని మన మనసులలో నిలబెట్టుకోవాలి.ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు,భూత,భవిష్యద్వర్తమానాలను గ్రహించి ప్రవర్తించగలవాడు.ఇలా చేయగలిగితే మనకు సమస్తము మన గుప్పిటలోకి వస్తుంది.ముందర సముద్రంలోని నీళ్ళతో ఊహించికుంటే ఒక చుక్క కంటే తక్కువ మన అస్థిత్వం.ఆ భగవంతుడు లీలామానుష విగ్రహుడు.ఈ సమస్త విశ్వం అతని చెప్పు చేతలలో నడుస్తుంది.దానిలో అనుమానం కించిత్ కూడా లేదు. సద్యో ముక్కి,క్రమ ముక్తి అని రెండు రకాలు ఉన్నాయి.సంసారము నందు ప్రవేశించిన వారికి తపము,యోగము అనే ముక్తి మార్గాలు ఉన్నాయి.కానీ ఆ రెండింటిలోనూ భక్తి మార్గము కంటే సులభమయిన మార్గము ఇంకొకటి లేదు అని ఆ భగవంతుడే నొక్కి వక్కాణించాడు. సద్యో ముక్తి అంటే మన జీవిత కాలంలోనే ముక్తిని పొందడం.ఇది జ్ఞానంతో భవబంధాలనుండి పూర్తిగా బయటపడగలిగితేనే సిద్ధిస్తుంది. కర్మ ముక్తి అంటే అంచెలంచెల మోక్షం.ఇది మరణం తరువాత లభిస్తుంది.

Thursday, 11 December 2025

ఖట్వాంగుడు

శుకుడు పరీక్షిత్తుకు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు.మీకు తెలుసు కదా మా తండ్రి వ్యాసుడు అని.అతను ద్వాపర యుగములోనే బ్రహత్వమును సిద్ధింపజేసే భాగవతామును రచించాడు.నాకు చెప్పాడు ఆ పూర్వాపరాలు అన్నీను.నాకు ఉత్తమ చరిత్రలు, రచనలు చదవాలనే తపన ఉంది.కాబట్టి నేను శ్రద్ధాసక్తులతో భాగవతాన్ని పఠించాను. నీ విషయానికి వస్తే,నీవు కూడా హరిభక్తుడివి.ఎల్లప్పుడూ ఆ విష్ణువు ధ్యానంలోనే నిమగ్నమయి ఉంటావు.భాగవతము విషయానికి వస్తే ఆ గ్రంథము విష్ణువు గురించి వివరిస్తుంది.అలాగే విష్ణు భక్తుల గురించి కూడా సవివరంగా చెబుతుంది.మోక్షము కావాలి అని కోరుకునే వారికి భాగవతము వలన తప్పక కైవల్యం దక్కుతుంది.కాబట్టి ఇప్పుడు నేను నీకు ఆ భాగవతము చెబుతాను. పూర్వము ఖట్వాంగుడు అనే రాజు ఉండేవాడు.అతను మహాపరాక్రమశాలి.సప్త ద్వీపాలనూ పాలిస్తుండేవాడు.దేవతలు రాక్షసులతో యుద్థంలో గెలనలేక పోతూ ఉండేవారు.అప్పుడు దేవేంద్రుడు ఖట్వాంగుడి సహాయము కోరాడు.అప్పుడు ఆ ధీశాలి రాక్షసులను ఓడించాడు.దేవతలు అందరూ సంతోషించారు.వారు రాజును ఏదైనా వరము కోరుకో,తీరుస్తాము అని మాట ఇచ్చారు.ఖట్వాంగుడు తనకు ఇంక ఎంత ఆయుస్సు మిగిలి ఉందో చెప్పమన్నాడు.వాళ్ళు లెక్కలు చూసి,ఇంక ఒక్క క్షణం మటుకే మిగిలి ఉంది అని ఉటంకించారు. రాజు తత్తర పాటు పడలేదు.ప్రశాంతంగా,వెంటనే రాజ్యానికి వచ్చాడు.సర్వ సంగ పరిత్యాగి అయ్యాడు.గోవింద నామం జపిస్తూ,ధ్యానిస్తూ చివరి రెండు ఘడియలలోనే ముక్తిని పొందాడు. ఓ రాజా!నేను నీకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నానో అర్థం అవుతుందా?మనసా,వాచా,కర్మణా శ్రీహరిని ఒక్క క్షణం ధ్యానించినా ముక్తి లభిస్తుంది.అలాంటిది నీకు వారం రోజులు గడువు ఉంది.కాబట్టి సమయాభావం అని భయపడవద్దు.ఈ వారం రోజులూ హాయిగా శ్రీహరిని స్తుతించు.అతని చరిత్రలు విను.నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. మనసు పాదరసంలాగా చంచలమయినది.దానిని బుద్ధిబలంతో నివారించు.నీ మనోఫలకం పైన ఆ భగవంతుడిని ప్రతిష్టించుకో!రజోగుణము,తమోగుణములను ఆమడ దూరంలో ఉంచు.దరి చేర నివ్వవద్దు.ధారణాబలంతో హరిధ్యానం చేస్తే ముమ్మాటికీ నీకు ముక్తి లభిస్తుంది.