Saturday, 1 November 2025

విదురుడు సలహా ధృతరాష్ట్రుడికి

ధర్మరాజు దేశాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు.మనుమడు అయిన పరీక్షిత్తు ముద్దూ ముచ్చట్లు చూసి మురిసిపోతున్నాడు.ధృతరాష్ట్రుడు,గాంథారీలను గౌరవంగా,మర్యాదా,మన్ననలకు లోటురాకుండా అభిమానంగా చూసుకుంటూ ఉన్నాడు. విదురుడికి ధృతరాష్ట్రుడి పరిస్థితి దీనంగా అనిపించింది.ఉండబట్టలేక ఒకరోజు ధృతరాష్ట్రుడి దగ్గరకు పోయి హితవు చెప్పాడు. ఓ రాజా!నీవు కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నావు.ముసలితనము ఎప్పుడో పైన పడింది.అయినా నీలో దుగ్ధ చావలేదు.కాలము సమీపిస్తుంది అనే ధ్యాసే లేకుండా బ్రతుకుతున్నావు.ఏమైనా చూద్దామూ అంటేనా పుట్టు గ్రుడ్డివి.ఈ ముసలి మొప్పందాన ఏమి భోగాలు అనుభవించ గలవు?శూన్యం!నా అనే వాళ్ళు ఎవరూ మిగలలేదు.అందరూ యుద్ధంలో తుడిచి పెట్టుకుని పోయారు.మీ భార్యా భర్తలు ఇద్దరూ అంతు లేని దుఃఖంలో మునిగి ఉన్నారు. నీకొడుకులు దుష్టులు.పాండవులు ఉన్న ఇంటికి నిప్పు పెట్టారు.ద్రౌపదిని వస్త్రాపహరణకు గురిచేసి అవమానించింది నీ సు(కు)పుత్రులే.కుయుక్తులతో పాండవులను అడవులపాలు చేసారు.ఇంత దరిద్రంగా నీ బిడ్జలు వాళ్ళను సాథిస్తుంటే నీవు కిమ్మనకుండా కూర్చున్నావు అప్పుడు.ఇప్పుడు వాళ్ళ పంచనే పడి మీరు బ్రతకడం నాకు నచ్చటంలేదు.అది పద్థతి కూడా కాదు అనిపిస్తుంది. భీముడికి నోటి దురుసు ఎక్కువ.ఈ ముసలోళ్ళు మన నెత్తి మీద పడ్డారు.వాళ్ళ ముఖాన నాలుగు మెతుకులు కొట్టండి అని మాట్లాడుతున్నాడు.ఇన్ని అవమానాలు పడుతూ,వారి పంచనే ఉండి వాళ్ళు ఈసడించుకుంటూ పెట్టే పిండం కోసము ఎదురు చూస్తున్నావు పూటపూటకి.ఎందుకింత ఆశ?ఇంకా ఏమి సాథించాలని?ఏమి అనుభవించాలని?నీకు ఏమైనా ఇంకా బిడ్డలను కనాలని ఆశ ఉందా?మనుమల ముద్దుమాటలు వింటూ మురిసిపోగలవా?నీదంటూ ఏమి మిగలనప్పుడు దానధర్మాలు చేయగలవా?ఇంత వయసు వచ్చినా ఈ దేహము శాశ్వతము కాదనే నగ్న సత్యాన్ని ఇంకా తెలుసుకోలేకపోతే ఎలా? ఇంకన్నా ఈ శరీరం పైన మోహము వదులుకో.ఇల్లు విడిచి,ముని వృత్తిని అవలంబించు.మోక్ష ప్రాప్తి కోసం ఇకనైనా అడుగులు వెయ్యి.

No comments:

Post a Comment