Friday, 21 November 2025
కలి తొలి అడుగు
పరీక్షిత్తుకు కురు జాంగల దేశమున కలి ప్రవేశించినట్లు తెలిసింది.కలిని శిక్షించాలని అనుకున్నాడు.చతురంగబలాలతో కదంతొక్కాడు.ఇంద్రనీలవర్ణం కల గుర్రాలనుపూన్చి సింహధ్వజము నిల్పిన రథాన్ని అధిరోహించాడు.దిగ్విజయ యాత్రకు శ్రీకారం చుట్టాడు.ఇలావృత రమ్యక హిరణ్మయ హరివర్ష కిపురుష భద్రాశ్వకేతుమాలా భారత వర్షములను,ఉత్తర కురు దేశమును జయించాడు.ఆ దేశవాసులు ఇచ్చిన కానుకలను స్వీకరించాడు.
పరీక్షిత్తు తూర్పుగా ప్రవహించే సరస్వతీ నదీతీరము చేరుకునినాడు.అక్కడ అతనికి వృషభరూపములో ఒంటి పాదంతో సంచరించే ధర్మ దేవత కానవచ్చింది.దానికి దగ్గరలోనే లేగదూడ లేని పాడియావు లాగా కన్నుల నిండా నీరు గ్రుక్కుకున్న ,కాంతి విహీనంగా,గోరూపము ధరించి ఉన్న భూదేవి కనిపించింది.
ఆ ధర్మ దేవత భూదేవితో ఇలా అంటున్నది.ఓ బంగారు తల్లీ!కన్నుల నిండా ఆ నీరు ఏంది?ఎందుకు అంత క్షోభ పడుతున్నావు?నీ శరీరము ఏదో రోగముతో కృశించినట్లుగా కనిపిస్తుంది.ముఖము కళా కాంతీ లేకుండా వాడిపోయి ఉంది.ఏమైంది?నీ అయినవాళ్ళకు కానీ,చుట్టపక్కాలకు కానీ కష్టం వచ్చిందా?ఏమైనా భయం వేసిందా?అసలు ఇంత దిగులు విచారంతో డీలా పడిపోయేదానికి కారణం ఏంది?
దుష్టులను శిక్షించి భూభారం తగ్గించిన ఆ శ్రీకృష్ణుడు అవతారము చాలించేసాడు అని మనసు కష్ట పెట్టుకున్నావా?అనాథను అయ్యాను అని దుఃఖిస్తున్నావా?
ఆ మాటలకు భూదేవి సమాథానం ఇలా చెప్పింది.అయ్యా!నువ్వు ధర్మదేవతవు.ఒకప్పుడు నాలుగు పాదాలతో నడిచే వాడివి!అలాంటిది ఒంటి పాదముతో ఒరుగుతూ,నిలద్రొక్కుకోలేక సతమతమవుతున్నావు.నీ ఈ కష్టాలన్నీ ఆ పరంథాముడు,పరాత్పరుడు అయిన శ్రీకృష్ణుడు లేకపోవటం వల్లనే కదా!ఆయన అస్తమయంతో కలి ప్రవేశించింది.
ఆ కలి పాదం అట్లాంటిట్లాంటిది కాదు,అంతా పాప భూయిష్టం!ఆ కలి ప్రేరణ చాలా బలీయమైనది.దాని ప్రభావం వలన మనుష్యులకు అన్నీ పాపపు ఆలోచనలే వస్తాయి.మనుష్యులు అందరూ పాపపంకిలంలో మునిగి తేలుతుంటే మామూలు పరిస్థితి ఇంకెక్కడ ఉంటుంది?ఆ అరాచకాల వలన పితృదేవతలకు,వర్ణాశ్రమములకు,నీకు,నాకు,గోవులకూ ఇంక గడ్డుకాలమే!ఆ శ్రీమన్నారాయణుడి పాద స్పర్శ ఇంక నాకు తగలదని మనసు చిన్నబోతుంది.బాధ సుడులు తిరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment