Sunday, 30 November 2025
కలికి భయం వేసింది
పరీక్షిత్తు ఈ రకంగా ధర్మదేవతను,భూదేవిని అనునయించాడు.తన కరవాలాన్ని దూసాడు.దుర్మార్గుడు,దుష్టుడు,దురాత్ముడు అయిన కలిని సంహరించేదానికి పూనుకున్నాడు.కలికి భయం వేసింది.తన రాజు వేషం విడిచి పెట్టాడు.ఏకంగా పరీక్షిత్తు కాళ్ళపైన పడిపోయాడు.తనను రక్షించమని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు కలిని లేపి ఇలా అన్నాడు.ఓయీ!భయపడవద్దు.నేను అర్జునుడి మనవడిని.ఓడిపోయినవారిని,భయపడి శరణుజొచ్చినవారిని చంపడం మా ఇంటా వంటా లేదు.ఇంకైనా బుద్ధి తెచ్చుకోని,పద్థతిగా వ్యవహరించు.నీవు పాపాత్ముడివి.నీలాంటి నీచులకు నా రాజ్యంలో చోటు లేదు.
అప్పుడు కలి చేతులు ముడుచుకుని అడిగాడు.రాజా!ఓ పరీక్షిత్తు మహారాజా!మీ రాజ్యంలో నాకు స్థానం లేదన్నారు.నేను ఇంక ఎక్కడ ఉండాలో మీరే నిర్ణయించండి.అప్పుడు పరీక్షిత్తు జవాబిచ్చాడు.ఓ కలీ!ఎక్కడ ప్రాణహింస జరుగుతుందో,స్త్రీకి గౌరవం,రక్షణ దక్కవో,ఎక్కడ జూదము,మద్యమూ నిరాటంకంగా కొనసాగుతాయో...ఆ ప్రదేశాలలో ఉండవచ్చు.ఇవే కాదు.ఇంకా అసత్యము,మదము,కామము,హింస,విరోధము కానవచ్చే ఐదు స్థలములలోకూడా ఉండవచ్చు.అంతేకానీ తోకఆడిచ్చి వేరే మంచి,పవిత్రమయిన ప్రదేశాలకు పోకూడదు.
ఇట్లా పరీక్షిత్తు కలిని నిగ్రహించాడు.
ధర్మదేవత పోగొట్టుకున్న తపము,శౌచము,దయ అనే మూడు పాదాలనూ తిరిగి ఇచ్చాడు.ఈ ప్రక్రియకు భూదేవి చాలా సంతోషించింది.పాప పంకిలంకాకుండా ఉంటేనే కదా ఆమె ప్రశాంతంగా,మనశ్శాంతిగా గాలి పీల్చుకో గలుగుతుంది.పాపభారము మోయటమంటే మాటలు కాదు కదా!ప్రత్యక్ష నరకం కదా!
తరువాత పరీక్షిత్తు హస్తినకు వచ్చి రాజ్య సుపరిపాలన చేసుకుంటూ ఉన్నాడు.బ్రాహ్మణ శాపం వలన తనకు తక్షకుని కాటు వలన మరణం సంభవిస్తుందని తెలుసుకున్నాడు.సర్వసంగ పరిత్యాగి అయ్యాడు.శుక మహర్షికి శిష్యుడు,భక్తుడు అయ్యాడు.విజ్ఞానము సంపాదించాడు.ప్రశాంతంగా గంగా తీరమున శరీరము విడిచాడు.
సూతుడు ఇలా చెప్పసాగాడు.కలి యుగములో పాపాలు చేసినా వాటి ఫలితము లభించదు.మంచి చేస్తాను,మంచి మార్గములో నడుస్తాను అని అనుకున్నా పుణ్యము చేకూరుతుంది.అందుకే పరీక్షిత్తు కలిని చంపకుండా వదలిపెట్టాడు.సత్ప్రవర్తన గలవారికి,మంచిగా ధైర్యము ఉండేవారికి కలిని చూసి భయపడేపని లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment