Wednesday, 5 November 2025

ధృతరాష్ట్రుడు గాంధారి గతించుట

ఆ తరవాత నారదుడు తుంబురుడితో కలిసి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు.ధర్మరాజు తన తమ్ముళ్ళతో ఎదురేగి అతనిని స్వాగతించాడు.అతనిని తగు రీతిన పూజించాడు. ధర్మరాజు నారదుడిని ఇలా అడిగాడు.ఓ నారద మునీంద్రా!నీవు త్రిలోక సంచారివి.త్రికాలజ్ఞుడివి.నీకు తెలియని దంటూ ఏమీ లేదు.నా తల్లిదండ్రులు అయిన ధృతరాష్ట్రుడు గాంథారి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు.వారు ఎక్కడకు పోయి ఉంటారో తెలిపేది. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు.ఓ రాజా!సర్వమూ ఈశ్వర జనితము,పరమేశ్వరమయము.భగవంతుడే మనుష్యులను కలుపుతూ ఉంటాడు.అలానే వేరుచేస్తూ ఉంటాడు.ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు.దీనికి మనమెవ్వరమూ చింతించాల్సిన పనిలేదు.ఒకడిని కొండచిలువ మింగింది అనుకో!అతడు వేరే వాళ్ళను రక్షించగలడా?తనను తానే రక్షించుకోలేడు!అలాగే నిత్యమూ మోపలేని బాధలను అనుభవించే ఈ శరీరము వేరే వారిని ఎలా రక్షిస్తుంది?సకల చరాచర సృష్టిని ఒక మహాశక్తి తన చెప్పుచేతలలో పెట్టుకుని ఆడిస్తుంది.మనము ఆటబొమ్మలము,తోలు బొమ్మలము...అంతే! కానీ సగటు మానవుడు సదా మాయలో కప్పబడి ఉంటాడు కదా!కాబట్టి ఈశ్వరుని లీలా వినోదం అర్థం కాక,అర్థం చేసుకోలేక కష్టాలు పడుతుంటారు.అజ్ఞానములో పడి మన వారికి ఏమైందో,ఏమో అని పరితపిస్తూ ఉంటారు. ధర్మరాజా!అజ్ఞానపు సుడిగుండాలనుంచి బయటపడు.దిగులు,విచారము ప్రక్కన పెట్టు.కాలము చాలా శక్తివంతము అయినది.దానిని తప్పించడం ఎవరి వల్లా కాదు. ఇంక మీ వాళ్ళ గురించి చెబుతాను విను.ధృతరాష్ట్రుడు,గాంథారిలతో పాటు విదురుడుకూడా ఉన్నాడు.వారు ముగ్గురూ హిమాలయాలలోని దక్షిణభాగము వైపు వెళ్ళారు.అక్కడ ఒక తపోవనము చేరుకున్నారు.సప్తమహర్షుల సంతోషము కోసరము గంగానది అక్కడ ఏడు పాయలుగా చీలి,ప్రవహిస్తుంది.ధర్మరాజు ఆ పుణ్యతీర్థములో స్నానము చేసి,యధావిధి హోమములు చేసాడు.ఆ పుణ్యతీర్ధము జలమును తాగాడు.కర్మములను అన్నింటినీ వదిలి పెట్టాడు.నీరు,ఆహారము వదిలి పెట్టాడు.పర్ణశాలలోని ఉచితాసనము పై కూర్చుని,భగవంతుని ధ్యానములో పరిపూర్ణమై ఉన్నాడు.ఈ రోజు నుంచి ఏడురోజుల తరువాత యోగాగ్నికి శరీరాన్ని ఆహుతి ఇస్తాడు.గాంధారి కూడా భర్తతో పాటు అగ్ని ప్రవేశము చేస్తుంది.వారి మరణము తరువాత విదురుడు తీర్థయాత్రలకు వెళతాడు. ఈ విషయము చెప్పి నారదుడు,తుంబురుడితో కలసి స్వర్గలోకమునకు బయలుదేరాడు.

No comments:

Post a Comment