Tuesday, 4 November 2025

ధృతరాష్ట్రుడు గాంధారిల వానప్రస్థము

విదురుడు చెప్పిన మాటలు ధృతరాష్ట్రుడి బుర్రకు ఎక్కాయి.ముక్తి కావాలంటే రక్తి వదులుకోవాలి అనే సూక్ష్మం అర్థం అయింది. ధృతరాష్ట్రుడు రాజగృహము వదలి హిమవత్ ప్రాంతానికి బయలుదేరాడు.గాంథారి కూడా భర్త వెంట పయనమయింది.భర్తకోసము అస్వాభావికంగా అంథత్వము స్వీకరించిన మహా ఇల్లాలు.విదురుడు వారికి దారి చూపుతూ ముందుకు సాగాడు. ధర్మరాజు రోజూ ప్రాతఃకాలమున లేచి సంధ్యావందనము చేసుకుంటాడు.నిత్య హోమము పాటిస్తాడు.బ్రాహ్మణులకు దానములిస్తాడు.తరువాత పెద్దల దగ్గరకు వచ్చి నమస్కరిస్తాడు.వారి మంచి చెడ్డలు కనుక్కుంటాడు.అలా ఆరోజు కూడా దైనందిన కార్యక్రమాలు అన్నీ చూసుకుని ధృతరాష్ట్రుడి మందిరానికి వచ్చాడు.పెద్దమ్మ,పెద్దనాన్నలు కనిపించలేదు.సంజయుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు.అతనిని మందల అడిగాడు ఓ సంజయా!మా తల్లిదండ్రులు కనిపించడం లేదేమి?ఎక్కడకు పోయి ఉంటారు.మా తండ్రికి కళ్ళుకూడా కనిపించవు కదా!మా తల్లి ఏమో ఎప్పుడూ పుత్రశోకంతో దుఃఖిస్తూ ఉంటుంది.అయినా వాళ్ళు ఎక్కడికి పోగలరు?ఇంకెక్కడికి పోతారు?అసలు విదురుడు కూడా కనిపించడం లేదేంటి? ధృతరాష్ట్రుడికి తాను చేసిన తప్పులు అన్నీ అవలోకనం చేసుకున్నాడా?ఆ దిగులుతో భార్యతో కలిసి గంగలో దూకి ప్రాణత్యాగానికి పాల్పడ్డాడా? మా చిన్నతనంలోనే మానాన్న పోయాడు.అప్పటినుంచి వీరే మమ్ములను చేరదీసారు.మా ఆలనాపాలన అంతా వారే చూసారు. ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడికి పోయుంటారు? సంజయుడికి కూడా దుఃఖముతో నోట మాట రావటం లేదు.సంజయుడే వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నాడు.కొంచెం సేపటికి చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టాడు. హే రాజా!మామూలుగా మీ తండ్రి అన్ని విషయాలు నన్ను అడుగుతుంటాడు.ఆయనకు అన్ని వార్తలు చెబుతుంటాను.కానీ నిన్న రాత్రి ఎందుకో ఏమీ అడగలేదు.ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరూ లేరు.ముగ్గురూ నా కళ్ళు గప్పి రాత్రిపూట వెళ్ళినట్లున్నారు.వారు ఏమని నిర్ణయించుకున్నారో,ఎక్కడికి పోయారో నాకు అవగతమవటంలేదు.

No comments:

Post a Comment