Saturday, 8 November 2025

శ్రీ కృష్ణుని నిర్యాణము

ధర్మరాజు ఈ దుశ్శకునాలకు భయపడుతూ ఉన్నాడు.అర్జునుడు ద్వారక నుండి వచ్చాడు.అతని ముఖం వాడిపోయి దీనంగా ఉంది.రాగానే అనినకాళ్ళపైన పడ్డాడు.ధర్మరాజుకు ఇంకా భయమేసింది ఏమైందోనని.పెద్దగా అడిగాడు. అర్జునా!ఏమైంది.మన తాతగారు,మేనమామ,మేనత్తలు బాగున్నారా?అక్రూరుడు,కృతవర్మ,ఉగ్రసేనుడు కుశలమే కదా?ప్రద్యుమ్నుడు,అనిరుద్ధుడు క్షేమమే కదా?శ్రీకృష్ణుడు క్షేమమే కదా!ఎందుకింత దిగులుగా ఉన్నావు? నీవు మానసికంగా చాలా ధృఢంగా ఉండేవాడివి.పంది కారణంగా ఘోరమయిన అడవిలో శివుడుతో పోరాడినప్పుడు కూడా తడబడలేదు.కాలకేయులను యుద్ధంలో సంహరించినప్పుడు కూడా ఆవగింజంత కూడా బెదరలేదు.కౌరవులను కాపాడేదానికి గంధర్వులతో పోరు సల్పినపుడు కూడా చలించలేదు.అట్లాంటి నీకళ్ళలో ఆనీరు ఏంది?ఎవరిచేతిలో అయినా ఓడిపోయావా?సాధు సజ్జనులను దూషించావా?వీరుల మధ్య అవమానముపాలు అయ్యావా?ఏమి జరిగిందో తొందరగా చెప్పు. ఆడిన మాట ఏమైనా తప్పావా?ఎక్కడ అయినా తప్పుడు సాక్ష్యం చెప్పావా?ఎవరైనా శరణార్థులు నీ దగ్గరికి వస్తే కాపాడకుండా వదిలివేసావా?కారణం ఏంది? అర్జునుడు ఆగని కన్నీరును తుడిచే దానికి విఫలయత్నం చేసాడు.గొప్ప నిధిని పోగొట్టుకునినట్లు మొహం గంటు పెట్టుకున్నాడు.జీరబోయిన గొంతుతో ఇలా చెప్పాడు. అన్నయ్యా!ఈ నోటితో ఏమని చెప్పేది.మనకు సారథి,మంత్రి,బావ,మిత్రుడు,బంధువు,ప్రభువు,గురువు,దేవుడు,సర్వమూ,సమస్తమూ అయిన శ్రీకృష్ణుడు మనలను అందరినీ ఏకాకులను చేసి,విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. మనకు ఎంత చేసాడు!మనకు ఆయన చేసిన సహాయాలు ఒకటా రెండా!సవాలక్ష!మత్స్య యంత్రము నా చేత కొట్టించి ద్రౌపది మనకు దక్కేలా చేసాడు.శ్రీకృష్ణుడి ఊతం లేకపోతే నేనొక్కడినే ఇంద్రుడిని ఎదిరించి ఖాండవ దహనము చేయగలిగేవాడినా?అతని అనుగ్రహము తోటే కదా మనము ఇంత మంది రాజులను జయించి ఇంతింత ధనము సంపాదించింది!మయుడు నిర్మించిన సభాభవనము మనకు అతని దయ వల్లనే కదా దక్కింది.మనము రాజసూయయాగము సంపూర్ణం చేసేదానికి ఆయనే కదా ఆయువు పట్టు! ఇంతెందుకు?దుష్టులు అయిన కౌరవులు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చి వస్త్రాపహరణం చేసినప్పుడు,ఆమె మానసంరక్షణ చేసింది అతనే కదా!ఆమెకు ధైర్యము చెప్పి,ప్రతిజ్ఞ చేసి,శత్రుసంహారం చేసేదానికి ఆయన అనుగ్రహమేకదాకారణం! ఇలా అర్జునుడు అన్నయ్య దగ్గర వాపోయాడు.

No comments:

Post a Comment