Thursday, 6 November 2025

ఎటు చూసినా దుర్నిమిత్తములు

ధర్మరాజుకు మనసు కుదురుగా అనిపించడం లేదు.అన్నీ చెడ్డ శకునాలు కనిపిస్తున్నాయి.మనసు కీడు శంకిస్తూ ఉన్నది.భీముడితో తన మనసులోని గుబులు బయటపెట్టుకుంటున్నాడు. భీమా!నారద మహర్షి వచ్చి వెళ్ళాడు కదా!అతను చెప్పినట్లు కాలం మారుతున్నట్లు అనిపిస్తుంది.పంటలు సరిగ్గా పండటం లేదు.రాబడి క్షీణిస్తున్నది.జనబాహుళ్యం కామక్రోధాలకు లోనవుతున్నారు.చాలా తేలికగా నోటి వెంట అసత్యాలు పలుకుతున్నారు.ఇతరులను మోసగించడం దినచర్యగా మారుతున్నది.ఎక్కువ మంది అధర్మ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.కాగడా పెట్టి వెతికినా మోసములేని వ్యవహారము,కపటంలేని ప్రేమ,స్నేహము కనిపించడం లేదు.మొగుడూ పెళ్ళాలు కూడా అస్తమానమూ గొడవలు,కలహాలు పెట్టుకుంటున్నారు.కొడుకులను చూస్తే,ఏకంగా తండ్రులను చంపేదానికి ఉరుకుతున్నారు.శిష్యులు పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా గురువులనే దూషిస్తున్నారు.చదువు కున్నవారికి విచక్షణ,విశ్లేషణ ఉండాలి సహజంగా.కానీ అలా చదువుకున్నవారు కూడా న్యాయము విడిచి తప్పుదోవలో నడుస్తున్నారు.కాలం మరీ ఇంత విపరీతంగా మారుతుందని అసలు నేను ఊహించలేదు. మన వ్యవహారానికి వస్తే,అర్జునుడు ఇంకా ఇంటికి రాలేదు.ద్వారకకు పోయి ఏడు నెలలు కావస్తుంది.యాదవులు ఏమో చపలచిత్తులు.ఎప్పుడూ కోపతాపాలకు బానిసలు అయి ఉంటారు.ఇప్పుడు సవ్యంగా ఉన్నారో లేదో?శ్రీకృష్ణుడు సుఖ సంతోషాలతో ఉన్నాడో,లేడో?నాకు మనసు అంతా కకలావికలంగా ఉంది.మనసు స్థిమితంగా లేదు.ఇదీ అని కారణం ఏమీ లేదు. నాకు వ్యాకులతగా ఉంది.నాకు చాలా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి.ఒక కుక్క నాకు ఎదురుగా నిలబడి మోర ఎత్తి మొరుగుతున్నది.ఒక నక్క నోట మంటలు గ్రక్కుతూ,సూర్యుడికి అభిముఖంగా నిలుచుకుని విచారంగా ఊళ పెడుతున్నది.గద్దలు,కాకులు ...ఎప్పుడూ లేని విథంగా గుంపులు గుంపులుగా బారులు తీరి కనిపిస్తున్నాయి.గుర్రములు కంట నీరు పెడుతున్నాయి.ఏనుగులలో సహజంగా కనిపంచే మదము అసలు కానరావడం లేదు.పావురం శాంతికి చిహ్నం కదా!కానీ నా కళ్ళకు యమదూతలాగా కనిపిస్తున్నది.నిత్యము హోమాగ్ని ప్రజ్జ్వలనము అయే చోట అసలు మండటం లేదు.దిక్కులూ,మూలలూ పొగ నిండిపోతున్నది.సూర్యుడి తేజస్సు తగ్గింది.భూమి కంపిస్తూ ఉంది.గాలి సుడులు తిరుగుతూ దుమారం రేగి ఆకాశాన్ని కప్పి వేస్తున్నది.నీటిని వర్షించాల్సిన మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి.ఎవరి స్థానంలో వారు ఉండాల్సిన గ్రహాలు పోట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది.అకాలంగా పిడుగులు పడుతున్నాయి.భూమి క్రింద నుండి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి.భూమి ఆకాశాల మధ్య భాగము అగ్నికీలలతో నిండినట్లు భయం కొలుపుతుంది.దూడలు పాలు తాగటం లేదు.పోనీ అవి వెళ్ళినా ఆవులు వాటికి పాలు ఇవ్వటం లేదు.ఆలయాల్లో ఉండాల్సిన విగ్రహాలు బయట తిరుగుతున్నాయి. భీమా!ఇదంతా నాభ్రమనా?లేక నిజంగా జరుగుతుందా?నాకేమీ పాలు పోవటం లేదు.మొత్తానికి చాలా అసంతృప్తిగా,అసహనంగా,అలజడిగా ఉంది. ఈ ఉత్పాతాలు అన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది.భూదేవికి ఇంక శ్రీకృష్ణుడిని సేవించే భాగ్యము లేదేమో అనిపిస్తుంది.

No comments:

Post a Comment