Thursday, 11 December 2025

ఖట్వాంగుడు

శుకుడు పరీక్షిత్తుకు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు.మీకు తెలుసు కదా మా తండ్రి వ్యాసుడు అని.అతను ద్వాపర యుగములోనే బ్రహత్వమును సిద్ధింపజేసే భాగవతామును రచించాడు.నాకు చెప్పాడు ఆ పూర్వాపరాలు అన్నీను.నాకు ఉత్తమ చరిత్రలు, రచనలు చదవాలనే తపన ఉంది.కాబట్టి నేను శ్రద్ధాసక్తులతో భాగవతాన్ని పఠించాను. నీ విషయానికి వస్తే,నీవు కూడా హరిభక్తుడివి.ఎల్లప్పుడూ ఆ విష్ణువు ధ్యానంలోనే నిమగ్నమయి ఉంటావు.భాగవతము విషయానికి వస్తే ఆ గ్రంథము విష్ణువు గురించి వివరిస్తుంది.అలాగే విష్ణు భక్తుల గురించి కూడా సవివరంగా చెబుతుంది.మోక్షము కావాలి అని కోరుకునే వారికి భాగవతము వలన తప్పక కైవల్యం దక్కుతుంది.కాబట్టి ఇప్పుడు నేను నీకు ఆ భాగవతము చెబుతాను. పూర్వము ఖట్వాంగుడు అనే రాజు ఉండేవాడు.అతను మహాపరాక్రమశాలి.సప్త ద్వీపాలనూ పాలిస్తుండేవాడు.దేవతలు రాక్షసులతో యుద్థంలో గెలనలేక పోతూ ఉండేవారు.అప్పుడు దేవేంద్రుడు ఖట్వాంగుడి సహాయము కోరాడు.అప్పుడు ఆ ధీశాలి రాక్షసులను ఓడించాడు.దేవతలు అందరూ సంతోషించారు.వారు రాజును ఏదైనా వరము కోరుకో,తీరుస్తాము అని మాట ఇచ్చారు.ఖట్వాంగుడు తనకు ఇంక ఎంత ఆయుస్సు మిగిలి ఉందో చెప్పమన్నాడు.వాళ్ళు లెక్కలు చూసి,ఇంక ఒక్క క్షణం మటుకే మిగిలి ఉంది అని ఉటంకించారు. రాజు తత్తర పాటు పడలేదు.ప్రశాంతంగా,వెంటనే రాజ్యానికి వచ్చాడు.సర్వ సంగ పరిత్యాగి అయ్యాడు.గోవింద నామం జపిస్తూ,ధ్యానిస్తూ చివరి రెండు ఘడియలలోనే ముక్తిని పొందాడు. ఓ రాజా!నేను నీకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నానో అర్థం అవుతుందా?మనసా,వాచా,కర్మణా శ్రీహరిని ఒక్క క్షణం ధ్యానించినా ముక్తి లభిస్తుంది.అలాంటిది నీకు వారం రోజులు గడువు ఉంది.కాబట్టి సమయాభావం అని భయపడవద్దు.ఈ వారం రోజులూ హాయిగా శ్రీహరిని స్తుతించు.అతని చరిత్రలు విను.నీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. మనసు పాదరసంలాగా చంచలమయినది.దానిని బుద్ధిబలంతో నివారించు.నీ మనోఫలకం పైన ఆ భగవంతుడిని ప్రతిష్టించుకో!రజోగుణము,తమోగుణములను ఆమడ దూరంలో ఉంచు.దరి చేర నివ్వవద్దు.ధారణాబలంతో హరిధ్యానం చేస్తే ముమ్మాటికీ నీకు ముక్తి లభిస్తుంది.

1 comment: