Friday, 28 November 2025

బుడ్డోళ్లతో భేటీ బహు బాగు

నాలుగు రోజుల ముందు అయ్యప్పమాల వేసిన పూజకు వెళ్ళాను.మొదటి రెండు మూడు గంటలూ పూజ చూస్తూ గడిచి పోయింది. నా ప్రక్కన ఒక ఆమె కూర్చుంది.వాళ్ళ మనవడు నా దగ్గరకు వచ్చాడు.నాలుగేళ్ళ వాడు.పేరు అడిగితే చెప్పాడు.భలే ముద్దుగా ఉన్నాడు.వాడు నేను నవ్వగానే భలే ఆశ్చర్యపోయాడు.vasco de gama మన భారతదేశాన్ని కనిపెట్టినప్పుడు కూడా అంత ఆనందించి ఉండడు అనిపించింది.అమ్మా!అమ్మమ్మకు పన్ను లేదు అంటూ అరిచాడు.discovery of the century లాగా గర్వంగా మొహం పెట్టాడు.రేయ్!ఒకటి కాదురా సగం పైన లేవు ఇక్కడ అని నవ్వాను. ఇంక భోజనాలు మొదలు.పళ్ళెంలో లడ్డు పెట్టుకుని ఎక్కడ కూర్చోవాలా అని చూస్తూ చిన్నగా అడుగులు వేస్తున్నాను.ఒక నాలుగైదు ఏళ్ళపాప తన ప్రక్కన కూర్చోమని సైగ చేసింది.వాళ్ళ అమ్మనాన్నవాళ్ళు ఉంటారు కదా!అని తటపటాయించాను.ఎవరూ లేరా పాపా అని అడిగితే లేరు అనింది.ఏమి పేరు,ఏ బడి,ఎన్నో తరగతి అని అడిగాను.అన్నిటికీ ముచ్చటగా సమాథానం చెప్పింది.ఇంక తనకు ఊపు వచ్చింది.నాకు డాన్స్ వచ్చు తెలుసా అనింది.అవునా!చేసి చూపించు బుజ్జీ అంటే చేసింది.పాటలు పాడుతావా అంటే ఓ అంటూ మంచి సంస్కృత శ్లోకం స్పష్టంగా,రాగయుక్తంగా చెప్పింది.బొమ్మలు వేస్తావా తల్లీ అని అడిగాను .ఓ అంది.కానీ పేపరు,పెన్సిల్ లేదు అనింది.పరవాలేదులే నా అరచేతిలో చిన్న బొమ్మ నీ వేలుతో గీయి అని అన్నాను.సరే అని గీసింది.ఇప్పుడే వస్తాను అని పైకి పరుగెత్తుకుని పోయి,పేపరు పెన్సిలు తెచ్చింది.ఏమి వేసేది అని అడిగింది.నా బొమ్మ వేయి బుజ్జితల్లీ అని అన్నాను.ఎంత బాగా వేసింది అంటే నేను అంత అందగత్తెను అని నాకే ఇన్ని రోజులు తెలియలేదు.బంగారు తల్లికి ముద్దులు పెట్టాను.వడ్డీతో సహా నాకు అప్పుడే తీర్చేసింది.ఇట్లానే నేను అడుగుతుంటే తన బొమ్మ,నా ప్రక్కన ఉన్న ఇంకో అమ్మమ్మ బొమ్మ,వాళ్ళ బుజ్జి తమ్ముడు బొమ్మ,శివుడు,కుక్క,నత్తగుల్ల,రంగవల్లిలు వేసింది.నాకోసము నెంబర్లు ఒకటి నుంచి పది దాకా రాసింది.వంద దాకా రాయగలను కానీ స్థళం లేదు అని వంద రాసింది.వెయ్యి కూడా వచ్చు అనింది.ఎన్ని సున్నాలో డౌటు అనింది.ఒకటి రాసి మూడు సున్నాలు పెట్టాలి అమ్ము అంటే చకచకా పెట్టేసింది.ఇంగ్లీషు వచ్చు అని apple,ball,cat,dog,తన పేరు,తమ్ముడి పేరు రాసింది.ఇంక మా పిల్లలు బయలుదేరాతామంటే సరే తల్లీ పోయొస్తాను అని అన్నాను.నా కోసం ఫేర్ వెల్ డాన్స్గ్ చేసి బై చెప్పింది.నాకు మనసు అంతా హాయిగా అయింది. రెండో రోజు ఫ్లైటులో నా ప్రక్కన ఒక బిడ్డతల్లి కూర్చుంది.వాళ్ళ పాపకు సంవత్సరము దాటింది.నడక వచ్చు.ఇంకా మాటలు రాలేదు.పలకరిస్తే పాలపళ్ళు అన్నీ చూపిస్తూ నవ్వేసింది.చేయి అందిస్తుంది.చిన్నగా నన్ను తాకుతుంది.కొంచొం సేపు గమ్ముగా తనని పట్టించుకోకపోతే వాళ్ళ అమ్మ ఒడిలోంచి దిగి నాదగ్గరకు వచ్చి కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసి నవ్వుతుంది.తనతో అసలు అలసట తెలియలేదు. ఇలా బిడ్డలతో గడపడము నాకు అదృష్టము అనిపించింది.ఎందుకంటే వాళ్ళు కానీ,వాళ్ళ అమ్మా నాన్న కానీ నాకు తెలియదు.మళ్ళీ ఇంక అసలు వాళ్ళను కలవలేనేమో కూడా!

1 comment: