Sunday, 18 January 2026

వామన,హంస,మనువు,ధన్వంతరి అవతారములు

శ్రీహరి అదితి,కశ్యపులకు వామన రూపంలో జన్మించాడు.ఇంద్రుడికి తమ్ముడు అయినాడు.బలి చక్రవర్తి రాక్షస రాజు.అతనిని ఈ బ్రాహ్మణుడిగా వెళ్ళి మూడడుగులు దానం అడిగాడు.బలికి వచ్చింది శ్రీమహా విష్ణువే అని తెలుసు.కానీ ఒప్పుకున్నాడు.అంతలో వామనుడు ఇంతింతై వటుడింతై ముల్లోకాలనూ ఆక్రమించాడు.మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే తన శిరస్సు చూపిస్తాడు బలి చక్రవర్తి.రాక్షస గురువు చాలా వారిస్తాడు వద్దని,వచ్చింది ఆ పురుషోత్తముడని.కానీ బలి వినలేదు,వినిపించుకోలేదు. భగవంతుడికే దానమిచ్చిన ఘనత బలి చక్రవర్తిది.వామనుడు అంతట తన మూడో అడుగు బలి తల పైన ఉంచి అధః పాతాళానికి అణగద్రొక్కాడు.ఇంద్రునికి స్వర్గాన్ని అప్పగించాడు. ఇది వామన అవతారము. బ్రహ్మ నారదుడితోటి హంస అవతారము గురించి చెబుతున్నాడు.ఓ నారదా!ఆ విశ్వ వ్యాపకుడు నా దైవభక్తి యోగానికి చాలా సంతోషించాడు.అప్పుడు హంస రూపము దాల్చాడు.హంస అయి ఆత్మ తత్త్వాన్ని వివరించే భాగవత పురాణాన్ని నాకు బోధించాడు.ఇది హంసావతార కథ. ఆ దేవదేవుడు మనువుగా పుట్టాడు.గొప్ప తేజస్సుతో మెలిగాడు.అప్రతిహతమయిన చక్రాయుధాన్ని ధరించాడు.ఇక దుష్ట శిక్షణకు నడుము బిగించాడు.దుష్టులయిన రాజులనందరినీ దునుమాడుతూ శిష్టులను పాలించాడు.ఇది మనువు అవతారము. ఆ చక్రథారి,ఆ మహావిష్ణువు ధన్వంతరిగా అవతరించాడు.ఆయుర్వేదమును నిర్మించాడు,కనుగొన్నాడు.ఆయన తన నామము స్మరిస్తేనే జనుల రోగములు నశింపచేసేవాడు.ఇది ధన్వంతరి అవతార సారము.

Friday, 9 January 2026

నృసింహావతార,ఆది మూలావతార కథ

పూర్వము హిరణ్య కశిపుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు.రాక్షస ప్రవృత్తి అంటే ఇంక క్రూరత్వము కరడు గట్టి ఉంటుంది కదా!అతడు గదను ఆయుధముగా చేసుకుని దేవతలను చాలా ఇక్కట్లపాలు చేసాడు.చాలా బాధలు పెట్టాడు.స్వర్గము ఛిందరవందరమయింది.ఎక్కడ చూసినా కల్లోలమూ,భీభత్సమే!అప్పుడు అసుర సంహారము కోసము శ్రీమహా విష్ణువు నృసింహ రూపం ధరించాడు. ఇల్లూ వాకిలీ కాకుండా గడప పైన కూర్చుని,పగలూ రాత్రి కాకుండా అసుర సంధ్య వేళలో,ఏ అస్త్ర శస్త్రాలు వాడకుండా తన గోళ్ళతో ఆ దుష్టుడిని చీల్చి చంపాడు.ఈ కార్యంతో ముల్లోకాలకూ మేలు చేసాడు.అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేలా చేసాడు.ఇది నృసింహావతార కథ. గజేంద్రుడు ఒకసారి నీటికోసరం మడుగులోకి దిగాడు.అప్పుడు ఒక మొసలి దాని కాలును నోట పట్టుకుంది.అప్పుడు ఆ గజేంద్రుడు ఆ మొసలి తో వేయి ఏండ్లు పోరాడాడు దాని పట్టు నుంచి విడిపించుకునేదానికి.కానీ తన శక్తి యుక్తులు చాలలేదు.అప్పుడు గజేంద్రుడు శ్రీహరిని శరణు కోరాడు.లావొక్కింతయు లేదు,ధైర్యము విలోలంబయ్యే.....అంటూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మిని వదలి,వైకుంఠపురాన్ని వదలి,పై పంచే జారి పోతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసాడు భక్తుడిని రక్షించేదానికి.తన విష్ణు చక్రంతో మొసలిని తుదముట్టించి గజేంద్రుడిని కాపాడాడు. ఇది శ్రీమహా విష్ణువు యొక్క ఆదిమూలావతారము.

Wednesday, 7 January 2026

మత్స్య,కూర్మావతారాలు

బ్రహ్మ చెబుతున్నాడు నారదుడికి.నారదా!వైవస్వత మనువు కాలంలో యుగము అంతము అయింది.అప్పుడు జలప్రళయము సంభవించింది.అప్పుడు విష్ణువు విచిత్రమయిన మత్స్యరూపము ధరించాడు.ఆ చేప రోజు రోజుకు పెరుగుతూ,చాలా స్వల్ప వ్యవథిలో బ్రహ్మాండంగా పెరిగింది.ఆ చేప సృష్టి అంతరించకుండా కాపాడింది.సృష్టికి ఆధారములు అయిన వస్తువులు,జీవరాశులులో నిండి,ఆ మనువు ఎక్కి ఉండే నావ మునిగి పోకుండా కాపాడింది. ఆ సమయంలో నానుంచి వేదాలను రాక్షసులు అపహరించి ఉన్నారు.దేవతల ప్రార్థన మేరకు ఆ వేదములును తిరిగి నాకు అప్పగించింది. ఇది మత్స్యావతార కథ. ఒకానొకప్పుడు దేవతలు,దానవులు అమృతము కోసము కష్టపడ్డారు.మంధర పర్వతాన్ని కవ్వములాగా చేసుకున్నారు.వాసుకిని కవ్వము చిలికేదానికి వాడే త్రాడు లాగా కట్టారు.పాల సముద్రాన్ని ఏక బిగిన చిలకటం మొదలుపెట్టారు చెరొక ప్రక్కన నిలబడి.కొంచెం సేపటికి ఆ పర్వతము మునిగి పోబోయింది.అప్పుడు భగవంతుడు కూర్మరూపంలో సముద్రం అడుగుకు వెళ్ళి,కవ్వము మునిగిపోకుండా తన వీపుపై పెట్టుకున్నాడు.ఆ పట్టు ఇచ్చాడు కాబట్టే దానవులు,దేవతలు అమృతము చిలకగలిగారు. ఇది కూర్మావతార కథ.

Tuesday, 6 January 2026

వృషభుడు,హయగ్రీవుడు

అగ్నీధ్రుడు అనేవాని పుత్రుడు నాభి.ఆ నాభి భార్య మేరుదేవి.ఆమెకు సుదేవి అనే పేరు కూడా వాడుకలో ఉంది.ఆ దంపతులకు వృషభుడు అనే కొడుకు పుట్టాడు.వృషభుడు ఎవరో కాదు!విష్ణువే ఆ పేరుతో వారికి పుట్టాడు. వృషభుడు శాంతమూర్తి.సర్వసంగ పరిత్యాగి.ఆయన పరమ హంస అయి మునులందరి ప్రశంసలు పొందాడు.ఇది వృషభావతార కథ. హయగ్రీవుడు బంగారు మేని ఛాయ గలవాడు.భగవదంశ సంభూతుడు.అతడు బ్రహ్మ ముఖమునుండి పుట్టాడు.అతను వేదాలలో దిట్ట.ఒకరకంగా చెప్పాలంటే వేదమయుడు.యజ్ఞ పురుషుడు.హయగ్రీవుడు ఎంతటి మహానుభావుడు అంటే అతని నాసిక నుండి వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్లనే వేదములు పుట్టాయి.ఇది హయగ్రీవావతార వృత్తాంతము.

Sunday, 4 January 2026

ధృవుడు,పృథుడు

ధృవుడు ఉత్తానపాదుడు అనే రాజుకు పుత్రుడు.అతను విష్ణువు అంశతో జన్మించాడు.అతని చిన్న వయసులో తండ్రి ఒళ్ళోకూర్చోబోయాడు.సవతి తల్లికి ఒప్పలేదు.తండ్రి తొడపై కూర్చుని,మురిపాలు పోవాలి అనే ఆ చిన్న బాలుడి కోర్కె తీరని కోరికే అయింది.ఆ సవతి తల్లి మాటలు ఆ చిన్నారి గుండెల్లో గునపాల్లా గ్రుచ్చుకున్నాయి.మానవుల ప్రేమలు సమంగా ఉండవు.భగవంతుడే సర్వకాల సర్వావస్థలయందు అందరినీ సమంగా ప్రేమిస్తాడు అని కన్న తల్లి చెప్పింది.ఎవరైతే తనను తననుగా ప్రేమిస్తారో,వారి ప్రేమ పొందితే చాలు అని తల్లి చెప్పిన మాటలు తలకెక్కాయి.అంతట తక్షణం ఆ పరమాత్ముడిని అన్వేషిస్తూ కానలకెళ్ళాడు. అడవిలో విష్ణువు కోసం ఘోర తపస్సు చేసాడు.ఆ భగవంతుడు అతనికి అత్యున్నతమయిన ధృవ స్థానం కల్పించాడు.భృగువు,మిగిలిన మునులు అతనిని స్తుతించారు.ధృవ మండలము సప్తర్షి మండలానికి పైభాగాన ఉంటుంది.ఇది ధృవావతార కథ. మునుపు వేనుడు అని ఒక రాజు ఉన్నాడు.భలే కృూరుడు.దుష్ట ప్రవర్తనకు తగినట్లుగా అతనికి బ్రాహ్మణ శాపం తగిలింది.దాని దెబ్బకు భాగ్యము అంతా పోయింది.ధనంతోటే పౌరుషము కూడా కనుమరుగు అవుతుంది కదా! పృథువు ఆ వేనుని పుత్రుడు.తండ్రి దుష్ట బుద్ధి ఇసుమంతకూడా అంటలేదు.అతను లోకములకు హితము కూర్చిన మహనీయుడు.ఇతను కూడా విష్ణు అంశతో పుట్టాడు.చక్రవర్తి అయ్యాడు.ఇతను భూమిని గోవుగా చేసాడు.సమస్త వస్తువులను పిదికాడు.పుత్రుడుగా తన ధర్మం నిర్వర్తించాడు.తండ్రికి ఉత్తమ గతి కల్పించాడు. ఇది పృథువు అవతార కథ.

Friday, 2 January 2026

సనకాదులు,నరనారాయణులు

బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.నేను ఒకానొకప్పుడు కల్పాదినీ,లోకాలనూ సృజింపదలచాను.అందుకని తపస్సు చేయఢం మొదలుపెట్టాను.అప్పుడు నా నోటి నుండి సన అనే శబ్దము వెలువడింది.అందువల్ల సన అనే పేరుగల నలుగురు మానస పుత్రులు కలిగారు నాకు.వారే సనకుడు,సనందనుడు,సనత్కుమారుడు మరియు సనత్సుజాతుడు.పోయిన కల్పాంతంలో వారే ఆత్మతత్త్వాన్ని తిరిగి నెలకొల్పారు.వారు వేరుగా కనిపించినా నలుగురూ విష్ణువు అంశమే.ఇది అందరూ గ్రహించాలి. ఇదే సనకాదుల వృత్తాంతము. ఇక నరనారాయణుల గురించి చెబుతాను.మూర్తి అనునామె దక్షపుత్రిక.ఆమెకు,ధర్మునికి ఇద్దరు కుమారులు పుట్టారు.వారే నరనారాయణులు.వారిరువురూ మంచి గుణములు కలవారు.పరమ పావన మూర్తులు.వారు మునులు అయినారు.బదరీ వనంలో ఘోరమయిన తపస్సు చేయసాగారు.దేవేంద్రుడికి భయం పట్టుకుంది.వారి తపోబలం వలన తన పదవికి భంగం కలుగుతుందేమో అని.ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే గదా!వారి తపస్సు భగ్నం చేసేదానికి అప్సరసలను రంగంలోకి దించాడు. ఆ అప్సరసలు దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు తమ తమ శక్తియుక్తులు అన్నీ ప్రదర్శించారు.కానీ నరనారాయణులు చలించలేదు.మామూలు మునులు అయి ఉంటే ఎప్పుడో వాళ్ళను భస్మంచేసి ఉండేవాళ్ళు.కానీ వీరిరువురూ సత్త్వగుణసంపన్నులు.కాబట్టి కోపం తెచ్చుకోలేదు.శాంతి మార్గాన్నే ఎంచుకున్నారు. నారాయణుడు తన యూరువును చీల్చగా,అందుండి ఒక సౌందర్యవతి ఉద్భవించినది.ఆమె అతిలోక సుందరి.ఆమె కాలి గోటికి కూడా సరికాదు ఈ అప్సరసల అందచందాలు.వారు సిగ్గుతో తల వంచుకున్నారు.ఊరువు వలన ఉద్భవించినది కావున ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చినది.అప్సరసలు అవమానభారంతో వెనుతిరిగారు.ఇది నర నారాయణావతార వృత్తాంతము.

Thursday, 1 January 2026

కపిలుడు,దత్తాత్రేయుడు

కర్దమ ప్రజాపతికి,దేవహూతికి తొమ్మిది మంది సోదరీమణులతో కలిపి కపిలుడు జన్మించాడు.సాంఖ్య యోగము అనేది భగవంతుడు అయిన శ్రీహరిని పొందేదానికి అనువైన మార్గము.ఆ సాంఖ్య యోగాన్ని తన తల్లికి ఉపదేశించాడు.పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలి విశదీకరించాడు.ఆ పై ముక్తిని పొందే మార్గము బోధించాడు.ఇది కపిలావతార కథ. అత్రి మహాముని తపస్వులలోకి ఉత్తముడు.అతను పుత్రుడు కావాలని శ్రీహరిని ప్రార్థించాడు.ఆ భగవంతుడు నేను నీకు దత్తుడను అంటూ అత్రి మహామునికి కొడుకుగా పుట్టాడు.అతడే దత్తాత్రేయుడు.దత్తుడు అయిన శ్రీహరి అత్రి మహామునికి పుత్రుడు అయినాడు కాబట్టి ఆత్రేయుడు అయినాడు.హరికి దత్తాత్రేయ నామము కలిగే దానికి ఇదే కారణము. దత్తాత్రేయుడి పాద ధూళితో హైహయ వంశీయులు,యాదవులు పవిత్రులు అయినారు.వారందరూ ఐహిక సుఖాలను అనుభవించారు.అలాగే పరలోక సుఖాలనూ ఆస్వాదించారు.ఇది దత్తాత్రేయావతార కథ.