Wednesday, 1 October 2025

నారదుడు అక్కడకు వచ్చాడు

వ్యాసుడు దిగులు పడుతున్నాడు.అక్కడకు నారదుడు వచ్చాడు.ఆయన ఎప్పుడూ మహతీ వీణను వాయించికుంటూ,నారాయణ స్మరణ అనునిత్యం చేసుకుంటూ తిరుగుతుంటాడు కదా!నిజంగా మహానుభావుడు!వ్యాసుడు నారదుడి రాకను దూరంనుంచి చూసాడు.ఆనందంగా,ఆదరంగా ఆయనకు ఎదురు వెళ్ళాడు.సంతోషంగా ఆయనను తీసుకుని వచ్చి,అర్ఘ్యపాద్యాలతో సత్కరించుకున్నాడు.నారదుడికి వ్యాసుడిని చూడగానే అర్థమయిపోయింది ఎందుకో ఎడతెరిపి లేకుండా దిగులు పడుతున్నాడని.నారదుడు ఆప్యాయంగా,అనునయంగా వ్యాసుడితో ఇలా మాటలాడటం మొదలు పెట్టాడు.ఓ మహర్షీ!నువ్వు చిన్నా చితకా వాడివి కాదు.వేదాలను విభజించిన ప్రతిభాపాటవాలు ఉన్న వాడివి.భారతము అంటే పంచమ వేదము అంటారు.ఆ మహాకావ్యాన్నే రచించావు.కామ క్రోథ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలనే సునాయాసంగా జయించావు.నీకు బ్రహ్మతత్త్వము తెలుసు.మునులుకు,యోగులకు,సాథువులకు నాయకుడివి.ఇన్ని గొప్ప గుణాలు ఉన్న నీకు దిగులుకు కారణం ఏంది?ఎందుకు అంత బేలగా,పిరికివాడిలాగా దిగులు విచారంలో మునిగి ఉన్నావు?

Monday, 29 September 2025

వ్యాసుడి పుట్టుక…వేదముల విభజన

సూతుడికి భలే సంతోషంఅయింది,శౌనకాది మునులు అట్లా అడిగేటప్పటికి.ఊపూ ఉత్సాహంతో చెప్పడం మొదలు పెట్టాడు.మూడవ ద్వాపర యుగము ముగిసింది.ఉపరిచర వసువుల వలన వాసవి పుట్టింది.ఆమెకు సత్యవతి అని ఇంకో పేరు కూడా ఉంది.ఆమె యందు పరాశర మునికి వ్యాసుడు పుట్టాడు.వ్యాసుడు విష్ణువు అంశతో పుట్టాడు.అతను మహా జ్ఞాని.అతను బదరికాశ్రమములో ఉండేవాడు.ఒకరోజు దగ్గరలోనే ఉండే సరస్వతీ నదీ తీరంలో స్నానపానాదులు ముగించుకుని వచ్చాడు.ప్రశాంతంగా ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో,సూర్యోదయ సమయంలో యుగధర్మాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతని మనసుకి ఇలా అనిపించింది.లోకంలో మానవులకు ఆయుష్షు తక్కువ.బలహీనంగా ఉంటారు.జవసత్త్వాలు తొందరగా నశిస్తాయి.దాని కారణంగా ధైర్యము ఉండదు.కాబట్టి సర్వ మానవకోటికి హితవుగా ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతడు నలుగురు హోతలచేత అనుష్టింపదగినవి,ప్రజలకు మంచి చేసే యజ్ఞాలు నిరంతరం చేయించాలనుకున్నాడు.నాలుగు వేదాలు అన్నీ కలగాపులగం అయిపోయి ఉన్నాయి.వాటిని మంచిగా నాలుగు వేదాలుగా విభజించాడు.అవి ఋగ్వేదము,సామవేదము,యజుర్వేదము మరియు అధర్వణ వేదము.విభజించడంతో ఊరుకోలేదు.అతను ఓపికగా ఋగ్వేదాన్ని పైలునకు,సామవేదం జైమినికి,యజుర్వేదం వైశంపాయునికి అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు.తాను చెప్పిన పురాణాలు,ఇతిహాసాలను రోమహర్షణ మహామునికి బోధించాడు.రోమహర్షణుడు ఇంకెవరోకాదు,స్వయానా సూతుడి తండ్రి.పైలుడు,జైమిని,వైశంపాయనుడు,సుమంతుడు వాళ్ళకు చెప్పబడిన వేదాలను విభజించి వారి వారి శిష్యులకు చెప్పారు.ఈ రకంగా వేదాలను చిన్న చిన్న భాగాలు చేసారు.కాలక్రమేణా ఆ వేదాలు అజ్ఞానుల నోళ్ళలో కూడా పడ్డాయి.వ్యాస మహర్షి ఈ విషయం గమనించాడు.అందుకని పామరులకు,స్త్రీలకు,మందబుద్ధి గల వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా మహాభారతం రచించాడు.మహా భారతానికి పంచమ వేదము అనే పేరు కూడా వచ్చింది.ఇంత చేసినా వ్యాసుడికి వ్యాకులత పోలేదు.ఏదో అసంతృప్తి.ఇంకేదో దిగులు,విచారమూ పట్టుకున్నాయి.మనసును లాగేసే ఈ కలత,కలవరపాటుకు కారణం ఏంది అని సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆలోచించటం మొదలుపెట్టాడు.అప్పుడు తోచింది.ఏమని అంటే ...శ్రీహరికి,యోగులకు,మునులకు ఇష్టము అయిన భాగవతము చెప్పాలనే ఆలోచన ఇన్ని రోజులు రాక పోవటమే అని.నా దిగులు,విచారం,మనోవ్యాకులతకు కారణం ఖచ్చితంగా ఇదే అని నిర్ధారణకు వచ్చాడు.

Thursday, 25 September 2025

శుక మహర్షి గొప్పదనం

శౌనకాది మహా మునులు సూతుడు చెప్పిన మాటలు విన్నారు.వాళ్ళందరూ ముక్త కంఠంతో ఇలా అడిగారు. ఓ సూత మునీంద్రా!అసలు దీనికి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి?ఈ భాగవతాన్ని రచించమని ఏయుగంలో ఎవ్వరు అడిగారు?ఎక్కడ అడిగారు?ఎందుకు అడిగారు? శుక మహర్షి వ్యాసుని కొడుకు.అతడు మాయా మోహాన్ని అతిక్రమించిన వాడు.స్వపర భేదం లేకుండా సమస్తాన్ని సమానంగా చూడగలుగుతాడు.చూస్తాడు.పరబ్రహ్మను కనుగొన్నాడు.ఎప్పుడూ ఏకాంతవాసం కోరుకుంటాడు.అతడికి అందరూ సమానమే!ఎంతలా అంటే స్త్రీ పురుష విచక్షణ కూడా కనబరచడు.అసలు లేదు.దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది.అది ఇలా సాగుతుంది. ఒకరోజు శుక మహర్షి దిగంబరంగా దారిలో వెళుతున్నాడు.ఆ ప్రక్కనే దేవతా స్త్రీలు వివస్త్రలయి జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు.వారు ఈయనని చూడగానే అలాగే బయటకి వచ్చి ఆయనను పిలుస్తూ ఆయన వెనక వెళ్ళారు.శుక మహర్షి వారిని గమనించకుండా,తన దారిన తాను వెళ్ళిపోయాడు.ఇంకొంత దూరంలో వ్యాస మహర్షి వస్తూ వాళ్ళకి కనిపించాడు.వాళ్ళందరూ సిగ్గు పడిపోయి,మెలికలు తిరుగుతూ,గబగబా వస్త్రాలు ధరించారు. వ్యాసుడికి అర్థంకాలేదు.తన కొడుకు వెనక వివస్త్రలయి పరిగెత్తారు.వార్థక్యంలో ఉన్న తనను చూసి వారందరూ సిగ్గు పడుతున్నారు.ఉండ బట్టలేక అడిగేసాడు.ఓ దేవతా యువతులారా!నా కుమారుడు యువకుడు.యవ్వనంలో ఉన్నాడు.అందులోనూ బట్టలు లేకుండా వెళుతున్నాడు.మీరు ఏమో సిగ్గు విడిచి,వస్త్రములు ఒంటి పైన లేక పోయినా,అతనిని పిలుస్తూ,అతని వెంట పడ్డారు.నా విషయానికి వస్తే,నేను ముసలి వాడను.జవసత్త్వాలు ఉడిగిన వాడిని.దానికి తోడు శుభ్రంగా,మర్యాదపూర్వకంగా బట్టలు ధరించాను.ఎందుకు నన్ను చూడగానే మీరందరూ సిగ్గు పడ్డారు?ఎందుకు వస్త్రములను ధరించారు? దానికి ఆ యువతులు ఇలా జవాబు చెప్పారు.ఓ మహర్షీ!నీ కుమారుడు అన్నిటికీ అతీతుడు.అతనికి స్వపర భేదం లేదు,స్త్రీ పురుష భేదం అసలే లేదు.అతడు నిర్వికల్పుడు.అతను నిశ్చలమయిన మనసు కలవాడు.నీకు,అతనికి పోటీ ఏంది?నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాంటి శుక యోగి కురు జాంగల దేశాలను ఎందుకు ప్రవేశించాడు?హస్తినాపురానికి ఎందుకు వెళ్ళాడు?పరీక్షిత్తు మహారాజుకు ఎందుకు భాగవతం చెప్పాడు?భాగవతము అంటే కాకమ్మ పిచుకమ్మ కథ కాదు కదా!అది పూర్తిగా చె ప్పాలంటే చాలా కాలం పడుతుంది కదా!శుక మహర్షి ఎక్కడా,ఎప్పుడూ,ఎక్కువ సేపు ఉండడు. ఆఖరికి మనము ఇండ్లలో ఆవుకు పాలు పితికినంత సేపు కూడా ఉండలేడు.అట్లాంటి ఆయన ఎంతో కాలము ఒకే చోట ఉండి,ఎట్లా భాగవతము చెప్పాడు?అసలు పరీక్షిత్తు మహారాజుకు ఏమైంది? ఆయనకు విరక్తి ఎందుకు కలిగింది?అసలు గంగ నడుమ ఉండే దానికి కారణం ఏంది? స్వామీ!మా మనసుల నిండా ప్రశ్నలే!వాటన్నిటికీ మాకందరికీ సమాథానం కావాలి.కాబట్టి దయచేసి మా విన్నపాలు మన్నించి,మాకు అన్నీ వివరణగా చెప్పండి.

Wednesday, 24 September 2025

నారాయణుని చరిత్రే భాగవతమంటే!

ఆ తరువాత సూతుడు శౌనకాది మహామునులతో భాగవతము,దాని గొప్పదనం గురించి ఇలా చెప్పాడు.ఓ మహామునులారా!నారాయణుడు భగవంతుడు.భాగవతము అనేది ఆ భగవంతుని చరిత్ర.ఇది అన్ని పురాణాల సారము.దీనికి మించిన పుణ్య కావ్యము,గ్రంథము మరొకటి లేదు.వ్యాస మహర్షి భగవంతుని అవతారము.కాకపోతే ఇంత ప్రముఖమయిన గ్రంథాన్ని రచించగలుగుతాడా?ఆయన తన ఈ రచనను తన కొడుకు అయిన శుక మహర్షికి చెప్పాడు.పరీక్షిత్తు మహారాజు విరక్తి,వైరాగ్యముతో ఉన్న సమయంలో మునులతో ఉన్నాడు.అప్పుడు ఆయన కోరిక మేర శుక మహర్షి భాగవతమును వారందరికీ చెప్పాడు.శ్రీకృష్ణుని నిర్యాణము అందరికీ శరాఘాతం లాంటిది.ఆ మహానుభావుడితోటే ధర్మజ్ఞానము కూడా అంతరించింది.కలియుగము తన తొలి అడుగు పెట్టింది.ఇంకేముంది?దోషములు అనే చీకట్లు,అజ్ఞానము అనే సుడిగాలులు లోకమంతా విస్తరించాయి.జనులకు ఏది ఒప్పు,ఏది తప్పు,ఇంకేది సరి అయిన మార్గం?అనే మీమాంస అడుగడుగునా తలెత్తింది.వారికి దారి తెన్ను లేకుండా,అనాథలు అయిపోయారు.వారందరికీ ముఖ్యమయిన ఈ భాగవతాన్ని నాకు తెలిసిన విథంగా మీకు చెబుతాను.శ్రద్థగా వినండి.

Tuesday, 23 September 2025

భగవంతుని అవతారాలు ఇంకొన్ని

దేవతలు,దానవులు ఒకసారి పాలసముద్రాన్ని అమృతం కోసరము చిలికారు.అప్పుడు శ్రీహరి కూర్మరూపంలో మంథర పర్వతాన్ని తన వీపు పైన నిలిపి ఉంచాడు.ఈ కూర్మరూపము పదకొండవ అవతారము.పాల సముద్రాన్ని మథించిన తరువాత ధన్వంతరి అయి అమృత కలశం ను తీసుకుని వచ్చాడు.భగవంతుని పండ్రెండవ అవతారము ధన్వంతరి అవతారము.అమృతాన్ని దేవతలకు,దానవులకు సమముగా పంచాలి అని అన్నారు. అప్పుడు మోహినీ రూపంలో దానవుల కళ్ళు గప్పి మోసం చేసి అమృతం అంతా దేవతలకు పంచి పెట్టాడు.ఈ మోహినీ రూపమే ఆయన పదమూడవ అవతారము.ఆ తరువాత కాలంలో హిరణ్య కశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు.ప్రహ్లాదుడు,హరి భక్తుడు అతని కొడుకు.ప్రహ్లాదుడిని రక్షించేదానికి నరసింహావతారము ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించాడు తన గోళ్ళు,కోరలతో!ఈ నరసింహావతారమే ఆయన పదునాల్గవ అవతారము.బలి చక్రవర్తిని మూడడుగుల స్థలం అడిగాడు వామనావతారములో వచ్చి.ఆయన ఒప్పుకోగానే,ఇంతింతై వటుడింతై మూడు లోకాలనూ ఆక్రమించాడు.ఈ వామనావతారమే పదహైదవ అవతారము.జమదగ్నికి భార్గవరాముడుగా పుట్టడం ఆయన పదహారవ అవతారము.ఈ అవతారములో క్రోధమూర్తిగా ఉంటూ బ్రాహ్మణులకు ద్రోహము తలపెట్టిన క్షత్రియులను తుద ముట్టించాడు.పదహేడవ అవతారములో బాదరాయణుడిగా పుట్టాడు.ఈ అవతారములో కలసిపోయి ఉన్న వేదాలను విభజించాడు.పదునెనిమిదవ అవతారములో శ్రీరాముడిగా జన్మించాడు.ఈ అవతారములో దశరథుడికి పుత్రుడు అయ్యాడు.సముద్రమును దాటి రాక్షస రాజు అయిన రావణాసురుడుని హతమార్చాడు.మునులను కాపాడాడు.పందొమ్మిదో అవతారములో శ్రీకృష్ణుడు,బలరాముడుగా పుట్టాడు.ఈ జన్మలో దుష్టులు అయిన రాక్షసులను,రాజులను తుద ముట్టించారు.అలా భూభారాన్ని తగ్గించారు.కలియుగములో బుద్ధుడి అవతారము ఎత్తుతాడు.మధ్య గయా ప్రదేశమున పుడతాడు.యుగసంధి సమయములో రాజులు చోరప్రాయులు అవుతారు.అప్పుడు విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిరూపంతో పుట్టి జనులను ఉద్ధరిస్తాడు. ఇలా భగవంతుడి లీలల గురించి తెలిపే గ్రంథమే భాగవతము.

Sunday, 21 September 2025

భగవంతుని అవతారాలు

భగవంతుని అవతారాల గురించి చెప్పుకుందాము.అన్ని అవతారాలకంటే మొదటి అవతారము నారాయణుడిదే.అతడి నాభి,అనగా బొడ్డు నుంచి వచ్చిన కమలములో బ్రహ్మ పుట్టాడు.అతడి అవయవములనుండి సకల లోకాలు ఉద్భవించాయి.అతడు కౌమారావస్థలో బ్రహ్మణ్యుడు అయి ఘోరమయిన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. ఇప్పుడు అతని రెండవ అవతారము గురించి చెప్పుకుందాము.భూమి క్రుంగి పోతుంటే,అది ఆపేదానికి వరాహ అవతారము ఎత్తాడు.నారదుడుగా మూడవ అవతారము ఎత్తాడు.ఈ రూపంలో కర్మల నుండి విముక్తి ప్రసాదించే వైష్ణవ తంత్రాన్ని ఉపదేశించాడు.నాలుగో అవతారములో నరనారాయణుల రూపము ధరించి ఘోరమయిన తపస్సు చేసాడు.అయిదవ అవతారములో కపిల మహర్షిగా పుట్టాడు.ఈ రూపంలో ఆసురి అనే బ్రాహ్మణుడికి తత్త్వమును నిర్ణయించే సాంఖ్యమును ఉపదేశించాడు.ఆరవ అవతారములో అత్రిమహామునికి,అనసూయాదేవికి దత్తాత్రేయుడుగా జన్మించాడు.ఈ రూపంలో అలర్కునికి,ప్రహ్లాదుడు మున్నగువారికి తత్త్వబోధ చేసాడు.ఏడవ అవతారంలో రుచికి ఆకూతి యందు యజ్ఞుడు అనే పేరుతో కుమారుడుగా పుట్టాడు.ఈ రూపంలో యముడు,ఇతర దేవతలతో కలసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.అష్టమ అవతారంలో మేరుదేవి యందు నాభికి ఉరుక్రముడు అనే పేరుతో పుత్రుడుగా జన్మించాడు.ఈ జన్మలో విద్వాంసులకు పరమహంస మార్గమును బోధించాడు.ఋషులు అందరూ ప్రార్థించగా తొమ్మిదో జన్మలో పృధు చక్రవర్తిగా పుట్టాడు.ఈ జన్మలో భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిదికాడు.చాక్షుష మన్వంతరములో పదవ అవతారంగా మత్స్య రూపం ధరించాడు.ఈ రూపంలో భూరూప మయిన నావను ఎక్కించి వైవస్వతమనువును ఉద్ధరించాడు.

Friday, 19 September 2025

హరి సత్త్వగుణ సంపన్నుడు

ఇప్పుడు ఇక్కడ ఇంకో విశేషము ఉంది.కట్టెకంటే పొగ మేలు.పొగ కంటే అగ్ని మేలు.అచ్చం అలాగే తామస గుణము కంటే రజోగుణము మంచిది.రజోగుణము కంటే సత్త్వ గుణము విశిష్టమయినది.ఎందుకంటే సత్త్వగుణము బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది.కాబట్టి మునులు అందరూ సత్త్వ గుణ సంపన్నుడు అయిన హరినే సదా సేవిస్తారు.అందరికీ మేలు కలగాలి అని భావించేవారు భగవంతుడిని సేవిస్తారు.మోక్షము కావాలి అనుకునేవారు ఎవరినీ నిందించరు.శాంత చిత్తంతో నారాయణుని కథలు వింటుంటారు.ఎందుకంటే మనకు మోక్షము ఇచ్చేది ఆ నారాయణుడే కదా!అన్ని ధర్మాలు అతనినే మోక్షానికి మార్గం అని చూపెడతాయి.ఆ పరబ్రహ్మ సత్త్వ రజస్తమో గుణములచే యుక్తమయిన లోకాన్ని సృజిస్తాడు.చెడు పెరిగి నప్పుడు,లోక కళ్యాణం కొరకు వివిధరూపాలలో పుడతాడు.అతడు పురుష రూపములో సముద్రం మధ్యలో యోగనిద్రలో ఉంటాడు.

Thursday, 18 September 2025

సూతుడి పలుకులు

సూతమహర్షిని శౌనకాది మునులు అలా కోరారు.అప్పుడు ఆయన శుకయోగికి,నరనారాయణులకు,సరస్వతీదేవికి,వ్యాస మహర్షికి నమస్కరించాడు. శుకయోగి అంతటినీ,అందరినీ సమానంగా చూసేవాడు.సమస్త కర్మలను విడనాడి,సన్న్యాసి అయిన వాడు.సూతమహర్షి ఇలా అన్నాడు.మునీంద్రులారా!హరిభక్తి మానవులకు పరమధర్మము.ఆ హరి భక్తి ఎలాంటి ఆటంకాలు,అవరోధాలు లేకుండా సాగాలి.ఎందుకు,ఏమిటి,ఎలా,ఎక్కడ,ఎప్పుడు అని కారణాలు,సాకులు లేకుండా నిర్హేతుకంగా,నిరాటంకంగా సర్వకాల సర్వావస్థలయందు కొనసాగాలి.అది ఒక యోగము,యాగము,యజ్ఞము కావాలి.అప్పుడు మనకు వైరాగ్యము,విజ్ఞానము,విజ్ఞత ప్రాప్తిస్తాయి.నారాయణుని గురించి కథలు,విషయాలు చెప్పని ధర్మాలకు అర్థం,పరమార్థం ఉండదు.వాటి వల్ల లాభం లేదు.సారం లేని చెరకు పిప్పిలాంటివి అలాంటి ధర్మాలు.జ్ఞానము,వైరాగ్యముతో కలిసిన భక్తియోగమే మానవుడికి పరమాత్మను చూపిస్తుంది.నిశ్చలమయిన మనసుతో,నిరంతరం గోవిందుని వినినా,వర్ణించినా,ధ్యానించినా ముక్తి,మోక్షం లభిస్తాయి.మనకు భగవంతుడి మీద శ్రద్ధ,ఆసక్తి ఉండాలి.మోక్షానికి తలుపులు తెరిచే భగవంతుడి కథలు వినాలనే ఆసక్తి మెండుగా ఉండాలి.ఇలా చేస్తే పుణ్య తీర్థాలలో స్నానం చేస్తే,పెద్దలకు సేవ చేస్తే వచ్చే పుణ్యము దక్కుతుంది.శ్రీకృష్ణుని కథల యందు ఆసక్తి ఉండే వారికి ఇంకేదీ రుచించదు.తేనెను జుర్రుకున్నట్లు జుర్రుకోవాలి అనిపిస్తుంది.చెవులలో అమృతము పోసినట్లు ఉంటుంది కృష్ణలీలలు వింటుంటే.శ్రీకృష్ణుడు తన కథలు వినేవారి మనసులలో నిలిచి ఉంటాడు.వారికి ఎప్పుడూ శుభములు చేకూరేలా చేస్తుంటాడు.ఎలాంటి చెడూ జరగకుండా చూసుకుంటాడు.అశుభములు నశిస్తే నిశ్చలమయిన భక్తి కలుగుతుంది.మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది.మనసు రజోగుణము,తమోగుణముల వలన కలిగే కామక్రోథమదలోభాలకు బలికాదు.సత్త్వగుణము పెంపొందుతుంది.దాని వలన ప్రసన్న మనస్కుడు అవుతాడు.ప్రసన్నంగా ఉండేవాడు ముక్తసంగుడు అవుతాడు.ముక్తసంగుడు అంటే అహం లేనివాడు.ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఉండేవాడు.భవబంథాలకు దూరంగా ఉండేవాడు.అంతా నాదీ,నేనే అనే అజ్ఞానం నుంచి బయట పడినవాడు.కాబట్టి భగవంతుడు యొక్క తత్త్వం,జ్ఞానం తెలుసుకుంటాడు.అహంకారము నశిస్తుంది.అహంకారము నశిస్తే అనుమానాలు,గిలులు పోతాయి.దాని ప్రభావంగా కర్మలు నశిస్తాయి.

Wednesday, 17 September 2025

నారాయణుని నామ మహిమ

కలి దోషములు అన్నీ నారాయణుని కీర్తన వలననే నశిస్తాయి.అందుకే ఉత్తములు ఆయనను నిత్యమూ స్తుతిస్తూ ఉంటారు.విష్ణునామ సంకీర్తన అనేది దావానలంలాంటిది.దాని సెగకు,పొగకూ,మంటలకు కీకారణ్యాలు లాంటి పాపాల పుట్టలు చిటెకలో భస్మమయిపోతాయి.సూర్యుని కిరణాలతో చీకటి ఎలా పటాపంచలు అవుతుంది?అచ్చం అలాగే నారాయణుని స్మరిస్తే కామము,క్రోధము,లోభము,మోహము,మదము,మాత్సర్యము అనేవి కంటికి కనిపించకుండా మాయమయిపోతాయి.నరహరి బలరాముడుతో కలసి ఎన్నేసి గొప్ప పనులు చేసాడు.మానవాళి అంతా అచ్చెరువు అయేలా చేసాడు కదా!ఆ మహానుభావుని చరిత్ర వినాలని మాకంతా కుతూహలముగా ఉంది.మా చెవులకు ఉండే తుప్పు అంతా పోయేలా ఆ మహావిష్ణువు కథలు వినాలని ఉంది.ఈ భవసాగరము ఈదాలంటే సామాన్య మానవుడికి వల్ల కాదు.ఎవరిదైనా ఆపన్నహస్తంకావాలి.కలి దోషములు పోగొట్టుకోవాలనే తపనలో మేమందరమూ ఉన్నాము.మా అదృష్టం కొద్దీ నీవు మాకు కనిపించావు.శ్రీకృష్ణుడు ధర్మస్థాపనకు పెట్టనికోట.అతడు ఇప్పుడు పరమపదించాడు.ఇంక ఈ లోకంలో ధర్మాన్ని నిలిపేదెవరు?

Tuesday, 16 September 2025

విష్ణు కథలు ఎందుకు వినాలి?

అక్కడ గుమి గూడిన మునులు అందరూ సూతుడితో ఇలా మొర పెట్టుకున్నారు.ఓ మహామునీ!మీకు తెలియనిది ఏముంది?ఈ కలియుగంలో మనుష్యులు అందరూ స్వతహాగా మంద బుద్ధులు.వారి జీవితకాలము చాలా తక్కువ.దానికి తోడు ఏదో ఒక రోగముతో బాథ పడుతుంటారు.కాబట్టి వారికి మంచి పనులు చేసి పుణ్యము సంపాదించే అంత సమయము,సందర్భము,ఇచ్ఛ ఉండవు.ఒక రకంగా చెప్పాలంటే ఉత్తమగతి పొందటం,దక్కించుకోవటం వారివల్ల కానేకాదు.కానీ వారందరూ సులభంగా ఉత్తమగతిని పొంది,ఉత్తమలోకాలకు పోవాలంటే మంచి ఉపాయము చెప్పండి.మనుష్యులకు మనశ్శాంతి ఏమి చేస్తే దక్కుతుందో సెలవీయండి. మాకందరికీ విష్ణువు కథలు వినాలని చాలా తపనగా ఉంది.ఎందుకంటారా?ఎవరి రూపం చూడగానే భయంతో రాక్షసులు ప్రాణభయంతో పరుగులు పెడతారు?శ్రీమహా విష్ణువు కదా!ఏ దేవుడి నామ జపం వల్ల లోకంలో ఉండే అన్ని పాపాలు పటాపంచలు అవుతాయి? శ్రీహరి నామమే కదా!ఎవరి చరిత్ర మనసులో తలచుకోగానే మృత్యువు కూడా ఆసాంతం భయపడి దరిదాపుల్లోకూడా ఉండకుండా పారిపోతుంది?ఆ విష్ణు దేవుని చరిత్రే కదా!ఏ మహామహుని పాదపద్మాలకు పూజలు చేసి మునులు మనశ్శాంతినీ,ముక్తినీ పొందారు?ఆ శేషశయనుడి కరచరణాలే కదా! కాబట్టి ఓ మునీంద్రా!మాకు విష్ణు కథలు చెప్పి,మమ్ములని చరితార్థులను చేయండి.

Monday, 15 September 2025

సూత మహర్షి గురించి…

రోమహర్షణుడు అని ఒక మహాముని ఉండేవాడు.అతని కుమారుడే సూత మహర్షి.ఇతనికి ఉగ్రశ్రవసుడు అని ఇంకో పేరుకూడా ఉంది.ఇతడు పురాణములకు దిట్ట.ఇతిహాసములకు గని.ధర్మశాస్త్రములకు గొప్ప నిధి.అతను తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అనే తపన ఉన్నవాడు.కాబట్టి అతను సరళంగా,సామరస్యంగా,సర్వజనామోదముగా,సామాన్యులకు కూడా అర్థము అయ్యేలా వివరించి చెప్పేవాడు.కాబట్టి అందరి మన్ననలకు పాత్రుడు అయ్యేవాడు.కాబట్టి అక్కడ ఉండే మునులందరూ సూతుని చూసి మహదానందపడిపోయారు.సహజమే కదా! అందరూ ఆయన చుట్టూ గుమిగూడారు.ఇలా అడిగారు.ఓ పౌరాణికా!నీవు పురాణాలను అన్నింటినీ ఔపాసన పట్టిన వాడివి.వ్యాస మహాముని కరుణ వలన సమస్త విషయాలు ఎరిగిన వాడవు.నీకు తెలియని ధర్మము,జ్ఞానము అంటూ ఏమీ లేదు.అనుభవజ్ఞులు అయిన పెద్దలకు తెలిసిన అన్ని విషయాలు నీకు తెలుసు.నీవు ఎంతో కాలము నుండి జ్ఞానోఽపాసనలో ఉన్నావు.నీకు అనేక గ్రంథాలలోని రహస్యార్థము,మర్మము తెలుసు.ఇందులో వింత,ఆశ్చర్య పడే విషయము ఏమీ లేదు.నీవు ఇక్కడ ఉన్న మాకందరికీ గురువు లాంటి వాడివి.గురువులు సహజంగా తమ శిష్యులకు ధర్మసూక్ష్మాలూ,మంచి నీతులు బోధిస్తారు కదా!అనేకానేక రహస్యాలను వివరించి,అనుమానాలు తీరుస్తారు కదా!కాబట్టి నీవు మాకు సుస్థిరము అయిన సుఖము ఎలా సంపాదించాలో,కలుగుతుందో చెప్పాలి.

Sunday, 14 September 2025

సత్త్రయాగము ప్రారంభం

ఒకసారి అక్కడ ఋషులు అందరూ కలసి మాటలాడుకున్నారు.ఏమని?వేయి ఏండ్ల కాల పరిమితి గల సత్త్రయాగము చేయాలని.మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టారు.ఆ విషయం ముల్లోకాలలోనూ తెలిసింది.ఆ యాగము చూస్తే జన్మ తరిస్తుందని రావటం మొదలుపెట్టారు.అలా వచ్చేవారిలో చాలా మంది దేవతలు,మునులు,రాజులు,పండితులు,సామాన్యప్రజానీకం ఉన్నారు. ఒకసారి అక్కడకు సూతమహర్షి వచ్చాడు.ఆయన ఋషులందరిలోకి ఉత్తమోత్తముడు.ఎల్లప్పుడూ ఈశ్వర ధ్యానం లోనే ఉంటాడు.బహు పురాణవేత్త.అక్కడ ఉండే మునులు అందరూ ఆనందంతో ఆయనకు ఎదురేగారు.గౌరవ మర్యాదలతో తీసుకుని వచ్చారు.అర్ఘ్యపాద్యములు ఇచ్చారు.సముచిత ఆసనం మీద కూర్చోబెట్టారు.

Saturday, 13 September 2025

నైమిశారణ్యంలో గురుశిష్యులు

ఆ నైమిశారణ్యంలో ఉండే మునులు గొప్ప విద్వాంసులు.వారికి సమస్త శాస్త్రాలూ క్షుణ్ణంగా తెలుసు.కాబట్టి వారికి శుశ్రూష చేసుకోవాలి అనే ఇచ్ఛతో నలుమూలల నుంచి,అనేక ప్రాంతాల నుండి వేల సంఖ్యలో శిష్యులు వస్తూ ఉంటారు.వారి ఆశ ఏందంటే ఆ మునులు వీరిని మెచ్చి,వారికి తెలిసిన సమస్త శాస్త్రాలు,పురాణాలు వీరికి నేర్పిస్తారని!ఆ మునులు కూడా రాగ ద్వేషాలకు అతీతంగా,శిష్యులు కోరిన అన్ని విద్యలూ నేర్పిస్తుంటారు.అక్కడ అందరూ సఖ్యంగా,సామరస్యంగా ఉంటూ భగవద్థ్యానము చేసుకుంటూ ఉంటారు.ఎప్పుడూ ఏదో ఒక యజ్ఞమో,యాగమో చేసుకుంటూ ఉంటారు.ఇలా నైమిశారణ్యము ఎప్పుడూ కళ కళలాడుతూ ఉంటుంది.

Friday, 12 September 2025

కథ మొదలు పెడదామా ఇంక

లోకములోని అన్ని అరణ్యాయలలోకీ నైమిశారణ్యము చాలా ప్రముఖమైనది.ప్రాశస్త్యము కలది.ఉత్తమమైనది కూడా!అక్కడ ఉండే అన్ని వృక్షాలు ఎప్పుడూ కళకళలాడుతుంటాయి.ఎప్పుడూ పూలతోను,రసభరిత పళ్ళతోనూ నిండి ఉంటాయి.రకరకాల హరిత వర్ణాలతో అక్కడ ఉండే చెట్లు అన్నీ శోభాయమానంగా కనువిందులు చేస్తుంటాయి.అక్కడ చాలా మంది మునులు తమ తమ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని ఉంటారు.కాబట్టి జనులు,పురప్రజలు సంతోషంగా వారిని చూసి తరించేదానికి వస్తుంటారు. అక్కడ ఇంకో తమాషాకూడా మనం చూడగలతాము.మామూలుగా కృూరమృగాలు సాథుజంతువులను వేటాడుతుంటాయి కదా!కానీ ఇక్కడ అన్నీ ఆలాజాలంగా,సఖ్యంగా,సామరస్యంగా కలసిమెలసి ఉంటుంటాయి.వాటి మధ్య విరోథభావాలు మచ్చుకికి కూడా కనిపించవు.ఐక్యమత్యంగా,హాయిగా,చెట్టాపట్చాలేసుకుని తిరుగుతుంటాయి.దీనికంతటికీ కారణం ఏమనుకుంటున్నారు మీరు?నేను చెప్పనా!ఇంగిత జ్ఞానము లేని జంతువులు కూడా మహామునుల ప్రభావం చేత జాతివైరం మాని,సాథ్యమైనంతగా సాధుజీవితానికి,సఖ్యతకి,సామరస్యానికీ పెద్ద పీట వేసాయి.ఇంతేనా!కాదు,కాదు.ఆ మునులు లాగా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ కానవస్తాయి.ఎంత గొప్ప కదా!

Thursday, 11 September 2025

భాగవతము చదివితే…

భాగవతము చదివి,అర్థం చేసుకుంటే సర్వ పాపాలు నశిస్తాయి అని అంటారు.సమస్త సంపదలు దక్కుతాయి.అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాన సంపద దక్కుతుంది.భాగవతము మనకు ముక్తిని ప్రసాదిస్తుంది.దానిని చదివినా,వ్రాసినా,విన్నా సర్వ పాపాలు నశిస్తాయి.నిత్యమూ ధర్మమార్గంలో నడిచేవారికి శ్రీహరి సులభంగా దక్కుతాడు.ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో,ఆనందంగా విరాట్ స్వరూపుడు అయిన ఆ దేవదేవుని కొలిస్తే కష్టాలు,కలతలు ఉండనే ఉండవు.ఎందుకంటే అన్నిటినీ సమంగా స్వీకరించ గలిగే స్థితప్రజ్ఞత అలవరుతుంది.ఈ విషయం స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు.అందరికీ ధర్మం అర్థం అయి,ఆ దిశగా ప్రయాణం చేయగలిగే వెసులుబాటుకోసం వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు. భాగవతము అనేది నిజానికి ఒక కావ్యము కాదు.వేదమనే చెట్టుకి కాసి,రసమయమయిన పండుగా మారిన జ్ఞానము.దానిని శుక మహర్షి అనే చిలుక చిరు పంటితో కొరకగా,దానినుంచి కారిన అమృత రసగుళిక ఈ మహిమాన్వితమయిన భాగవత గ్రంథము.దీని నుంచి ఎవరెవరికి ఎంతెంత కావాలో అంతంత ఆస్వాదించ వచ్చు.అది మనతృష్ణను పట్టి ఉంటుంది.ఆ రసాస్వాదనకు అంతం ఉండదు.ఎంత జుర్రుకోవాలంటే అంత జుర్రుకోవచ్చు.ఎలాంటి ఆంక్షలు,ప్రతిబంధకాలు ఉండవు.

Wednesday, 10 September 2025

శ్రీ మహా భాగవతము….।

శ్రీ మహా భాగవతము మనకు చాలా ముఖ్యమైన పురాణ గ్రంథము.వేదవ్యాసుడు ఈ గ్రంథాన్నిరచించాడు.శ్రీహరి గురించి ప్రముఖంగా ప్రస్తావన ఉంటుంది.ఇది చదివినా,విన్నా చాలా మంచిది. భాగవతము స్కంధాలుగా విభజించ బడింది.ఇందులో పన్నెండు స్కంధాలు ఉన్నాయి. విష్ణువు భగవంతుడు.అతని గురించి తెలియ చెప్పేదే భాగవతము.విష్ణువు సమస్తలోకాలనూ పాలిస్తాడు,పరిపాలిస్తాడు.అందరినీ రక్షించేదీ అతనే!అందరినీ పుట్టించేదీ,లాలించేదీ,చివరకు గట్టెక్కించేదీ అతనే!దుష్ట శిక్షణార్థం,శిష్ట రక్షణార్థం ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో ఆవిర్భవించేదీ అతనే!సామాన్యమైన మనకే కాదు,త్రిమూర్తులకు కూడా మూల కారణం అతడు.